product
-
టారిఫ్ వార్.. బొమ్మాబొరుసు!
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్‌ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్‌లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.మన ఎగుమతులకు లాభమేనా?ట్రంప్ టారిప్ వార్తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్‌లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్‌ల పెంపుతో యూఎస్‌లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.టెక్స్టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్‌లు భారత టెక్స్టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్‌లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్‌ను ఎగుమతి హబ్‌గా చేసుకుంటున్న యాపిల్‌తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్‌కు దెబ్బ...ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.యూఎస్‌లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్‌లో ఉన్న ఎఫ్‌పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.అనుకూలం⇒ ఫార్మా – చైనాపై టారిఫ్‌ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.⇒ టెక్స్టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్‌లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.ప్రతికూలం⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్‌తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది. -
ఫ్రెష్‌వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సీపీవో రాజీనామా
నాస్డాక్-లిస్టెడ్ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CPO) ప్రకాష్ శ్రీనివాసగోపాలన్ రామమూర్తి రాజీనామా చేశారు. ఆగస్టు 14నాటి ఎస్ఈసీ ఫైలింగ్ సమాచారం ప్రకారం.. కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ వుడ్సైడ్కి అక్టోబర్ 1 వరకు రామమూర్తి సహకారంగా ఉంటూ సాఫీగా పరివర్తన జరిగేలా చూస్తారు.మరోవైపు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టైలర్ స్లోట్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అదనపు పాత్రను పోషిస్తారని ఆగస్టు 6న ఎస్ఈసీ ఫైలింగ్‌లో సంస్థ ప్రకటించింది. అలాగే ఫిలిప్పా లారెన్స్‌ను చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా కంపెనీ నియమించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సంస్థలో మేనేజ్మెంట్ స్థాయిలో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి.సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గిరీష్ మాతృభూతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు. డెన్నిస్ వుడ్‌సైడ్ సీఈవో అయ్యారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత సీపీవో రాజీనామా వ్యవహారం చోటు చేసుకుంది. ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (CRO) ప్రదీప్ రథినం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థకు రాజీనామా చేశారు. -
‘వెంకటగిరి’ ఉత్పత్తులు అత్యద్భుతం
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి నేతన్నలు తయారు చేసిన పలు అద్భుతమైన డిజైన్లు అబ్బురపరుస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధులు కితాబిచ్చారు. వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, జరీ తదితర ఉత్పత్తులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఓపెన్ ఇండియా ఒన్ ప్రొడెక్ట్ అవార్డులో భాగంగా 2023లో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీల్లో వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధి జగీష్ తివారిమిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి వెంకటగిరిలో తయారు చేసే పలు చేనేత ఉత్పత్తులు, చీరలు, డిజైన్లను పరిశీలించారు. కేంద్ర బృందానికి వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికారు. పట్టణంలోని సాలి కాలనీలోని టాటాట్రస్ట్ అంతరాన్ అందిస్తున్న సహకారం, నేతన్నల వృత్తిలో నైపుణ్యం వంటి అంశాలపై ఆరాతీశారు. బంగారుపేటలో రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీతలు కూనా మల్లికార్జున్. గౌరవబత్తిన రమణయ్య నివాసాల వద్ద జందాని ట్రెడిషన్ రంగంలో తయారు చేసిన చీరలు, చీరలపై తెలుగు సంప్రదాయల కళ ఉట్టిపడేలా తయారు చేసిన డిజైన్లపై ఆరాతీశారు. వెంకటగిరి రాజా కాలంలో వెంకటగిరి జరీ చీరల ప్రత్యేకతపై వివరాలు తెలుసుకున్నారు. రాజరాజేశ్వరి చేనేత సహకారం సంఘాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వెంకటగిరిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి నక్కా వెంకటరమణయ్య అండ్ సన్స్ వద్దకు వెళ్లి తయారీ విక్రయానికి సిద్ధంగా ఉన్న పట్టు చీరలను పరిశీలించారు.అలాగే ప్రసిద్ధి చెందిన ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) కళాశాలను కేంద్ర బృందం ప్రతినిధి జిగీష తివారి మిశ్రా పరిశీలించారు. -
‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో చేనేత హవా
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) జాతీయ అవార్డుల ప్రక్రియ తుది దశకు చేరింది. ఓడీఓపీ జాతీయ అవార్డు–2023కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 25నుంచి జూలై 31 మధ్య దేశంలోని 751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. వడపోత అనంతరం దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకున్నారు. వాటిలో ఏపీ నుంచి 14 ఉత్పత్తులకుచోటు లభించింది. వీటిని ఇన్వెస్ట్ ఇండియా బృందం (జాతీయ స్థాయి టీమ్) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ నెల 10న మొదలైన ఈ బృందం పర్యటన ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. 14 ఉత్పత్తులు ఇవే.. రాష్ట్రం నుంచి పరిశీలనకు ఎంపికైన ఉత్పత్తులలో పొందూరు ఖద్దరు (శ్రీకాకుళం), బొబ్బిలి వీణ (విజయనగరం), అరకు కాఫీ (ఏఎస్ఆర్), సముద్ర రొయ్యలు (విశాఖ), పులగుర్త చొక్కాలు, చీరలు (తూర్పుగోదావరి), ఉప్పాడ జాందానీ చీరలు (కాకినాడ), కొబ్బరి, కొబ్బరి పీచు (అంబేడ్కర్ కోనసీమ), మంగళగిరి చేనేత చీరలు (గుంటూరు), పెద్ద రొయ్యలు (బాపట్ల), ఉదయగిరి చెక్క కత్తిపీట (నెల్లూరు), చేనేత సిల్క్ చీరలు (కర్నూలు), మదనపల్లె సిల్క్ చీరలు (అన్నమయ్య), సిల్క్ చీరలు (శ్రీ సత్యసాయి), వెంకటగిరి చీరలు (తిరుపతి) ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా తరఫున ఆరాధన, హరిప్రీత్‌సింగ్, నమీర అహ్మద్, రాబిన్ ఆర్ చెరియన్, సోనియా, ఆకాంక్ష, జిగిషా తివారీ బృందం వేర్వేరుగా 8 రోజులపాటు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవార్డుకు ఎంపికైతే మంచి మార్కెటింగ్ వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల ప్రతిభను వెలికితీసి వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓడీఓపీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించేలా అవార్డులు ఇస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 24 జిల్లాల్లో ప్రత్యేకత సంతరించుకున్న 38 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి ఓడీఓపీ జాతీయ అవార్డుకు దరఖాస్తు చేశాం. ఏపీ నుంచి 14 ఉత్పత్తులను తుది పరిశీలనకు ఎంపిక చేయగా.. వాటిలో 8 చేనేత వస్త్రాల ఉత్పత్తులు ఉండటం గొప్ప విషయం. జాతీయ అవార్డుకు ఎంపికైన వాటికి మార్కెటింగ్ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. – కె.సునీత, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్‌లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్‌గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్‌లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌తో చేయించిన సాఫ్ట్ టాయ్స్‌లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఏటా మూడు వినూత్న ఉత్పత్తులు: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చికిత్స ప్రమాణాలను మెరుగుపర్చగలిగే మూడు వినూత్న ఉత్పత్తులను ఏటా ఆవిష్కరించాలని ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ (డీఆర్ఎల్) నిర్దేశించుకుంది. అలాగే 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు తక్కువ ధరల్లో ఔషధాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి నిర్దేశించుకున్న సుస్థిర వృద్ధి లక్ష్యాల ప్రణాళికను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా, 2030 నాటికి పూర్తిగా 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వాడుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. అలాగే 2027 నాటికి మార్కెట్లో తామే ముందుగా ప్రవేశపెట్టే ఉత్పత్తులు 25 శాతం ఉండేలా కంపెనీ కృషి చేయనుంది. అటు సీనియర్ లీడర్షిప్ స్థాయిలో మహిళల సంఖ్యను ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు పెంచుకుని 35 శాతానికి పెంచుకోనుంది. సామాజిక, పర్యావరణ లక్ష్యాలపరంగా చూస్తే వ్యర్థాలను గణనీయంగా తగ్గించుకోవడం తదితర అంశాలు ఉన్నాయి. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!) -
Use Me Works: వేస్ట్ నుంచి బెస్ట్
మన చుట్టూ పేరుకు పోతున్న రకరకాల వ్యర్థాల నుంచే కొత్త అర్థాలను వెతకచ్చు. ఆ అర్థాల నుంచి ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తోంది ఢిల్లీ వాసి మీనాక్షి శర్మ. ఫ్యాబ్రిక్ డిజైనింగ్‌లో కోర్సు చేస్తూనే... విపరీతంగా పేరుకుపోతున్న ఫ్యాబ్రిక్ వ్యర్థాల గురించీ ఆలోచించింది. అంతటితో ఆగిపోకుండాఆ వ్యర్థాల నుంచే ఎంతోమందికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టింది. దిల్లీ చుట్టుపక్కల నుంచి నెలకు 200 కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్‌ను సేకరించి, 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మెట్రో నగరాల్లో వాతావరణ పరిస్థితుల గురించి మనలో చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ, రకరకాల కాలుష్యాలని నివారించడం మాత్రం మనవంతు బాధ్యత అనుకోం. ఈ బాధ్యతారాహిత్యం మనకే కాదు మన ముందుతరాలకూ నష్టమే అంటోంది దిల్లీలో అప్స్లైకింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి వర్క్’ని విజయవంతంగా కొనసాగిస్తున్న మీనాక్షి శర్మ. కుతుబ్ మినార్ దగ్గర 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తన క్రియేటివ్ స్టూడియోలో 30 మంది మహిళలు కుట్టుపని చేస్తూ కనిపిస్తారు. చుట్టుపక్కల ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వేస్ట్ క్లాత్స్ ఉన్న సంచులు నిండుగా కనిపిస్తుంటాయి. వాటిని చూపిస్తూ 34 ఏళ్ల మీనాక్షి శర్మ తన స్వీయానుభవాలను వివరిస్తుంటుంది. ‘వనరులను గౌరవించడం ఎలాగో మా అమ్మానాన్నలను చూస్తూ పెరిగాను. పాత వస్తువులను తిరిగి మరో వాడుకోదగిన వస్తువుగా ఎలా మార్చేవారో వారిని చూసే నేర్చుకున్నాను. చదువుకోవడానికి జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చిన నేను డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నాను. ఆ సమయంలో ఫ్యాషన్ పరిశ్రమలో టన్నులకొద్దీ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు మిగిలిపోతున్నాయని తెలుసుకున్నాను. ‘ఆ వేస్టేజ్‌ని తిరిగి ఉపయోగంలోకి తేలేమా..?’ అని ఆలోచించాను. ► పేద మహిళలకు ఉపాధి కాలేజీ పూర్తయ్యాక కెరియర్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైనది అని ఆలోచించి, వ్యర్థాలవైపుగా కదిలాను. ఇళ్లలో పనులు చేసేవారూ, చిన్న చిన్న కూలి పనులకు వెళ్లే మహిళలను కలిశాను. వారికి కుట్టుపనిలో శిక్షణ ఇచ్చి, డెకార్ ఐటమ్స్ చేయడం మొదలుపెట్టాను. క్లాత్ బ్యాగులు, ఇతర యాక్సెసరీస్, గృహాలంకరణకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడ తయారవుతాయి. ముఖ్యంగా పుట్టినరోజు, పండగ రోజుల్లో ఇంటి అలంకరణలో ఉపయోగించే ఐటమ్స్‌ని మహిళలు శ్రద్ధగా తయారు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ని ఈ క్లాత్ ఐటమ్స్ రీ ప్లేస్ చేస్తాయి. వీటివల్ల ఇక్కడి మహిళలకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంద’ని వివరిస్తుంది మీనాక్షి శర్మ. ► ఫ్యాక్టరీ టు వార్డ్రోబ్ వీరు తయారు చేసే వస్తువులలో ఫ్యాషన్ ఉపకరణాలు, అందమైన పూలతీగలు, కుషన్ కవర్లు, క్విల్ట్‌లు, బ్యాగులు, రగ్గులు.. వంటివి ఉంటాయి. ‘వ్యర్థాలను సేకరించడం పెద్ద సవాల్’ అంటారు మీనాక్షి. ‘ఇళ్లు, ఫ్యాక్టరీలు, బొటిక్స్ నుంచి స్క్రాప్ అంతా డంప్ చేసే ప్రదేశాలకు చేరుకుంటుంది. మేం ఆ డంపింగ్ నుంచి ఈ వ్యర్థాలను సేకరిస్తాం. కొన్నిసార్లు ప్రజలే తమ పాత దుస్తులను మా స్టూడియోకి కొరియర్లో పంపుతారు. వాటిని బాగు చేసి, అప్‌సైక్లింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని చెప్పే మీనాక్షి పదేళ్లుగా ఈ స్టూడియోని నిరంతరాయంగా నడుపుతోంది. తన ‘యూజ్ మి’ స్టూడియో నుంచి వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది ఈ పర్యావరణ ప్రేమిక. ముఖ్యంగా పిల్లలకు వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తే ‘వృ«థా అంటూ ఏదీ ఉండదని’ గ్రహించి వారు జీవితమంతా ఆ విధానాలనే అవలంబిస్తారని తన వర్క్‌షాప్స్, ఆన్లైన్ క్లాసుల ద్వారా మరీ మరీ చెబుతుంది. మీనాక్షి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వెంచర్‌కి అమెరికా, లండన్ తదితర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. ఆలోచనతోపాటు ఆచరణలో పెట్టిన పని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందో తన సృజనాత్మక విధానాల ద్వారా చూపుతుంది మీనాక్షిశర్మ. -
వంట పాత్రల్ని శుభ్రం చేసి..ఆరబెట్టే క్రాకరీ శానిటైజర్!
పింగాణి, గాజు వస్తువులను శుభ్రం చేయడం, భద్రపరచడం చాలా జాగ్రత్తతో చేయాల్సిన పని. పూర్తిగా తడి ఆరని ఈ వస్తువులపై సూక్ష్మజీవులు చేరే అవకాశాలూ ఎక్కువే! ఇలాంటి సున్నితమైన పింగాణి, గాజు వస్తువులను చక్కగా శుభ్రంచేసి, వాటిని పొడిగా ఆరబెట్టేందుకు జపానీస్ సంస్థ ‘యొకాయి’ ఈ క్రాకరీ శానిటైజర్‌ను రూపొందించింది. డిష్వాషర్లు పాత్రలను శుభ్రం చేసే మాదిరిగానే, ఇది పింగాణి, గాజు పాత్రలను, వస్తువులను శుభ్రం చేస్తుంది. అవి శుభ్రమయ్యాక 60 డిగ్రీల ఉష్ణోగ్రత విడుదల చేసి, వాటిపై సూక్ష్మజీవులను నాశనం చేసి, పొడిగా ఆరబెడుతుంది. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. దీని పనితీరుపై పరీక్షలు కొనసాగిస్తున్నారు. -
AP: రికార్డులు తిరగరాసిన విశాఖ స్టీల్‌ప్లాంట్
ఉక్కునగరం (గాజువాక)/విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. స్టీల్‌ప్లాంట్ 2018–19లో అత్యధికంగా 49,11,194 మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల్ని అమ్మి అప్పట్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 నాటికే ఆ రికార్డును అధిగమించి అత్యధిక అమ్మకాలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వారాలు ముందుగానే పాత రికార్డును అధిగవిుంచడం విశేషం. ఈ సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులను అభినందించింది. చదవండి: దక్షిణ కొరియా మార్కెట్లో ఏపీ బంగినపల్లి -
ప్లానెట్ 3 ఆర్: పాలిథిన్ ఫ్యాషన్
మనం పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నైజిరియాకు చెందిన అడెజోక్ లసిసి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చిన్నప్పటినుంచి లసిసికి చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించే అలవాటు. తరచూ ప్లాస్టిక్, గుడ్డ ముక్కల వ్యర్థాలను రోడ్లపక్కన పడేయడం, దాని ఫలితంగా డ్రైనేజీలు పూడిపోయి నీళ్లుపోవడానికి వీలు లేక ఎక్కడికక్కడ మురుగు నీరంతా నిలిచిపోవడం... అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకునేది. క్రమేణా వయసుతోపాటు ఆలోచనలు కూడా పెరిగి పెద్దయ్యాయి. దాని ఫలితమే డిగ్రీ పూర్తయ్యాక ఏకంగా రీసైక్లింగ్ కంపెనీ పెట్టి ప్లాస్టిక్‌తో ఫ్యాషనబుల్ ఉత్పత్తుల డిజైనింగ్! ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తూ పెరిగిన లసిసికి ఎలాగైనా దానికి పరిష్కారం కనుగొనాలన్న కుతూహలం పెరిగింది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క ఆలోచిస్తుండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటికి వచ్చింది. అప్పటికీ ఇంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. కాలుష్య సమస్య మరింత ఎక్కువైంది. ఇలా అనుకుంటుండగానే వాటర్ ప్యాకెట్ల వ్యర్థాలు టన్నులకొద్ది పేరుకు పోవడం గమనించింది. వీటితో ఏం చేయాలి అనుకున్న సమయంలో లసిసి తల్లి దగ్గర నేత పని నైపుణ్యాలు నేర్చుకుని వాటర్ ప్యాకెట్లతో వస్త్రాన్ని రూపొందించింది. దీంతో ఏదైనా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నైజీరియాలో వాటర్ ప్యాకెట్స్ తయారీలో నైలాన్ ను వాడుతారు. ఈ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేయడం కంటే కొత్తగా తయారు చేయడానికి ఖర్చు తక్కువ. అందువల్ల పారిశ్రామిక వర్గాలు కొత్త వాటర్ ప్యాకెట్స్‌ను తయారు చేస్తాయి. అవి టన్నుల కొద్దీ చెత్తలో పేరుకు పోతుంటాయి. వీటిని రీసైకిల్ చేయడమే లక్ష్యంగా ‘ప్లానెట్ 3ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కంపెనీని ప్రారంభించింది లసిసి. ప్లానెట్ 3 ఆర్ వాడిపడేసిన వాటర్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌బిన్ లను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల వారంతా దానిలో ప్లాస్టిక్‌ను పడేయడం వల్ల సేకరణ సులభం అయింది. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను శుభ్రం చేసి ఎండబెట్టి, తరవాత దారాలుగా కత్తిరించి మగ్గం మీద వస్త్రంగా నేస్తుంది. దీని తయారీలో తొంబై శాతం ప్లాస్టిక్, పదిశాతం గుడ్డముక్కలను వినియోగిస్తుంది. ఇలా తయారైన బట్టతో చెప్పులు, బూట్లు, స్కూలు బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డ్రెస్‌లుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక మహిళలు, పిల్లలకు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కూడా కల్పిస్తుంది. కొన్ని వందలమంది వికలాంగ యువతీ యువకులకు రీసైక్లింగ్‌పై శిక్షణ ఇచ్చింది. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తోంది. లసిసి చేస్తోన్న పర్యావరణ కృషికి గాను ఆమెను అనేక అవార్డులు కూడా వరించాయి. రోజుకి అరవై మిలియన్ల వాటర్ ప్యాకెట్లు! ‘‘నైజిరియాలో రోజుకి యాభై నుంచి అరవై మిలియన్ల నీటిప్యాకెట్లు అవసరమవుతాయి. అరలీటరు వాటర్ ప్యాకెట్లను వీధుల్లోని షాపులు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పటికీ కూడా 39 శాతం మందికి సరైన మంచి నీటి సదుపాయం లేదు. అందువల్ల వాటర్ ప్యాకెట్లపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. వాటర్ ప్యాకెట్లు దాహం తీరుస్తున్నప్పటికీ వాడి పడేసిన తరువాత అవి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఒక్క వాటర్ విభాగం నుంచి వస్తోంది. దీన్ని తన చిన్నతనం నుంచి నిశితంగా గమనించిన లసిసి కాలుష్యానికి పరిష్కారం వెతుకుతూ ప్లానెట్ 3 ఆర్ ను నెలకొల్పింది. -
నేషనల్ గట్క పోటీలలో ఏపీకి రజతం.. తొలి ప్రయత్నం లోనే..
సాక్షి, తిరుపతి (చిత్తూరు): 9వ జాతీయస్థాయి గట్క మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలలో తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి సత్తా చాటింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఈ పోటీలు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఇండియన్ గట్క అసోసియేషన్ నిర్వహించింది. ఉత్తమ ప్రతిభ కనరబరచి నవశక్తి సిల్వర్ మెడల్ సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ గట్క అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోత్సా్నదేవి తెలిపారు. అండర్–19 విభాగంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నవశక్తి వరుసగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక క్రీడాకారిణులపై గెలిచి, ఫైనల్స్‌లో పంజాబ్‌తో తలపడి రెండో స్థానంలో నిలిచిందని ఆమె చెప్పారు. ముగింపు రోజున కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాగూర్ చేతుల మీదు గా రజత పతకాన్ని అందుకుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎందరో క్రీడాకారిణులు పాల్గొన్నప్పటికీ నవశక్తి మాత్రమే పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని జ్యోత్సా్నదేవి, రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, జిల్లా గట్క అసోసియేషన్ సెక్రటరీ శివ ఆమెను అభినందించారు. డిసెంబర్లో హర్యానా రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా నేషనల్స్‌కు నవశక్తి ఎంపికైందని తెలిపారు. ప్రయాణం చేస్తూనే..ఆన్లైన్ ఎగ్జామ్‌కు హాజరు! నవశక్తి చిన్నతనం నుంచే క్రీడల్లో విశేషంగా రాణి స్తోంది. పలు రికార్డులు సొంతం చేసుకుంది. రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలు సైతం ఎన్నో అందుకుంది. తొలుత స్విమ్మింగ్, స్కేటింగ్, తర్వాత కరాటే, రెజ్లింగ్, ఇప్పుడు గట్కలో తన సత్తా చాటుతూ క్రీడల్లో తన ప్రత్యేకతను చాటు కుంటోంది. ప్రస్తుతం చెన్నైలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నవశక్తి జాతీయస్థాయి గట్క పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి ట్రైన్లో ఆంధ్రప్రదేశ్ జట్టుతో వెళ్తూనే తనతోపాటు లాప్టాప్ తీసుకెళ్లింది. ప్రయాణిస్తూనే ఆన్లైన్ క్లాసులకు హాజరవడమే కాకుండా ఫైనల్ సెమిస్టర్ పరీక్ష సైతం రాయడం గమనార్హం! -
ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్
సాక్షి, అమరావతి: స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2030 నాటికి దేశం నుంచి విదేశాలకు అయ్యే ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ఏపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రతి జిల్లాలో ఎక్స్పోర్ట్ హబ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎక్స్పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేసి.. ఆయా జిల్లాల నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేస్తోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ)లను ఏర్పాటు చేస్తూ గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతి జిల్లాలో స్థానిక వ్యాపారులకు ఎగుమతుల అవకాశాలను వివరిస్తూ వారికి చేయూత అందించేందుకు నలుగురు అధికారులతో డిస్ట్రిక్ ఇండస్ట్రియల్ సెంటర్ (డీఐసీ)లను ఏర్పాటు చేసింది. ఇవి ఆయా జిల్లాల నుంచి ఎగుమతికి అవకాశం గల ఉత్పత్తులను ఎంపిక చేసి ఆమోదం కోసం డీఐఈపీసీలకు పంపిస్తారు. వీటిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఆమోదిస్తారు. ఆ విధంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 10 జిల్లాలకు సంబంధించిన ఉత్పత్తులకు ఆమోదం లభించగా.. మరో మూడు జిల్లాలకు సంబంధించి ఉత్పత్తులు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో ఆరు జిల్లాలు ఇప్పటికే ఎగుమతులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాయి. టాప్–3లో నిలిచేలా.. మన రాష్ట్రం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,07,730 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో ఇది 5.8 శాతం వాటా కాగా.. ఈ విషయంలో మన రాష్ట్రం ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. 2030 నాటికి దీనిని 10 శాతానికి చేర్చడం ద్వారా టాప్–3 స్థానంలో నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా అదనంగా ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులను గుర్తించి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ) డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం విదేశీ ఎగుమతులతో పాటు ఆన్లైన్ రిటైల్ మార్కెటింగ్ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. ఇందుకోసం వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య సంఘాలతో ఏపీ ఈడీబీ చర్చలు జరుపుతోందన్నారు. కొన్ని ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు పొందేవిధంగా చర్యలు తీసుకోవడంతోపాటు త్వరలోనే ఎగుమతులకు ప్రత్యేక పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. చదవండి : బైక్ ఎగుమతుల్లో రికార్డు సృష్టించిన భారత్..! -
ఆన్లైన్ లో ఫేక్ వస్తువులు అమ్మితే ఇక అంతే!
ప్రస్తుతం కరోనా పుణ్యమా అని చాలా మంది ప్రజలు బయటికి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్ట పడటం లేదు. ప్రతి చిన్న వస్తువును కొనుక్కోవడానికి కూడా ఆన్ లైన్ షాపింగ్ మీద ఆధారపడుతున్నారు. కరోనా రాక ముందు కంటే వచ్చిన తర్వాతే ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్న వస్తువులపై ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఇందులో కొనే వస్తువు నిజమా కదా?, ఫేక్ వస్తువు వస్తే ఏం చేయ్యాలి ? అనే సందేహాలు వారి మదిలో మెదులుతున్నాయి. ఈ మధ్య కాలంలోఈ కామర్స్ సైట్లలో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నట్లు వినియోగదారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటి వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన కొన్ని నియమాలను నేషనల్ ఈ కామర్స్ పాలసీ ముసాయిదాలో పొందుపరిచింది. ప్రైవేట్, ప్రైవేట్యేతర డాటాపై ప్రభుత్వం ముసాయిదా ప్రక్రియలా పాలసీని పేర్కోంది. పరిశ్రమ అభివృద్ధి కోసం డేటా వినియోగంపై నూతన విధానం తీసుకురాబోతుంది. దీనిలో ప్రతి ఉత్పతులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వినియోగదారులకు తెలిసే విధంగా కొత్త ముసాయిదా తీసుకురానున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఏదైనా కంపెనీ ఉత్పత్తి ఆన్ లైన్ లో అమ్మాలని అనుకుంటే దానికి సంబందించిన ప్రతి సమాచారం యూజర్లకు అందించాల్సి ఉంటుంది. ఈ కామర్స్ కంపెనీలు తమ ఫాట్ ఫాంలలో విక్రయించే ఉత్పత్తులు నకిలీవి కాదని ముందే నిర్దారించుకోవడం కోసం సేఫ్ గార్డ్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆన్లైన్ లో నకిలీ ఉత్పత్తిని అమ్మితే అది అన్ లైన్ కంపెనీతోపాటు, అమ్మంకందారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ చర్య పారిశ్రామిక అభివృద్ధికి డేటా షేరింగ్ సహకరిస్తుందని తెలిపింది. ఇందుకోసం మరిన్ని డేటా నిబంధనలు రానున్నట్లుగా తెలిపింది. ఈ కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. చదవండి: ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయండి -
చెరువు నిండె.. చేను పండె!
సాక్షి, హైదరాబాద్: ఆహా.. ఉత్పత్తి అంటే ఇదీ..! తెలంగాణ పంట పడింది. రికార్డులు కొట్టుకుపోతున్నాయి. చెరువు నిండింది. పొలం పారింది. రైతుకు దిగులు లేదు. పంటకు తెగులులేదు. విత్తనాల కొరతలేదు. ఎరువుల కరువులేదు. ‘రైతుబంధు’ఆదుకుంది. చేనూచెలకా చిద్విలాసం చేశాయి. దిగుబడులు ఎగబడి పెరిగాయి. ఉత్పత్తిలో ఖరీఫ్, రబీలకు తేడా లేదు. తెలంగాణ పల్లెలు గోదావరి జిల్లాలతో పోటీ పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్లుగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో భారీ పురోగతి కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులు ఉనికిలోకి రావడంతో సాగునీటి వసతి పెరిగింది. దీంతో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. గోదావరి జిల్లాలతో పోటీ పడి... కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014–15లో ఆహారధాన్యాల ఉత్పత్తి 72.18 లక్షల మెట్రిక్‌టన్నులు. అది ఇప్పుడు 91.93 లక్షల మెట్రిక్‌టన్నులకు చేరుకుంది. 2016–17, 2017–18 ఏళ్లల్లో రబీల్లో రికార్డుస్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. గోదావరి జిల్లాలతో పోటీపడి ఆహారధాన్యాల ఉత్పత్తి కావడం విశేషం. విచిత్రమేంటంటే... 2014–15 ఖరీఫ్‌లో 44.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పండితే, 2016–17 రబీలోనైతే ఏకంగా 49.07 లక్షల మెట్రిక్ టన్నులు పండటం విశేషం. గత ఖరీఫ్‌లో వరి దిగుబడి గత 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 41.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (61.57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) పండటం విశేషం. గతేడాది పత్తి, పప్పుధాన్యాల దిగుబడి ఢమాల్... గతేడాది పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి మాత్రం పడిపోయింది. 2018–19లో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని నివేదిక తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. 2017–18లో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యా ల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. -
2020లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ!
ముంబై: సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని సిమెంట్ విభాగం, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ 2020 కల్లా ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించాలని జేఎస్‌డబ్ల్యూ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.8 మిలియన్ టన్నులుగా ఉంది. దీన్ని వచ్చే ఏడాదిమార్చి కల్లా 14 మిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీలేశ్ నర్వేకర్ పేర్కొన్నారు. 2020 కల్లా 20 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. సిమెంట్ ఉత్పత్తి ఈ స్థాయికి చేరాకే ఐపీఓకు వస్తామన్నారు. కంపెనీ విలువ రూ.18,000 కోట్లు ఐపీఓకు వచ్చే నాటికి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కంపెనీ విలువ రూ.18,000 కోట్లుగా ఉండేలా చూసుకోవాలని లకి‡్ష్యంచినట్లు నీలేశ్ చెప్పారు. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు తమ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించే అవకాశం ఉందన్నారు. అంటే ఈ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్లో ఉండొచ్చు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, ఉత్పత్తి పెంచుకోవటానికి వినియోగిస్తామన్నారు. -
పత్తి చేల్లో దొంగలు పడ్డారు
కర్నూలు(అగ్రికల్చర్): పత్తి చేల్లో దొంగలు పడుతున్నారు. కరువు, పెద్ద నోట్ల మార్పిడితో ప్రజలు ఇళ్లల్లో డబ్బులు పెట్టడం లేదని తెలుసుకున్నారే ఏమో కానీ కొద్ది రోజులుగా దొంగలు పంట ఉత్పత్తులను అపహరిస్తున్నారు. గతంలో కల్లాల్లో పంట నూర్పిడి సమయంలో దొంగలు పడేవారు. ప్రస్తుతం ఏకంగా పొలాలకు వెళ్లి దిగుబడులను దోచుకెళ్తున్నారు. ఇటీవల కోడుమూరు మండలంలోని పులకుర్తి, కల్లపరి గ్రామాల్లో పత్తి దొంగతనాలు జరిగాయి. తాజాగా కర్నూలు మండలం జి.సింగవరం గ్రామాల్లో ఒకే రోజు పలువురి రైతుల పొలాల్లోని పత్తిని అపహరించారు. దాదాపు 20 క్వింటాళ్ల పత్తి చోరికి గురైనట్లు రైతులు చెబుతున్నారు. జి.సింగవరం గ్రామానికి చెందిన రైతులు మురళీమోహన్, రామకృష్ణ, మహేష్, బేరి మధు, వెంకటేశ్వర్లు, బేరి మద్దిలేటి చేలల్లో దాదాపు రూ.లక్ష విలువ చేసే పత్తిని ఎత్తుకెళ్లారు. కరువు కాలంలో చేతికొచ్చే అరకొర పంటను దొంగలను అపహరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నాణ్యమైన ఉత్పత్తి సాధించాలి
మల్టీ డిపార్ట్మెంట్æ కమిటీ సమావేశాల్లో సీజీఎం వెంకటేశ్వరరావు గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి అందరూ కృషి చేయాలని ఆర్జీ–1 సీజీఎం, ఆర్జీ–2 ఇన్చార్జి సీజీఎం వెంకటేశ్వర్రావు కోరారు. ఆర్జీ–1 పరిధిలోని జీడీకే–1వ గని, ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3 కృషిభవన్‌లో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన మల్టీడిపార్ట్‌మెంటల్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది ఉద్యోగులందరూ మల్టీ డిపార్ట్మెంట్ కమిటి ద్వారా సమావేశాలు నిర్వహించుకుని ఆయా గనులు, డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో, సమన్వయంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సంస్థను లాభాల బాట పట్టించారని తెలిపారు. ఈసారి వర్షాల కారణంగా సెప్టెంబర్ వరకు ఉత్పత్తి, ఉత్పాదకత విషయంలో కొంత వెనుకబడి ఉన్నామని, దీనిని అధిగమించి ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి అంకితభావంతో పని చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితే వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధిం^è డం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో బొగ్గుకు డిమాండ్ తగ్గిపోయిందన్నారు. విదేశాలను నుంచి తక్కువ ధరకే బొగ్గు మార్కెట్లోకి దిగుమతి కావడంతో బొగ్గు ధరలు పడిపోయాయని తెలిపారు. విద్యుత్ సంస్థలకు సరఫరా చేసే బొగ్గు ధరను పెంచే అవకాశం లేకుండా పోయిందని, కేవలం సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసే బొగ్గు ధరమాత్రమే మనచేతుల్లో ఉందన్నారు. దీనికోసం ఇ–యాక్షన్ ద్వారాబొగ్గు అమ్మకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులపై ఒత్తిడి పెంచి అధికారులు చేతులు ఎత్తేస్తే కాదని అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. భారీ యంత్రాల నిర్వహణపై దృష్టిసారించి పనిగంటలు పెంచుకోవాలని సూచించారు. సంస్థ మిగులు బడ్జెట్ కోసం అవుట్ సోర్సింగ్, ట్రాన్స్‌పోర్టు కోల్‌కాంట్రాక్టు ద్వారా పనులు నిర్వహిస్తుందని తెలిపారు. ఇది ఎంతో కాలం ఉండబోదన్నారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచకతప్పదని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రాన్స్‌పోర్టు ధరలు విపరీతంగా పెరిగాయని, ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ పరిస్థితి అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. సమావేశాల్లో ఐఈడీ ఏజీఎం ప్రసాద్‌రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేవీ.రావు సాధించాల్సిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, రక్షణ పరమైన చర్యలు, అందరి బాధ్యత తదితర విషయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశాల్లో ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, ఎస్వోటూ జీఎం రవీందర్, ఏజెంట్లు సాంబయ్య, రమేశ్, పర్సనల్ డీజీఎం బి.హనుమంతరావు, ఎన్వీ.రావు, ఈఅండ్ఎం ఏజీఎం సాయిరాం, ఫైనాన్స్ డీజీఎం రాజేశ్వర్‌రావు, క్వాలిటీ డీజీఎం భైరయ్య, మేనేజర్లు బీవీ.రమణ, వెంకటయ్య, సంక్షేమాధికారి శ్రీనివాస్, నాయకులు సారంగపాణి, యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌అహ్మద్, రమేశ్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు ఉత్పత్తులపై ‘85% హెచ్చరిక’ వద్దు
పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్: పొగాకు ఉత్పత్తులపై 85% గ్రాఫిక్ ఆరోగ్య హెచ్చరికలు ఉండాలన్న నిబంధనను ఉపసంహరించాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పాన్‌షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగరాజ్ శంకర్రావు, నేతలు సతీష్‌నాయక్, మహ్మద్ ఆఫ్జలుద్దీన్లు మాట్లాడుతూ ప్రపంచంలోనే పొగాకు అత్యధికంగా వినియోగించే యూఎస్ఏ, జపాన్, చైనా వంటి దేశాల్లో సున్నా ఛాయాచిత్ర హెచ్చరికలుంటే ఇండియాలో 85% ఉండాలన్న నిబంధన విధించడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. వేలాది కుటుంబాలు పాన్‌షాప్‌ల ద్వారా జీవనం కొనసాగిస్తున్నాయని, అంతేగాక, తంబాకు అమ్మే వ్యాపారులు, రిటైలర్లు జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి హెచ్చరికల ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. -
ఓసీటీఎల్ ప్లాంటులో ఉత్పత్తి బంద్
♦ ఏజీఎంపై కార్మికుల దాడే కారణమన్న యాజమాన్యం ♦ అధికారి మృతి వల్లే ఈ నిర్ణయమంటూ ఎక్స్ఛేంజీలకు లేఖ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రిల్లింగ్ పైపుల తయారీలో ఉన్న ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్)... నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఉన్న తన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18న కార్మికుల దాడిలో కంపెనీ ఆపరేషన్స్ సీనియర్ ఏజీఎం మస్తాన్ రావు గాయపడ్డారు. ఆ తరవాత ఆసుపత్రిలో చికిత్స చెందుతూ మృతి చెందారు. సోమవారం అత్యవసరంగా సమావేశమైన ఓసీటీఎల్ బోర్డు... దాడి తరువాత ప్లాంటులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించింది. ‘‘ఇతర సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్లాంటు కార్యకలాపాలను తక్షణమే నిలిపేయాలని నిర్ణయించాం.’’ అంటూ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక లేఖ రాసింది. నార్కట్‌పల్లి ప్లాంటులో చమురు, సహజవాయు రంగాలకు అవసరమైన డ్రిల్లింగ్ పైపులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక రిస్క్ తీసుకోలేం..ఎక్స్ఛేంజీలకు ఓసీటీఎల్ రాసిన లేఖ సారాంశం చూస్తే... ‘‘కార్మికుల దాడిలో కీలక అధికారిని కోల్పోయాం. మేనేజర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు భద్రంగా ఉండటం మాకు ముఖ్యం. దాన్ని పణంగా పెట్టలేం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా అభ్యర్థనేంటంటే సిబ్బందికి, కంపెనీ ఆస్తులకు తగిన భద్రత కల్పించమని. అంతేకాక ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించండి ’’ అని లేఖలో కోరింది. ఓసీటీఎల్ తన లేఖలో కొందరు కార్మికుల తీరుపై విరుచుకుపడింది. ‘‘గతంలో ఎలాంటి నోటీసులు, కారణాలు లేకుండానే కార్మికులు పనులను అడ్డుకునేవారు. బయటి వ్యక్తుల ప్రోద్బలంతో ఉత్పత్తిని అడ్డుకుని పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసేవారు. మేనేజర్లను, ఇంజనీర్లను, ఉద్యోగులను బెదిరించేవారు. పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుటే దాడికి పాల్పడ్డ సంఘటనలూ ఉన్నాయి’’ అని వివరించింది. మంత్రులకు సమాచారమిచ్చినా... ప్లాంటులోని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రికి, పరిశ్రమల మంత్రికి తెలియజేసినట్లు కంపెనీ పేర్కొంది. ‘‘మా ఆస్తులు, ఉద్యోగుల ప్రాణ రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రతిసారీ మంత్రులను కోరాం. మంత్రులు సమయం తీసుకోవటంతో పాటు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిని మేం తొలగిస్తే... వారిక్కూడా భారీ పరిహారం చెల్లించమన్నారు. దీంతో ఇష్టం లేకున్నా 2015 సెప్టెంబర్‌లో కొందరు కార్మికులను విధుల్లోకి తీసుకున్నాం. వారు మారలేదు సరికదా... సిబ్బందిని బెదిరించేవారు. చివరకు ఫిబ్రవరి 18న మస్తాన్‌రావుపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారు. గాయపడిన మస్తాన్‌రావు 20న మరణించారు. అందుకే ప్లాంటును నిలిపేస్తున్నాం’’ అని ఓసీటీఎల్ వివరించింది. -
ఎల్ఐసీ నుంచి జీవన్ ప్రగతి
హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా ‘జీవన్ ప్రగతి’ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. సంరక్షణ, సేవింగ్స్ ప్లాన్‌తో కూడిన ఈ నాన్-లింక్డ్ పాలసీ కాలంలో ప్రతి ఐదేళ్ల తరువాత దానంతట అదే రిస్క్ కవరేజ్ పెరుగుతుంది. అదే విధంగా అత్యవసర పరిస్థితుల్లో రుణ సౌలభ్యం కూడా ఈ పథకం ద్వారా పొందవచ్చు. బోనస్‌తోపాటు జీవిత బీమా మొత్తం మెచ్యూరిటీ ప్రయోజనంగా అందుతుంది. ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం ప్రయోజన రైడర్ అందుబాటులో ఉంది. 12 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పాలసీ గడువు 12 నుంచి 20 ఏళ్లు. కనీస జీవిత బీమా మొత్తం రూ.1,50,000. గరిష్ట జీవిత బీమా మొత్తానికి సంబంధించి ఎటువంటి పరిమితి లేదు. -
ఎల్.ఎన్.పేటలో ఏనుగుల బీభత్సం
ఎల్.ఎన్.పేట: వ్యవసాయ బావి వద్ద ఉన్న వడ్ల రాశిపై ఏనుగులు దాడిచేసి సుమారు 20 బస్తాల ధాన్యం తిని.. మిగతా ధాన్యంతో పాటు వరికుప్పలను ధ్వంసం చేశాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలం గొట్టిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం బావి వద్దకు వెళ్లిన రైతు ఇది గుర్తించి ఏనుగులను అక్కడి నుంచి తరమడానికి ప్రయత్నించగా.. అవి తిరగబడి అతన్ని తరిమిశాయి.. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు బాణాసంచా, డప్పుల చప్పుడు చేయడంతో.. ఏనుగుల మంద అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసీంది. -
రక్షణ రంగంలో పటిష్ట బంధం
భారత్, అమెరికా నిర్ణయం ఇరు దేశాల రక్షణ మంత్రులు జైట్లీ, హేగెల్ చర్చలు {పధాని మోడీతోనూ హేగెల్ భేటీ న్యూఢిల్లీ: రక్షణ పరికరాల అభివృద్ధి, వాటి ఉత్పత్తిలో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. డిఫెన్స్ టెక్నాలజీ, ట్రేడ్ ఇనిషియేటివ్(డీటీటీఐ) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రెండు వైపులా నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి చక్ హేగెల్ శుక్రవారం ఇక్కడ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. రక్షణ రంగంలో అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్లు జైట్లీ తెలిపారు. మిలటరీ హార్డ్‌వేర్ తయారీ రంగంలో అమెరికాతో కలిసి పనిచేయాలని, సైనిక పరికరాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. దేశ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోడానికి వీలుగానే రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచామన్నారు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ను సందర్శించాలని మంత్రిని హేగెల్ ఆహ్వానించారు. ఇందుకు జైట్లీ అంగీకరించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా హేగెల్ కలుసుకున్నారు. ప్రధానితో భేటీలో ఇరాక్ సంక్షోభం ప్రస్తావనకు వచ్చింది. ఇరాక్‌లో శాంతిభద్రతలు దిగజారిపోతుండటంపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. -
సులువుగా బంగారం కొనొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో సులువుగా వెండి, బంగారం కొనే విధంగా రిద్ధిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ పలు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం బులియన్ ఇండియా పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసి, నెలనెలా కొంత మొత్తం కొనే విధంగా సిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పాటు త్వరలో మరో మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఫిన్‌కర్వ్ బులియన్ ఇండియా డెరైక్టర్ సచిన్ కొఠారి తెలిపారు. ప్రతీ నెలా కనీసం రూ.1,000 మొత్తంతో బంగారం లేదా వెండిని కొనే విధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని అందిస్తున్నామని, బ్యాంకులు, ఇతర ఆన్లైన్ బంగారంతో పోలిస్తే 5-8 శాతం తక్కువ ధరకే బంగారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం వివరాలు తెలియచేయడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొఠారి మాట్లాడుతూ ఎటువంటి అదనపు రుసుములు లేకుండా, పూర్తి రక్షణతో ఉచితంగా భద్రపర్చుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని ఐడీబీఐ బ్యాంక్ ట్రస్టీకి చెందిన వాల్ట్‌లో భద్రపరుస్తామని, ఇన్వెస్టర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని కొని అమ్ముకోవచ్చన్నారు. ఒక గ్రాముకంటే ఎక్కువగా వున్నపుడు, వినియోగదారులు కోరుకుంటే ఫిజికల్ గోల్డ్‌ను ఇంటికి డెలివరీ చేస్తారు. దీంతో పాటు ప్రతీ నెలా స్థిరమైన పరిమాణంతో బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా గోల్డ్ ఎక్యూమలేట్ పథకాన్ని, అలాగే ప్రస్తుత ధరలో బంగారాన్ని కొని దాన్ని వాయిదా పద్థతుల్లో చెల్లించే విధంగా గోల్డ్ ఇన్స్టాల్మెంట్, అలాగే కొన్న బంగారాన్ని జ్యూవెలరీ సంస్థలకు బదలాయించి ఆభరణాలను కొనుగోలు చేసుకునే విధంగా గోల్డ్ యూనిట్ ట్రాన్సఫర్ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. స్నాప్‌డీల్ ద్వారా సత్యుగ్ గోల్డ్ ఆభరణాలు ప్రముఖ సినిమా నటి, శిల్పాశెట్టికు చెందిన సత్యుగ్ గోల్డ్ సంస్థ ఆభరణాలను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు సత్యుగ్ గోల్డ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని స్నాప్‌డీల్ తెలిపింది. -
ఎలక్ట్రానిక్స్ రంగానికి వరాలు !
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్ధికి దోహదపడే పలు చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారని ఈ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనల కారణంగా దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ జోరు పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ వర్గాలు అంటున్నాయి. 1. టెలికాం, ఐటీ ఉత్పత్తుల దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ)ని విధింపు. దేశీయ ఉత్పత్తికి ఊతమివ్వడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం లక్ష్యాలుగా ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ 1లో లేని ఐటీ, టెలికాం ఉత్పత్తులకు ఈ సుంకం వర్తిస్తుంది. ఈ చర్య కారణంగా వీఓఐపీ ఫోన్లు, కొన్ని టెలికాం నెట్వర్క్ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. 2. పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై ప్రస్తుతం విధిస్తున్న 4 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ(ఎస్ఏడీ)ను తొలగించారు. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విద్యా సుంకాన్ని విధించారు. ఫలితంగా దేశీయంగా తయారయ్యే ఉత్పత్తుల ధర, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధర ఒకే విధంగా ఉంటుంది. 3. కలర్ పిక్చర్ ట్యూబ్‌లపై దిగుమతి సుంకం తొలగింపు. దీంతో వీటి ధరలు మరింతగా తగ్గుతాయి. 4. 19 అంగుళాల లోపు ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల తయారీలో ఉపయోగపడే స్క్రీన్లపై 10 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఫలితంగా వీటి ధరలు తగ్గుతాయి. 5. ఒక ఏడాదిలో రూ. 25 కోట్లకు మించిన పెట్టుబడులపై 15% మూలధన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఫలి తంగా ఎంఎస్ఎంఈలో పెట్టుబడుల పెరుగుతాయి. -
భారత్‌లోకి ‘చైనా యాపిల్’!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు భారత్‌లో అందిస్తోంది. వచ్చేవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమవుతాయని షియోమి వెబ్సైట్ పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ల విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి. 86 సెకన్లలో లక్ష ఫోన్ల విక్రయాలు ఈ కంపెనీ ఎంఐయూఐ వీ5 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ను కస్టమైజ్ చేసింది. ఎంఐయూఐ వీ5 ఓఎస్‌పై పనిచేసే ఈ ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఎల్సీడీ టచ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 800 2.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రెనో 330 450 మెగా హెర్ట్జ్ జీపీయూ, 2 జీబీ ర్యామ్, ఈఎంఎంసీ 4.5 ఫ్లాష్ మెమరీ, 16 జీబీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3050 ఎంఏహెచ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులకు చైనాలో ఎంత క్రేజ్ ఉందంటే, ఆన్లైన్లో ఎంఐ 3 ఫోన్లు 86 సెకన్లలోనే లక్ష అమ్ముడు కావడం విశేషం. ఆన్లైన్లోనే అమ్మకాలు షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. బీజింగ్ కేం ద్రంగా పనిచేసే ఈ కంపెనీ అనతికాలంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థ ఇప్పటికే 1.7 కోట్ల హ్యాండ్సెట్లను విక్రయించింది. ఎంఐ 3, రెడ్మి, ఎంఐ వై-ఫై, ఎంఐ బాక్స్ తదితర హ్యాండ్సెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ ఆన్లైన్లోనే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో ఎక్కడా తన ఫోన్లను విక్రయించదు. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో 1 శాతమే మార్కెటింగ్‌కు కేటాయిస్తోంది(శామ్సంగ్ కేటాయింపు 5.1%). ఇలా ఆదా చేసిన సొమ్ములతో నాణ్యమైన విడిభాగాలను కొనుగోలు చేసి అత్యంత ఆధునిక ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి కంపెనీ భారత కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ చూస్తారు. ఈ మేరకు షియోమి కం పెనీ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. హువాయి, జెడ్‌టీఈ, లెనొవొ, జియోని, అప్పో వంటి ఇతర చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయి. -
వృద్ధితో ద్రవ్యలోటు కట్టడి: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన తొలి బడ్జెట్ సమర్పణకు రెండు రోజుల ముందు ద్రవ్యలోటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ద్రవ్యలోటును ఆమోదనీయ స్థాయిలో కట్టడి చేయడం అవసరమని ఉద్ఘాటించిన ఆయన, వృద్ధి, పన్నుల వసూళ్ల ద్వారా ఈ దిశలో ప్రభుత్వం ముందుకు కదులుతుందని అన్నారు. ద్రవ్యలోటు కట్టడికి వ్యయ నియంత్రణలు సరికాదన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, ద్రవ్యలోటు గురించి వివరించారు. ద్రవ్యలోటు కట్టడికి ఆర్థిక వృద్ధే కీలకమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) ద్రవ్యలోటు రూ.2.4 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఫిబ్రవరి 17న అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో ఇది 45.6 శాతానికి సమానం. 2014-15లో మొత్తం ద్రవ్యలోటు రూ.5.28 లక్షల కోట్లకు కట్టడి చేయాలని చిదంబరం చివరి ఓటాన్ అకౌంట్ నిర్దేశించుకుంది. 2013-14 జీడీపీతో పోల్చిచూస్తే, ఆ యేడాది ద్రవ్యలోటు 4.5 శాతంగా ఉంది (రూ.5,08,149 కోట్లు). 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం 4.9 శాతం. 2016-17 నాటికి ఆర్థిక వృద్ధి ద్వారా జీడీపీలో ద్రవ్యలోటు శాతాన్ని 3 శాతానికి తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. 2014-15 జీడీపీలో ద్రవ్యలోటు 4.1 శాతానికి కట్టడి చేయాలన్నది ఫిబ్రవరి 17 బడ్జెట్ లక్ష్యం. క్లెయిమ్ చేయని మొత్తం రూ.5వేల కోట్లు: కాగా రాజ్యసభ్యలో ఆర్థికశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని మొత్తం నిధుల పరిమాణం 2013 డిసెంబర్ 31 నాటికి రూ.5,124 కోట్లని తెలిపారు. సంబంధిత డిపాజిటర్ల సమాచారాన్ని తెలుసుకోడానికి బ్యాంకింగ్ వ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వెల్లడించారు. సంస్కరణలే వృద్ధికి బాట: కేంద్రం న్యూఢిల్లీ: సంస్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఒక ప్రకటనలో కేంద్రప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్ ఆర్థికమంత్రి జార్జ్ ఆస్బోర్న్తో భారత్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. సంస్కరణల అమలు ద్వారా రానున్న త్రైమాసికాల్లో వృద్ధి జోరందుకుంటున్న అభిప్రాయాన్ని ప్రకటన వ్యక్తం చేసింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక రికవరీ సంకేతాలు భారత్, బ్రిటన్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది. -
నేటి బడ్జెట్‌పై ఆశలెన్నో
సాక్షి, ముంబై: ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ‘అచ్చే దిన్ ఆయేంగే’ (మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ఎన్నోకల సమయంలో ముంబై అభివృద్ధికి మోడీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని ముంబైకర్లు కోరుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు, రైలు చార్జీలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్యులు బేజారవుతున్నాడు. మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో ముంబైకి ఎంతమేర ప్రాధాన్యం ఇస్తారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముంబైలో ప్రతీరోజు 75 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి అందే ఆర్థిక వనరుల్లో లోకల్ రైళ్ల వాటా అత్యధికంగా ఉంటుంది. ఏటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ముంబైకర్లకు మొండిచేయి ఎదురవుతుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన అనేక రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. తీవ్రజాప్యం వల్ల వీటి వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. నిధులు లేక కొన్ని ప్రాజెక్టులు అర్థంతరంగా నిలిచిపోయాయి. కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు మంజూరైతే అవి పూర్తవుతాయని నగరవాసులు భావిస్తున్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) ద్వారా మూడు ప్రాజెక్టులు పూర్తిచేయాలని రైల్వే బోర్డు సంకల్పించింది. అందులో మొదటి ప్రాజెక్టు కోసం రూ.3,125 కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు పనులు జాప్యం కావడంతో అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు పెరిగింది. ఇందులో తొమ్మిది బొగీలున్న లోకల్ రైళ్లను 12, 15 బోగీలుగా మార్చే ప్రాజెక్టు కూడా ఉంది. రెండో ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు మంజూరు చేశారు. అనేక కారణాలవల్ల ఇవన్నీ పెండింగులోనే ఉన్నాయి. దీంతో ప్రాజెకుల్ట వ్యయం రూ.7,013 కోట్లకు చేరుకున్నా పనులు పూర్తికాలే దు. మూడో ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించినా, ఇప్పటికీ అవి విడుదల కాలేదు. దీంతో ఠాణే-సీఎస్టీ స్టేషన్ల మధ్య ఐదు, ఆరో రైల్వే లేన్ల పనులు పెండింగులోనే ఉన్నాయి. ఈ పనులు సమయానికి పూర్తయినట్లతే లోకల్ రైలు సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలు పడేది. ముంబై రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు నిర్మించడం, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడం, రైల్వే ప్రమాదాల నివారణ, ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేదా సబ్వే నిర్మాణం వంటి దీర్ఘకాల డిమాండ్లపై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముంబైకర్లు కోరుకుంటున్నారు. -
చివర్లో లాభాల గోల్
331 పాయింట్ల హైజంప్ 25,521కు ఎగసిన సెన్సెక్స్ నిఫ్టీ 98 పాయింట్లు ప్లస్ రెండు వారాల్లో గరిష్ట లాభం ఇరాక్ యుద్ధ భయాలు కొనసాగుతున్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్లతో హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 331 పాయింట్లు ఎగసి 25,521 వద్ద నిలిచింది. ఇది గత రెండు వారాల్లోనే అత్యధిక లాభంకాగా, నిఫ్టీ కూడా 98 పాయింట్లు పుంజుకుని 7,632 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతక్రితం ఈ నెల 6న మాత్రమే ఈ స్థాయిలో 377 పాయింట్లు లాభపడింది. గత రెండు రోజుల నష్టాలను తలపిస్తూ తొలుత అమ్మకాలు కొనసాగాయి. దీంతో సెన్సెక్స్ మిడ్ సెషన్లో 25,104 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఆపై నెమ్మదిగా కోలుకుంటూ వచ్చింది. మధ్యాహ్నం రెండు తరువాత అన్ని వర్గాల నుంచీ కొనుగోళ్లు పెరగడంతో భారీ లాభాలతో దూసుకెళ్లింది. ఒక దశలో గరిష్టంగా 25,546 పాయింట్ల వరకూ ఎగసింది. చివరికి అదే స్థాయిలో స్ధిరపడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 386 పాయింట్లు పతనమైన విషయం విదితమే. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ఆయిల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ 3-1.5% మధ్య పురోగమించాయి. ఆయిల్ షేర్ల జోష్ అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ షేర్లు ఓఎన్జీసీ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్, ఆర్ఐఎల్ 4-2.5% మధ్య పుంజుకున్నాయి. బ్యాంకింగ్ ఓకే బ్యాంకింగ్ దిగ్గజాలు యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ 4-2.5% మధ్యలో పురోగమించగా, ఫెడరల్ బ్యాంక్, బీవోఐ, పీఎన్బీ, ఇండస్ఇండ్, బీవోబీ, కెనరా, యస్ బ్యాంక్ సైతం 5-3% మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ జోరు ఇతర బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, భెల్, సెసాస్టెరిలైట్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, భారతీ, మారుతీ 3-2% మధ్య లాభపడ్డాయి. ఆరు మాత్రమే : సెన్సెక్స్లోఎంఅండ్ఎం, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో 1.5-0.5% మధ్య క్షీణించగా, సిప్లా నామమాత్రంగా నష్టపోయింది. చిన్న షేర్ల దూకుడు సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2% స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 2,046 లాభపడితే, 953 మాత్రమే నష్టపోయాయి. బీఎస్ఈ-500 పరుగు బీఎస్ఈ-500లో భాగమైన జేపీ ఇన్ఫ్రా, సియట్, హెచ్ఎంటీ, వ్యాబ్కో, చంబల్, సింటెక్స్, ఆర్సీఎఫ్, స్టెరిలైట్ టెక్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, మోతీలాల్ ఓస్వాల్, ఎంటీఎన్ఎల్, జేకే లక్ష్మీ సిమెంట్, ఐఆర్బీ ఇన్ఫ్రా, గృహ్ ఫైనాన్స్ తదితరాలు 13-7% మధ్య దూసుకెళ్లాయి. -
పీఎస్‌యూ బ్యాంకుల మార్కెట్ వాటా పడిపోతుంది!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల మార్కెట్ వాటా 2025కల్లా 20% క్షీణించడం ద్వారా 60%కు పరిమితమవుతుందని రిజర్వ్ బ్యాంక్ కమిటీ నివేదిక అంచనా వేసింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో పీఎస్‌యూ బ్యాంకుల వాటా 2000లో 80%గా నమోదైంది. ప్రభుత్వం వాటాలు తగ్గించుకోవడం, బ్యాంకులు పనితీరు మెరుగుపరచుకోవడం వంటి చర్యలను చేపట్టకపోతే మార్కెట్ వాటా పడిపోతుందని తెలిపింది. కాగా, ఇదే సమయంలో ప్రయివేట్ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా మూడో వంతుకు పుంజుకోనున్నట్లు పేర్కొంది. 2000లో ప్రయివేట్ రంగ బ్యాంకుల వాటా 12%గా నమోదైంది. ఇక విదేశీ బ్యాంకుల కార్యకలాపాలు నామమాత్రంగా ఉండనున్నట్లు అభిప్రాయపడింది. ఆస్తుల ఒత్తిడి ... పీఎస్‌యూ బ్యాంకులు అటు మొండి బకాయిలతోపాటు, ఇటు తగినంత మూలధన పెట్టుబడులు లేక ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు ఆర్బీఐ కమిటీ నివేదిక వివరించింది. ఇవి బ్యాంకుల వృద్ధిని అడ్డగిస్తాయని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 15 ప్రయివేట్ రంగ బ్యాంకులతోపాటు, 30 విదేశీ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. -
ఆ రెండు సంస్థల ఆఫీసులను తిరిగి అప్పగించండి
ముంబై: దక్షిణ ముంబై ఓడరేవు ప్రాంతంలోని వేల్హారి ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఆటో ఇన్వెస్ట్మెంట్లపై జప్తును ఎత్తివేసి, భవనాలు తిరిగి అప్పగించాలని బాంబే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. సాంగ్లీ బ్యాంక్ (ప్రస్తుతం ఇది ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది) ఆవరణలోని ఆఫీసులను ఈ రెండు సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. ముంబై పోలీసు శాఖ అనుబంధ ఆర్థిక నేరాల విభాగం జరిపిన విచారణలో ఆ రెండు సంస్థలు ఏ నేరంలోనూ భాగస్వాములైనట్లు తేల లేదని జస్టిస్ పి.వి.హర్దాస్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎంఎస్ రూఫిట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థతోపాటు దాని డెరైక్టర్లు, అదే ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాకేష్ అగర్వాల్ అనే వ్యక్తి 2003లో ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదు చేశాడు. అయితే విచారణ సమయంలో వెల్హారి ట్రేడింగ్, ఆటో ఇన్వెస్ట్మెంట్ సంస్థలను సీల్ చేశారు. ఆ రెండు సంస్థలు మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్(ఎంపీఐడి) కోర్టును ఆశ్రయించాయి. అయితే విచారణ కొనసాగుతున్నందున ఆయా ఆస్తుల విడుదల కోర్టు నిరాకరిం చింది. దీంతో రెండు సంస్థలకు హైకోర్టుకు వెళ్లా యి. నవంబర్ 2004లోనే విచారణ పూర్తయిందని, చార్జిషీట్ కూడా దాఖలు చేశారని హైకోర్టు తెలి పింది. అయితే ఆ భవనంలో అద్దెకు ఉంటున్న రెండు సంస్థలు ఏ నేరానికీ పాల్పడలేదని ఈ ఏడా ది ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల విభాగం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. నిందితులకు కేవలం మంచి చేయాలనే ఉద్దేశంతోనే రెండు సంస్థలు ఆవరణను ఇచ్చాయని కోర్టు తెలిపింది. అయితే రెండు ఆఫీసు ఆవరణలను తమకు ఇచ్చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్ విచారణ సమయంలో కోరింది. సాంగ్లీ బ్యాంకుకు న్యాయబద్ధమైన కిరాయిదారులైనందున బ్యాంక్ వాదనను పక్కకు పెట్టిన హైకోర్టు... పై విధంగా తీర్పు నిచ్చింది. -
పీఎస్‌యూ బ్యాంకులకు మరో రూ.8 వేల కోట్ల మూలధనం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8 వేల కోట్ల అదనపు క్యాపిటల్‌ను అందించే అవకాశముంది. తాత్కాలిక బడ్జెట్లో ఇందుకు రూ.11,200 కోట్లు కేటాయించామనీ, ఇంతకంటే ఎక్కువ మొత్తం అవసరం ఉన్నప్పటికీ రూ.6,000 - 8,000 కోట్ల స్థాయిలో సమకూర్చుతామనీ ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సాంధు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో మంగళవారం ఆర్థిక మంత్రి చిదంబరం సమావేశం అనంతరం సాంధు మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేది కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమేనని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.14 వేల కోట్ల మూలధనాన్ని పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.రెండు వేల కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.1,200 కోట్లు వెళ్లాయి. గ్లోబల్ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకులన్నీ టైర్-1 క్యాపిటల్‌ను పెంచుకునే యత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ప్రమాణాల ప్రకారం భారతీయ బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల అదనపు క్యాపిటల్ అవసరమని రిజర్వు బ్యాంకు అంచనా. నిధుల సమీకరణకు హోల్డింగ్ కంపెనీలు.. విస్తరణకు అవసరమైన నిధుల కోసం హోల్డింగ్ కంపెనీ, స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పీఎస్‌యూ బ్యాంకులకు చిదంబరం సూచించారు. మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) పరిస్థితి మెరుగుపడి 4.44 శాతానికి చేరిందనీ, అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.07 శాతంగా ఉందనీ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గాలి - నాయక్ కమిటీ నివేదిక ముంబై: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల్లో సర్కారు తన వాటాను 50 శాతం కంటే తక్కువ స్థాయికి తగ్గించుకోవాలని యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.జె.నాయక్ సారథ్యంలోని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సూచించింది. బ్యాంకులను ప్రస్తుతం పాలిస్తున్న తీరును విమర్శించింది. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక శాఖల పెత్తనం, సీవీసీ, కాగ్ వంటి బాహ్య సంస్థల నిఘా తదితర పరిమితులతో పీఎస్‌యూ బ్యాంకులు సతమతం అవుతున్నాయని నాయక్ కమిటీ రూపొందించిన నివేదిక పేర్కొంది. ‘పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువకు తగ్గిపోతే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల బ్యాంకులపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గకుండానే ఆ బ్యాంకుల్లో ప్రధాన వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది. తద్వారా బ్యాంకులు మరింత విజయవంతంగా పనిచేయడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బ్యాంకుల పాలనా సంబంధమైన పలు విధులకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. 1970, 80ల నాటికి బ్యాంకుల జాతీయకరణ చట్టాలతో పాటు ఎస్బీఐ చట్టం, ఎస్బీఐ (అనుబంధ బ్యాంకుల) చట్టాలను రద్దు చేయాలి. అన్ని బ్యాంకులనూ కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురావాలి. బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటా బదిలీకోసం బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఏర్పాటుచేయాలి...’ అని కమిటీ సూచించింది. -
డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు
హైదరాబాద్: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు నమోదైంది. పేటెం టున్న ఔషధమైన వాసెపాకు జనరిక్ వెర్షన్‌ను తీసుకొచ్చే పనిలో రెడ్డీస్ నిమగ్నమైందంటూ డబ్లిన్‌కు చెందిన అమరిన్ ఫార్మా అమెరికా కోర్టును ఆశ్రయించింది. రెడ్డీస్ ఏఎన్‌డీఏ 16 కౌంట్లలో వాసెపా ఔషధాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. రెడ్డీస్, అనుబంధ కంపెనీ, ఇతర విభాగాలుగానీ ఈ ఔషధం తయారీ, వాడకం, విక్రయం, అమ్మజూపడం, కొనుగోలును శాశ్వతంగా నిషేధించాలని కోర్టుకు విన్నవించింది. హ్యాచ్-వాక్స్మన్ యాక్టు కింద అమరిన్ ఫార్మా ఈ దావా వేసింది. శరీరంలో ఒక రకమైన కొవ్వును (ట్రైగ్లిసెరైడ్స్) తగ్గించేందుకు ఈ ఔష దం దోహదం చేస్తుంది. వాసెపా ఔషధం పేటెం ట్లు చాలామటుకు 2030లో ముగియనున్నాయి. -
హైదరాబాద్‌లో ఓలా క్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసులందిస్తున్న ఓలా క్యాబ్స్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. మే మూడో వారంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సిటీ ట్యాక్సీ, ఔట్ స్టేషన్, లోకల్ రెంటల్స్ ఇలా మూడు విభాగాలుగా సేవలు అందిస్తామని చెప్పారు. కంపెనీ తొలి విడతగా 200-250 కార్లను ప్రవేశపెడుతోంది. తొలుత సెడాన్ కార్లను అందుబాటులోకి తేనున్నారు. రానున్న రోజుల్లో ప్రీమియం విభాగంలో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను పరిచయం చేయనున్నారు. పగలు, రాత్రి... ఏ సమయంలో బుక్ చేసినా ఒకే రకమైన చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరుతోసహా ఏడు నగరాల్లో ఓలా సేవలందిస్తోంది. 9,000 పైగా కార్లున్నాయి. రోజుకు 15 వేలకుపైగా కాల్స్ అందుకుంటోంది. ఓలా మినీ పేరుతో చిన్న కార్లతో సేవలందిస్తోంది కూడా. వీటికి రూ.100 కనీస చార్జీ. 6 కిలోమీటర్ల తర్వాత కి.మీ.కు రూ.13 చార్జీ ఉంటుంది. ఇక లగ్జరీ కార్లకు కనీస చార్జీ రూ.200. 2 కిలోమీటర్ల తర్వాత కారు మోడల్‌నుబట్టి చార్జీ వసూలు చేస్తారు. ఇద్దరు యువకులు..: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓలా క్యాబ్స్‌ను భవీష్ అగర్వాల్, అంకిత్ భాటి ప్రారంభించారు. వీరిద్దరూ ఐఐటీ ముంబైలో చదువుకున్నవారే. జనవరి 2011న ఓలా ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే క్యాబ్ సేవల్లో దేశంలో అతి పెద్ద సంస్థగా ఎదిగింది. 9,000 కార్లలో ఒక్కటి కూడా సంస్థ సొంతం కాదు. ఔత్సాహిక యువకులకు కార్లను ఇప్పించి, వాటిని సంస్థ బ్రాండ్‌పైన వినియోగిస్తోంది. బుకింగ్స్ ఆధారంగా డ్రైవర్లకు చెల్లింపులు జరుపుతారు. ఆసక్తికర అంశమేమంటే ఓలా క్యాబ్స్ అప్లికేషన్ ద్వారా కారును బుక్ చేసుకుంటే.. ప్రయాణికుడు ఎక్కడున్నా జీపీఎస్ ఆధారంగా డ్రైవరుకు ఇట్టే తెలిసిపోతుంది. -
కొపాక్సోన్పై నాట్కో ఫార్మాకి దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసి అధికాదాయం పొందుదామనుకున్న నాట్కో ఫార్మా ఆశలపై టెవా ఫార్మా నీళ్లు జల్లింది. నాడీ సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగించే కొపొక్సొన్ పేటెంట్ హక్కులపై టెవా ఫార్మా లేవనెత్తిన వాదనలు వినడానికి అమెరికా సుప్రీంకోర్టు సమ్మతించింది. వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ఫార్మా రంగం సిద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు టెవా సుప్రీంకోర్టుకు ఎక్కడంతో జాప్యం తప్పకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ గత ఏడాది అమెరికాలోని కింది కోర్టు ఇతర కంపెనీలతో కలిసి ఈ ఔషధాన్ని విక్రయించడానికి నాట్కోకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కొపాక్జోన్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రపంచ జెనరిక్ ఔషధ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న టెవా వ్యాపారంలో 20 శాతం కొపాక్జోన్ నుంచి వస్తుండటమే కాకుండా, లాభాల్లో 50 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది అమెరికాలో కొపాక్సొన్ అమ్మకాల విలువ రూ. 25,200 కోట్లుగా నమోదయ్యింది. నమ్మకం ఉంది టెవాకి చెందిన 808 పేటెంట్ చెల్లదన్న నమ్మకాన్ని నాట్కో ఫార్మా వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మైలాన్, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి కొపాక్సొన్ను అమెరికాలో విక్రయించడానికి నాట్కోకి గతేడాది అనుమతి లభించింది. ప్రస్తుత వార్తల నేపథ్యంలో మంగళవారం నాట్కో ఫార్మా షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 14శాతం నష్టపోయి రూ.685 వద్ద ముగి సింది. కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌పై నాట్కో హక్కులు పొందినప్పటి నుంచి ఆదాయం బాగా పెరుగుతుం దన్న అంచనాతో నాట్కో ఫార్మా షేరు దూసుకుపోయింది. ఇప్పుడు ఈ అంశం తిరిగి కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారని, ప్రస్తుత స్థాయి నుంచి 10 శాతం మించి పతనం అయ్యే అవకాశాలు కనిపించడం లేదని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు. -
బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి జెన్‌మనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకింగ్‌సహా పలు ఆర్థిక సేవల రంగంలో ఉన్న జెన్‌మనీ తాజాగా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం జెన్‌మనీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్లు జెన్‌మనీ మేనేజింగ్ డెరైక్టర్ ప్రతాప్ కంతేటి తెలిపారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో బీమా బ్రోకింగ్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవిత, సాధారణ బీమా రంగంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన పాలసీలు విక్రయించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అధిక కమీషన్ల కోసం ఆశపడకుండా ఖాతాదారులకు అవసరమైన పాలసీలను మాత్రమే అందిస్తామని, ముఖ్యంగా టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాలపై అధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. బీమా రంగంలో విస్తరణకు ఇంకా చాలా అవకాశాలున్నాయని, వచ్చే మూడేళ్ళలో మొత్తం ఆదాయంలో 50 శాతం బీమా బ్రోకింగ్ నుంచే వచ్చే విధంగా చేయాలన్నదే తమ లక్ష్యమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి తెలిపారు. గత ఆరు నెలల నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెరిగాయని, అలాగే రాష్ట్ర విభజన పూర్తి కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విచారణలు మొదలైనట్లు తెలిపారు. -
ఆర్థిక స్వేచ్ఛలో రాష్ట్రానిది మూడో స్థానం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సానుకూలంగా మరో నివేదిక వెలువడింది. ఆయన సీఎంగా ఉన్న గుజరాత్ రాష్ట్రం.. ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపర్చుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిల్చింది. ప్రముఖ ఆర్థిక వేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్టు స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాలనాయంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార.. కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీని ప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతో పాటు వేగంగా పరిస్థితులను మెరుగుపర్చుకునే విషయంలో కూడా అగ్రస్థానం దక్కించుకుంది. 0-1.0 స్కేలుపై 0.65 స్కోరు సాధించింది. ఓవరాల్‌గా తమిళనాడు రెండో స్థానంలో (0.54 స్కోరు), ఆంధ్రప్రదేశ్ (0.50 స్కోరు) మూడో స్థానంలో ఉన్నాయి. బీహార్ 0.31 స్కోరుతో ఎప్పట్లాగానే అట్టడుగున ఉంది. మావోయిస్టులు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ.. జార్ఖండ్‌తో పోలిస్తే చత్తీస్‌గఢ్ మెరుగైన స్కోరుతో 16వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. -
ప్రొడక్ట్ బిజినెస్‌ను విడదీసిన పొలారిస్
న్యూఢిల్లీ: ప్రొడక్ట్ బిజినెస్‌ను విడదీసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల సంస్థ పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ వెల్లడించింది. తద్వారా తదుపరి దశ వృద్ధిని అందుకోలగమని భావిస్తున్నట్లు తెలిపింది. అన్ని అనుమతులూ లభిం చాక ప్రొడక్ట్ విభాగాన్ని ‘ఇంటలెక్ట్ డిజైన్ ఏరీనా’గా పిలవనున్నట్లు పేర్కొంది. గ్లోబల్ యూనివర్సల్ బ్యాంకింగ్, రిస్క్ అండ్ ట్రెజరీ మేనేజ్మెంట్, గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లు ఇంటలెక్ట్లో భాగంగా ఉంటాయని వివరించింది. ఈ చర్య కస్టమర్లు, ఉద్యోగులతోపాటు, ఇన్వెస్టర్లకు కూడా లబ్దిని చేకూర్చగలదని పొలారిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ జైన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో పొలారిస్ షేరు దాదాపు 12% దూసుకెళ్లి రూ. 153 వద్ద ముగిసింది. -
భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్మెంట్కు ఓకే
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు భెల్, ఐవోసీలలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సాధికార మంత్రుల కమిటీ(ఈజీవోఎం) ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఐవోసీలో 10%, భెల్‌లో 5% వాటాను ప్రభుత్వం విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ. 7,300 కోట్లు లభించగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ఐవోసీలో 10% వాటాను ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు 5% చొప్పున విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధర రూ. 248 వద్ద ఐవోసీ(10%) వాటాకు రూ. 5,300 కోట్లు లభించే అవకాశమున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి రవి మాథుర్ చెప్పారు. వాటా విక్రయాన్ని ఆఫ్‌మార్కెట్ ద్వారా ప్రభుత్వం చేపట్టనుంది. ఇక భెల్‌లో 5% వాటాను బ్లాక్‌డీల్ ద్వారా ఎల్ఐసీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధర రూ. 167 వద్ద భెల్ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,045 కోట్లవరకూ సమకూరవచ్చు. ప్రస్తుతం భెల్‌లో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది. -
ఫార్చూన్ ప్రశంసనీయ కంపెనీల్లో...టాటా స్టీల్, ఓఎన్జీసీ
న్యూయార్క్: ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలు-టాటా స్టీల్, ఓఎన్‌జీసీలకు చోటు లభించింది. ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో ఈ జాబితాను రూపొందించింది. వరుసగా ఏడో ఏడాది కూడా యాపిల్ కంపెనీయే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా టాటా స్టీల్, ఓఎన్జీసీలు టాప్ 50లో చోటు సంపాదించలేకపోయాయి. అగ్రశ్రేణి మెటల్ కంపెనీల జాబితాలో నాలుగో స్థానంలో టాటా స్టీల్ నిలిచింది. గత ఏడాది జాబితాలో ఈ కంపెనీ ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది మైనింగ్, ముడి చమురు ఉత్పత్తి కేటగిరిలో పదో స్థానంలో నిలిచిన ఓఎన్జీసీ ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకింది. అంతర్జాతీయ అగ్రశ్రేణి ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ నిలిచింది. ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 3వ స్థానం, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ (5వ స్థానం), కోకకోలా(6)లు ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర కంపెనీలు, నైక్ (13వ స్థానం), ఐబీఎం(16), మైక్రోసాఫ్ట్(24), వాల్‌మార్ట్(28), జేపీ మోర్గాన్ చేజ్(30), గోల్డ్‌మాన్ శాచ్స్(34), ఫేస్బుక్(38), పెప్సికో(42వ స్థానం). -
స్టీల్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: మార్చి నుంచి స్టీల్ ధరలు పెరగనున్నాయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)తో పాటు, ప్రయివేట్ రంగ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ధరల్ని పెంచుతున్నాయి. మార్చి 1 నుంచి స్టీల్ ధరలను టన్నుకి రూ. 1,000 వరకూ పెంచనున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. ఇక జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పటికే టన్ను ధరపై రూ.750 వరకూ వడ్డించనున్నట్లు తెలిపింది. ముడిఇనుము ధరలతోపాటు, రవాణా చార్జీలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా వైజాగ్ స్టీల్ పేర్కొంది. వెరసి వివిధ రకాల ఉత్పత్తులపై టన్నుకి కనిష్టంగా రూ. 750, గరిష్టంగా రూ. 1,000ను పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ బాటలో ఎస్సార్ స్టీల్ కూడా వచ్చే నెల నుంచి టన్నుకి రూ. 1,000 వరకూ స్టీల్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీ వ్యయాలు పెరగడానికితోడు డిసెంబర్ క్వార్టర్లో స్టీల్‌కు కొంత డిమాండ్ పుంజుకోవడం కూడా ధరల పెంపుకు కారణమైనట్లు ఆ వర్గాలు వివరించాయి. మూడోసారి ఈ ఏడాది ఇప్పటివరకూ స్టీల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనల నేపథ్యంలో స్టీల్ ధరలు మూడోసారి హెచ్చనున్నాయి. దేశీయ స్టీల్ తయారీ సంస్థలు ఇప్పటికే జనవరి-ఫిబ్రవరిలో టన్నుకి రూ. 2,500-3,000 స్థాయిలో ధరలను పెంచాయి. ఇందుకు ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలే కారణమైనప్పటికీ ఇటీవల స్టీల్‌కు డిమాండ్ పుంజుకోవడం కూడా దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. విదేశాలకు స్టీల్ ఎగుమతులు వృద్ధి చెందుతుండటంతో దేశీయంగా అధిక సరఫరాకు చెక్ పెట్టేందుకు కంపెనీలకు వీలు చిక్కుతోంది. ఇది మరోవైపు ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కూడా దారి చూపుతోంది. అయితే ధరల పెంపును మార్కెట్లు పూర్తిస్థాయిలో గ్రహించే అవకాశాలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి స్టీల్ వినియోగం అంత ప్రోత్సాహకరంగా ఏమీలేదని, ఈ నేపథ్యంలో ధరల పెంపు కొనసాగేదీ లేనిదీ చూడాల్సి ఉన్నదని జయంత్ రాయ్ వ్యాఖ్యానించారు. రేటింగ్ దిగ్గజం ఇక్రాకు చెందిన కార్పొరేట్ రంగ విభాగానికి సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా జయంత్ పనిచేస్తున్నారు. ఇదీ ధరల తీరు: నిర్మాణ రంగంలో వినియోగించే టీఎంటీ బార్లు, స్ట్రక్చర్లు వంటి లాంగ్ ప్రొడక్ట్‌ల ధరలు ప్రస్తుతం టన్నుకి రూ. 37,000-39,000 స్థాయిలో ఉన్నాయి. ఇక ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు కొనుగోలు చేసే హెచ్ఆర్ క్వాయిల్, సీఆర్ క్వాయిల్ వంటి ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల ధరలైతే టన్నుకి రూ. 39,500-43,500 మధ్య పలుకుతున్నాయి. -
ఫండ్స్ పథకాలపట్లా ఆసక్తి చూపాలి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవడంలో విజయవంతమైన బీమా రంగ కంపెనీల బాటలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రయాణించాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. అయితే ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. తద్వారా ఫండ్ పథకాల విక్రయంలో పీఎస్‌యూ బ్యాంకులు ప్రముఖ పాత్రను పోషించేందుకు వీలుచిక్కుతుందని అభిప్రాయపడింది. బీమా పథకాల పంపిణీలో బ్యాంకింగ్ నెట్వర్క్ విజయవంతమైన నేపథ్యంలో సెబీ సూచనలకు ప్రాధాన్యత ఏర్పడింది. సంప్రదాయ బ్యాంకింగ్ ప్రొడక్ట్లకుతోడు థర్డ్‌పార్టీ బీమా పథకాల విక్రయంలో బ్యాంకులు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఇది ప్రతిబింబించడంలేదని సెబీ వ్యాఖ్యానించింది. బ్యాంకుల ద్వారా ఫండ్ పథకాల విక్రయం పుంజుకోవాలంటే పీఎస్‌యూ బ్యాంకులే చొరవ చూపాల్సి ఉంటుందని సూచించింది. భారీగా విస్తరించిన బ్రాంచీల ద్వారా బ్యాంకులు ఫండ్ పథకాల పంపిణీకి జోష్ తీసుకురాగలవని సెబీ ప్రతిపాదనలలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. -
విలువైన బ్రాండ్ టాటా
లండన్: భారత దేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ గ్లోబల్ టాప్ 500 బ్రాండ్ జాబితాలో 2,110 కోట్ల డాలర్ల విలువతో టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని(భారత్ వరకూ) ఈ ఏడాది కూడా నిలుపుకుంది. గత ఏడాది 39వ స్థానంలో ఉన్న టాటా బ్రాండ్ ఈ ఏడాది 34వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో భారత కంపెనీలు గత ఏడాది ఆరు ఉండగా, ఈ ఏడాది ఈ సంఖ్య 5కు పడిపోయింది. ఒక్క టాటా మినహా మిగిలిన నాలుగు సంస్థల ర్యాంక్‌లు ఈ ఏడాది తగ్గాయి. అంతర్జాతీయ జాబితాలోని ఇతర భారత కంపెనీలు ఎస్బీఐ (347వ స్థానం), ఎయిర్టెల్(381), రిలయన్స్ ఇండస్ట్రీస్(413), ఇండియన్ ఆయిల్(474), ఈ జాబితాలో ఈ ఏడాది చోటు దక్కించుకోలేని కంపెనీగా ఐటీసీ నిలిచింది. మూడోసారీ యాపిలే ఇక ఈ జాబితాలో 10,500 కోట్ల డాలర్లతో యాపిల్ బ్రాండ్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. అగ్రస్థానంలో యాపిల్ నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది. 7,900 కోట్ల డాలర్లతో శామ్సంగ్ రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, వెరిజాన్, జీఈ, ఏటీఅండ్‌టీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఐబీఎంలు నిలిచాయి. ఇక అత్యంత శక్తివంతమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఫెరారి నిలిచింది. ఈ గ్లోబల్ జాబితాలో అమెరికా బ్రాండ్లు ఎక్కువగా(185) ఉన్నాయి. -
మహీంద్రా రేవా ఈ2ఓ కారు ధర కట్
న్యూఢిల్లీ: మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ ధర రూ.1.7 లక్షల వరకూ తగ్గే ఒక కొత్త స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. గుడ్‌బై ఫ్యూయల్, హెలో ఎలక్ట్రిక్ పేరుతో వినూత్నమైన ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్‌ను అందిస్తున్నామని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈవో చేతన్ మైణి చెప్పారు. చార్జింగ్ బ్యాటరీని కొనుగోలు చేయకుండా నెలకు రూ.2,599 చొప్పున ఐదేళ్లు చెల్లించే ఈ బ్యాటరీ రెంటల్ స్కీమ్ కారణంగా రూ. 6.69 లక్షల ధర ఉండే ఈ2ఓ కారును ఇప్పుడు రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ లిథియమ్ అయాన్ బ్యాటరీ నెలకు 800 కిమీ. చొప్పున(సగటున)ఐదేళ్లకు 50 వేల కిమీ. దూరం ప్రయాణిస్తుందని వివరించారు. బ్యాటరీ రెంటల్‌తో పాటు ఎలక్ట్రిసిటీ కంజప్షన్ చార్జీని కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది చాలా స్వల్పంగానే ఉండగలదని ఆయన వివరించారు. 24 గంటలూ రిపేర్ సేవలు అందుబాటులో ఉంటాయని, బ్యాటరీ రిపేర్ కాలంలో మరో కారును సమకూరుస్తామని పేర్కొన్నారు. కొత్త స్మార్ట్ పోర్ట్ టెక్నాలజీతో క్విక్2చార్జ్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. దీంతో ఈ2ఓ కారును ఒక్క గంటలోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు. -
అందరూ అవినీతిపరులు కారు: ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: దేశమంతా అవినీతిలో కూరుకుపోయిందన్నది చాలా తప్పుడు భావన అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. అందరూ అవినీతిపరులు కారన్నారు. నియంత్రణ సంస్థలు కూడా అందరినీ అదే దృష్టికోణంతో చూడకుండా.. క్షమించరాని ఉల్లంఘనలకు కంపెనీలు పాల్పడ్డాయని, క్రిమినల్ నేరాలు చేశాయని పక్కాగా రుజువులు ఉన్నప్పుడే రంగంలోకి దిగాలని సూచించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) స్వర్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు తెలిపారు. ‘నేను అవినీతికి మద్దతు పలకడం లేదు. కానీ అందరూ అవినీతిపరులని మాత్రం నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు, మీ తల్లిదండ్రులు, మిత్రులు, ప్రతి ఒక్కరు అవినీతిపరులన్న భావన్న చాలా దారుణమైనది. ఇలా మనల్ని మనమే తక్కువ చేసుకోవడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను’ అని చిదంబరం చెప్పారు. -
సెకండ్ హ్యాండ్..పుల్ డిమాండ్!
దేశంలోనే నంబర్ వన్ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఒకప్పటి చీఫ్ జగదీశ్ ఖట్టర్ ఇప్పుడేకారు నడుపుతుంటారో? ఏ టాప్ఎండ్ ఎస్యూవీనో లేదంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీకారో అనుకుంటున్నారా... అబ్బే ఆయన షి‘కారు’ చేసేది కేవలం సెకండ్హ్యాండ్లలో! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అంతేకాదు, ఇప్పుడు ఆయన వ్యాపారం కూడా ఇదే. వాడినకార్లను కొనడం.. అమ్మడం... సర్వీసింగ్. ఇందుకోసం ఆయన అయిదేళ్ల క్రితం ప్రారంభించిన కార్నేషన్ ఆటో అనే సంస్థ ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్లో తనదైనముద్రతో దూసుకెళ్తోంది. దీనంతటికీ దేశంలో ఈ మార్కెట్ పుంజుకుంటుండటమే కారణం. ఒకపక్క, ఆటోమొబైల్ మార్కెట్లో మందగమనం నెలకొన్నప్పటికీ ఈ యూజ్డ్ కార్ల వ్యాపారం మాత్రం టాప్‌గేర్‌లో దూసుకెళ్తుండటం విశేషం. ‘ధనిక కస్టమర్లు కొత్తకార్లు కొంటారు.. తెలివైనవాళ్లు సెకండ్‌హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తారు’ ఇదీ ఖట్టర్ ఫిలాసఫీ! పెద్ద కంపెనీల ప్రవేశంతో.. ఒపప్పుడు చిన్నాచితకా సంస్థలు, డీలర్లకే పరిమితమైన ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి దిగ్గజాలు ప్రవేశించడంతో వ్యవస్థీకృత రూపుదాల్చుతోంది. మారుతీ సుజుకీ ‘ట్రూ వేల్యూ’ పేరుతో, మహీంద్రా అండ్ మహీంద్రా.. ‘ఫస్ట్ చాయిస్’, జగదీశ్ ఖట్టర్ నెలకొల్పిన కార్నేషన్ ఆటో వంటివి ఈ రంగంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రస్తుతం మల్టీబ్రాండ్ యూజ్డ్ కార్ల మార్కెట్లో ఈ సంస్థాగత కంపెనీల వాటా దాదాపు 15%. బడా కంపెనీలు ప్రవేశించినా.. ఇప్పటికీ చిన్న చిన్న డీలర్ల(ఆన్ఆర్గనైజ్డ్)దే ఈ మార్కెట్లో మెజారిటీ వాటా. అయితే, పెద్ద కంపెనీల ప్రవేశంతో తమ మార్జిన్లు, అమ్మకాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయనేది చిన్న డీలర్ల వాదన. బడా సంస్థలు వారంటీ ఇతర త్రా ఆఫర్ చేస్తుండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. విస్తరణ జోరు... ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డుకాలం కొనసాగుతున్నప్పటికీ సెకండ్‌హ్యాండ్ కార్ల కంపెనీలు విస్తరణతో దూసుకెళ్తున్నాయి. దీనికి పటిష్ట డిమాం డే కారణం. గతేడాది ఏప్రిల్ నుం చి ఇప్పటిదాకా మహీంద్రా ఫస్ట్ చాయిస్ 100 కొత్త డీలర్షిప్ సోర్లను దేశ్యాప్తంగా తెరిచింది. ఈ వ్యవధిలో తాము 60 వేల సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించామని.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 40% అధిమని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సీఈఓ నాగేంద్ర పల్లె పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకూ విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక మారుతీ ట్రూ వేల్యూ కూడా విస్తరణతో ఉరకలేస్తోంది. గతేడాది డిసెంబర్ నాటికి కంపెనీ అవుట్లెట్ల సంఖ్య మొత్తం 309 నగరాల్లో 507కు చేరింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌కు 245 నగరాల్లో 429 అవుట్లెట్లు ఉన్నాయి. ఇక ఖట్టర్‌కు చెందిన కార్‌నేషన్‌కు ప్రస్తుతం 40 డీలర్షిప్ అవుట్లెట్లు ఉండగా.. మరో మూడేళ్లలో 150-200కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘సెకండ్‌హ్యాండ్’ పదానికి బదులు ఇప్పుడు ‘యూజ్డ్’ కార్లు లేదా ‘ప్రీఓన్డ్’ కార్లు అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మార్కెట్ ఎంత? అధికారికంగా గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ.. దేశంలో వార్షికంగా 30 లక్షల యూజ్డ్ కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. 2013లో దేశీయంగా 18.07 లక్షల కొత్త కార్లు అమ్ముడైనట్లు సియామ్ అంచనా(2012లో దాదాపు 20 లక్షల కార్లతో పోలిస్తే 9.5 శాతం తగ్గాయి). క్రిసిల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2016-17 నాటికి వార్షికంగా యూజ్డ్కార్ల అమ్మకాల సంఖ్య దాదాపు మూడింతలకు.. అంటే 80 లక్షల స్థాయికి చేరొచ్చని అంచనా. మొత్తం మార్కెట్ విలువ రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కాగా, అమెరికాలోలో గతేడాది దాదాపు 4 కోట్ల యూజ్డ్ కార్లు అమ్ముడవగా.. చైనాలో ఈ సంఖ్య 48 లక్షలు కావడం గమనార్హం. డిమాండ్‌కు కారణమేంటి? పేరున్న కార్ల బ్రాండ్లు ఈ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో కస్టమర్లలో నమ్మకం పెరిగేందుకు దోహ దం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, సెకండ్‌హ్యాండ్ వాహనాలను నడిపేందుకు ఇష్టపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండటం కూడా యూజ్డ్ కార్లకు డిమాండ్‌ను సృష్టిస్తోంది. ఈ విధమైన ధోరణికి మనోళ్లు బాగానే అలవాటుపడుతుండటం మరో కీలకమైన అంశం. యూజ్డ్ కారుతో కొన్నాళ్లు నడిపించి.. ఆ తర్వాత కొత్తకారు సొంతంచేసుకోవాలనుకునే ట్రెండ్ ఇటీవల ఊపందుకుంటోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. విదేశీ లగ్జరీకార్ల నుంచి దేశీ కంపెనీల ప్రఖ్యాత కార్ల మోడళ్లు ఇలా అన్నీ అందుబాటు ధరల్లో ఊరిస్తుండటం కూడా కొందరు కస్టమర్లను యూజ్డ్ కార్లవైపు నడిపిస్తోందని చెబుతున్నారు. పదేపదే కార్లను మార్చే కస్టమర్లు దేశంలో పెరుగుతుండడం, రుణాల లభ్యత వంటివి సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్‌కు వరంగా మారుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోపక్క, రోజుకో కొత్త మోడల్ కారు మార్కెట్లోకి విడుదలవుతుండడం కూడా ఈ మార్కెట్ పురోగతికి దోహదం చేస్తోంది. -
ఈసారి రికార్డే
నాగపూర్: ఈ ఏడాది 263.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని భారత్ సాధిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే అధికమని అన్నారు. నగరంలో కృషి వసంత్-2014 జాతీయ వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే ఈసారి నాలుగు మిలియన్ టన్నులు అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు వల్ల గతేడాది 255.36 మిలియన్ టన్నులకు మాత్రమే ఆహార ధాన్య ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఈసారి ఆశించినమేర కన్నా అధికంగ వర్షాలు కురవడంతో పాటు ఖరీఫ్, రబీ పంట సేద్యం పెరిగిందని పవార్ అన్నారు. దీనివల్ల ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో భారత్ తొలిస్థానంలో ఉంద ని, గోధుమ, పత్తిలో రెండో స్థానంలో ఉందని ఆయన వివరించారు. పాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తిలోనూ భారత్ అగ్రస్థానంలో ఉందని తెలి పారు. 92 మంది విజయవంతమైన రైతులు ప్రదర్శనను మెచ్చిన పవార్, వీరితో మిగతా రైతు లు కూడా పంటల ఉత్పత్తిలో పోటీపడాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్‌వో) ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర ముందస్తు అంచనాల ప్క్రారం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో 4.6 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. ఐదు రోజుల పాటు ప్రదర్శన పారిశ్రామిక విభాగం సీఐఐ సహకారంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కృషి వసంత్ జాతీయ వ్యవసాయ ప్రదర్శనను ఆదివారం నుంచి ఐదు రోజులు పాటు నిర్వహిస్తోంది. గత వందేళ్లలో ఐసీఏఆర్ సాధించిన విజయాలతో పాటు వ్యవసాయ పరిశోధన చరిత్ర ను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనకు సుమారు ఐదు లక్షల మంది రైతులు సందర్శించే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అగ్రి వెబ్ ద్వారా ప్రసారం చేస్తోందని తెలిపారు. శిక్షణకు రాని రైతు లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ఏడాదికి రూ.112 కోట్లు!
న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం సత్య నాదెళ్ల... అదిరిపోయే వేతన ప్యాకేజీ అందుకోనున్నారు. జీతం, బోనస్, స్టాక్ ఆప్షన్స్ ఇతరత్రా ప్రోత్సాహకాలన్నీ కలిపితే ఏడాదికి ఆయనకు 1.8 కోట్ల డాలర్లు(దాదాపు రూ.112 కోట్లు) లభించనున్నాయి. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే సారథి సత్యతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న కొత్త ఉద్యోగ ఒప్పందం ప్రకారం... జీతం ఏడాదికి 12 లక్షల డాలర్లు(రూ.7.5 కోట్లు) కావడం గమనార్హం. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్(ఈఐపీ) ప్రకారం నాదెళ్లకు ప్యాకేజీని నిర్ణయించారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా చేరిన 47 ఏళ్ల సత్య... సర్వర్ అండ్ టూల్స్, క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్, ఆన్లైన్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్ విభాగాల్లో బాధ్యతలను నిర్వర్తించారు. 1.32 కోట్ల డాలర్ల షేర్లు... వార్షిక ఈఐపీలో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 1.32 కోట్ల డాలర్ల విలువైన షేర్లు సత్య అందుకోనున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని జూలై 1 నుంచి జూన్ 30గా లెక్కిస్తారు. 2014, 2015 సంవత్సరాల్లో సీఈఓగా అందుకునే వార్షిక వేతనానికి తోడు 0-300 శాతం వరకూ నగదు ప్రోత్సాహకం(అవార్డు)ను కూడా సత్యకు ఇస్తున్నట్లు ఆఫర్ లేఖలో మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీన్ని పనితీరు ఆధారంగా కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది. గరిష్టంగా చూస్తే ఈ మొత్తం 36 లక్షల డాలర్లుగా ఉండొచ్చు. మొత్తంమీద ప్యాకేజీ 1.8 కోట్ల డాలర్లగా లెక్కతేలుతోంది. సత్యకు ఆఫర్ చేసిన వేతన ప్యాకేజీ వివరాలను కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా తెలియజేసింది. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఆయనకు లాంగ్‌టర్మ్ పర్ఫార్మెన్స్ స్టాక్ అవార్డ్స్ కూడా లభించనున్నాయి. 39 ఏళ్ల కంపెనీ చరిత్రలో బిల్‌గేట్స్, స్టీవ్ బామర్ల తర్వాత మూడో సీఈఓగా బాధ్యతలు స్వీకచించిన సత్య... 2013 ఆర్థిక సంవత్సరంలో 6.75 లక్షల డాలర్ల జీతాన్ని అందుకున్నారు. ఇక 16 లక్షల డాలర్ల విలువైన నగదు బోనస్ లభించినట్లు సమాచారం. స్వాగతించిన అమెరికా మీడియా.. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల నియామకాన్ని అమెరికా మీడియా మొత్తం స్వాగతించింది. ఈ టెక్నోక్రాట్‌కు మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదురుచూస్తున్నాయని కూడా తమ కథనాల్లో గుర్తుచేసాయి. కార్పొరేట్ కంప్యూటర్ సర్వర్లు, ఇతర బ్యాకెండ్ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఈ టెక్నాలజీ నిపుణుడే తమకు తగిన సారథి అని మైక్రోసాఫ్ట్ తేల్చు కుంది. ఇంటాబయటా బోలెడంత మంది జాబితాను మదించి... చివరకు సత్య నాదెళ్లకు ఓటేసింది. - వాల్‌స్ట్రీట్ జనరల్ భారత్ అర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న అవకాశాలతో ప్రవాసీయులు మాతృదేశంవైపు చూస్తున్న తరుణంలో అమెరికాలో ఒక భారతీయుడు(సత్య) మైక్రోసాఫ్ట్‌కి సారథిగా రావడం గొప్పవిషయమే. - టైమ్ మ్యాగజీన్ బయటి వ్యక్తికోసం తీవ్రంగా వేటసాగించినా.. కంపెనీలోని వ్యక్తివైపే మైక్రోసాఫ్ట్ మొగ్గుచూపింది. తమ కస్టమర్లు క్లౌడ్వైపు దృష్టిసారించడంలో విజయంసాధించిన సత్య నాదెళ్లను ఎంచుకుంది. - వాషింగ్టన్ పోస్ట్ ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అధిపతులుగా ఉన్న భారతీయుల శక్తిసామర్థ్యాలు సత్య నాదెళ్ల ఘనతతో మరోసారి నిరూపితమయ్యాయి. 10 మంది భారతీయులు సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ కంపెనీల వ్యాపార విలువ దాదాపు 35,000 కోట్ల డాలర్లు కావడం గమనార్హం. ఇది గతేడాది భారత్ ఎగుమతులకంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఐటీ రంగంతోపాటు విదేశాల్లో ఇతరత్రా కంపెనీలకు చాలా మంది భారతీయులు అధిపతులుగా ఉన్నప్పటికీ.. కనీసం 12 అతిపెద్ద సంస్థలకు మనోళ్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లుగా కొనసాగుతున్నారు. కాగా, గతంలో కూడా సిటీ గ్రూప్(విక్రం పండిట్), మోటరోలా(సంజయ్ ఝా) లకు మనోళ్లు సీఈఓలుగా చేశారు. భారతీయులు.. భారీ జీతాలు పేరు కంపెనీ(సీఈఓ) వార్షిక ప్యాకేజీ సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ 1.8 కోట్ల డాలర్లు సంజయ్ ఝా గ్లోబల్ ఫౌండ్రీస్ 4.7 కోట్ల డాలర్లు (2013లో మోటొరోలాతో ఉన్నపుడు) ఇవాన్ మెండిస్ డియాజియో 1.7 కోట్ల డాలర్లు(2012) ఇంద్రా నూయి పెప్సీకో 1.26 కోట్ల డాలర్లు(2013) శాంతను నారాయణ్ అడోబ్ సిస్టమ్స్ 1.20 కోట్ల డాలర్లు (2012) అజయ్ బంగా మాస్టర్ కార్డ్ 1.13 కోట్ల డాలర్లు (2013) పియూష్ గుప్తా డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ 93.31 లక్షల డాలర్లు (2012) అన్షు జైన్ డాయిష్ బ్యాంక్(కో-సీఈఓ) 79.52 లక్షల డాలర్లు (2013) సంజయ్ మెహరోత్రా శాన్డిస్క్ 66.66 లక్షల డాలర్లు (2012) రాకేశ్ కపూర్ రెకిట్ బెన్కిసర్ 47.01 లక్షల డాలర్లు (2012) టాప్ సెర్చ్... సత్య మైక్రోసాఫ్ట్ సారథిగా సత్య పేరు వెల్లడికావడంతో సైబర్ ప్రపంచంలో ఆయన పేరు మార్మోగిపోయింది. ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ హాట్‌టాపిక్ ఆయనే. కేవలం అరనిమిషంలోనే గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ‘సత్య నాదెళ్ల’ పేరుతో 44 కోట్ల సెర్చ్ రిజల్ట్స్ ప్రత్యక్షం కావడం దీనికి నిదర్శనం. అంతేకాదు ఆయన పేరుతో 0.14 సెకండ్లో 1.28 కోట్ల వార్తా కథనాలు గూగుల్ న్యూస్‌లో పోస్ట్కావడం విశేషం. సైబర్ జగత్తులో ఇప్పటిదాకా నమోదైన అత్యధిక సెర్చ్‌ల రికార్డులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా(65 కోట్లు), బిల్ గేట్స్(48 కోట్లు) తర్వాత మూడోవ్యక్తిగా సత్య నిలవడం గమనార్హం. ఇదే టాప్ సెర్చ్ జాబితాలో రతన్ టాటా(40 లక్షలు), పెప్సీకో చైర్పర్సన్ ఇంద్రా నూయి(10 లక్షల కంటే తక్కువ)... సత్యకంటే ఆమడ దూరంలో ఉన్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా ఎంపికైన తర్వాత ఆయన పేరుమీద ఫేస్బుక్లో ఒక పేజ్ ఒపెన్ కావడం... దీనికి కొద్దిగంటల్లోనే 30 వేలకు పైచిలుకు ‘లైక్స్’ వెల్లువెత్తడం విశేషం. -
కుబేరుల ‘రియల్’ సంపద..!
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల సంపదలో ఐదో వంతు రియల్ ఎస్టేట్‌దే. అలాగే ఆసియా కుబేరుల మొత్తం సంపదలో సింహభాగం రియల్టీదేనని అం తర్జాతీయ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ, సావిల్స్ తాజా నివేదిక పేర్కొంది. వెల్త్-ఎక్స్ సంస్థతో కలిసి రూపొందించిన నివేదిక ముఖ్యాంశాలు..., ప్రపంచంలో 2 లక్షల మంది అపర కుబేరులు (ఆల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్) తమ సం పదలో ఐదో వంతు రియల్టీలో ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచంలో అపర కుబేరుల మొత్తం సంపద 27,77,000 కోట్ల డాలర్లు. దీంట్లో రియల్టీ ఆస్తులు వాటా 19%(5,32,800 కోట్ల డాలర్లు). యూరోపియన్ కుబేరులకు అత్యధిక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. వారి మొత్తం ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ వాటా 31%. ఆ తర్వాతి స్థానంలో 27% వాటాతో ఆసియా కుబేరులు, 26% వాటాతో మధ్య ఆసియా కుబేరులున్నారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 180 లక్షల కోట్ల డాలర్లు. దీంట్లో 72%యజమానులే నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్రొపర్టీయే. ప్రపంచ జనాభాలో అపర కుబేరుల సంఖ్య 0.003 శాతమే. అయితే ప్రపంచవ్యాప్త రియల్టీలో వీరి వాటా 3%. ఒక్కొక్కరి సగటు రియల్టీ సం పద 2.65 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.159 కోట్లు) 2018 నాటికి అపర కుబేరుల సంఖ్య 22% పెరుగుతుంది. ప్రస్తుతం 27.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న వీరి సంపద 2018 నాటికి 36 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. -
ఫేస్బుక్ చేతికి లిటిల్ ఐ ల్యాబ్స్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ కంపెనీ ఫేస్బుక్ బెంగుళూరుకు చెందిన లిటిల్ ఐ ల్యాబ్స్ కంపెనీని కొనుగోలు చేసింది. ఫేస్బుక్ కంపెనీకి ఇది భారత్‌లో తొలి టేకోవర్. అయితే ఎంత మొత్తానికి దీనిని కొనుగోలు చేసింది వెల్లడి కాలేదు. అయితే ఈ డీల్ విలువ కోటి-కోటిన్నర డాలర్ల వరకూ ఉండొచ్చని సమాచారం. ఆండ్రాయిడ్ ఓఎస్ సంబంధిత మొబైల్ యాప్ డెవలపర్ల కోసం మానిటరింగ్ టూల్స్‌ను, పెర్ఫామెన్స్ ఎనాలసిస్ సంబంధిత కార్యకలాపాలను ఈ లిటిల్ ఐ ల్యాబ్స్ నిర్వహిస్తుంది. ఫేస్బుక్ టేకోవర్ కారణంగా తమ మొబైల్ డెవలప్మెంట్ కార్యకలాపాలు మరో స్థాయికి పెరుగుతాయని లిటిల్ ఐ పేర్కొంది. ఈ కంపెనీ టేకోవర్ వల్ల మరింత సమర్థవంతమైన ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ఆవిష్కరణ సాధ్యమవుతుందని ఫేస్బుక్ ఇంజినీరింగ్ మేనేజర్ సుబ్బు సుబ్రమణ్యన్ చెప్పారు. ఏడాది క్రితం గిరిధర్ మూర్తి, కుమార్ రంగరాజన్, సత్యం కందుల, లక్ష్మణ్ కాక్కిరాల-ఈ నలుగురు లిటిల్ ఐ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టేకోవర్ కారణంగా ఈ కంపెనీ సిబ్బంది మొత్తం ఫేస్బుక్ కేంద్ర కార్యాలయం, మెన్లోపార్క్(కాలిఫోర్నియా)కు తరలివెళతారు. -
ఫెడ్ కోతతో ఇబ్బందిలేదు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్)తో... దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావమేమీ ఉండబోదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. భారత్ ఎగుమతులు పుంజుకుంటున్నాయని, అదేవిధంగా కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) సైతం మెరుగుపడుతోందన్నారు. సోమవారం ఇక్కడ విడుదల చేసిన అర్ధవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఈ విషయాలను పేర్కొన్నారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ ట్యాపరింగ్ పరిణామాలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీతో పోలిస్తే క్యాడ్ 3%లోపే ఉండొచ్చు’ అని రాజన్ చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో క్యాడ్ 3.05 శాతానికి దిగొచ్చింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఆశ్చర్యకరంగా 1.2 శాతానికి పరిమితం కావడం గమనార్హం. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది చరిత్రాత్మక గరిష్టానికి(4.8%) ఎగబాకడం విదితమే. బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏ) గడిచిన ఆరు నెలలుగా పెరుగుతూవస్తుండటం అత్యంత ఆందోళనకరంగా పరిణమించిందని రాజన్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి వ్యవస్థీకృత ముప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే... బ్యాంకుల స్థూల ఎన్పీఏలు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 4.6 శాతానికి ఎగబాకవచ్చని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి స్థూల ఎన్పీఏలు 4.2 శాతం(రూ.2.29 లక్షల కోట్లు)గా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ పరిమాణం రనూ.167 లక్షల కోట్లు. కాగా, మొత్తం రుణాల్లో పునర్వ్యవస్థీకరణ రుణాలు కూడా 2013-14 క్యూ2(జూలై-సెప్టెంబర్) నాటికి ఆల్‌టైమ్ గరిష్టానికి(రూ.4 లక్షల కోట్లు) దూసుకెళ్లడం గమనార్హం. క్రితం క్యూ2తో పోలిస్తే 10.2 శాతం ఎగబాకినట్లు నివేదిక వివరించింది. కాగా, 2015 మార్చినాటికి స్థూల ఎన్పీఏలు 4.4 శాతానికి మెరుగుపడొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అయితే, ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారితే ఇది 7 శాతానికి కూడా పెరిగే ముప్పు ఉందని నివేదిక హెచ్చరించింది. అన్నింటికంటే ప్రభుత్వరంగ బ్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీరేట్ల తగ్గింపు ఇతరత్రా పాలసీ సడలింపులపై దృష్టిపెట్టాలనుకున్నా.. అధిక ద్రవ్యోల్బణం కారణంగా సాధ్యంకావడం లేదని రాజన్ చెప్పారు. మంచి వర్షపాతంతో వ్యవసాయ దిగుబడులు పుంజుకోనున్నాయని, దీంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధి కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. స్థిరమైన సర్కారు రాకపోతే అంతే..! 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త రిస్క్‌లు పొంచిఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోతే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇది ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తుందన్నారు. స్థిరమైన సర్కారు ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కూడా దీనికోసమే ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే..
ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలంటే ప్రకటనలిస్తారు.. అయితే, ఇది ప్రేయసిని వెతుక్కోవడానికి ఇచ్చిన ప్రకటన! విషయమేమిటంటే.. అమెరికాలోని షికాగోకు చెందిన గోర్డాన్ ఎంగెల్(40) ఈ మధ్య భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. మళ్లీ తన మనసుకు నచ్చిన నెచ్చెలి వేటలో పడ్డాడు. ఆన్లైన్ డేటింగ్ సైట్లు వంటివాటిని ప్రయత్నించి, ప్రయత్నించి విసిగిపోయాడు. దీంతో వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ టైపులో.. ‘నా పేరు గోర్డాన్.. పద డిన్నర్కెళ్దాం’ అంటూ షికాగోలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వే మీద ఈ వినూత్న భారీ ప్రకటన ఇచ్చాడు. ఇందుకోసం వేల డాలర్లు వెచ్చించాడు. ఈ బిల్‌బోర్డు మీదే గోర్డాన్ చిత్రం, అతడి డేటింగ్ వెబ్సైట్ www.helpgordyfindlove.com చిరునామా పెట్టాడు. దీనికి మంచి స్పందన లభిస్తోంది