- పేరుకే రుణఅర్హత కార్డులు
- కౌలు రైతులకు దక్కని పంట రుణాలు
- 4702 మందికి కార్డుల జారీ
- పరిశీలనలో 2,628 మంది రైతులు
- 70మందికి కూడా రుణాలివ్వని వైనం
అక్కరకు రాని కార్డులు
Published Thu, Jul 21 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
కరీంనగర్ అగ్రికల్చర్ : చేనుచెలకల్లో కాయాకష్టం చేసుకునే రైతులకు నానా కష్టాలు వస్తున్నాయి. ఉన్న భూమిని నమ్ముకున్న సన్నచిన్నకారు రైతుకు ఒక కష్టమైతే.. ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసుకునే వారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. సాగుచేసుకుని బతుకుతామనుకున్న వారి ఆశలు అధికారులు, బ్యాంకర్ల తీరుతో ఆవిరవుతున్నాయి. కౌలుదారుల కష్టాలు తీరుస్తామంటూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా ప్రయోజనం శూన్యం. రుణఅర్హత కార్డులిచ్చి సాగురైతులతో సమానంగా పథకాలు వర్తింపజేస్తామన్న హామీలు వట్టిదే అయింది.
‘ఏపీ ల్యాండ్ లైసెన్స్‌డ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్ 2011’ ను చట్టాన్ని తీసుకొచ్చింది. కౌలురైతులను గుర్తించి వారికి రుణఅర్హత కార్డులను ఏటా జారీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కౌలుదారుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. నాలుగు నెలలు కావస్తున్నా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో లక్షకు పైగా కౌలు రైతులుండగా.. కేవలం 8,106 మంది దరఖాస్తులు చేసుకున్నారంటే అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగం మధ్య సమన్వయం కొరవడి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో కౌలుదారుల గుర్తింపు ప్రక్రియ ముందుకు సాగడంలేదు.
ఇప్పటివరకు అందులో 4,702 మందినే అర్హులుగా గుర్తించారు. అందులో 1,422మంది రెన్యువల్ చేసుకున్నవారే కావడం గమనార్హం. మరో 776 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. 2,628 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర గడిచినా గుర్తించిన కౌలురైతుల్లో రెన్యువల్ చేసుకున్న వారిలో 70 మందికి కూడా రుణాలివ్వలేదని తెలిసింది.
ఎందుకీ కార్డులు..?
కౌలుచట్టం ద్వారా పంటరుణాలు, పంటలబీమా, పరిహారం, రాయితీలు, ప్రోత్సాహకాలు అందని ద్రాక్షగా మారాయి. 2011 నుంచి కౌలురైతులకు రుణఅర్హత కార్డులు జారీ చేస్తున్నారు. ఏటా దరఖాస్తుల సంఖ్యతోపాటు అర్హులు, రుణం పొందినవారి సంఖ్య తగ్గడంతో కౌలురైతులకు నిరాశే ఎదురైంది. గతేడాది 14,541 మందికి రుణ అర్హతకార్డులిచ్చారు. అందులో ఈ యేడాది 1,422 మంది రైతులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
బ్యాంకర్ల మెలికలు
రుణాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నా బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. సరైన అవగాహన లేక భూయజమానులు కౌలుపత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. భూయాజమానుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోవడంతో కౌలు రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. గతంలో ఇచ్చిన రుణఅర్హత కార్డులపై పంటరుణాలు అందకపోవడంతో రైతుల్లో నిర్లిప్తత వ్యక్తమవుతోంది. అప్పటికే సదరు భూములపై సొంతందారులు రుణం తీసుకుంటుండడంతో అదే భూమికి పంట రుణం ఎలా ఇవ్వమంటారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. పట్టాదారు, కౌలుదారుల మధ్య నెలకొంటున్న వివాదాలను సాకుగా చూపి రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సర్కార్ శాశ్వత పరిష్కారంతో న్యాయం చేయాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు.
Advertisement
Advertisement