
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ!
ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.
ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.
దత్తత తీసుకుంటారు...
ఒక్కో మహిళా కానిస్టేబుల్‌కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.
సైబర్‌క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్‌టచ్–బ్యాడ్‌టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
ఆ బాధ నుంచే...
ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్‌ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు.
ప్రతి సీనియర్ ఒక జూనియర్‌ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్‌లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.
పెట్రోలింగ్ బాధ్యతలు...
తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్‌లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.
అందుకే... పోలీస్ అక్క
ఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.
– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్
– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment