వేదికలపై గంభీరోపన్యాసాలు చేయడంలో, విలువల గురించి మాట్లాడటంలో మన నాయకులకు ఎవరూ సాటిరారు. ఆ ఉపన్యాసాలకూ, ఆచరణకూ పెద్దగా పొంతనవుండదు. శుక్రవారం జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించాయి. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే తీసుకుంటామని మోదీ ప్రకటించారు. మంచిదే. గత అయిదేళ్ల పాలనలో ఏకాభిప్రాయం జాడ ఎక్కడా కనబడకపోగా చాలా నిర్ణయాలు విపక్షాన్ని సభనుంచి గెంటేశాక మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.
ఆ నిర్ణయాలపై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ప్రతిఘటన కూడా ఎదురైంది. బహుశా అందువల్లే కావొచ్చు... 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన మెజారిటీ ఈసారి మాయమైంది. మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని స్థితి ఏర్పడింది. రామమందిర నిర్మాణం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపి, దానిమాటున మూడున్నర దశాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ... తీరా ఆలయ నిర్మాణం కొనసాగుతున్న దశలో కనీస మెజారిటీకి దూరంకావటం, యూపీలో సగంపైగా సీట్లు కోల్పోవటం కేవలం యాదృచ్ఛికమని మోదీ చెప్పగలరా? చివరకు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ కోల్పోవలసి వచ్చిందని ఆయనకు గుర్తుందో లేదో!
అయోధ్య ప్రాంతంలోని 9 స్థానాల్లో 5, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలోని 12 స్థానాల్లో తొమ్మిదింటిని ఈసారి బీజేపీ చేజార్చుకుంది. బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాంతాలూ ఆయువుపట్టు. అంతేకాదు... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో 50 శాతంపైగా వోట్లతో 224 స్థానాలు గెల్చుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 156కి పడిపోయింది. బీజేపీ 500 కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 30... వేయి కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 100 ఉన్నాయి. ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా అందులోని సమాజ్‌వాదీ పార్టీ దాదాపు అన్నిచోట్లా గణనీయంగా కోలుకుంది.
తమ గెలుపును ఓటమిగా చిత్రిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఇప్పుడూ, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకొచ్చిన మొత్తం సీట్ల సంఖ్యతో పోల్చినా ఈసారి తమకొచ్చిన స్థానాలు చాలా ఎక్కువని ఎద్దేవా చేయటం బాగానేవుంది. అయితే జరిగిందేమిటో లోతుగా విశ్లేషిస్తే సత్యం బోధపడుతుంది. మోదీ పైకేమి మాట్లాడినా నిరుపేదలూ, మధ్యతరగతి తమకు క్రమేపీ దూరం జరుగుతున్నారని బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈసారి ఆ రెండు వర్గాలకూ కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చ జరిగినప్పుడు ఉపన్యాస పోటీలుగా భావించి మాట్లాడటంకాక ఆరోగ్యకరమైన చర్చలకు చోటీయడం ఎంతో అవసరం.
ఎన్‌డీఏ సహజసిద్ధమైన కూటమని, ఇందులో అధికార యావలేదని మోదీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్‌డీఏకు మద్దతుగా నిలిచిన నితీశ్, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో హఠాత్తుగా కాడి పారేసి విడిగా ఎందుకు పోటీ చేశారో, అంతకు సంవత్సరం ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎందుకు అంటకాగారో ఎవరైనా చెప్పగలరా? తరచు యూటర్న్‌లు తీసుకోవటంలో నితీశ్, చంద్రబాబులకు పోటీ పెడితే ఎవరు ప్రథమ స్థానం గెల్చుకుంటారో చెప్పటం కొంత కష్టమే.
ఇలాంటివారిని పక్కనబెట్టుకుని ‘ఇది సహజసిద్ధమైన కూటమి, సుపరిపాలన కోసం కలిశాం’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తే నమ్మడానికి దేశ ప్రజలు తెలివితక్కువవారు కాదు. మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచడంమాట అలావుంచి 2014లోనే ‘మీరు పదిహేనేళ్లు అధికారంలో వుంటారని బాబు జోస్యం చెప్పార’ని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 2019లో వీరిద్దరూ ఎన్‌డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు... ఇప్పుడెందుకు కలిసినట్టు? ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారంలో పెట్టి, చివరకు కేంద్రమే ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రజానీకాన్ని పక్కదోవ పట్టించి బాబు లాభపడ్డారు.
విలువలన్నిటినీ గాలికొదిలి ఏం చేసైనా అధికారంలోకి వచ్చితీరాలన్న పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అత్యంత హీనంగా దుర్భాషలాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ తదితరులు ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవటమో, ఆలస్యంగా స్పందించటమో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలను అనుకరిస్తూ ఏపీలో ఏం జరిగినా, బాబు తదితరులు అవాకులూ చవాకులూ మాట్లాడినా ప్రధాన ఎన్నికల అధికారి ఉలుకూ పలుకూ లేకుండా నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఆఖరికి పోలైన వోట్లకన్నా గెలిచిన అభ్యర్థికి అధికంగా వోట్లు వచ్చిన ఉదంతాలు అక్కడక్కడ బయటపడ్డాయి. ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనే కాళ్లావేళ్లాపడి మరీ బాబు ఎన్‌డీఏలోకి లంఘించారు.
వేదికలెక్కి విలువల గురించి గంభీరోపన్యాసాలు చేసేముందు మొన్న ఎన్నికల్లో తమ ప్రవర్తన ఎలావుందో, ఏం మాట్లాడామో చూసుకోవటం వారికే మంచిది. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందాన వేదికలెక్కి విన్యాసాలు చేస్తే జనం నవ్విపోతారని నరేంద్ర మోదీతోపాటు ఎన్‌డీఏ భాగస్వామ్యపక్ష నేతలు తెలుసుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్లూ ఏం చేశారో, ఎలా మెలిగారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు.
విలువల జాడేది?!
Published Sat, Jun 8 2024 12:02 AM | Last Updated on Sat, Jun 8 2024 12:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment