ఆర్డీఓ వాహనం ఎదుట బైఠాయించిన మహిళలు
దిలావర్‌పూర్ మండలంలో ఫ్యాక్టరీ వద్దంటూ రోడ్డెక్కిన గ్రామాలు
ఎన్‌హెచ్ 61పై 12 గంటలపాటు రాస్తారోకో, వంటావార్పు
నచ్చజెప్పేందుకు వచ్చిన మహిళా ఆర్డీఓ గంటల తరబడి ఘెరావ్.. వాహనంపై దాడి.. అతికష్టంమీద రాత్రికి ఆమెను కాపాడిన జిల్లా ఎస్పీ.. తోపులాటలో మహిళా ఎస్సైకి గాయాలు
ఘటనపై సీఎంఓకు నివేదించిన జిల్లా కలెక్టర్
నిర్మల్/దిలావర్‌పూర్: తమ పచ్చని పంటపొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన మంగళవారం తీవ్రరూపు దాల్చింది. దిలావర్‌పూర్ మండలంలోని దిలావర్‌పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్‌ను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల సహనం నశించింది.
బంద్ పాటించడంతోపాటు దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. నిర్మల్–భైంసా మార్గంలో దాదాపు 12 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
ఆర్డీవో నచ్చజెప్పినా..: నిరసనకారులు రోడ్డుపైనే మధ్యాహ్నం, రాత్రి
వంటావార్పు చేసుకోవడంతోపాటు సాయంత్రం నుంచి అక్కడే చలిమంటలు వేసుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు మధ్యాహ్నం 3 గంటల వేళ నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి రాగా ఆమెను నిరసనకారులు అడ్డుకున్నారు. 20 మంది గ్రామస్తులను కలెక్టరేట్‌కు తీసుకెళ్లి కలెక్టర్‌తో మాట్లాడిస్తానని చెప్పినా వారు ససేమిరా అన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే కలెక్టరే తమ వద్దకు రావాలంటూ ఆమెను ఘెరావ్ చేశారు. దీంతో ఆమె రాత్రి 9:30 గంటల వరకు వాహనంలోనే కూర్చుండి పోయారు.
చివరకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రోప్‌పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున్న మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీఓను వాహనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు ఆర్డీవో వాహనాన్ని బోల్తా పడేసి దానిపై చలిమంటల్లోని కర్రలను విసిరేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో లక్ష్మణచాంద మండల ఎస్సై సుమలత గాయపడ్డారు. మరోవైపు కొన్ని గంటలపాటు వాహనంలో కూర్చుండిపోయిన ఆర్డీఓ సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.
చేతిలో ప్లకార్డులు, పురుగుమందు డబ్బాలు
మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ‘కనబడుట లేదు..’ అంటూ వారి ఫొటోలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. అలాగే కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలు తీసుకొచ్చి ఇప్పటికైనా ఫ్యాక్టరీని తీసేయకపోతే తమకు అవే దిక్కంటూ చూపించారు.
300 మంది పోలీసుల మోహరింపు..
నిరసనకారులు బంద్‌తోపాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు మంగళవారం వేకువ జామునే నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంత సేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచీ బలగాలను రప్పించారు.
సీఎంవోకు నివేదిక పంపాం: కలెక్టర్
నిర్మల్ చైన్‌గేట్: ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ఆవేదనను సీఎంవోకు నివేదించినట్లు వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
ఆది నుంచి వద్దంటూనే..
దిలావర్‌పూర్–గుండపల్లి గ్రామాల మధ్య శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు సమీపంలో దాదాపు 40ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహరీతోపాటు దాదాపు నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. రూ. వందల కోట్ల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్‌తో కూడినదని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ సమీపంలోని దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాలు తొలి నుంచీ ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.
గతేడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన పరిశ్రమ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. నాటి నుంచి ఆయా గ్రామస్తులు దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాలూ ఆందోళనలో భాగమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment