Use Me Works: వేస్ట్‌ నుంచి బెస్ట్‌ | Use Me Works: Delhi fashion designer Meenakshi Sharma success story | Sakshi
Sakshi News home page

Use Me Works: వేస్ట్‌ నుంచి బెస్ట్‌

Published Tue, Nov 8 2022 12:32 AM | Last Updated on Tue, Nov 8 2022 12:32 AM

Use Me Works: Delhi fashion designer Meenakshi Sharma success story - Sakshi

‘యూజ్‌ మి వర్క్‌’ ఫౌండర్‌ మీనాక్షి శర్మ

మన చుట్టూ పేరుకు పోతున్న రకరకాల వ్యర్థాల నుంచే కొత్త అర్థాలను వెతకచ్చు. ఆ అర్థాల నుంచి ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తోంది ఢిల్లీ వాసి మీనాక్షి శర్మ. ఫ్యాబ్రిక్‌ డిజైనింగ్‌లో కోర్సు చేస్తూనే... విపరీతంగా పేరుకుపోతున్న ఫ్యాబ్రిక్‌ వ్యర్థాల గురించీ ఆలోచించింది. అంతటితో ఆగిపోకుండాఆ వ్యర్థాల నుంచే ఎంతోమందికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. దిల్లీ చుట్టుపక్కల నుంచి నెలకు 200 కేజీల ఫ్యాబ్రిక్‌ వేస్ట్‌ను సేకరించి, 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

మెట్రో నగరాల్లో వాతావరణ పరిస్థితుల గురించి మనలో చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ, రకరకాల కాలుష్యాలని నివారించడం మాత్రం మనవంతు బాధ్యత అనుకోం. ఈ బాధ్యతారాహిత్యం మనకే కాదు మన ముందుతరాలకూ నష్టమే అంటోంది దిల్లీలో అప్‌స్లైకింగ్‌ ప్రాజెక్ట్‌ ‘యూజ్‌ మి వర్క్‌’ని విజయవంతంగా కొనసాగిస్తున్న మీనాక్షి శర్మ. కుతుబ్‌ మినార్‌ దగ్గర 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన క్రియేటివ్‌ స్టూడియోలో 30 మంది మహిళలు కుట్టుపని చేస్తూ కనిపిస్తారు. చుట్టుపక్కల ఫ్యాబ్రిక్‌ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వేస్ట్‌ క్లాత్స్‌ ఉన్న సంచులు నిండుగా కనిపిస్తుంటాయి. వాటిని చూపిస్తూ 34 ఏళ్ల మీనాక్షి శర్మ తన స్వీయానుభవాలను వివరిస్తుంటుంది.

‘వనరులను గౌరవించడం ఎలాగో మా అమ్మానాన్నలను చూస్తూ పెరిగాను. పాత వస్తువులను తిరిగి మరో వాడుకోదగిన వస్తువుగా ఎలా మార్చేవారో వారిని చూసే నేర్చుకున్నాను. చదువుకోవడానికి జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చిన నేను డిగ్రీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఎంచుకున్నాను. ఆ సమయంలో ఫ్యాషన్‌ పరిశ్రమలో టన్నులకొద్దీ ఫ్యాబ్రిక్‌ వ్యర్థాలు మిగిలిపోతున్నాయని తెలుసుకున్నాను. ‘ఆ వేస్టేజ్‌ని తిరిగి ఉపయోగంలోకి తేలేమా..?’ అని ఆలోచించాను.

► పేద మహిళలకు ఉపాధి
కాలేజీ పూర్తయ్యాక కెరియర్‌ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైనది అని ఆలోచించి, వ్యర్థాలవైపుగా కదిలాను. ఇళ్లలో పనులు చేసేవారూ, చిన్న చిన్న కూలి పనులకు వెళ్లే మహిళలను కలిశాను. వారికి కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి, డెకార్‌ ఐటమ్స్‌ చేయడం మొదలుపెట్టాను. క్లాత్‌ బ్యాగులు, ఇతర యాక్సెసరీస్, గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ తయారవుతాయి. ముఖ్యంగా పుట్టినరోజు, పండగ రోజుల్లో ఇంటి అలంకరణలో ఉపయోగించే ఐటమ్స్‌ని మహిళలు శ్రద్ధగా తయారు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే యూజ్‌ అండ్‌ త్రో ఐటమ్స్‌ ని ఈ క్లాత్‌ ఐటమ్స్‌ రీ ప్లేస్‌ చేస్తాయి. వీటివల్ల ఇక్కడి మహిళలకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంద’ని వివరిస్తుంది మీనాక్షి శర్మ.

► ఫ్యాక్టరీ టు వార్డ్రోబ్‌
వీరు తయారు చేసే వస్తువులలో ఫ్యాషన్‌ ఉపకరణాలు, అందమైన పూలతీగలు, కుషన్‌ కవర్లు, క్విల్ట్‌లు, బ్యాగులు, రగ్గులు.. వంటివి ఉంటాయి. ‘వ్యర్థాలను సేకరించడం పెద్ద సవాల్‌’ అంటారు మీనాక్షి. ‘ఇళ్లు, ఫ్యాక్టరీలు, బొటిక్స్‌ నుంచి స్క్రాప్‌ అంతా డంప్‌ చేసే ప్రదేశాలకు చేరుకుంటుంది. మేం ఆ డంపింగ్‌ నుంచి ఈ వ్యర్థాలను సేకరిస్తాం. కొన్నిసార్లు ప్రజలే తమ పాత దుస్తులను మా స్టూడియోకి కొరియర్‌లో పంపుతారు. వాటిని బాగు చేసి, అప్‌సైక్లింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని చెప్పే మీనాక్షి పదేళ్లుగా ఈ స్టూడియోని నిరంతరాయంగా నడుపుతోంది.

తన ‘యూజ్‌ మి’ స్టూడియో నుంచి వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహిస్తుంటుంది ఈ పర్యావరణ ప్రేమిక. ముఖ్యంగా పిల్లలకు వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తే ‘వృ«థా అంటూ ఏదీ ఉండదని’ గ్రహించి వారు జీవితమంతా ఆ విధానాలనే అవలంబిస్తారని తన వర్క్‌షాప్స్, ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా మరీ మరీ చెబుతుంది. మీనాక్షి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వెంచర్‌కి అమెరికా, లండన్‌ తదితర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. ఆలోచనతోపాటు ఆచరణలో పెట్టిన పని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందో తన సృజనాత్మక విధానాల ద్వారా చూపుతుంది మీనాక్షిశర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement