weaste
-
Phone Addiction: మీ సమయమంతా ఫోన్‌కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్‌కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్‌ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్‌కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్‌లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్‌స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్‌తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్‌లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్‌లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్‌లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్‌తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
Use Me Works: వేస్ట్ నుంచి బెస్ట్
మన చుట్టూ పేరుకు పోతున్న రకరకాల వ్యర్థాల నుంచే కొత్త అర్థాలను వెతకచ్చు. ఆ అర్థాల నుంచి ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తోంది ఢిల్లీ వాసి మీనాక్షి శర్మ. ఫ్యాబ్రిక్ డిజైనింగ్‌లో కోర్సు చేస్తూనే... విపరీతంగా పేరుకుపోతున్న ఫ్యాబ్రిక్ వ్యర్థాల గురించీ ఆలోచించింది. అంతటితో ఆగిపోకుండాఆ వ్యర్థాల నుంచే ఎంతోమందికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. దిల్లీ చుట్టుపక్కల నుంచి నెలకు 200 కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్‌ను సేకరించి, 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మెట్రో నగరాల్లో వాతావరణ పరిస్థితుల గురించి మనలో చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ, రకరకాల కాలుష్యాలని నివారించడం మాత్రం మనవంతు బాధ్యత అనుకోం. ఈ బాధ్యతారాహిత్యం మనకే కాదు మన ముందుతరాలకూ నష్టమే అంటోంది దిల్లీలో అప్స్లైకింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి వర్క్’ని విజయవంతంగా కొనసాగిస్తున్న మీనాక్షి శర్మ. కుతుబ్ మినార్ దగ్గర 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన క్రియేటివ్ స్టూడియోలో 30 మంది మహిళలు కుట్టుపని చేస్తూ కనిపిస్తారు. చుట్టుపక్కల ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వేస్ట్ క్లాత్స్ ఉన్న సంచులు నిండుగా కనిపిస్తుంటాయి. వాటిని చూపిస్తూ 34 ఏళ్ల మీనాక్షి శర్మ తన స్వీయానుభవాలను వివరిస్తుంటుంది. ‘వనరులను గౌరవించడం ఎలాగో మా అమ్మానాన్నలను చూస్తూ పెరిగాను. పాత వస్తువులను తిరిగి మరో వాడుకోదగిన వస్తువుగా ఎలా మార్చేవారో వారిని చూసే నేర్చుకున్నాను. చదువుకోవడానికి జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చిన నేను డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నాను. ఆ సమయంలో ఫ్యాషన్ పరిశ్రమలో టన్నులకొద్దీ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు మిగిలిపోతున్నాయని తెలుసుకున్నాను. ‘ఆ వేస్టేజ్‌ని తిరిగి ఉపయోగంలోకి తేలేమా..?’ అని ఆలోచించాను. ► పేద మహిళలకు ఉపాధి కాలేజీ పూర్తయ్యాక కెరియర్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైనది అని ఆలోచించి, వ్యర్థాలవైపుగా కదిలాను. ఇళ్లలో పనులు చేసేవారూ, చిన్న చిన్న కూలి పనులకు వెళ్లే మహిళలను కలిశాను. వారికి కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి, డెకార్ ఐటమ్స్ చేయడం మొదలుపెట్టాను. క్లాత్ బ్యాగులు, ఇతర యాక్సెసరీస్, గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ తయారవుతాయి. ముఖ్యంగా పుట్టినరోజు, పండగ రోజుల్లో ఇంటి అలంకరణలో ఉపయోగించే ఐటమ్స్‌ని మహిళలు శ్రద్ధగా తయారు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ని ఈ క్లాత్ ఐటమ్స్ రీ ప్లేస్ చేస్తాయి. వీటివల్ల ఇక్కడి మహిళలకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంద’ని వివరిస్తుంది మీనాక్షి శర్మ. ► ఫ్యాక్టరీ టు వార్డ్రోబ్ వీరు తయారు చేసే వస్తువులలో ఫ్యాషన్ ఉపకరణాలు, అందమైన పూలతీగలు, కుషన్ కవర్లు, క్విల్ట్‌లు, బ్యాగులు, రగ్గులు.. వంటివి ఉంటాయి. ‘వ్యర్థాలను సేకరించడం పెద్ద సవాల్’ అంటారు మీనాక్షి. ‘ఇళ్లు, ఫ్యాక్టరీలు, బొటిక్స్ నుంచి స్క్రాప్ అంతా డంప్ చేసే ప్రదేశాలకు చేరుకుంటుంది. మేం ఆ డంపింగ్ నుంచి ఈ వ్యర్థాలను సేకరిస్తాం. కొన్నిసార్లు ప్రజలే తమ పాత దుస్తులను మా స్టూడియోకి కొరియర్లో పంపుతారు. వాటిని బాగు చేసి, అప్‌సైక్లింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని చెప్పే మీనాక్షి పదేళ్లుగా ఈ స్టూడియోని నిరంతరాయంగా నడుపుతోంది. తన ‘యూజ్ మి’ స్టూడియో నుంచి వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది ఈ పర్యావరణ ప్రేమిక. ముఖ్యంగా పిల్లలకు వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తే ‘వృ«థా అంటూ ఏదీ ఉండదని’ గ్రహించి వారు జీవితమంతా ఆ విధానాలనే అవలంబిస్తారని తన వర్క్‌షాప్స్, ఆన్లైన్ క్లాసుల ద్వారా మరీ మరీ చెబుతుంది. మీనాక్షి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వెంచర్‌కి అమెరికా, లండన్ తదితర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. ఆలోచనతోపాటు ఆచరణలో పెట్టిన పని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందో తన సృజనాత్మక విధానాల ద్వారా చూపుతుంది మీనాక్షిశర్మ. -
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం పిచికారీతో తెల్లదోమను అరికట్టవచ్చు
కొబ్బరి, పామాయిల్ తోటలను ఆశిస్తున్న వలయాకారపు తెల్లదోమను వేస్ట్ డీ కంపోజర్(డబ్లు్య.డి.సి.) ద్రావణం పిచికారీతో అరికట్టవచ్చు. 200 లీటర్ల నీటిలో డబ్లు్య.డి.సి. బాటిల్లోని 30 గ్రాముల పొడితోపాటు 2 కిలోల బెల్లం కలిపి.. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం కలియదిప్పాలి. ఈ ద్రావణం ఐదారు రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. అదనంగా నీటిని కలపకుండా ఈ ద్రావణాన్ని కొబ్బరి/పామాయిల్ తోటలపై పిచికారీ చేయాలి. 3 రోజుల విరామంతో కనీసం 5 విడతలు పిచికారీ చేయాలి. చెట్టు తడిచేలా పిచికారీ చేయాలి. మునగ తదితర కూరగాయ తోటల్లో తెల్లదోమను డబ్లు్య.డి.సి. సమర్థవంతంగా అరికట్టింది. వలయాకారపు తెల్లదోమను సైతం అరికడుతుంది. వేస్ట్ డీ కంపోజర్’ సీసాలు ఎక్కడ దొరుకుతాయి? వేస్ట్ డీ కంపోజర్ సీసాలను హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని మార్క్ అగ్రి జెనెటిక్స్ ప్రై. లిమిటెడ్ కార్యాలయం నుంచి పొందవచ్చు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ప్రాంతీయ మండలిగా గుర్తింపు పొందిన సంస్థ ఇది. ఈ కార్యాలయం నుంచి (ఉదయం 10 గం. నుంచి 5 గం. వరకు) రూ. 20లకు వేస్ట్ డీ కంపోజర్ సీసాలను రైతులు స్వయంగా వచ్చి కొనుగోలు చేయవచ్చు. రైతులు ఆధార్ కార్డు నకలు, పట్టాదారు పాస్‌బుక్ నకలును వెంటతీసుకెళ్లాలి. వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: సేంద్రియ రైతుల సేవా కేంద్రం, మార్క్ ప్రోగ్రీన్ జెనెటిక్స్ ప్రై.లిమిటెడ్, 416/ఎ, బాబూఖాన్ ఎస్టేట్, బషీర్‌బాగ్, హైదరాబాద్. 040– 23235858, 91009 80757. వేస్ట్ డీ కంపోజర్ సీసాను ఒకసారి కొనుక్కుంటే చాలు. ద్రావణాన్ని 5 లీటర్లు పక్కన పెట్టుకుంటే.. మళ్లీ అవసరమైనప్పుడు 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం కలిపి ఈ ద్రావణాన్ని పాలలో తోడు మాదిరిగా డ్రమ్ములో కలిపితే చాలు.. నాలుగైదు రోజుల్లో డ్రమ్ము ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. – డా. వి. ప్రవీణ్‌కుమార్ (92478 09764), శాస్త్రవేత్త, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), కేంద్ర వ్యవసాయ శాఖ, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ -
అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని సరుకుల సరఫరా
పురుగు పట్టిన పప్పు, బియ్యం బాలింతలు, గర్భిణులు తినేందుకు నిరాసక్తత ఇబ్రహీంపట్నం : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ సరుకుల సరఫరాకు కాంట్రాక్ట్ పొందిన వారు నాణ్యత లేకుండా అందిస్తుండడంతో పౌష్టికాహారాన్ని తినలేకపోతున్నారు. మండలంలోని 46 అంగన్వాడీ కేంద్రాలకు పురుగు పట్టిన కందిపప్పు ప్యాకెట్లు, లక్క పురుగులతో ఉన్న బియ్యాన్ని అధికారులు సరఫరా చేశారు. అంగన్వాడీ టీచర్లు ఈ విషయంపై అధికారులకు చెబితే ఏమవుతుందోననే భయంతో పురుగు పట్టిన కందిపప్పు, లక్క పురుగులతో ఉన్న బియ్యంతో వండిపెడుతున్నారు. దీంతో బాలింతలు, గర్భిణులు తినేందుకు ఇష్టపడడంలేదు. కేంద్రాలకు వచ్చే చిన్నారులను ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తున్నారు. 46 కేంద్రాలకు గతనెల పురుగుపట్టిన కందిపప్పు ప్యాకెట్లను సరఫరా చేశారని, ఈనెల1న లక్క పురుగులతో కూడిన బియ్యం సరఫరా అయినట్లు అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 68 కిలోల కందిపప్పు ప్యాకెట్లు, 5 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం సరఫరా అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పురుగు పట్టిన పప్పు, బియ్యాన్ని తిరిగి పంపించి నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు. కాంట్రాక్టర్ లోపం... అధికారుల నిర్లక్ష్యం అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు టెండర్లు పిలించారు. దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. సరుకులను సరఫరా చేసే ముందు అధికారులు పరిశీలించాల్సి ఉండగా అలా చేయకుండానే పురుగు పట్టిన పప్పు, బియ్యం సరఫరా అవుతున్నాయి. -
అక్కరకు రాని కార్డులు
పేరుకే రుణఅర్హత కార్డులు కౌలు రైతులకు దక్కని పంట రుణాలు 4702 మందికి కార్డుల జారీ పరిశీలనలో 2,628 మంది రైతులు 70మందికి కూడా రుణాలివ్వని వైనం కరీంనగర్ అగ్రికల్చర్ : చేనుచెలకల్లో కాయాకష్టం చేసుకునే రైతులకు నానా కష్టాలు వస్తున్నాయి. ఉన్న భూమిని నమ్ముకున్న సన్నచిన్నకారు రైతుకు ఒక కష్టమైతే.. ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసుకునే వారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. సాగుచేసుకుని బతుకుతామనుకున్న వారి ఆశలు అధికారులు, బ్యాంకర్ల తీరుతో ఆవిరవుతున్నాయి. కౌలుదారుల కష్టాలు తీరుస్తామంటూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా ప్రయోజనం శూన్యం. రుణఅర్హత కార్డులిచ్చి సాగురైతులతో సమానంగా పథకాలు వర్తింపజేస్తామన్న హామీలు వట్టిదే అయింది. ‘ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్ 2011’ ను చట్టాన్ని తీసుకొచ్చింది. కౌలురైతులను గుర్తించి వారికి రుణఅర్హత కార్డులను ఏటా జారీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కౌలుదారుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. నాలుగు నెలలు కావస్తున్నా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో లక్షకు పైగా కౌలు రైతులుండగా.. కేవలం 8,106 మంది దరఖాస్తులు చేసుకున్నారంటే అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగం మధ్య సమన్వయం కొరవడి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో కౌలుదారుల గుర్తింపు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇప్పటివరకు అందులో 4,702 మందినే అర్హులుగా గుర్తించారు. అందులో 1,422మంది రెన్యువల్ చేసుకున్నవారే కావడం గమనార్హం. మరో 776 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. 2,628 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర గడిచినా గుర్తించిన కౌలురైతుల్లో రెన్యువల్ చేసుకున్న వారిలో 70 మందికి కూడా రుణాలివ్వలేదని తెలిసింది. ఎందుకీ కార్డులు..? కౌలుచట్టం ద్వారా పంటరుణాలు, పంటలబీమా, పరిహారం, రాయితీలు, ప్రోత్సాహకాలు అందని ద్రాక్షగా మారాయి. 2011 నుంచి కౌలురైతులకు రుణఅర్హత కార్డులు జారీ చేస్తున్నారు. ఏటా దరఖాస్తుల సంఖ్యతోపాటు అర్హులు, రుణం పొందినవారి సంఖ్య తగ్గడంతో కౌలురైతులకు నిరాశే ఎదురైంది. గతేడాది 14,541 మందికి రుణ అర్హతకార్డులిచ్చారు. అందులో ఈ యేడాది 1,422 మంది రైతులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్యాంకర్ల మెలికలు రుణాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నా బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. సరైన అవగాహన లేక భూయజమానులు కౌలుపత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. భూయాజమానుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోవడంతో కౌలు రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. గతంలో ఇచ్చిన రుణఅర్హత కార్డులపై పంటరుణాలు అందకపోవడంతో రైతుల్లో నిర్లిప్తత వ్యక్తమవుతోంది. అప్పటికే సదరు భూములపై సొంతందారులు రుణం తీసుకుంటుండడంతో అదే భూమికి పంట రుణం ఎలా ఇవ్వమంటారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. పట్టాదారు, కౌలుదారుల మధ్య నెలకొంటున్న వివాదాలను సాకుగా చూపి రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సర్కార్ శాశ్వత పరిష్కారంతో న్యాయం చేయాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు.