
వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని (Ettaboyina Sai Shivani) యూపీఎస్‌సీ (UPSC) సివిల్స్‌లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్‌పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...
‘నాన్న రాజు మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా.
ఇదీ చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్

ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువు కునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ్ర΄ోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్‌లో ర్యాంక్ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు.
చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
కఠోర సాధన చేసింది
తమ కుమార్తె సాయి శివాని కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలతోపాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్ అనే వ్యక్తి నిర్వహించే అండర్ స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు.
– వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్