సాక్షి, హైదరాబాద్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడుతూ..‘ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబందం ఉందని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశాడు.
ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీని రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్‌పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment