Ethanol Factory Row
-
ఇథనాల్‌పై గెలుపులో అంతా ఆమే!
అభివృద్ధికి ఎవరు మాత్రం కాళ్లు అడ్డుతారు? అయితే అభివృద్ధి అనుకున్నది ఊరువాడకు చేటు చేసేలా ఉందని అనిపిస్తే... ఆందోళన మొదలవుతుంది. మంచి అని చెబుతున్నది ‘చెడు’ చేయడానికి వస్తుంది అనుకుంటే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ఆందోళన. ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఉద్యమ విజయం. ఈ ఉద్యమ ప్రత్యేకత... మహిళా శక్తి.అక్షరజ్ఞానం లేని మహిళల నుంచి చదువుకున్న మహిళల వరకు, కూలిపనులు చేసుకునే శ్రామిక మహిళల నుంచి ఇంటిపనుల్లో తలమునకలయ్యే గృహిణుల వరకు ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. ఉద్యమానికి వెన్నెముకై ముందుకు నడిపించారు. మరో వైపు....ఆ ఉద్యమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా, హింసాత్మక ఘటనలు చోటు చేనుకోకుండా వెయ్యి కళ్లతో పర్యవేక్షించిన మహిళా అధికారులు. ఆర్డీఓ రత్నకల్యాణి, శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూసిన ఎస్పీ జానకీషర్మిల, ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారమిస్తూ చర్చలు జరిపిన కలెక్టర్ అభిలాష అభినవ్... ఇలా ఎంతోమంది మహిళలు ఉన్నారు.‘ఉన్న ఊరు కన్నతల్లి’ అంటారు. ఆ కన్నతల్లి కళ్లలో కలవరం మొదలైంది. నవ్వుతూ పచ్చగా పలకరించే పొలంలో కళ తప్పింది. ఊరి చెరువు దుఃఖసముద్రం అయింది. ‘ఇక మన ఊరు మనుపటిలా ఉండదా?’‘ఇథనాల్ పరిశ్రమ కాలుష్య పడగనీడలో భయంభయంగా మనుగడ సాగించాల్సిందేనా?’....ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆందోళనల మధ్య ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది.నమ్ముకున్న పొలాలే లేకుంటే...‘మాకు పట్టెడన్నం పెట్టే పంట పొలాలే లేకుంటే రేప్పొద్దున్న మా పరిస్థితి ఏంటన్న ప్రశ్నే మమ్మల్ని ఇంతలా కదిలించింది’ అంటున్నారు ఉద్యమశంఖారావం పూరించిన మహిళలు. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎలాగో నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్–గుండంపల్లి ప్రాంతాలు అలాగ. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు ఆమడదూరంలో ఉండే ఈ నేలంతా వ్యవసాయాధారితమే. ఇంటిల్లిపాది పొద్దున్నే పంటచేలోకి వెళ్తారు. అలాంటి చోట ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం ఆ రైతు కుటుంబాలు, గ్రామాలను కలవరపెట్టింది.ఊరూరా..ఇంటింటికీ..పొద్దున్నే పొలాలు, చేలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చే మహిళలు ఆ తరువాత ఉద్యమబాటలో కదిలేవారు. తోటి మహిళలతో కలిసి తమ ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లేవాళ్లు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏం నష్టపోతాం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేవారు. పక్కనున్న గ్రామాలకు కూడా వెళ్లి మహిళలతో మాట్లాడేవారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఉద్యమకార్యాచరణ అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయింది.లాఠీలతో కొట్టినా... ఇగ వెనక్కి తగ్గద్దు అనుకున్నాం‘మా ఊళ్లు బాగుండాలన్నా, మా పిల్లల భవిష్యత్తు భద్రంగాఉండాలన్నా పచ్చని మా పల్లెల్లో చిచ్చుపెట్టే ఆ ఫ్యాక్టరీ ఉండొద్దని అనుకున్నాం. ఊళ్లో మగవాళ్లు చేస్తున్న పోరుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఈసారి మేమే ముందుండాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు అరెస్టులే చెయ్యనీ, లాఠీలతో కొట్టనీ... ఇగ వెనక్కు తగ్గేది లేదని గట్టిగ అనుకునే ముందుకొచ్చాం..’ అంటుంది గుండంపల్లికి చెందిన శ్వేతారెడ్డి.‘క్షణం తీరిక లేకుండా పొలం పనులు, ఇంటి పనులు. అయినంత మాత్రాన ఊరు ఎటు బోతే నాకేంది అనుకోలేము కదా. ఇది ఒక్కరి సమస్య కాదు. ఊరందరి సమస్య. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉద్యమంలో భాగం అయ్యాను’ అంటుంది ఒక రైతు బిడ్డ......ఎవరి మాట ఎలా ఉన్నా మహిళలందరూ ఉద్యమ బాట పట్టారు. మహిళలే ఉద్యమం అయితే ఆ శక్తి ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.నిద్రలేని రాత్రులుదిలావర్పూర్–గుండంపల్లి ఊళ్ల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట అని తెలిసినప్పటి నుంచే మాలో ఆందోళన మొదలైంది. ఆ పరిశ్రమతో భవిష్యత్‌లో మా ఊళ్లు, పంటచేలు దెబ్బతింటాయని తెలిసినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక ఏమైనా పర్వాలేదనే ముందుకు వచ్చాం.– కొమ్ముల శ్వేతారెడ్డి, గుండంపల్లిఅందరం ఒక్కటై...మన ఊళ్లు బాగుండాలని చేపట్టిన ఉద్యమంలో మనమంతా భాగం కావాలని మా గ్రామ మహిళలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం చేసేది కాదని, మన ఊళ్లు, పిల్లలు బాగుండాలని చేస్తున్నామని చెబుతూ అందరూ ఇందులో భాగమయ్యేలా చేశాం.– ఆలూరు లక్ష్మి, దిలావర్పూర్రెండడుగులు వెనక్కి వేసి...తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని ఎస్పీ జానకీశర్మ స్వయంగా రోప్‌పార్టీతో వెళ్లి బయటకు తీసుకువచ్చింది. దిలావర్పూర్లో తమపై రాళ్లు రువ్వుతున్నా. ఎక్కడా ఆవేశపడకుండా తమ బలగాలను శాంతియుతంగా నడిపింది. తాను వెనుకడుగు వేస్తూ ఉద్యమకారులకు దగ్గరైంది. చివరకు ‘ఎస్పీ జిందాబాద్’ అని అనిపించుకుంది.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
ఇథనాల్ మంటలు: కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్
సాక్షి, హైదరాబాద్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడుతూ..‘ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబందం ఉందని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశాడు.ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీని రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
నిలిచిన ఇథనాల్ ఫ్యాక్టరీ
నిర్మల్/దిలావర్పూర్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో రగిలిన ‘ఇథనాల్’ మంట చల్లారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు, గ్రామస్తులు రోడ్డెక్కి చేపట్టిన ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.దిలావర్పూర్–గుండంపల్లి మధ్య నిర్మాణంలో ఉన్న పీఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు తాత్కాలికంగా తమ పోరును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులపై రాళ్లు రువ్వి.. అంతకుముందు దిలావర్పూర్ మండల కేంద్రంలో ‘ఇథనాల్’ మంట రెండోరోజైన బుధవారమూ కొనసాగింది. దిలావర్పూర్, గుండంపల్లిలో పొద్దున్నే పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండంపల్లిలో అరెస్టులు చేయడానికి వచ్చిన పోలీసులను భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అడ్డుకున్నారు. మరోసారి 61వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు గ్రామస్తులు గుమిగూడగా ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో వజ్ర వాహనంతోపాటు వచ్చిన పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలు ఉండటంతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బలగాలు వెనుదిరగడం మొదలుపెట్టారు. ఈలోగా కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. అయినప్పటికీ పోలీసులు లాఠీచార్జీ చేయకుండా సంయమనం పాటిస్తూ దిలావర్పూర్ నుంచి 2 కి.మీ. వెనక్కి వెళ్లిపోయారు. దీంతో దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం తదితర గ్రామాల ప్రజలు మళ్లీ ఎన్.హెచ్. 61పై బైఠాయించారు. పిల్లలతోపాటు మహిళలు తమ ఎదుట పురుగు మందుల డబ్బాలను పెట్టుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేసుకున్నారు. ‘లగచర్ల’ ప్రభావంతో ప్రభుత్వం అప్రమత్తం ఇటీవల వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో చోటుచేసుకున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో దిలావర్పూర్ మండలంలో జరుగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకారులు దాడి చేయొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వారు రాస్తారోకో చేస్తున్న ప్రాంతానికి వెళ్లలేదు.అలాగే ఆందోళనకారులు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించొచ్చన్న సమాచారంతో ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని మధ్యాహ్నంలోగా ఖాళీ చేయించారు. జిల్లా కేంద్రంలోనే ఉన్న ఆర్డీవో కార్యాలయానికి ఏకంగా తాళం వేశారు. ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనలకు విరామంఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వచ్చిన ప్రకటనతో ఆందోళనకారులు చల్లబడ్డారు. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షరి్మల ఆయా గ్రామాల రైతులు, పెద్దలతో సాయంత్రం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. అనంతరం ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించేందుకు జిల్లా ఎస్పీ, పోలీసులు దిలావర్పూర్ మండల కేంద్రానికి చేరుకోగా ప్రజలు వారికి పూలతో స్వాగతం పలికారు. ‘ఎస్పీ జిందాబాద్..’ అంటూ నినాదాలు చేశారు. పటాకులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న యువకులందరినీ పోలీసులు తిరిగి గ్రామాల్లో వదిలిపెట్టారు. -
ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కొడుకుదే: కాంగ్రెస్
నిర్మల్ : దిలావర్ పూర్లో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది తెలిసిందే. దీంతో కలెక్టర్ పనులను ఆపేయించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ కౌంటర్‌కు దిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిదే. ఇథనాల్ ఫ్యాక్టరీతో జనాల్ని ముంచాలని కేసీఆర్ చూశారు. అందుకే తలసాని కొడుకు సాయి సంస్థకు అప్పగించారు. కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ఇథనాల్ కంపెనీకి సంబంధం ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిదో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు దిలావర్ పూర్‌కి రావాలి. వారితో పాటు మేమూ వస్తాం. అక్కడికి వెళ్లి తప్పెవరిదో? తేల్చుకుందాం’ అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై పూర్వపరాలు పరిశీలించాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన. కాగా, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్ నుంచి నిర్మల్ - భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు. ఇథనాలు పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు. దీంతో అధికార యంత్రాగం పనుల్ని ఆపేయించి.. చర్చలకు పిలిచింది. అదే సమయంలో.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయని గుర్తించింది. ఫ్యాక్టరీ అనుమతులపై సమీక్షించి.. అవసరమైతే వాటిని రద్దు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం.