అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యత లేని సరుకుల సరఫరా
-
పురుగు పట్టిన పప్పు, బియ్యం
-
బాలింతలు, గర్భిణులు తినేందుకు నిరాసక్తత
ఇబ్రహీంపట్నం : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ సరుకుల సరఫరాకు కాంట్రాక్ట్ పొందిన వారు నాణ్యత లేకుండా అందిస్తుండడంతో పౌష్టికాహారాన్ని తినలేకపోతున్నారు. మండలంలోని 46 అంగన్‌వాడీ కేంద్రాలకు పురుగు పట్టిన కందిపప్పు ప్యాకెట్లు, లక్క పురుగులతో ఉన్న బియ్యాన్ని అధికారులు సరఫరా చేశారు. అంగన్‌వాడీ టీచర్‌లు ఈ విషయంపై అధికారులకు చెబితే ఏమవుతుందోననే భయంతో పురుగు పట్టిన కందిపప్పు, లక్క పురుగులతో ఉన్న బియ్యంతో వండిపెడుతున్నారు. దీంతో బాలింతలు, గర్భిణులు తినేందుకు ఇష్టపడడంలేదు. కేంద్రాలకు వచ్చే చిన్నారులను ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తున్నారు. 46 కేంద్రాలకు గతనెల పురుగుపట్టిన కందిపప్పు ప్యాకెట్లను సరఫరా చేశారని, ఈనెల1న లక్క పురుగులతో కూడిన బియ్యం సరఫరా అయినట్లు అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి 68 కిలోల కందిపప్పు ప్యాకెట్లు, 5 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం సరఫరా అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పురుగు పట్టిన పప్పు, బియ్యాన్ని తిరిగి పంపించి నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.
కాంట్రాక్టర్ లోపం... అధికారుల నిర్లక్ష్యం
అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు టెండర్లు పిలించారు. దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు నాణ్యమైన సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. సరుకులను సరఫరా చేసే ముందు అధికారులు పరిశీలించాల్సి ఉండగా అలా చేయకుండానే పురుగు పట్టిన పప్పు, బియ్యం సరఫరా అవుతున్నాయి.