Dilawarpur
-
ఇథనాల్‌పై గెలుపులో అంతా ఆమే!
అభివృద్ధికి ఎవరు మాత్రం కాళ్లు అడ్డుతారు? అయితే అభివృద్ధి అనుకున్నది ఊరువాడకు చేటు చేసేలా ఉందని అనిపిస్తే... ఆందోళన మొదలవుతుంది. మంచి అని చెబుతున్నది ‘చెడు’ చేయడానికి వస్తుంది అనుకుంటే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ఆందోళన. ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఉద్యమ విజయం. ఈ ఉద్యమ ప్రత్యేకత... మహిళా శక్తి.అక్షరజ్ఞానం లేని మహిళల నుంచి చదువుకున్న మహిళల వరకు, కూలిపనులు చేసుకునే శ్రామిక మహిళల నుంచి ఇంటిపనుల్లో తలమునకలయ్యే గృహిణుల వరకు ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. ఉద్యమానికి వెన్నెముకై ముందుకు నడిపించారు. మరో వైపు....ఆ ఉద్యమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా, హింసాత్మక ఘటనలు చోటు చేనుకోకుండా వెయ్యి కళ్లతో పర్యవేక్షించిన మహిళా అధికారులు. ఆర్డీఓ రత్నకల్యాణి, శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూసిన ఎస్పీ జానకీషర్మిల, ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారమిస్తూ చర్చలు జరిపిన కలెక్టర్ అభిలాష అభినవ్... ఇలా ఎంతోమంది మహిళలు ఉన్నారు.‘ఉన్న ఊరు కన్నతల్లి’ అంటారు. ఆ కన్నతల్లి కళ్లలో కలవరం మొదలైంది. నవ్వుతూ పచ్చగా పలకరించే పొలంలో కళ తప్పింది. ఊరి చెరువు దుఃఖసముద్రం అయింది. ‘ఇక మన ఊరు మనుపటిలా ఉండదా?’‘ఇథనాల్ పరిశ్రమ కాలుష్య పడగనీడలో భయంభయంగా మనుగడ సాగించాల్సిందేనా?’....ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆందోళనల మధ్య ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది.నమ్ముకున్న పొలాలే లేకుంటే...‘మాకు పట్టెడన్నం పెట్టే పంట పొలాలే లేకుంటే రేప్పొద్దున్న మా పరిస్థితి ఏంటన్న ప్రశ్నే మమ్మల్ని ఇంతలా కదిలించింది’ అంటున్నారు ఉద్యమశంఖారావం పూరించిన మహిళలు. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎలాగో నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్–గుండంపల్లి ప్రాంతాలు అలాగ. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు ఆమడదూరంలో ఉండే ఈ నేలంతా వ్యవసాయాధారితమే. ఇంటిల్లిపాది పొద్దున్నే పంటచేలోకి వెళ్తారు. అలాంటి చోట ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం ఆ రైతు కుటుంబాలు, గ్రామాలను కలవరపెట్టింది.ఊరూరా..ఇంటింటికీ..పొద్దున్నే పొలాలు, చేలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చే మహిళలు ఆ తరువాత ఉద్యమబాటలో కదిలేవారు. తోటి మహిళలతో కలిసి తమ ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లేవాళ్లు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏం నష్టపోతాం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేవారు. పక్కనున్న గ్రామాలకు కూడా వెళ్లి మహిళలతో మాట్లాడేవారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఉద్యమకార్యాచరణ అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయింది.లాఠీలతో కొట్టినా... ఇగ వెనక్కి తగ్గద్దు అనుకున్నాం‘మా ఊళ్లు బాగుండాలన్నా, మా పిల్లల భవిష్యత్తు భద్రంగాఉండాలన్నా పచ్చని మా పల్లెల్లో చిచ్చుపెట్టే ఆ ఫ్యాక్టరీ ఉండొద్దని అనుకున్నాం. ఊళ్లో మగవాళ్లు చేస్తున్న పోరుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఈసారి మేమే ముందుండాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు అరెస్టులే చెయ్యనీ, లాఠీలతో కొట్టనీ... ఇగ వెనక్కు తగ్గేది లేదని గట్టిగ అనుకునే ముందుకొచ్చాం..’ అంటుంది గుండంపల్లికి చెందిన శ్వేతారెడ్డి.‘క్షణం తీరిక లేకుండా పొలం పనులు, ఇంటి పనులు. అయినంత మాత్రాన ఊరు ఎటు బోతే నాకేంది అనుకోలేము కదా. ఇది ఒక్కరి సమస్య కాదు. ఊరందరి సమస్య. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉద్యమంలో భాగం అయ్యాను’ అంటుంది ఒక రైతు బిడ్డ......ఎవరి మాట ఎలా ఉన్నా మహిళలందరూ ఉద్యమ బాట పట్టారు. మహిళలే ఉద్యమం అయితే ఆ శక్తి ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.నిద్రలేని రాత్రులుదిలావర్పూర్–గుండంపల్లి ఊళ్ల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట అని తెలిసినప్పటి నుంచే మాలో ఆందోళన మొదలైంది. ఆ పరిశ్రమతో భవిష్యత్‌లో మా ఊళ్లు, పంటచేలు దెబ్బతింటాయని తెలిసినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక ఏమైనా పర్వాలేదనే ముందుకు వచ్చాం.– కొమ్ముల శ్వేతారెడ్డి, గుండంపల్లిఅందరం ఒక్కటై...మన ఊళ్లు బాగుండాలని చేపట్టిన ఉద్యమంలో మనమంతా భాగం కావాలని మా గ్రామ మహిళలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం చేసేది కాదని, మన ఊళ్లు, పిల్లలు బాగుండాలని చేస్తున్నామని చెబుతూ అందరూ ఇందులో భాగమయ్యేలా చేశాం.– ఆలూరు లక్ష్మి, దిలావర్పూర్రెండడుగులు వెనక్కి వేసి...తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని ఎస్పీ జానకీశర్మ స్వయంగా రోప్‌పార్టీతో వెళ్లి బయటకు తీసుకువచ్చింది. దిలావర్పూర్లో తమపై రాళ్లు రువ్వుతున్నా. ఎక్కడా ఆవేశపడకుండా తమ బలగాలను శాంతియుతంగా నడిపింది. తాను వెనుకడుగు వేస్తూ ఉద్యమకారులకు దగ్గరైంది. చివరకు ‘ఎస్పీ జిందాబాద్’ అని అనిపించుకుంది.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కొడుకుదే: కాంగ్రెస్
నిర్మల్ : దిలావర్ పూర్లో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది తెలిసిందే. దీంతో కలెక్టర్ పనులను ఆపేయించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ కౌంటర్‌కు దిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిదే. ఇథనాల్ ఫ్యాక్టరీతో జనాల్ని ముంచాలని కేసీఆర్ చూశారు. అందుకే తలసాని కొడుకు సాయి సంస్థకు అప్పగించారు. కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ఇథనాల్ కంపెనీకి సంబంధం ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిదో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు దిలావర్ పూర్‌కి రావాలి. వారితో పాటు మేమూ వస్తాం. అక్కడికి వెళ్లి తప్పెవరిదో? తేల్చుకుందాం’ అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై పూర్వపరాలు పరిశీలించాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన. కాగా, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్ నుంచి నిర్మల్ - భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు. ఇథనాలు పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు. దీంతో అధికార యంత్రాగం పనుల్ని ఆపేయించి.. చర్చలకు పిలిచింది. అదే సమయంలో.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయని గుర్తించింది. ఫ్యాక్టరీ అనుమతులపై సమీక్షించి.. అవసరమైతే వాటిని రద్దు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు
-
నిర్మల్ పల్లెల్లో ‘ఇథనాల్’ మంట
నిర్మల్/దిలావర్పూర్: తమ పచ్చని పంటపొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన మంగళవారం తీవ్రరూపు దాల్చింది. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్‌ను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల సహనం నశించింది. బంద్ పాటించడంతోపాటు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. నిర్మల్–భైంసా మార్గంలో దాదాపు 12 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.ఆర్డీవో నచ్చజెప్పినా..: నిరసనకారులు రోడ్డుపైనే మధ్యాహ్నం, రాత్రి వంటావార్పు చేసుకోవడంతోపాటు సాయంత్రం నుంచి అక్కడే చలిమంటలు వేసుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు మధ్యాహ్నం 3 గంటల వేళ నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి రాగా ఆమెను నిరసనకారులు అడ్డుకున్నారు. 20 మంది గ్రామస్తులను కలెక్టరేట్‌కు తీసుకెళ్లి కలెక్టర్‌తో మాట్లాడిస్తానని చెప్పినా వారు ససేమిరా అన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే కలెక్టరే తమ వద్దకు రావాలంటూ ఆమెను ఘెరావ్ చేశారు. దీంతో ఆమె రాత్రి 9:30 గంటల వరకు వాహనంలోనే కూర్చుండి పోయారు. చివరకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రోప్‌పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున్న మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీఓను వాహనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు ఆర్డీవో వాహనాన్ని బోల్తా పడేసి దానిపై చలిమంటల్లోని కర్రలను విసిరేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో లక్ష్మణచాంద మండల ఎస్సై సుమలత గాయపడ్డారు. మరోవైపు కొన్ని గంటలపాటు వాహనంలో కూర్చుండిపోయిన ఆర్డీఓ సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.చేతిలో ప్లకార్డులు, పురుగుమందు డబ్బాలుమాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ‘కనబడుట లేదు..’ అంటూ వారి ఫొటోలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. అలాగే కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలు తీసుకొచ్చి ఇప్పటికైనా ఫ్యాక్టరీని తీసేయకపోతే తమకు అవే దిక్కంటూ చూపించారు.300 మంది పోలీసుల మోహరింపు..నిరసనకారులు బంద్‌తోపాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు మంగళవారం వేకువ జామునే నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంత సేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచీ బలగాలను రప్పించారు.సీఎంవోకు నివేదిక పంపాం: కలెక్టర్నిర్మల్ చైన్‌గేట్: ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ఆవేదనను సీఎంవోకు నివేదించినట్లు వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.ఆది నుంచి వద్దంటూనే..దిలావర్పూర్–గుండపల్లి గ్రామాల మధ్య శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు సమీపంలో దాదాపు 40ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహరీతోపాటు దాదాపు నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. రూ. వందల కోట్ల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్‌తో కూడినదని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ సమీపంలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలు తొలి నుంచీ ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. గతేడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన పరిశ్రమ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. నాటి నుంచి ఆయా గ్రామస్తులు దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాలూ ఆందోళనలో భాగమయ్యాయి. -
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, నిర్మల్ జిల్లా: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లిల వద్ద శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌తో నిర్మించిన కాళేశ్వర ప్రజెక్టు ప్యాకేజీ-27ను (శ్రీలక్ష్మీ నరసింహాస్వామి లిఫ్ట్ ఇరిగేషన్) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. తరువాత దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించి పూజ నిర్వహించారు. అదే విధంగా సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆశా కార్యకర్తల ఆందోళన.. గుండంపెల్లిలో ఉద్రిక్తత గుండంపెల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ ఆశా కార్యకర్త సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసుల తీరుపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. చివరికి ప్యాకేజీ 28 కాళేశ్వర పనులు ప్రారంభించిన తర్వాత మంత్రికి ఆశా కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు. -
అధ్వానంగా అంతర్గత రోడ్లు
► చినుకుపడితే చిత్తడవుతున్న రహదారులు ► పెరుగుతున్న పందుల బెడద ► ఇబ్బందుల్లో దిలావర్పూర్ వాసులు దిలావర్పూర్: దిలావర్పూర్ గ్రామంపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఫలితంగా గ్రామస్తులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎన్నికల సమయంలో అదిచేస్తాం..ఇదిచేస్తాం.. అన్న నేతలు తీరా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రధానంగా గ్రామంలో మేజర్‌సమస్యలు రాజ్యమేలుతుండడంతో అనేక వార్డుల్లో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా డ్రెయినేజీ అంతర్గత రోడ్లు, పందుల బెడదతో ప్రజలు తీవ్ర తంటాలు పడుతున్నా పట్టించుకునే నా«థుడే కరువయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన దిలావర్పూర్లో రోజురోజుకి పెరుగుతున్న జనాభా అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల జాడ అగుపడని మూలంగా 14వార్డుల్లో ప్రజలు తీవ్ర సమస్యల బారిన పడుతున్నారు. దాదాపుగా 7వేల పైచిలుకు జనాభా4200 మంది ఓటర్లు ఉన్న దిలావర్పూర్లో ప్రధానంగా పారిశుద్ద్య సమస్యలు తరచూ ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామంలో గత కొన్ని సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైనేజీలే అనేక వార్డుల్లో ఇప్పటికీ అవే ఉండడంతో పెరిగిన జనాభాఅవసరాలకు అవి సరిపడక పోవడంతో నిత్యం డ్రైనేజీల గుండా మురికినీరు ప్రవహిస్తునే ఉంది. ఒకటవ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారడంతో జనావాసాల నడుమ పెద్దపెద్ద గుంతలు ఏర్పడి కుంటలను తలపిస్తున్నాయి. దీంతో దోమల బెడద అధికంగా కావడంతో రాత్రయితే చాలు తాము దోమలతో సావాసం చేస్తూ రోగాల బారిన పడుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్త చేస్తున్నారు. గతంలో గ్రామంలో మలేరియా,డెంగ్యూ ప్రబలడంతో స్వయంగా జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జనావాసాల నడుమ ఎలాంటి మురునీటి గుంటలు ఉండకూడదన్న ఉన్నతాధికారుల మాటలు నీటిమూటలే అయ్యాయి. అనేక వార్డుల్లో వర్షంకురిస్తే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు దెబ్బతిని మట్టిరోడ్లను తలపిపిస్తున్నాయి. పందుల బెడదపైస్పందించని అధికారులు... గ్రామంలో అనేక రోజుల నుండి పందుల బెడద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసమస్యపై గ్రామకమిటీతోపాటు పంచాయతీ పాలక వర్గాలు జిల్లా ఉన్నతాదికారులకు ఫిర్యాదు చేయగా గ్రామానికి వచ్చిన ఉన్నతాధికారులు సైతం సమస్యల పట్ల చేతులెత్తేయండంతో నేడు గ్రామంలో ఏవీధిలో చూసిన పందులు తారసపడుతునే ఉన్నాయి. గ్రామస్థుల పిర్యాదులు సైతం అధికారులు బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే గ్రామంలో రాజ్యమేలుతున్న సమస్యల పట్ల స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. చర్యలు చేపడతాం.... మండలంలోని గ్రామంలో పలు వార్డుల్లో డ్రైనేజీలు, íసీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాం, అలాగే గ్రామంలోని డ్రైనేజీల్లో వర్షాకాలం నేపథ్యంలో పూడిక తీయించి శుభ్రపరుస్తాం. జనావాసాల నడుమ ఉన్న మురుగునీటి గుంటలను తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. – కె.శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీ కార్యనిర్వహణ అధికారి, దిలావర్పూర్