ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలి సభ
కనీసం ఓ శాలువా, ఓ పూల బొకే కూడా తీసుకురాని బాబు, పవన్
మోదీకి సన్మానమంటూ వ్యాఖ్యాత ప్రకటన
లేచి నిల్చున్న మోదీ.. దిక్కులు చూసిన టీడీపీ, జనసేన అధినేతలు
తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని ప్రధానికి బహూకరించిన పురందేశ్వరి
15 లక్షల మంది ప్రజలు వస్తారని నేతల ప్రకటన
లక్ష మంది కూడా లేక వెలవెలబోయిన సభ
వేసిందే 48 వేల కుర్చిలు.. అవీ ఖాళీనే
జనం లేకపోవడంతో బాబు కవరింగ్
టీడీపీ కార్యకర్తలతో స్టేజి ముందు హంగామా
వారి తాకిడికి పని చేయని మైకులు.. మోదీ అసహనం
లైటింగ్ టవర్లు ఎక్కినవారిని హెచ్చరించిన మోదీ
పవన్ ప్రసంగం మధ్యలో ఆపి మరీ వారిని కిందికి దించిన ప్రధాని
కూటమి తొలి సభ అట్టర్ ఫ్లాప్‌తో నైరాశ్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, నరసరావుపేట: ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన చేరిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభ ప్రధానికి అవమానంతో మొదలై, జనం రాక, మైకులు పనిచేయక చివరకు నవ్వులపాలై ఓ ఫ్లాప్ షోగా మిగిలింది. ప్రధాని మోదీ వస్తుండటంతో 15 లక్షల మందితో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని చెప్పారు. తీరా చూస్తే సభకు పట్టుమని లక్ష మంది కూడా రాలేదు. మేనిఫెస్టో కూడా లేదు. వైఎస్సార్‌సీపీ సిద్ధం సభలు పది లక్షలు, పదిహేను లక్షల జనంతో విజయవంతమై చరిత్ర సృష్టించాయి.
వాటి స్థాయిలో నిర్వహించాలన్న భావనతో టీడీపీ, జనసేన ఏర్పాట్లు చేశాయి. తీరా చూస్తే కనీసం లక్ష మంది కూడా రాలేదు. మరోపక్క జనం లేకపోవడాన్ని కవర్ చేయడానికి చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో చేయించిన హడావుడి ప్రధాని మోదీని అసహనానికి గురి చేసింది. టీడీపీ కార్యకర్తలు సౌండ్ బాక్సుల పైకి దూసుకురావడంతో చాలాసార్లు మైకులు మొరాయించాయి. కార్యకర్తలు సౌండ్ బాక్సుల టవర్లు, లైటింగ్ టవర్ల పైకి ఎక్కడంతో మోదీ తీవ్రంగా వారిని హెచ్చరించారు.
100 ఎకరాల్లో సభకు 30 ఎకరాలే
బొప్పూడి వద్ద సుమారు దాదాపు 100 ఎకరాల్లో ఈ సభకు ఏర్పాట్లు చేశారు. అందులో పార్కింగ్‌కి పోను కేవలం 40 ఎకరాలను సభ కోసం కేటాయించారు. అందులో వేదిక, హెలీప్యాడ్‌ల కోసం పది ఎకరాలు కేటాయించగా మిగిలిన 30 ఎకరాల్లో మాత్రమే కార్యకర్తల కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 2 వేల కుర్చిలు వేశారు. అవి కూడా ఒక కుర్చికి ఇంకో కుర్చికి మధ్య రెండు అడుగులు గ్యాప్ ఉండేలా వేశారు.
మొత్తం 48 వేల కుర్చిలు వేసినట్లు చెబుతున్నారు. వాటిలో 6 వేల కుర్చిలు కూడా నిండలేదు. మోదీ ప్రసంగం మొదలైన నిమిషానికే మైకు మొరాయించడంతో రెండు నిముషాలు ఆగాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఎక్కువ మంది లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. మోదీ మాట్లాడే సమయంలో మూడుసార్లు అంటే దాదాపు ఏడు నిమిషాలకు పైగా మైకులు ఆగిపోవడంతో సభా ప్రాంగణం ఖాళీ అయిపోయింది.
టీడీపీ ప్రోద్బలంతో టవర్లెక్కిన కార్యకర్తలు.. హెచ్చరించిన ప్రధాని
సభా వేదికపైకి మోదీ వచ్చిన సమయానికి కూడా జనం లేకపోవడంతో చంద్రబాబు, పవన్‌లో ఆందోళన కనిపించింది. మోదీ వేదిక మీదకు వచ్చిన తరువాత పవన్, బాబు ప్రసంగించారు. దీన్ని గమనించిన చంద్రబాబు అండ్ టీం పరువు కాపాడుకోవడానికి తమకు తెలిసిన టక్కుటమార విద్యలను ప్రదర్శించారు. ఖాళీ కుర్చిల నుంచి మోదీ దృష్టి మళ్లించేందుకు సభలో టీడీపీ కార్యకర్తలతో గందరగోళం సృష్టించి జనం భారీగా వచ్చారన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు.
ముందు ఉన్న కార్యకర్తలు స్టేజ్ వద్దకు దూసుకువస్తున్నట్టు ప్రయత్నించారు. సౌండ్ బాక్స్ టవర్లను సైతం ఎక్కి హడావుడి చేశారు. పవన్ మాట్లాడుతున్న సమయంలో చాలా మంది మైక్ టవర్స్, లైటింగ్ కోసం కట్టిన టవర్లపై ఎక్కడాన్ని మోదీ గమనించారు. పవన్‌ను ఆపి మోదీ మాట్లాడారు. ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బందులు ఎదురౌతాయని, దయచేసి దిగాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని గట్టిగా హెచ్చరించడంతో టీడీపీ కార్యకర్తలు టవర్ల పైనుంచి కిందికి దిగారు.
మొరాయించిన మైకులు..ప్రధాని అసహనం
ప్రధాని మోదీ మాట్లాడుతుండగా మైకులు పదే పదే మొరాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనం రాకపోవడాన్ని కవర్ చేయడంలో భాగంగా చంద్రబాబు తన కార్యకర్తలతో చేయిస్తున్న హడావుడిలో భాగంగా వారంతా సౌండ్ సిస్టం వద్దకు దూసుకుపోయారు. వారి తాకిడితో వైర్లు, ఇతర పరికరాలు కదిలిపోయి మైకులు మొరాయించాయి. పవన్, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఒకటి, రెండుసార్లు అంతరాయం కలిగింది. ప్ర«ధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో తొలుత మూడు నిమిషాలు మైకులు పనిచేయలేదు.
తరువాత ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా మరోసారి ఐదు నిమిషాల దాకా అంతరాయం కలిగింది. దీంతో మోదీ అసహనానికి గురయ్యారు. ‘దయ ఉంచి అక్కడ ఉన్నవారంతా వెనక్కి వెళ్తే మైక్ పనిచేస్తుంది. సభకు అంతరాయం కలిగించవద్దు. మీ ఉత్సాహం, మీ జోష్ నాకు ఇష్టమే. కానీ మీరు కొంచెం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దూరంగా ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నారు. మీరెందుకు హడావిడి చేస్తున్నారు’ అంటూ మోదీ చిరాకు పడ్డారు.
తొలి మీటింగే ఫెయిలవడంతో...
బీజేపీతో పొత్తు కుదరడంతో టీడీపీ నిర్వహించిన తొలి సభ విఫలమవడంతో టీడీపీ, జనసేన కేడర్ నైరాశ్యంలోకి వెళ్లింది. గట్టిగా ఓ మీటింగ్ నిర్వహించలేకపోతున్నాం.. ఇదేమి ఖర్మ.. అంటూ టీడీపీ కార్యకర్తలు అక్కడే వ్యాఖ్యానించారు. మరోవైపు సభలో సామాన్య ప్రజలు కనిపించలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. చిలకలూరిపేట సమీపంలో టీడీపీ నేతల మిల్లుల్లో పనిచేసే నార్త్ ఇండియా వలస కూలీలు కూడా సభలో అధిక సంఖ్యలో కనిపించారు. మహిళలు ఈ సభకు దూరంగా ఉన్నారు.
సభలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆర్‌టీసీ బస్సులతోపాటు నారాయణ, భాష్యం వంటి టీడీపీ అనుకూల విద్యా సంస్థల నుంచి వందలాది బస్సులు గ్రామాలకు పంపినా జనం లేక ఖాళీగానే వచ్చాయి. కొన్నింటిలో సగం మంది కూడా లేరు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.1,000 దాకా నగదు, మందు బాటిల్, బిర్యానీ పొట్లం ఇచ్చినా సభకు రాలేదని నేతలు చిరాకుపడ్డారు. బొçప్పూడి సభతో ప్రజల నాడి అర్థమవుతోందన్న భావన వారిలో నెలకొంది. ప్రజలు సీఎం వైఎస్ జగన్ వైపు ఉన్నారన్న విషయం ఈ సభ ద్వారా మరోసారి రుజువైందని టీడీపీ కార్యకర్తలే సభ బయట వ్యాఖ్యానించారు.
వైఫల్యాన్ని పుల్లారావుపై నెట్టేశారు
సభ వైఫల్యాన్ని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పైకి తోసే ప్రయత్నం మొదలైంది. సభ అట్టర్ ఫ్లాప్ అవడం, ప్రధానికి వేదికపై అవమానం జరగడం, మైకులు పనిచేయకపోవడానికి పుల్లారావే కారణం అంటూ ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెట్టింది. మైక్ సిస్టమ్‌కు సరైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని, అసలు ఏర్పాట్లను పుల్లారావు పట్టించుకోలేదంటూ ప్రచారం చేస్తున్నారు.
వ్యాఖ్యాతను కూడా సరైన వారిని పెట్టలేదంటూ కామెంట్లు మొదలుపెట్టారు. దీంతో పుల్లారావు మీడియా ముందుకు వచ్చి పోలీసుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. సభకు ప్రజలు రాకపోవడానికి కారణాన్ని ఎల్లో మీడియా కూడా పోలీసులపై నెట్టేసింది. ట్రాఫిక్ జామ్ అయ్యిందని, పోలీసులు సరిగా పర్యవేక్షించలేదంటూ ఎల్లో మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
సభా వేదికపై ప్రధానికి అవమానం
రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్డీఏ కూటమి సభకు హాజరైన ప్రధాన మంత్రి మోదీకి సభా వేదికపైనే అవమానం జరిగింది. దేశ ప్రధాని కోసం కనీసం ఒక పూల బొకే తీసుకురావాలన్న ఆలోచన 40 ఏళ్ల రాజకీయం అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పనిచేసన టీడీపీ అధినేత చంద్రబాబుకు, వందలాది పుస్తకాలు చదివానని చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాలేదు. ప్రధాని హెలికాప్టర్ దిగి వేదిక పైకి రాగానే వట్టి చేతులతోనే ఆహా్వనం పలికారు.
ఆయన కూర్చున్న తర్వాత ప్రధాని మంత్రి మోదీని చంద్రబాబునాయుడు సన్మానిస్తారని, పవన్ పూల బొకే ఇస్తారని వ్యాఖ్యాత చెప్పారు. దీంతో మోదీ సహా అందరూ లేచి నిల్చున్నారు. అయితే, అక్కడ శాలువా లేదు, పూల బొకే లేదు. దీంతో చంద్రబాబు, పవన్ దిక్కులు చూస్తూ నిల్చున్నారు. శాలువా కోసం అటూఇటూ చూశారు. విషయం గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాను సభ పూర్తి అయిన తర్వాత మోదీని సన్మానించేందుకు తీసుకువచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చంద్రబాబుకు మోదీ క్లాస్!
ఏ సభలో అయినా ఉత్సాహంగా ప్రసంగించే ప్రధాని మోదీ ఈ సభలో జనం లేకపోవడం, పదే పదే మైకులు మొరాయించడంతో కొంత కోపంగా ప్రసంగించారని బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని సభా వేదికపై ఉన్నంతసేపూ కోపంగానే ఉన్నారు. చంద్రబాబు, పవన్‌తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. మీటింగ్ జరిగిన తీరుపై ప్రధాని మోదీ చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకినట్టు సమాచారం. సభ జరుగుతున్నంత సేపు చంద్రబాబు, పవన్‌ల మొహాల్లోనూ ఏమాత్రం ఆనందం లేదు.
అన్నమో ‘నారాయణా’
♦ ప్రజాగళం సభకు నుంచి జనాన్ని పంపిన మాజీ మంత్రి నారాయణ
♦ ఒంగోలు వద్ద భోజనం పెడతామని పంపారు.. సాయంత్రం 4 దాటినా భోజనాలు అందని వైనం
♦ ఆకలితో అలమటించిన మహిళలు
♦ సభకు వెళ్లకుండానే వెనక్కి వెళ్లిన బస్సులు
మద్దిపాడు: చిలకలూరిపేట సమీపంలో ఆదివారం జరిగిన ప్రజాగళం సభకు బయల్దేరిన జనం ఆకలితో అలమటించి, మధ్యలోనే ఆగిపోయారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలను తరలించారు.
నెల్లూరు, చుటుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రజలను ఈ సభకు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నారాయణ విద్యా సంస్థల బస్సులను తెప్పించి, మధ్యాహ్నం 12 గంటలకే వాటిలో కార్యకర్తలు, మహిళలను తరలించారు. వారికి మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెం వద్ద భోజనాలు అందిస్తారని చెప్పారు. వారు అక్కడికి మధ్యాహ్నం వేళ చేరారు. అక్కడ నారాయణ పంపిన బస్సుల్లోని వారికి భోజనాలు అందలేదు.
సాయంత్రం 4 దాటినా భోజనం పెట్టలేదు. బస్సుల్లో ఉన్న మహిళలు ఆకలికి తట్టుకోలేకపోవడంతో వారితో వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలు గుండ్లాపల్లి సమీపంలో బస్సులు నిలిపి స్థానికంగా ఉన్న ధాబాల వద్ద వారికి భోజనం పెట్టించి వెనక్కి తీసుకువెళ్లారు. మీటింగ్‌కు వెళ్లరా.. అని ద్వితీయ శ్రేణి నాయకులను అడగ్గా.. మీటింగ్ సంగతి ఎత్తితే మహిళలు కొట్టేలా ఉన్నారని, తెలిపారు. మీటింగ్‌కు వెళ్లడానికి డబ్బులు ఇచ్చారా... అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment