మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని ఆధార్‌సెంటర్ వద్ద బారులుదీరిన ప్రజలు
మహబూబాబాద్: ప్రభుత్వం గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులను జత చేస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. అయితే కొంతమంది ఆధార్, రేషన్‌కార్డుతో పాటు కులం, ఆదాయం, నివాసం తదితర సర్టిఫికెట్లను కూడా జత చేసేందుకు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ ఏజెన్సీల ఎదుట ఈ–కేవైసీ కోసం సైతం జనం క్యూ కడుతున్నారు.
రెండుంటే చాలు..
ప్రభుత్వం ఐదు గ్యారంటీల (మహాక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు) అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని గత డిసెంబర్ 28న ప్రారంభించి.. ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పెట్టింది. కాగా దరఖాస్తులకు ఆధార్, రేషన్‌కార్డుల జిరాక్స్‌లు జత చేస్తే సరిపోతుంది. అయితే ప్రజలు అన్ని పథకాల కోసం అన్ని రకాల సర్టిఫికెట్లు అవసరమని భావించి ఆయా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా పింఛన్, రైతుబంధు వచ్చిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని చెప్పినా ప్రజలు వినడం లేదు.
మీసేవ కేంద్రాల వద్ద రద్దీ..
జిల్లాలో 98 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో చాలా మంది కులం, ఆదాయం, నివాసం, ఆహార భద్రత కార్డుల కోసం ఆయా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. కాగా మహా లక్ష్మి పథకానికి ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు అడుగుతారని ప్రచారం జరగడంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న ఆరు ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల కోసం ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు, బయో మెట్రిక్, పుట్టిన తేదీ, ఇతర మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు.
గ్యాస్ ఏజెన్సీల వద్ద..
జిల్లాలో 13 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 2.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఈ–కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాయితీపై సిలిండర్ సరఫరా చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులుదీరుతున్నారు. ఈ–కేవైసీతో రాయితీ సిలిండర్‌కు సంబంధం లేదని అధికారులు చెబుతున్నా.. ప్రజలు వినడం లేదు.
వసూళ్ల పర్వం..
జనాల తాకిడిని ఆసరాగా చేసుకొని ఆధార్, మీ సేవ, జిరాక్స్ సెంటర్లలో అధికంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే పలు గ్యాస్ ఏజెన్సీలు ఈ–కేవైసీకి రూ.200వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో..
Comments
Please login to add a commentAdd a comment