ఏఎస్పీ జానకీ షర్మిలకు డాక్టరేట్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర నిఘా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అదనపు ఎస్పీ జానకీ షర్మిల డాక్టరేట్ పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో ‘ఉద్యోగులు అంకిత భావంతో పని చేసే విధానం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేశారు. హెచ్‌సీయూలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో వీసీ అప్పారావు చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు.
ప్రతిష్టాత్మక వర్శిటీ నుంచి డాక్టరేట్ పొందిన జానకీ షర్మిలను ప్రత్యేకంగా అభినందించిన డీజీపీ అనురాగ్ శర్మ విధులు నిర్వర్తిస్తూనే ఈ ఘనతను సాధించడం పలువురికి ఆదర్శప్రాయమన్నారు. అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీ కుమార్, నిఘా చీఫ్ నవీన్‌చంద్ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
షర్మిల నిఘా విభాగానికి బదిలీ కావడానికి ముందు ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నేర విభాగానికి నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. అనేక కీలక, సంచలనాత్మకమైన కేసుల దర్యాప్తులో తనదైన పాత్రను పోషించారు.