కేంద్రంలో వరసగా పదేళ్లు పాలించి మూడోసారి 400 సీట్లతో ఘనమైన హ్యాట్రిక్ నమోదు చేసుకోవాలనుకున్న ఎన్‌డీఏను ఉత్తరాదిన నిలువరించటంలో, దాన్ని 300 లోపు మెజారిటీకి పరిమితం చేయటంలో ‘ఇండియా’ కూటమి విజయం సాధించిందని సోమవారం వెల్లడవుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. ‘జనం మా వైపే మొగ్గు చూపారు. మూడోసారి కూడా పాలించమని ఆశీర్వదించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా జరిగిందేమిటో కనబడుతూనేవుంది.
పూర్తి ఫలితాలు వెల్లడికావటానికి ఇంకా సమయంవున్నా దేశానికి ‘కొత్త రోల్ మోడల్’గా బీజేపీ చూపించదల్చుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ సగం సీట్లపైగా కోల్పోవటం ఖాయమని అర్థమవుతోంది. రామమందిరం నిర్మాణమవుతున్న అయోధ్య... ఫైజాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనిదే. అక్కడా, ఇతరచోట్లా బీజేపీకి ఎదురుగాలి వీచటం చిన్నవిషయం కాదు. అయితే ఉత్తరాదిలో ఎన్‌డీఏకు జరిగిన ఈ నష్టాన్ని భర్తీ చేయటానికి దక్షిణాది సిద్ధపడిందని, తూర్పున ఒడిశా కూడా ముందుకొచ్చిందని ఫలితాలు సూచిస్తున్నాయి.
తమిళనాడు ఇందుకు మినహాయింపు. ఆఖరికి ఎప్పుడూ బీజేపీ ఉనికి కనబడని కేరళలో ఆ పార్టీకి ఒక స్థానం రావడం సామాన్యం కాదు. బెంగాల్ మాత్రం బీజేపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఉత్తరాదిన మతతత్వ రాజకీయాలపై మబ్బులు విడిపోతున్న వేళ దక్షిణాది ఆ ప్రభావానికి లోనుకావటం ఏపీలో టీడీపీకి కలిసొచ్చివుండొచ్చని కొందరు చేస్తున్న విశ్లేషణ నిజమే కావొచ్చు. ఎందుకంటే కార్గిల్ ఘర్షణల అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో మెరుగ్గా స్థానాలు వచ్చాక ఎన్‌డీఏకు ఈ స్థాయిలో ఆదరణ లభించటం ఇదే మొదటిసారి.
కర్ణాటక బీజేపీ కొమ్ముకాయడంలో వింతేమీ లేదు. అది బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం. గత లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీదే అక్కడ ఆధిక్యత. తెలంగాణలో సైతం ఈసారి దాదాపు సగం స్థానాలతో బీజేపీ జెండా ఎగరటం, ఆ పార్టీ అభ్యర్థులకు మంచి మెజారిటీలు నమోదుకావటం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘ఆరు గ్యారెంటీల’ పేరిట ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అధికారంలోవున్న కాంగ్రెస్ సతమతమవుతోంది. బీజేపీ బలం పుంజుకోవటానికి అది తోడ్పడింది.
కానీ వెనకా ముందూ చూడకుండా ఈ వాగ్దానాలనే కాపీకొట్టి జనం ముందుకొచ్చిన తెలుగుదేశానికి ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ లభించింది. అయిదేళ్లక్రితం ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం పైగా నెరవేర్చి, ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కాదని ఎన్‌డీఏవైపు జనం మొగ్గుచూపటం వెనక బీజేపీతోపాటు రకరకాల ప్రభావాలు స్పష్టంగానే కనబడుతున్నాయి.
చంద్రబాబు విశ్వసనీయత కలిగిన నాయకుడు కాదు. ఆ సంగతిని ఆయన 2014–19 మధ్య పాలించినప్పుడు సైతం నిరూపించుకున్నారు. చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేక ఏకంగా మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌నుంచి మాయం చేసిన ఘనుడాయన. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండబోదు. మేనిఫెస్టో ఆవిష్కరణ రోజున దానిపై ప్రధాని ఛాయాచిత్రం ఉండరాదని బీజేపీ పట్టుబట్టడం, అందుకు అంగీకరించినా దాన్ని చేతితో తాకేందుకు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు సిద్ధపడని వైనం తాజా వాగ్దానాలకు ఏ గతి పడుతుందో తేటతెల్లం చేశాయి.
ఆ సంగతలావుంచి ఎన్నికల ప్రచారపర్వంలోగానీ, అంతకుముందుగానీ ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కనబడనిచోట అధికారపక్షం ఇంత దారుణంగా ఓడిపోవటం వెనక ఈవీఎంల పాత్ర ఉండొచ్చని కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలూ... చాలాచోట్ల వోటింగ్ శాతం అసాధారణంగా పెరగటంలో మతలబుందని పోలింగ్ రోజున మరికొందరు శంకించటం పూర్తిగా కొట్టిపారేయదగినవి కాకపోవచ్చు. సాధారణంగా ఓడిన పక్షం ఈవీఎంలపై నెపం వేయటం గతంలో చాలాసార్లు జరిగింది.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అకాలీదళ్‌లు భిన్న సందర్భాల్లో ఆ పనే చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఇంతవరకూ ఆ మాటనలేదు. కానీ ఆ పార్టీ నేతల స్వరంలో అది అంతర్లీనంగా కనబడుతూనేవుంది. అమెరికాతోసహా సాంకేతికంగా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తి బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న తరుణంలో మన దేశంలో మాత్రమే ఇది ఎందుకు కొనసాగాలని చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఎలాగోలా గెలవటం తప్ప నైతిక విలువల గురించి అసలు పట్టింపేలేని బాబు చడీచప్పుడూ లేకుండా వోటింగ్ శాతం పెరగటానికీ, ఈవీఎంలను తనకనుకూలంగా మలుచుకోవటానికీ లోపాయకారీగా ఏమైనా చేసివుంటారన్న సంశయాలు ఇందుకే వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే భూ యజమానులకు తొలిసారిగా హక్కులివ్వటానికి సంకల్పించిన భూహక్కు చట్టం వంటి అత్యుత్తమ చట్టంపై బురదచల్లి, తప్పుడు ప్రచారం నడిపి ప్రజలను భయభ్రాంతుల్ని చేయటంలో బాబు విజయం సాధించారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. సత్యం మాత్రమే జయిస్తుందన్నది కూడా వాస్తవమే. కానీ గెలిచేదంతా సత్యం కాదు. నిలకడపై అన్ని నిజాలూ వెల్లడవుతాయి. ఎన్నికల నిర్వహణ తీరు అందరిలోనూ అనుమానాలు రేకెత్తించింది. ఏపీ ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. పక్కనున్న తెలంగాణలో వివాదరహితంగా ఎన్నికలు జరగ్గా ఏపీలో బాబు, పవన్‌లు దుర్భాషలతో చెలరేగిపోయారు.
వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం చేసిందేమీ లేదు సరిగదా...టీడీపీ అడిగిన తడవే అన్నీ నెరవేర్చింది. పర్యవసానంగా తటస్థతకు తూట్లుపడ్డాయి. మొత్తానికి ఆరు వారాలపాటు పెళ్లివారి నడకను తలపిస్తూ సాగిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా పాలనను స్తంభింపజేసింది.
దక్షిణాదిన ‘కమల’ హాసం!
Published Wed, Jun 5 2024 5:26 AM | Last Updated on Wed, Jun 5 2024 5:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment