అభివృద్ధికి ఎవరు మాత్రం కాళ్లు అడ్డుతారు? అయితే అభివృద్ధి అనుకున్నది ఊరువాడకు చేటు చేసేలా ఉందని అనిపిస్తే... ఆందోళన మొదలవుతుంది. మంచి అని చెబుతున్నది ‘చెడు’ చేయడానికి వస్తుంది అనుకుంటే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ఆందోళన. ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఉద్యమ విజయం.
ఈ ఉద్యమ ప్రత్యేకత... మహిళా శక్తి.
అక్షరజ్ఞానం లేని మహిళల నుంచి చదువుకున్న మహిళల వరకు, కూలిపనులు చేసుకునే శ్రామిక మహిళల నుంచి ఇంటిపనుల్లో తలమునకలయ్యే గృహిణుల వరకు ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. ఉద్యమానికి వెన్నెముకై ముందుకు నడిపించారు. మరో వైపు....ఆ ఉద్యమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా, హింసాత్మక ఘటనలు చోటు చేనుకోకుండా వెయ్యి కళ్లతో పర్యవేక్షించిన మహిళా అధికారులు. ఆర్డీఓ రత్నకల్యాణి, శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూసిన ఎస్పీ జానకీషర్మిల, ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారమిస్తూ చర్చలు జరిపిన కలెక్టర్ అభిలాష అభినవ్... ఇలా ఎంతోమంది మహిళలు ఉన్నారు.
‘ఉన్న ఊరు కన్నతల్లి’ అంటారు. ఆ కన్నతల్లి కళ్లలో కలవరం మొదలైంది. నవ్వుతూ పచ్చగా పలకరించే పొలంలో కళ తప్పింది. ఊరి చెరువు దుఃఖసముద్రం అయింది. ‘ఇక మన ఊరు మనుపటిలా ఉండదా?’
‘ఇథనాల్ పరిశ్రమ కాలుష్య పడగనీడలో భయంభయంగా మనుగడ సాగించాల్సిందేనా?’....ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆందోళనల మధ్య ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది.
నమ్ముకున్న పొలాలే లేకుంటే...
‘మాకు పట్టెడన్నం పెట్టే పంట పొలాలే లేకుంటే రేప్పొద్దున్న మా పరిస్థితి ఏంటన్న ప్రశ్నే మమ్మల్ని ఇంతలా కదిలించింది’ అంటున్నారు ఉద్యమశంఖారావం పూరించిన మహిళలు. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎలాగో నిర్మల్ జిల్లాలో దిలావర్‌పూర్–గుండంపల్లి ప్రాంతాలు అలాగ. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు ఆమడదూరంలో ఉండే ఈ నేలంతా వ్యవసాయాధారితమే. ఇంటిల్లిపాది పొద్దున్నే పంటచేలోకి వెళ్తారు. అలాంటి చోట ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం ఆ రైతు కుటుంబాలు, గ్రామాలను కలవరపెట్టింది.
ఊరూరా..ఇంటింటికీ..
పొద్దున్నే పొలాలు, చేలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చే మహిళలు ఆ తరువాత ఉద్యమబాటలో కదిలేవారు. తోటి మహిళలతో కలిసి తమ ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లేవాళ్లు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏం నష్టపోతాం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేవారు. పక్కనున్న గ్రామాలకు కూడా వెళ్లి మహిళలతో మాట్లాడేవారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఉద్యమకార్యాచరణ అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయింది.
లాఠీలతో కొట్టినా... ఇగ వెనక్కి తగ్గద్దు అనుకున్నాం
‘మా ఊళ్లు బాగుండాలన్నా, మా పిల్లల భవిష్యత్తు భద్రంగాఉండాలన్నా పచ్చని మా పల్లెల్లో చిచ్చుపెట్టే ఆ ఫ్యాక్టరీ ఉండొద్దని అనుకున్నాం. ఊళ్లో మగవాళ్లు చేస్తున్న పోరుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఈసారి మేమే ముందుండాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు అరెస్టులే చెయ్యనీ, లాఠీలతో కొట్టనీ... ఇగ వెనక్కు తగ్గేది లేదని గట్టిగ అనుకునే ముందుకొచ్చాం..’ అంటుంది గుండంపల్లికి చెందిన శ్వేతారెడ్డి.
‘క్షణం తీరిక లేకుండా పొలం పనులు, ఇంటి పనులు. అయినంత మాత్రాన ఊరు ఎటు బోతే నాకేంది అనుకోలేము కదా. ఇది ఒక్కరి సమస్య కాదు. ఊరందరి సమస్య. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉద్యమంలో భాగం అయ్యాను’ అంటుంది ఒక రైతు బిడ్డ.
.....ఎవరి మాట ఎలా ఉన్నా మహిళలందరూ ఉద్యమ బాట పట్టారు. మహిళలే ఉద్యమం అయితే ఆ శక్తి ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.
నిద్రలేని రాత్రులు
దిలావర్‌పూర్–గుండంపల్లి ఊళ్ల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట అని తెలిసినప్పటి నుంచే మాలో ఆందోళన మొదలైంది. ఆ పరిశ్రమతో భవిష్యత్‌లో మా ఊళ్లు, పంటచేలు దెబ్బతింటాయని తెలిసినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక ఏమైనా పర్వాలేదనే ముందుకు వచ్చాం.
– కొమ్ముల శ్వేతారెడ్డి, గుండంపల్లి
అందరం ఒక్కటై...
మన ఊళ్లు బాగుండాలని చేపట్టిన ఉద్యమంలో మనమంతా భాగం కావాలని మా గ్రామ మహిళలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం చేసేది కాదని, మన ఊళ్లు, పిల్లలు బాగుండాలని చేస్తున్నామని చెబుతూ అందరూ ఇందులో భాగమయ్యేలా చేశాం.
– ఆలూరు లక్ష్మి, దిలావర్‌పూర్
రెండడుగులు వెనక్కి వేసి...
తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని ఎస్పీ జానకీశర్మ స్వయంగా రోప్‌పార్టీతో వెళ్లి బయటకు తీసుకువచ్చింది. దిలావర్‌పూర్‌లో తమపై రాళ్లు రువ్వుతున్నా. ఎక్కడా ఆవేశపడకుండా తమ బలగాలను శాంతియుతంగా నడిపింది. తాను వెనుకడుగు వేస్తూ ఉద్యమకారులకు దగ్గరైంది. చివరకు ‘ఎస్పీ జిందాబాద్’ అని అనిపించుకుంది.
– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment