‘తీరిక లేనంత పనుల్లో బిజీగా ఉన్నాను’ అని చెప్పడం సులభం. ‘తీరిక చేసుకోవడం’ మాత్రం కష్టం. అయితే కొన్ని ఇష్టాలు ఆ కష్టాన్ని దాటి కాలాన్ని మనకు అప్పగిస్తాయి. కలెక్టర్‌గా తీరికలేనంత పనుల్లో తలమునకలైప్పటికీ తనలోని క్రియేటివిటీని కాపాడుకుంటున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోయ, ఉర్దూ భాషలు
నేర్చుకుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో పిల్లల పాటలు రాస్తోంది. ఉద్యోగ బాధ్యతలకు సృజనాత్మకత జోడిస్తోంది.
దేశంలో ఏ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లినా ‘ఏ అంటే ఆపిల్, బీ అంటే బాల్’ అని చదువుతారు పిల్లలు. కరీంనగర్‌లో అలా కాదు. ‘ఏ ఫర్ యాక్టివ్. బీ ఫర్ బ్రైట్. సీ ఫర్ క్రియేటివ్’ అంటూ ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌కు సరికొత్త పదాలతో పాడుతారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ పాట రాశారు. ఐదేళ్ల క్రితం తన కుమారుడు నైతిక్ పుట్టినప్పుడు మదిలో మెదిలిన పాటకు ఆమె అక్షర రూపం ఇచ్చారు. ఇదే పాటను తన కుమారుడికి నేర్పించే క్రమంలో కలెక్టరేట్ సిబ్బందికి కొత్తగా అనిపించింది. ‘పాట సృజనాత్మకంగా ఉంది. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఈ పాటని జిల్లాలోని అన్ని అంగన్ వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది’ అని అడిగారు. అందుకు సత్పతి సరే అన్నారు.
ఆక్షరాలే ఆట పాటలై...
అప్పటికే అంగన్ వాడీల బలోపేతంపై పమేలా సత్పతి దృష్టి సారించారు. చిన్నారులకు పోషకాహారం లోపం రాకుండా బలవర్ధ్దక ఆహారంతో పాటు ఆటపాటలతో కూడిన చదువును అందించాలనుకున్నారు. ఇటీవల ‘ఏ ఫర్ యాక్టివ్’ పాటను వీడియో రూపంలో విడుదల చేశారు. పిల్లలకు ఈ పాట ఎంతో నచ్చి ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఇది కేవలం పాట మాత్రమే కాదు..పాట రూపంలో ఎన్నో విషయాలను పిల్లలకు సులభంగా చెబుతున్న పాఠం.
బహు భాషలలో శభాష్ అనిపించుకుంటూ...
‘ఇది చాలు’ అనుకునే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలి...అనే తపన ఉన్న వాళ్లు ఎంతో ముందుకు వెళతారు. కలెక్టర్ పమేలా రెండో కోవకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలని తపించే జ్ఞానపిపాసీ. ఆమె మాతృభాష ఒడియా. హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు. తెలుగు రాయగలరు, చదవగలరు.
బాధలు తెలుసుకోవడానికి కోయ భాష నేర్చుకుంది...
భద్రాచలంలో పనిచేసే సమయంలో అక్కడ గిరిజనుల బాధలు వారి నోట నుంచి తెలుసుకునేందుకు కోయ భాష నేర్చుకున్నారు పమేలా. అంతేకాదు...కోయ భాషలో పాటలు రాసే స్థానిక రచయితలనుప్రాంపోత్సహించి ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించి విడుదల చేయించారు. కరీంనగర్‌కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అనుకున్నదే తడవుగా ట్యూటర్‌ను వెదికారు. ఉర్దూలో అక్షరాలు నేర్చుకుని బేసిక్ కోర్సు పూర్తి చేశారు.
‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ’ నుంచి ఉర్దూలో డిప్లమా చేశారు. భవిష్యత్‌లో మరిన్ని కోర్సులు చేసి ఉర్దూలో ప్రావీణ్యాన్ని సాధించాలనుకుంటున్నారు.
తెలంగాణలో నిజాం రాజుల కాలంలో రాసిన రెవెన్యూ రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. అలాంటి వాటిని చదివి అర్థం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉర్దూ నేర్చుకోవడమే కాదు తెలుగు గొలుసు రాతను అధ్యయనం చేస్తున్నారు పమేలా సత్పతి.
‘సృజనాత్మక కళలు, ఉద్యోగ నిర్వాహణ బాధ్యతలు ఒకే ఒరలో ఇమడవు’ అని అపోహ పడేవారికి కలెక్టర్ పమేలా సత్పతి రాసిన పాట....మేలుకొలుపు మాట. ‘కచ్చితంగా సాధ్యమే’’ అని బలంగా చెప్పే మాట.
‘సృజన మానసికవికాసానికే కాదు...అభివృద్ధికి కూడా’ అని చెప్పే బంగారు బాట.
వారి మనసు చదవాలంటే...
నాకు ఏప్రాంపాంతంలో పనిచేసినా ఆప్రాంపాంత ప్రజల భాష, సంస్కృతి, సంప్రదాయల గురించి తెలుసుకోవడం ఇష్టం. వారి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకం అయినప్పుడే వారి హృదయాలను అర్థం చేసుకోగలం. సమస్యలను పరిష్కరించగలం. ప్రతిప్రాంపాంతానికి తనదైన విశిష్ఠత ఉంటుంది. ఆ విశిష్ఠతను అభిమానించడం అంటే ఇష్టం. చాలామంది పేదప్రజలకు మాతృభాష తప్ప వేరే భాష రాకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల సేవ కోసం వచ్చే అధికారులకు బహు భాషలతో పరిచయం అవసరం. వారి భాషను అర్థం చేసుకోగలిగితే వారి సమస్యను లోతుగా అర్థం చేసుకోగలం.
– పమేలా సత్పతి, కలెక్టర్, కరీంనగర్
– భాషబోయిన అనిల్‌కుమార్
‘సాక్షి’ ప్రతినిధి, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment