ఏ భాష అయినా నేర్చుకోండి.. తెలుగులోనే మాట్లాడండి | CM Revanth Reddy Speech At World Telugu Federation Conference | Sakshi
Sakshi News home page

ఏ భాష అయినా నేర్చుకోండి.. తెలుగులోనే మాట్లాడండి

Published Mon, Jan 6 2025 5:41 AM | Last Updated on Mon, Jan 6 2025 5:41 AM

CM Revanth Reddy Speech At World Telugu Federation Conference

ప్రపంచ తెలుగు ఫెడరేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్, ఫెడరేషన్‌ చైర్మన్‌ ఇందిరాదత్,సినీనటులు సాయికుమార్, మురళీమోహన్, జయప్రద, జయసుధ తదితరులు

ప్రపంచ తెలుగు ఫెడరేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి 

దేశంలో అత్యధికులు మాట్లాడుతున్న రెండో భాష తెలుగు 

అయినా దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నాం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘రాజకీయాలు, ఆర్థికం, సినిమా ఇలా ఏ రంగంలోనైనా రాణించాలంటే నాలెడ్జ్‌ సంపాదించండి. ఏ భాష అయినా నేర్చుకోండి. కానీ తెలుగులోనే మాట్లాడుకోండి. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న రెండో భాషగా తెలుగు నిలిచింది. సుమారు 18 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతారు. కానీ ఈ స్థాయిలో దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నాం. దీనికి గల కారణాలను విశ్లేషించుకోవాలి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు ఫెడరేషన్‌ సభల ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

‘‘దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ, ఎన్టీఆర్‌.. తర్వాత కాకా, జైపాల్‌రెడ్డి వంటివారు ప్రభావం చూపించారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లింది. తర్వాత చట్టసభల్లో తెలుగువారు ఎవరు మాట్లాడుతారా? అని ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. అయితే ఎన్టీ ఆర్‌ ప్రారంభించిన ప్రపంచ తెలుగు ఫెడరేషన్‌ ప్రపంచం ముందు తెలుగు ప్రజలు తలెత్తుకునేలా ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల మన బాధ్యతను గుర్తుచేసినట్టు అవుతుంది. ఎవరెస్ట్‌ ఎక్కి చూసినా అక్కడో మలయాళీ ఉంటాడనే నానుడి ఉంది. ఇప్పుడలా తెలుగువారు కనిపిస్తున్నారు. సినిమా రంగంలో హాలీవుడ్‌ స్థాయిలో రాణిస్తున్నాం.

గత పాలకులతో అభివృద్ధి 
రాజీవ్‌గాంధీ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్‌ ప్రాంతం సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంతో పోటీపడేలా ఆర్థికంగా అవకాశాలు కల్పింస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఔటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు కట్టి ఐటీ, ఫార్మా కంపెనీల ఏర్పాటును ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిసి ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. విడిపోయి పోటీపడే కంటే కలసి ఉండి అభివృద్ధి వైపు నడిస్తే కచి్చతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు నిలుస్తాయి. దేశాల మధ్య యుద్ధాలకే చర్చలు పరిష్కారం చూపిస్తుంటే.. రాష్ట్రాల మధ్య సమస్యలకు చర్చలు దారి చూపవా?.

అందరినీ ఆహ్వనిస్తున్నాం... 
హైదరాబాద్‌ విశ్వనగరంగా రాణిస్తుందని భరోసా ఇస్తున్నాం. రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తున్నాం. వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలంలో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఔటర్‌ రింగురోడ్డు ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడింది. ఇకపై రీజనల్‌ రింగ్‌రోడ్డుతో తెలంగాణ రాష్ట్రాన్ని 60 శాతం పట్టణీకరణ చేసేలా ప్రభుత్వం పనిచేస్తోంది. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్‌ స్లోగన్‌తో 2050 లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాం. అందరినీ సాదరంగా ఆహ్వనిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’అని రేవంత్‌ పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement