
జనతంత్రం
‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.
కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు.
అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.
పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర.
ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.
ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.
ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.
కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.
ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.
‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది.
అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్ బ్యాంక్ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్‌డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.
జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!
ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్ పరివార్‌లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్ కుమార్ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్ తెలుగు డాట్ ఇన్’ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.
సంఘ్ పరివార్ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు.
అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్ టెర్రర్‌ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది.
జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం.
ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment