హరిత హబ్‌గా విశాఖ: ప్రధాని మోదీ | PM Narendra Modi Speech At AU public meeting | Sakshi
Sakshi News home page

హరిత హబ్‌గా విశాఖ: ప్రధాని మోదీ

Published Thu, Jan 9 2025 5:28 AM | Last Updated on Thu, Jan 9 2025 5:28 AM

PM Narendra Modi Speech At AU public meeting

ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌

ఏయూ బహిరంగ సభలో ప్రధాని మోదీ

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రంగా వైజాగ్‌

దేశంలో నెలకొల్పే రెండు ప్లాంట్లల్లో ఒకటి ఇక్కడే

2023లోనే గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ప్రారంభించాం

దేశంలోని మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కుల్లో ఒకటి ఏపీలోనే

రైల్వే జోన్‌ కల నెరవేరుతోంది

రూ.2 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి రోడ్‌ షో

ప్రధాని స్కూల్, తన స్కూల్‌ ఒక్కటేనన్న చంద్రబాబు  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిలో విశాఖ ప్రపంచంలోనే కీలక ప్రాంతంగా మారనుంది. ఇక దేశంలో నెలకొల్పుతున్న మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు కానుంది. తద్వారా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఈ రోజు రూ.2 లక్షల కోట్లకుపైగా విలువైన పెట్టుబడులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. రైల్వే జోన్‌ ఏర్పాటు కల కూడా నెరవేరుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నా అభి­మానాన్ని చూపించే అవకాశం వచ్చింది..’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ­న్నారు. విశాఖలోని ఏయూలో బుధవారం జరిగిన ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. అంతకుముందు సిరిపురం జంక్షన్‌ నుంచి ఏయూ గ్రౌండ్స్‌ వరకూ ఓపెన్‌ టాప్‌ వాహనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలసి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌ షో నిర్వహించారు. 

‘‘ఆంధ్రా ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. సింహాచలం లక్ష్మీ నృసింహ స్వామికి నమస్సులు తెలియజేసుకుంటున్నా..’’ అని తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని ప్రారంభించారు. 

మీ ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడోసారి కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైందని... దేశంతోపాటు ఏపీ కూడా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల లక్ష్యాలను సాకారం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్‌.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం’ అని పేర్కొన్నారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే...

2.5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ...
2047 నాటికల్లా ఆంధ్రప్రదేశ్‌ 2.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని చేరుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. సరికొత్త టెక్నాలజీకి రాష్ట్రం కేంద్రంగా మారుతోంది. అందులో ఒకటి గ్రీన్‌ హైడ్రోజన్‌. దేశంలో 2023లోనే నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టాం. 

2030 నాటికి 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీని కోసం ప్రారంభ దశలో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తుండగా అందులో ఒకటి విశాఖలో ఏర్పాటవుతోంది. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ రానుంది. దేశంలో నెలకొల్పే మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కులలో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు కానుండటం శుభ పరిణామం. ఈ పార్కులో ఉత్పత్తి, పరిశోధనల కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. 

తద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడంతోపాటు ఫార్మా కంపెనీలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. పట్టణీకరణ కలలను సాకారం చేసేందుకు క్రిస్‌ సిటీకి శంకుస్థాపన చేశాం. చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఈ స్మార్ట్‌ సిటీ భాగం కానుంది. దీనివల్ల ఏపీకి రూ.వేల కోట్ల పెట్టుబడులతో పాటు పారిశ్రామిక, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. శ్రీసిటీలో తయారీ రంగం అద్భుతంగా సాగుతోంది. పారిశ్రామిక, తయారీ రంగాలలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవాలి.

ఇప్పటికీ విశాఖకు అంతే ప్రాధాన్యం..
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశాం. ఏపీ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరబోతోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు విస్తరించనున్నాయి. పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థలో కూడా కొత్త అవకాశాలు దక్కుతాయి. 

రూ.వేల కోట్లతో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఏపీలో 70కిపైగా రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేయడంతో పాటు ఏడు వందే భారత్, అమృత్‌ భారత్‌ రైళ్లను నడిపిస్తున్నాం. విశాఖతో పాటు ఏపీలోని తీర ప్రాంతాలు వందల ఏళ్లుగా భారతీయ వాణిజ్యానికి గేట్‌ వేగా ఉన్నాయి. ఇప్పటికీ విశాఖకు అంతే ప్రాధాన్యం ఉంది. 

సముద్రతీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ని ఆధునికీకరిస్తున్నాం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే ఎన్‌డీఏ ప్రభుత్వ లక్ష్యం. సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు  రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేయనున్నాయి.

మనిద్దరి స్కూల్‌ ఒకటే సార్‌..!: సీఎం చంద్రబాబు
ప్రధాని చేతుల మీదుగా రూ.2,08,545 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఏపీ చరిత్రలో తొలిసారి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి మోదీ. దేశం కాదు.. ప్రపంచమే మెచ్చిన ప్రధాని మోదీ. భవిష్యత్తులో కూడా ప్రధాని మోదీ, పవన్‌ కళ్యాణ్, నేను... ఈ కాంబినేషన్‌ ఉంటుంది. మోదీ ప్రధానిగా దేశ రాజకీయాల్లో కొనసాగుతారు. రేపు ఢిల్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించేది ఎన్‌డీఏనే. 

సూపర్‌ సిక్స్‌ అమలు చేసే బాధ్యత మాదే. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని అయితే విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని. అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన ఘనత మోదీదే. మోదీని నిరంతరం స్ఫూర్తిగా తీసుకుంటూ ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. మీరు శంకుస్థాపన చేసిన అమరావతిని మీ ఆశీస్సులతో నిర్మించి.. మీ చేతుల మీదుగా ప్రారంభించే రోజు దగ్గర్లోనే ఉంది. 

పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేసేందుకు మీ సాయం కావాలి. మీ నాయకత్వంలోనే బీపీసీఎల్‌ రిఫైనరీ ప్రాజెక్టు కూడా రాబోతోంది. మీ స్కూల్, నా స్కూల్‌ ఒకటే సార్‌..! ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. ఇంతకంటే విశాఖకు ఏం కావాలి? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంసక పాలకులతో లక్ష్యాల్ని చేరుకోలేం. 

పటిష్ట భారత్‌ కోసం ప్రధాని కృషి: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌
స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్భర భారత్, పటిష్ట భారత్‌ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ని తీర్చిదిద్దిన ఘనత మోదీదే. భారీ పెట్టుబడులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో ఏకంగా 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏపీని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. (రూ. 2 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్నారనేందుకు బదులుగా రూ.2 లక్షల పెట్టుబడులంటూ పవన్‌ రెండు సార్లు పలికారు)

పీపుల్స్‌ మ్యాన్‌: నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి
నరేంద్ర మోదీ ప్రధాని అర్థం మార్చారు. పీపుల్స్‌ మ్యాన్‌గా మోదీ మార్చారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12,157 కోట్ల కేంద్ర సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అయ్యాయి. మోదీ కారణంగా ఈరోజు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది. పీఏం అనే పదానికి అర్థం మార్చేసి పీపుల్స్‌ మ్యాన్‌గా మోదీ మారారు. 

ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు..
– పూడిమడకలో రూ.1,85,000 కోట్లతో ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ 
– రూ.149 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ హెడ్‌క్వార్టర్స్‌ నిర్మాణం
– రూ.1,876 కోట్లతో నక్కపల్లిలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌
– రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ ఏరియాలో క్రిస్‌ సిటీ నిర్మాణం
– 465 కి.మీ. పొడవైన రైల్వే లైన్స్‌ డబ్లింగ్‌ పనులకు సంబంధించి 3 ప్రాజెక్టులు
– 48 కిలోమీటర్లకు సంబంధించి 3 ప్రాజెక్టుల రైల్వే లైన్ల నిర్మాణం
– డబుల్‌ లైన్, 4 లైన్ల నిర్మాణానికి సంబంధించి 294 కి.మీ. మేర 7 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ ప్రాజెక్టులు
– 28 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ బైపాస్‌ ప్రాజెక్టుల నిర్మాణ పనులు

సభలో ఆద్యంతం ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీలు ప్లాంట్‌ గురించే ప్రస్తావించిన సీఎం చంద్రబాబు విశాఖ స్టీలు ప్లాంటుపై కనీసం మాట మాట్లాడలేదు. ఆ పెట్టుబడులు వస్తే చాలనే అర్థంతో విశాఖ ప్రజలకు ఇంకేం కావాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

⇒ విశాఖలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లలో కేంద్ర మంత్రితో పాటు ఇన్‌చార్జీ మంత్రి, స్థానిక మంత్రులు, ఎంపీలకు స్థానం లభించలేదు. రోడ్‌ షోలో పాల్గొనేందుకు లోకేష్‌ ఉత్సాహం చూపినప్పటికీ అనుమతి లభించలేదని తెలుస్తోంది.

⇒ చంద్రబాబు తన ప్రసంగంలో 2 వేల ఎనిమిది వందల 545 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు 
జరుగుతున్నాయంటూ తడబడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement