Janaki Sharmila
-
వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు?
సాక్షి, వికారాబాద్: అవినీతి ఆరోపణలు.. కిందిస్థాయి సిబ్బందిని వేధించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్పీ నారాయణపై పోలీసు ఉన్నతాధికారులు బదిలీవేటు వేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎస్పీగా జానకీ షర్మిలను నియమించినట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. జానకీ షర్మిల ప్రస్తుతం మహిళా రక్షణ, సైబర్ సెక్యూరిటీ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఎస్పీ నారాయణను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేయడంపై జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ధారూరు సీఐ మురళి కుమార్‌ను సప్పెన్షన్ చేయడంతోపాటు, ఓ ఠాణాకు చెందిన ఏఎస్ఐ.. ఎస్పీ తీరుపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో డీఐజీ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా ఈ విషయంపై డీజీపీ కార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు వారం రోజులుగా తాండూరు, వికారాబాద్‌లో గోప్యంగా విచారణ జరిపినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం.. పూర్తి నివేదికను డీజీపీ కార్యాలయానికి అందజేయడంతో వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా యాలాలలో ఇసుక దందాను ఉన్నతాధికారి ప్రోత్సహించారనే ఆరోపణలతో పాటు, పలు సివిల్ పంచాయతీల్లో తలదూర్చి పెద్దఎత్తున లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంక్ నుంచి నెలకు 25 లీటర్ల చొప్పున డీజిల్ తీసుకొని, సదరు ఇందనానికి సంబంధించిన బిల్లులను సర్కారు నుంచి సుమారు రూ. 75లక్షలు కాజేశారనే విమర్శలు వచ్చాయి. -
ఏఎస్పీ జానకీ షర్మిలకు డాక్టరేట్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర నిఘా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అదనపు ఎస్పీ జానకీ షర్మిల డాక్టరేట్ పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో ‘ఉద్యోగులు అంకిత భావంతో పని చేసే విధానం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేశారు. హెచ్‌సీయూలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో వీసీ అప్పారావు చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ప్రతిష్టాత్మక వర్శిటీ నుంచి డాక్టరేట్ పొందిన జానకీ షర్మిలను ప్రత్యేకంగా అభినందించిన డీజీపీ అనురాగ్ శర్మ విధులు నిర్వర్తిస్తూనే ఈ ఘనతను సాధించడం పలువురికి ఆదర్శప్రాయమన్నారు. అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీ కుమార్, నిఘా చీఫ్ నవీన్‌చంద్ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల నిఘా విభాగానికి బదిలీ కావడానికి ముందు ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నేర విభాగానికి నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. అనేక కీలక, సంచలనాత్మకమైన కేసుల దర్యాప్తులో తనదైన పాత్రను పోషించారు. -
పోలీస్ రికార్డ్
సాక్షి, సిటీబ్యూరో: చైన్ స్నాచింగ్‌లతో నగరవాసులు, పోలీసుల కంటిమీద కునుకు లేకుండా చేసింది శివ గ్యాంగ్. నిర్మానుష ప్రాంతాల్లోని రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే వీరి టార్గెట్. బైకుల్లో వేగంగా వచ్చి మహిళల మెడల్లోని పుస్తెలతాడుసహా ఇతర బంగారు ఆభరణాలను లాక్కొని క్షణాల్లో మాయమయ్యేవారు. ఇలా జంట కమిషనరేట్ల పరిధిలో 700 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆగస్టు 14న అర్ధరాత్రి గ్యాంగ్ లీడర్ శివ పోలీసు కాల్పుల్లో మృతి చెందడం.. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. శివ స్నాచింగ్ గ్యాంగ్ నుంచి సైబరాబాద్ సీసీఎస్ పోలీ సులు భారీగా సొత్తు రికవరీ చేశారు. రికవరీ చేసుకున్న మంగళసూత్రాలను మహిళలకు అందజేసి రికార్డ్ సృష్టించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కడవలూరి శివ (35) తన గ్రామానికి చెందిన నారాయణ తో కలిసి 2002 నుంచి నేర జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని సోదరుడు మందపాటి జగదీష్ (34), వైజాగ్‌కు చెందిన రాజ్‌కుమార్‌లతో కలిసి నేర సామ్రాజ్మాన్ని విస్తరించాడు.2005లో కృష్ణానగర్‌కు చెందిన నాగమణిని శివ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తిరుపతి, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, కుషాయిగూడ, మల్కాజ్‌గిరిలో స్నాచింగ్‌లకు పాల్పడి జైలు కెళ్లాడు. 2012లో జైలు నుంచి విడుదలైన శివ తన భార్య, గ్యాంగ్ సభ్యులు నార్సింగ్‌లో మకాం ఉంటూ జంట పోలీసు కమిషనరేట్లలో 700 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ గ్యాంగ్ కోసం క్రైమ్స్ అదనపు డీసీపీ జానకీషర్మిల ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా.. ఆగస్టు 14న అర్ధరాత్రి శివ తన బైక్‌పై శంషాబాద్ పరిసరాల్లో సంచరిస్తున్నాడనే సమాచారం రాగానే సీసీఎస్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి, ఎస్ఐ వెంకటేష్ ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే.. పోలీసులపై కత్తితో దాడి చేసి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో శివ మృతి చెందాడు. అతని ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో ఆ గ్యాంగ్ నేరాల చిట్టా బహిర్గతమైంది. స్నాచింగ్‌కు పాల్పడిన బంగారు గొలుసులను ముత్తూట్, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టిన రసీదులు పెద్ద సంఖ్యలో లభించాయి. ఆ తరవాత రెండు రోజులకే అతని భార్య నాగమణి, జగదీష్, రాజ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. రికవరీకి రెండు నెలల ప్రయాస... జైలులో ఉన్న నాగమణి, జగదీష్, రాజ్‌కుమార్‌లను కోర్టు ఆదేశాల మేరకు నాలుగైదుసార్లు పోలీసులు విచారణ చేశారు. తాకట్టు పెట్టిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ (కర్మన్‌ఘాట్, చంపాపేట బ్రాంచ్)ల నుంచి బంగారు నగలు రికవరీ చేసుకునేందుకు పోలీసులు రెండు నెలలు కష్టపడాల్సి వచ్చింది. ఈ రెండు కంపెనీల నుంచి రూ. 3.75 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ నగలు తాకట్టు పెట్టుకోవడంతో రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉల్లఘించడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు అనీష్‌కుమార్ (30), నాగుల మీరన్ (29)లను అరెస్టు చేశారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలకు విజిలెన్స్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న రిటైర్ట్ అదనపు ఎస్పీ అష్వాక్ ఆలం ఖాన్, రిటైర్ట్ ఏసీపీ శ్యాంసుందర్‌లను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. వీరు పరారీలో ఉన్నారు. లెసైన్స్ రద్దు కోసం ఆర్బీఐకి సిఫార్స్... నిబంధనలను ఉల్లంఘించి చోరీ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని, మనీలాండరింగ్‌కు పాల్పడిన ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల లెసైన్స్ రద్దు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులకు సైబరాబాద్ పోలీసులు సిఫారసు చేశారు. ఇలాంటి కంపెనీల సహకారంతోనే స్నాచర్లు, దొంగలు రెచ్చిపోతున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. చోరీ బంగారం ఎవరు తాకట్టు పెట్టుకున్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్, క్రైమ్స్ ఇన్చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, అదనపు డీసీపీ క్రైమ్స్-2 కె.ముత్తయ్య, సీసీఎస్ ఏసీపీలు బి.రాములునాయక్, కె.రాంకుమార్, ఇన్స్పెక్టర్లు పి.శ్రీశైలం, ఎన్.సి.హెచ్.రంగస్వామి, పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్.లింగయ్య, పి.కసిరెడ్డి, వి.శ్రీకాంత్‌గౌడ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అశ్లీల వెబ్సైట్లకు కళ్లెం!
ఇంటర్నెట్ లో అశ్లీల వెబ్సైట్లకు కళ్లెం వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా బూతు వైబ్‌సైట్ లను బంద్ చేయాలని సర్కారు యోచిస్తోంది. దాదాపు 1,350 అశ్లీల వెబ్సైట్లను మూసివేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని తెలంగాణ పోలీసు వ్యవస్థలోని ఐటీ విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. పెద్దలు మాత్రమే వీక్షించే చిత్రాలు ఇకపై తెలంగాణ ఇంటర్నెట్ వినియోగదారులు అందుబాటులో ఉండవన్నారు. బూతు బొమ్మల వెబ్సైట్లను చెక్ పెట్టేందుకు చైనా ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే యోచనలో అధికారులున్నారు. పోర్నోగ్రఫీ చూడాలనే వారు తరచుగా కొన్ని రకాల పదాలను ఉపయోగించి సెర్చ్ ఇంజిన్స్ లో వెతుకుతుంటారు. ఇలాంటి వెబ్సైట్లకు చెక్ పెడితే పోర్నోగ్రఫీ కంటెంట్ లభించదు. అయితే దీనికి కేంద్ర సమాచార-ప్రసారశాఖ, హోంమంత్రిత్వ శాఖ ఆమోదం లభించాల్సివుంది. కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే విధానపరమైన నిర్ణయమని, కేంద్ర నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. మహిళలపై భద్రతపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సూచన ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళుతోంది. లండన్ లాంటి నగరాల్లో అశ్లీల వెబ్సైట్లపై నిషేధం విధించిన విషయాన్ని కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫీ కంటెంట్ పెరిగిపోవడం పట్ల రాజకీయ పార్టీలు, బుద్ధిజీవులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల వెబ్సైట్లను బంద్ చేయాలన్న ప్రతిపాదనను వారు స్వాగతిస్తున్నారు. అయితే పోర్నోగ్రఫీ వెబ్సైట్లను మూసివేయడంతోనే సరిపెట్టకుండా, ఆన్లైన్ వేధింపులపై కూడా దృష్టి పెట్టాలని మహిళలు కోరుతున్నారు. -
ఆపరేషన్ ‘ఔటర్’
జవహర్‌నగర్, గబ్బిలాలపేట, నందమూరినగర్‌లో ఇంటింటి తనిఖీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోదాలు అదుపులో 10 మంది అనుమానితులు, 40 వాహనాల స్వాధీనం జవహర్‌నగర్: నగర శివారులపై సైబరాబాద్ పోలీసులు డేగకన్ను వేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక క్రైం అదనపు డీసీపీ జి.జానకీషర్మిల ఆధ్వర్యంలో మల్కాజిగిరి డీసీపీ కోటేశ్వర్రావ్, ఏసీపీలు ప్రకాశ్‌రావ్, రామ్‌కుమార్‌లతో పాటు 30 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 240 మంది కానిస్టేబుళ్లు జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట, నందమూరినగర్ కాలనీలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సోదాలు చేస్తున్నంత సేపు బస్తీలలోకి, బయటకు ఎవరిని అనుమతించకుండా రెక్కీ నిర్వహించారు. బస్తీలలోని ప్రతీ ఇల్లు ముఖ్యంగా అనుమానం ఉన్న నేరగాళ్ల నివాసాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌ను నేరరహితంగా తీర్చిదిద్దాలని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు నగర శివారుల్లో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి నగరంలో దోపిడీ,దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్లు శివార్లలో తలదాచుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. కొందరికి భయం... మరికొందరి హర్షం ఆకస్మికంగా పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించడంతో కొందరు బయాందోళనలు చెందగా, మరి కొందరు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా మహిళలు బయటికి వచ్చి సెర్చ్ ఆపరేషన్ కోసం వచ్చిన అదనపు డీసీపీ జానకీషర్మిలతో తమ కష్టాలను స్వయంగా చెప్పుకున్నారు. కాలనీలలో బెల్టు షాపులు ఉండడం వల్ల వీధుల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జవహర్‌నగర్ ఎస్ఐ రాములును పిలిపించి పేదల కాలనీలలో మరింత రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొనసాగిన సోదాల్లో మొత్తం 1000 ఇళ్లను పైగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక పాత నేరస్తుడు ,10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 32 బైక్‌లు,6 ఆటోలు,2 కార్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. నేరగాళ్ల ఏరివేతే లక్ష్యం : జి.జానకీషర్మిల అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరగాళ్ల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తామని క్రైం అదనపు డీసీపీ జానకీషర్మిల పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతాల్లోని నేరస్తులపై డేగకన్ను పెట్టామన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చినా 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో పోలీసులు చేరుకుంటారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.