
పేపర్ ప్లేట్లు ప్రత్యక్షం కనిపించని మోదుగాకు విస్తర్లు
అన్ని శుభాకార్యాల్లో పేపర్ ప్లేట్లు పల్లె ప్రజలకు ‘ఉపాధి’ దూరం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానంలోనూ పలు మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యాలలో మోదుగాకు విస్తర్లు విరివిగా కనిపించేవి. నేడు వాటి స్థానంలో ప్లాస్టిక్‌ప్లేట్లు వచ్చేశాయి. స్టీల్‌గ్లాసుల స్థానంలో ప్లాస్టిక్‌గ్లాసులు దర్శనమిస్తున్నాయి. మోదుగాకు విస్తర్లలో భోజనం ఆరోగ్యంతోపాటు సంతృప్తిని ఇస్తే.. ప్లాస్టిక్‌ప్లేట్లలో భోజనం అనారోగ్యాన్ని కట్టబెడుతుంది. అయినా జనం ప్లాస్టిక్ మాయలోనే ఉన్నారు. మార్కెట్‌లోకి ప్లాస్టిక్ ప్లేట్ల రాకతో మోదుగాకు విస్తర్లకు గిరాకీ పడిపోయింది. ఫలితంగా ఏటా వేసవిలో మోదుగాకు విస్తర్లు తయారు చేసే పల్లెప్రజలు నేడు ఆ పనికి దూరమయ్యారు.
పల్లెల్లో వేసవి ఉపాధి
ఏటా వేసవి మొదలుకాగానే పల్లె ప్రజలు మోదుగాకులు తెంపే పనిలో నిమగ్నమయ్యే వారు. గతంలో ఇళ్లల్లో జరిగే ఎలాంటి కార్యక్రమంలోనైనా మోదుగాకు విస్తార్లు(ఆకుపల్లెం) వినియోగించేవారు. మోదుగాకు విస్తర్లు కుట్టే వారు. వ్యవసాయ పనులు లేని ఎండాకాలంలో వీటిని విక్రయించి ఆర్థికంగా నిలదొక్కుకునే వారు.
ఒక కట్టలో వంద ఆకులు ఉండేవి. ఒక కట్టను రూ.30చొప్పున విక్రయించేవారు. ఇలా వేసవిలో ఒక్కొక్కరు కనీసం రూ.5వేల నుంచి రూ.10వేలు సంపాదించేవారు. ఇలా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలకు ఎండాకాలంలో ఉపాధి లభించేది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లోని గ్రామాల్లో ఎక్కువగా విస్తరాకులు తయారు చేసేవారు కనిపించేవారు. వేసవి వచ్చిందంటే ఇంటిల్లిపాది మోదుగాకులు తెంపేందుకు ఒక బృందంగా వెళ్లేవారు. ఆకులు తెంపి, ఇంటికి తెచ్చి ఎండబెట్టి.. మళ్లీ వాటిపై నీళ్లు చల్లుతూ ఒక్కో ఆకును పేరుస్తూ సన్నటి వేపపుల్లలతో ఇస్తరాకులు కుట్టేవారు. ఇలా ఈ పని కుటుంబసభ్యులు అందరూ కలిసే చేసేవారు. ఈ పనిచేసి ఆర్థికంగా నిలదొక్కు కోవడంతోపాటు కుటుంబంలో ఐకమత్యం పెంపొందేది. ఫలితంగా ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలో ఎక్కువగా కనిపించేవి.
రంగులతో అనారోగ్యాలు
ప్లాస్టిక్‌ప్లేట్లు రంగురంగుల్లో ఆకర్షిస్తున్నాయి. ఆ రంగుల్లో వివిధ రకాలుగా హానిచేసే కెమికల్స్, మైనపు పూతలు వాడుతున్నారు. ఇవి క్రమంగా క్యాన్సర్ వంటి రోగాలకు కారణ మవుతాయి. అయినా ప్రజలు రంగురంగుల ప్లాస్టిక్‌ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులపైనే ఆసక్తి చూపుతున్నారు. మోదుకు విస్తర్లు కనుమరుగు కావడంతో ప్రతి పల్లెలో చిన్నదాని నుంచి పెద్ద పెద్ద శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్లు వినియోగిస్తున్నారు. ధర ఎక్కువ ఉన్నా రంగురంగుల ప్లేట్ల వాడకం తప్పడం లేదు. మోదుగాకు విస్తర్లను ఇప్పుడు కేవలం దైవకార్యక్రమాల్లోనే వినియోగిస్తుండడం గమనించాల్సిన విషయం.
వ్యాధులు వచ్చే ప్రమాదం
ఒకప్పుడు అందరం విస్తరాకులు వాడేవాళ్లం. ఇప్పుడు ఏ వేడుకలోనైనా ప్లాస్టిక్‌ప్లేట్లు వినియోగిస్తున్నారు. వీటితో అనారోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంతలో ప్లాస్టిక్‌ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులకు దూరంగా ఉండడం మంచిది. ప్లాస్టిక్‌తో ఉన్న అనర్థాలను గుర్తించి ఇప్పటికైనా స్టీల్‌ప్లేట్లను వాడుతూ..అనారోగ్యాలకు దూరంగా ఉండాలి.
– సత్యనారాయణస్వామి, ఎల్లారెడ్డిపేట
వేసవిలో చేతినిండా పని..
ఎండాకాలం వచ్చిందంటే చేతి నిండా పని ఉండేది. ఇంటిల్లిపాదిమి అడవికి పోయి మోదుగాకులు తెంపుకొచ్చేవాళ్లం. మ ళ్లీ ఇంటి వద్ద అందరం కలిసి వి స్తరాకులు కుట్టేవాళ్లం. ఎవరైనా పండుగ చేసుకుంటే మా దగ్గరికే వచ్చి కొనుక్కొని పోయేటోళ్లు. కానీ ఇప్పుడందరూ ప్లాస్టిక్‌ప్లేట్లే కొంటున్నారు. విస్తరాకుల కోసం ఎవరూ రావడం లేదు. ఇంటి వరకే విస్తర్లను తయారు చేసుకుంటున్నాము. – మోతె భారతమ్మ, నారాయణపూర్
ఒకప్పుడు ఉపాధి ఉండేది
గతంలో మారుమూల తండాల్లో నివసించే గిరిజనులం మోదుకు విస్తర్లు తయారు చేసి అమ్ముకొని వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే వాళ్లం. మార్కెట్లోకి ప్లాస్టిక్‌ప్లేట్లు రావడంతో ఉపాధి కోల్పోయాం. మాతరం వారంతా ఇప్పటికీ మోదుకు విస్తర్లనే కుట్టుకుంటున్నాం. ఇంట్లో జరిగే శుభకార్యాలకు మోదుగు విస్తర్లనే వాడుతున్నాం. బయట మాత్రం మోదుగు విస్తర్లు కనిపించడం లేదు. – భూక్య పీక్లీ, గుంటపల్లిచెరువు తండా