సీఎం ఆదేశంతో నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్లు నిర్మల్ కలెక్టర్ ప్రకటన
తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నామన్న దిలావర్‌పూర్ గ్రామస్తులు
నిర్మల్/దిలావర్‌పూర్: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో రగిలిన ‘ఇథనాల్’ మంట చల్లారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు, గ్రామస్తులు రోడ్డెక్కి చేపట్టిన ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
దిలావర్‌పూర్–గుండంపల్లి మధ్య నిర్మాణంలో ఉన్న పీఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు తాత్కాలికంగా తమ పోరును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
పోలీసులపై రాళ్లు రువ్వి..
అంతకుముందు దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ‘ఇథనాల్’ మంట రెండోరోజైన బుధవారమూ కొనసాగింది. దిలావర్‌పూర్, గుండంపల్లిలో పొద్దున్నే పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండంపల్లిలో అరెస్టులు చేయడానికి వచ్చిన పోలీసులను భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అడ్డుకున్నారు.
మరోసారి 61వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు గ్రామస్తులు గుమిగూడగా ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో వజ్ర వాహనంతోపాటు వచ్చిన పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలు ఉండటంతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బలగాలు వెనుదిరగడం మొదలుపెట్టారు. ఈలోగా కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు.
అయినప్పటికీ పోలీసులు లాఠీచార్జీ చేయకుండా సంయమనం పాటిస్తూ దిలావర్‌పూర్ నుంచి 2 కి.మీ. వెనక్కి వెళ్లిపోయారు. దీంతో దిలావర్‌పూర్, గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం తదితర గ్రామాల ప్రజలు మళ్లీ ఎన్.హెచ్. 61పై బైఠాయించారు. పిల్లలతోపాటు మహిళలు తమ ఎదుట పురుగు మందుల డబ్బాలను పెట్టుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేసుకున్నారు.
‘లగచర్ల’ ప్రభావంతో ప్రభుత్వం అప్రమత్తం
ఇటీవల వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో చోటుచేసుకున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో దిలావర్‌పూర్ మండలంలో జరుగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకారులు దాడి చేయొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వారు రాస్తారోకో చేస్తున్న ప్రాంతానికి వెళ్లలేదు.
అలాగే ఆందోళనకారులు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించొచ్చన్న సమాచారంతో ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని మధ్యాహ్నంలోగా ఖాళీ చేయించారు. జిల్లా కేంద్రంలోనే ఉన్న ఆర్డీవో కార్యాలయానికి ఏకంగా తాళం వేశారు.
ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనలకు విరామం
ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వచ్చిన ప్రకటనతో ఆందోళనకారులు చల్లబడ్డారు. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షరి్మల ఆయా గ్రామాల రైతులు, పెద్దలతో సాయంత్రం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు.
అనంతరం ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించేందుకు జిల్లా ఎస్పీ, పోలీసులు దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చేరుకోగా ప్రజలు వారికి పూలతో స్వాగతం పలికారు. ‘ఎస్పీ జిందాబాద్..’ అంటూ నినాదాలు చేశారు. పటాకులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న యువకులందరినీ పోలీసులు తిరిగి గ్రామాల్లో వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment