ఆర్థిక స్వేచ్ఛలో రాష్ట్రానిది మూడో స్థానం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సానుకూలంగా మరో నివేదిక వెలువడింది. ఆయన సీఎంగా ఉన్న గుజరాత్ రాష్ట్రం.. ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపర్చుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిల్చింది. ప్రముఖ ఆర్థిక వేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్టు స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
పాలనాయంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార.. కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీని ప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతో పాటు వేగంగా పరిస్థితులను మెరుగుపర్చుకునే విషయంలో కూడా అగ్రస్థానం దక్కించుకుంది. 0-1.0 స్కేలుపై 0.65 స్కోరు సాధించింది. ఓవరాల్‌గా తమిళనాడు రెండో స్థానంలో (0.54 స్కోరు), ఆంధ్రప్రదేశ్ (0.50 స్కోరు) మూడో స్థానంలో ఉన్నాయి. బీహార్ 0.31 స్కోరుతో ఎప్పట్లాగానే అట్టడుగున ఉంది. మావోయిస్టులు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ.. జార్ఖండ్‌తో పోలిస్తే చత్తీస్‌గఢ్ మెరుగైన స్కోరుతో 16వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది.