అడెజోక్ లసిసి
మనం పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నైజిరియాకు చెందిన అడెజోక్ లసిసి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చిన్నప్పటినుంచి లసిసికి చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించే అలవాటు. తరచూ ప్లాస్టిక్, గుడ్డ ముక్కల వ్యర్థాలను రోడ్లపక్కన పడేయడం, దాని ఫలితంగా డ్రైనేజీలు పూడిపోయి నీళ్లుపోవడానికి వీలు లేక ఎక్కడికక్కడ మురుగు నీరంతా నిలిచిపోవడం... అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకునేది. క్రమేణా వయసుతోపాటు ఆలోచనలు కూడా పెరిగి పెద్దయ్యాయి. దాని ఫలితమే డిగ్రీ పూర్తయ్యాక ఏకంగా రీసైక్లింగ్ కంపెనీ పెట్టి ప్లాస్టిక్‌తో ఫ్యాషనబుల్ ఉత్పత్తుల డిజైనింగ్!
ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తూ పెరిగిన లసిసికి ఎలాగైనా దానికి పరిష్కారం కనుగొనాలన్న కుతూహలం పెరిగింది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క ఆలోచిస్తుండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటికి వచ్చింది. అప్పటికీ ఇంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. కాలుష్య సమస్య మరింత ఎక్కువైంది. ఇలా అనుకుంటుండగానే వాటర్ ప్యాకెట్ల వ్యర్థాలు టన్నులకొద్ది పేరుకు పోవడం గమనించింది. వీటితో ఏం చేయాలి అనుకున్న సమయంలో లసిసి తల్లి దగ్గర నేత పని నైపుణ్యాలు నేర్చుకుని వాటర్ ప్యాకెట్లతో వస్త్రాన్ని రూపొందించింది. దీంతో ఏదైనా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది.
రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్
నైజీరియాలో వాటర్ ప్యాకెట్స్ తయారీలో నైలాన్ ను వాడుతారు. ఈ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేయడం కంటే కొత్తగా తయారు చేయడానికి ఖర్చు తక్కువ. అందువల్ల పారిశ్రామిక వర్గాలు కొత్త వాటర్ ప్యాకెట్స్‌ను తయారు చేస్తాయి. అవి టన్నుల కొద్దీ చెత్తలో పేరుకు పోతుంటాయి. వీటిని రీసైకిల్ చేయడమే లక్ష్యంగా ‘ప్లానెట్ 3ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కంపెనీని ప్రారంభించింది లసిసి. ప్లానెట్ 3 ఆర్ వాడిపడేసిన వాటర్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌బిన్ లను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల వారంతా దానిలో ప్లాస్టిక్‌ను పడేయడం వల్ల సేకరణ సులభం అయింది.
ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను శుభ్రం చేసి ఎండబెట్టి, తరవాత దారాలుగా కత్తిరించి మగ్గం మీద వస్త్రంగా నేస్తుంది. దీని తయారీలో తొంబై శాతం ప్లాస్టిక్, పదిశాతం గుడ్డముక్కలను వినియోగిస్తుంది. ఇలా తయారైన బట్టతో చెప్పులు, బూట్లు, స్కూలు బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డ్రెస్‌లుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక మహిళలు, పిల్లలకు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కూడా కల్పిస్తుంది. కొన్ని వందలమంది వికలాంగ యువతీ యువకులకు రీసైక్లింగ్‌పై శిక్షణ ఇచ్చింది. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తోంది. లసిసి చేస్తోన్న పర్యావరణ కృషికి గాను ఆమెను అనేక అవార్డులు కూడా వరించాయి.
రోజుకి అరవై మిలియన్ల వాటర్ ప్యాకెట్లు!
‘‘నైజిరియాలో రోజుకి యాభై నుంచి అరవై మిలియన్ల నీటిప్యాకెట్లు అవసరమవుతాయి. అరలీటరు వాటర్ ప్యాకెట్లను వీధుల్లోని షాపులు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పటికీ కూడా 39 శాతం మందికి సరైన మంచి నీటి సదుపాయం లేదు. అందువల్ల వాటర్ ప్యాకెట్లపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. వాటర్ ప్యాకెట్లు దాహం తీరుస్తున్నప్పటికీ వాడి పడేసిన తరువాత అవి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఒక్క వాటర్ విభాగం నుంచి వస్తోంది. దీన్ని తన చిన్నతనం నుంచి నిశితంగా గమనించిన లసిసి కాలుష్యానికి పరిష్కారం వెతుకుతూ ప్లానెట్ 3 ఆర్ ను నెలకొల్పింది.
Comments
Please login to add a commentAdd a comment