Fabric Designer
-
Use Me Works: వేస్ట్ నుంచి బెస్ట్
మన చుట్టూ పేరుకు పోతున్న రకరకాల వ్యర్థాల నుంచే కొత్త అర్థాలను వెతకచ్చు. ఆ అర్థాల నుంచి ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తోంది ఢిల్లీ వాసి మీనాక్షి శర్మ. ఫ్యాబ్రిక్ డిజైనింగ్‌లో కోర్సు చేస్తూనే... విపరీతంగా పేరుకుపోతున్న ఫ్యాబ్రిక్ వ్యర్థాల గురించీ ఆలోచించింది. అంతటితో ఆగిపోకుండాఆ వ్యర్థాల నుంచే ఎంతోమందికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. దిల్లీ చుట్టుపక్కల నుంచి నెలకు 200 కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్‌ను సేకరించి, 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మెట్రో నగరాల్లో వాతావరణ పరిస్థితుల గురించి మనలో చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ, రకరకాల కాలుష్యాలని నివారించడం మాత్రం మనవంతు బాధ్యత అనుకోం. ఈ బాధ్యతారాహిత్యం మనకే కాదు మన ముందుతరాలకూ నష్టమే అంటోంది దిల్లీలో అప్స్లైకింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి వర్క్’ని విజయవంతంగా కొనసాగిస్తున్న మీనాక్షి శర్మ. కుతుబ్ మినార్ దగ్గర 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన క్రియేటివ్ స్టూడియోలో 30 మంది మహిళలు కుట్టుపని చేస్తూ కనిపిస్తారు. చుట్టుపక్కల ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వేస్ట్ క్లాత్స్ ఉన్న సంచులు నిండుగా కనిపిస్తుంటాయి. వాటిని చూపిస్తూ 34 ఏళ్ల మీనాక్షి శర్మ తన స్వీయానుభవాలను వివరిస్తుంటుంది. ‘వనరులను గౌరవించడం ఎలాగో మా అమ్మానాన్నలను చూస్తూ పెరిగాను. పాత వస్తువులను తిరిగి మరో వాడుకోదగిన వస్తువుగా ఎలా మార్చేవారో వారిని చూసే నేర్చుకున్నాను. చదువుకోవడానికి జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చిన నేను డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నాను. ఆ సమయంలో ఫ్యాషన్ పరిశ్రమలో టన్నులకొద్దీ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు మిగిలిపోతున్నాయని తెలుసుకున్నాను. ‘ఆ వేస్టేజ్‌ని తిరిగి ఉపయోగంలోకి తేలేమా..?’ అని ఆలోచించాను. ► పేద మహిళలకు ఉపాధి కాలేజీ పూర్తయ్యాక కెరియర్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైనది అని ఆలోచించి, వ్యర్థాలవైపుగా కదిలాను. ఇళ్లలో పనులు చేసేవారూ, చిన్న చిన్న కూలి పనులకు వెళ్లే మహిళలను కలిశాను. వారికి కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి, డెకార్ ఐటమ్స్ చేయడం మొదలుపెట్టాను. క్లాత్ బ్యాగులు, ఇతర యాక్సెసరీస్, గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ తయారవుతాయి. ముఖ్యంగా పుట్టినరోజు, పండగ రోజుల్లో ఇంటి అలంకరణలో ఉపయోగించే ఐటమ్స్‌ని మహిళలు శ్రద్ధగా తయారు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ని ఈ క్లాత్ ఐటమ్స్ రీ ప్లేస్ చేస్తాయి. వీటివల్ల ఇక్కడి మహిళలకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంద’ని వివరిస్తుంది మీనాక్షి శర్మ. ► ఫ్యాక్టరీ టు వార్డ్రోబ్ వీరు తయారు చేసే వస్తువులలో ఫ్యాషన్ ఉపకరణాలు, అందమైన పూలతీగలు, కుషన్ కవర్లు, క్విల్ట్‌లు, బ్యాగులు, రగ్గులు.. వంటివి ఉంటాయి. ‘వ్యర్థాలను సేకరించడం పెద్ద సవాల్’ అంటారు మీనాక్షి. ‘ఇళ్లు, ఫ్యాక్టరీలు, బొటిక్స్ నుంచి స్క్రాప్ అంతా డంప్ చేసే ప్రదేశాలకు చేరుకుంటుంది. మేం ఆ డంపింగ్ నుంచి ఈ వ్యర్థాలను సేకరిస్తాం. కొన్నిసార్లు ప్రజలే తమ పాత దుస్తులను మా స్టూడియోకి కొరియర్లో పంపుతారు. వాటిని బాగు చేసి, అప్‌సైక్లింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని చెప్పే మీనాక్షి పదేళ్లుగా ఈ స్టూడియోని నిరంతరాయంగా నడుపుతోంది. తన ‘యూజ్ మి’ స్టూడియో నుంచి వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది ఈ పర్యావరణ ప్రేమిక. ముఖ్యంగా పిల్లలకు వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తే ‘వృ«థా అంటూ ఏదీ ఉండదని’ గ్రహించి వారు జీవితమంతా ఆ విధానాలనే అవలంబిస్తారని తన వర్క్‌షాప్స్, ఆన్లైన్ క్లాసుల ద్వారా మరీ మరీ చెబుతుంది. మీనాక్షి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వెంచర్‌కి అమెరికా, లండన్ తదితర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. ఆలోచనతోపాటు ఆచరణలో పెట్టిన పని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందో తన సృజనాత్మక విధానాల ద్వారా చూపుతుంది మీనాక్షిశర్మ. -
వెన్నంటే రూపాలు
కేన్వాస్ మీదే చిత్రకళ ఉండాలని నియమం ఏముంది? బ్లౌజ్ వెనుక భాగాన్ని కూడా కళాత్మక వేదిక చేయొచ్చు. దేశీయమైన కళను అక్కడ వ్యక్తం చేయవచ్చు. వీపునే ఒక చిత్ర ప్రదర్శనగా మార్చవచ్చు. కలకత్తా లాయర్ పరమఘోష్ ఫ్యాబ్రిక్ డిజైనర్‌గా చేస్తున్న ప్రయోగం ఇది. ఫ్యాషన్ డిజైనర్ అనకుండా ఫ్యాబ్రిక్ డిజైనర్ అనడంలోనే ఉంది ‘పరమ’ ప్రత్యేకత. ఆ స్పెషాలిటీ తెలుసుకోవాలంటే పరమ డిజైన్స్‌ని ఒకసారి పరిశీలించాలి. పరమఘోష్ కలకత్తా వాసి. లా చదువుకుంది. న్యాయవాద వృత్తిలో తీరకలేని పని ఆమెది. కానీ, తనలోని కళాతృష్ణకు జీవం పోయాలనుకుంది. అనుకున్నది సాధించింది. అందమైన కళారూపాలతో చేనేతలను అందంగా తీర్చిదిద్దుతోంది. 2015లో ‘పరమ’ పేరుతో సొంత క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. న్యాయవాది నుంచి డిజైనర్ వరకు వేసుకున్న ఆమె మార్గం కళాత్మకం. ►స్త్రీ ఔన్నత్యాన్ని చాటే డిజైన్లు చేనేత బ్లౌజులుగా, చీర కొంగు సింగారాలుగా ముచ్చటగొలుపుతుంటాయి. కలకత్తా కాళీ, తల్లీబిడ్డల అనుబంధం , గ్రామీణ మహిళ సింగారం, నృత్యభంగిమలు.. ఒకటేమిటి మానవ మూలాలను పరమ ఘోష్ డిజైన్లు వెలికితీస్తాయి. అందమైన కవిత్వం ఫ్యాబ్రిక్ మీద సహజసిద్ధమైన రంగులతో పెయింటింగ్‌గా, ఎంబ్రాయిడరీగా రూపుదిద్దుకుంటుంది. ►పగటిపూట న్యాయసంబంధిత విషయాలతో పోరాటం చేయడం, రాత్రి సమయాల్లో చేనేతపై మేజిక్ సృష్టించడం. ఇవి రెండూ విరుద్ధమైనవి. దీని గురించి ప్రస్తావిస్తే.. ‘‘మొదట్లో ఈ డిజైన్స్‌తో చేసిన బ్లౌజులు, చీరలు అమ్మకానికి పెట్టలేదు. మా కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు గిఫ్ట్‌గా ఇచ్చేదాన్ని. లేదంటే వాళ్లే కోరి మరీ నాచేత డిజైన్ చేయించుకునేవారు. నేను డిజైన్చేసిన దుస్తులను ధరించి నాకే ఫొటోలు పెట్టేవారు. ఫేస్బుక్లో పోస్ట్ చేసేవారు. అలా నా డిజైన్స్ మరో ప్రపంచానికి చేరువ చేశాయి. పుస్తకాలు, సంగీతం, చిత్రాలు, ప్రదేశాలు, ప్రజలు ఇవన్నీ నన్ను ఆకట్టుకున్న అంశాలే. వీటినే డిజైన్స్‌లో చూపిస్తుంటాను. ►‘ఫ్యాబ్రిక్ పైన కొత్త రాతలు రాయడం అనేది నాకున్న పిచ్చి. మన మూలాల్లో దాగున్న కళను తీసుకురావాలనే ప్రయత్నం. ‘పరమ’ అంటే సంతోషం. ఆ సంతోషాన్ని నలుగురికి పంచాలన్నదే నా తాపత్రయం. ఆ ఆలోచనతోనే ఒక చిన్న స్టార్టప్ వెంచర్‌ని ప్రారంభించాను. దీని ద్వారా నా వ్యక్తిత్వం ప్రతిబింబించడం సంతోషంగా ఉంది.’ ►నా చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లడానికి రోజూ ఏడ్చేదాన్నట. దాంతో మా అమ్మ నన్ను ఆర్ట్ క్లాస్‌కు పంపారు. నాటి నుంచి రంగులకన్నా నా జీవితాన్ని ఏదీ ప్రభావితం చేయలేదు. ఇంద్రధనుస్సు, రంగు రంగుల గాజులు, నా క్రేయాన్స్ పెట్టె, ఒక చిన్న గాజు పాత్ర, సీతాకోకచిలుకలు, కథల పుస్తకాలు.. ఇవే నన్ను అనుసరిస్తూ వచ్చాయి. పెయింటింగ్ నాకు ఊపిరిని ఇచ్చింది. చిత్రాలు, కథలే నన్ను అమితంగా ప్రభావితం చేసేవి.’ ►‘నాలుగేళ్ల క్రితం ‘పరమ’ను బ్రాండ్‌గా పరిచయం చేశాను. ఎనిమిదేళ్లు అందుకు తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. మొదట్లో చాలా భయపడ్డాను. కానీ, రాత్రింబవళ్లు వర్క్ చేశాను. ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాను. అందుకు మా అమ్మ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. క్రియేషన్ పార్ట్‌లో మా ప్యామిలీ మెంబర్స్ ఎవరూ వేలు పెట్టరు. కానీ, బిజినెస్ పార్ట్‌గా మా హజ్బెండ్ హెల్ప్ ఉంటుంది.’ ►స్త్రీ అంటే వంట చేయడం వరకే కాదు అది ఒక పార్ట్ మాత్రమే. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మన చేసే పని ప్రత్యేకమైనదై ఉండాలి. ఆ ప్రత్యేకత నేను ఎంచుకున్న మార్గంలో ఉంది. నా ఆర్ట్ మీద నాకు నమ్మకం ఉంది. అదే నన్ను నిలబెడుతుంది. పరమ ఘోష్ డిజైనర్, కలకత్తా -
కొప్పులో నెలవంక
వాలు జడ, పొట్టి జడ, పాయల జడ, ఫిష్ టెయిల్, ఫ్రెంచ్ ప్లాట్.. ఇలా వందలకొద్దీ హెయిర్ స్టైల్స్ ఉంటే, వాటి అలంకరణలు వేలకొద్ది ఉన్నాయి. అయితే ఒక వయసు దాటాక జడలు అంతగా నప్పవు. అలాగని కొప్పులు వేస్తే మరీ ‘పెద్దవారిలా కనిపిస్తాం’ అని ముఖం ముడుచుకోవాల్సిన అవసరం లేదు ఈ కేశాలంకరణ ఆభరణాలు మీ దగ్గరుంటే! అవి బంగారపువే కానక్కర్లేదు. ఇమిటేషన్ గోల్డ్‌లో విభిన్నరకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో రాళ్లు పొదిగినవి, రంగురంగుల పూసలు ఉన్న అందమైన క్లిప్స్ ఉన్నాయి. వెండి డిజైన్లు, ఫ్యాబ్రిక్ డిజైనర్ పువ్వులనూ తలలో తళుక్కుమనిపించవచ్చు. కొప్పుకిందుగా క్లిప్ పెడితే ఒక అందం, నెలవంక మాదిరిగా ఒకవైపు మాత్రమే అలంకరిస్తే మరొక అందం, కొప్పు మధ్యలో సింగారిస్తే ఇంకొక అందం. వేడుకల్లో వెలిగిపోయేలా నేటితరం అమ్మాయిలను సైతం ఆకట్టుకునే కొప్పుల సింగారాలు ఇవి.