urdu language
-
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్! మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దీన్ని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది. -
అతను అలా ఉండటం వల్లే...మంత్రి పదవి దక్కింది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే బీజేపీకి ముస్లిం మైనారిటీల మంత్రిగా డానిష్ ఆజాద్ అన్సారీని నియమించినట్లు బీజేపీ వెల్లడించింది. అన్సారీ బలియా జిల్లా నివాసి, యూపీ ప్రభుత్వం ఉర్దూ భాషా కమిటీలో సభ్యుడు కూడా. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా సేవలందించారు. అన్సారీ తన రాజకీయ జీవితాన్ని లక్నో విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎబీపీలో ఆయన అనేక పదవులు నిర్వహించారు. యువకులు, మైనారిటీ వర్గాల్లో ఆయన నిరంతరం చురుగ్గా వ్యవహరిస్తుండడమే ఆయనకు మంత్రి పదవి రావడానికి కారణంగా భావిస్తున్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలు, యువత అభ్యున్నతికి కట్టుబడి ఉందని గతంలో ఆయన చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచడం, మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా నొక్కి చెప్పారు. శ్రీకాంత్ శర్మ, సతీష్ మహానా, మహేందర్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్, నీలకాంత్ తివారీ, మొహసిన్ రజాలు ఈసారి కేబినెట్‌కు దూరమయ్యారు. కిక్కిరిసిన లక్నో స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, బాలీవుడ్ తారలు హాజరైన వేడుకలో యోగి ఆదిత్యనాథ్ 37 ఏళ్ల రికార్డుతో రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు 52 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించి 41.29 శాతం ఓట్లతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. రాష్ట్రంలో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రి. (చదవండి: ప్చ్.. ఆయనొక బీజేపీ నేత.. పేరు మాత్రం ‘కాంగ్రెస్’!) -
రెండో అధికారిక భాషగా ఉర్దూ
సాక్షి, అమరావతి: మైనార్టీల సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం–2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ బాష ప్రతిపాదించారు. ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ.. ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఉర్దూకు తెలుగుతో సమాన హోదాను కల్పించడంతో ప్రతి మైనార్టీ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022’ బిల్లుతో వచ్చే 10 ఏళ్లలో అల్ప సంఖ్యాక వర్గాలకు భద్రత, సామాజిక హోదాతో పాటు సమధర్మాన్ని పాటించేందుకు వీలుంటుందని అంజాద్ బాషా చెప్పారు. ఆర్థిక, విద్య, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ మూడేళ్లలో ఇది చారిత్రక సెషన్ అని కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఉర్దూకు అరుదైన గౌరవం రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఉర్దూకు అరుదైన గౌవరం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికారిక భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దానిని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టయింది. రాష్ట్రంలో 32.45 లక్షల మందికి ఉర్దూ మాతృభాషగా ఉంది. ఉర్దూ మాట్లాడే ప్రజలు వైఎస్సార్ కడపలో 19 శాతం, గుంటూరులో 15.55 శాతం, చిత్తూరు 13.16 శాతం, అనంతపురంలో 12.91, కర్నూలు 11.55, కృష్ణాలో 8.42 శాతం, ప్రకాశంలో 5.65 శాతం, నెల్లూరులో 7.84 శాతం ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ సుమరు రెండు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలున్నారు. -
ఉర్దూ తెలియక...ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు దెబ్బ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫెండ్లీ పోలీసింగ్ విధానం రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుండగా.. ముస్లిం నివాస ప్రాంతాల్లో మాత్రం అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ముస్లింల ప్రాబల్యం అధికంగా గల పాతబస్తీ, చార్మినార్ వంటి ప్రాంతాల్లో పనిచేసే పోలీసులకు ఉర్దూ భాష తెలియక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘పోలీసుల ఉద్దేశం మంచిదే అయినా, భాషా రాహిత్యం వల్ల వారు ముస్లిం వర్గాలతో మాట్లాడే సందర్భంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యం దెబ్బతింటోంద’ని అడ్వకేట్ సమీయుద్దీన్ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు.. తెలుగులో ‘మీరు’ అనే మర్యాదపూర్వక పిలుపుకు ఉర్దూలో ‘ఆప్’అనే పదం ఉంది. కానీ, దానికి బదులు ‘తు’ అనే పదాన్ని ప్రయోగించినప్పుడు ఎదుటివారి మర్యాద తగ్గించి మాట్లాడిన వారమవుతామని ఆయన అన్నారు. క్రిమినల్స్‌తో దురుసుగా మట్లాడితే ఫరవాలేదుగానీ, చిన్న చిన్న ఫిర్యాదుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్కువ చేసే వ్యాఖ్యలు పొరపాటున వ్యక్తమయినా ప్రజలకు పోలీసులపై చెడు అభిప్రాయం కలుగుతుందని మరో అడ్వకేట్ మహ్మద్ రషీద్ అన్నారు. అయితే, భారత పోలీసు సేవల చట్టం ప్రకారం.. ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారో ఆయా ప్రాంతీయ భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిబంధన ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ఆ నిబంధన పెద్దగా అమల్లోలేదు. దాంతో, గొడవలు, అల్లర్లు జరిగినప్పుడు ఆదేశాలు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. కాగా, ఉర్దూ తదితర భాషల్లో పట్టుసాధించడానికి పోలీసులకు స్వల్పకాలిక కోర్సులు ప్రవేశపెట్టనున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
ఉర్దూలోనూ అన్ని ప్రవేశ పరీక్షలు
-
ఉర్దూలోనూ అన్ని ప్రవేశ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోనే నిర్వహిస్తున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఇకపై ఉర్దూ భాషలోనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను ఇకపై ఉర్దూలో కూడా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇచ్చే ప్రశ్నపత్రాలను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోనే ముద్రించేవారు. అయితే 2018–19 విద్యా సంవత్సరంలో తొలిసారిగా ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లో ఇచ్చే ప్రశ్నలను ఉర్దూలో ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా సెట్ కమిటీలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఉర్దూ మాతృభాషగా కలిగిన విద్యార్థులకు ప్రశ్నలు మరింత సులభంగా అర్థం అవుతాయన్నారు. పీజీ ప్రవేశ పరీక్షల్లో కూడా... పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షల్లోనూ ఉర్దూ భాషలో ప్రశ్నపత్రాలను ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇంగ్లిష్ నుంచి ఉర్దూ భాషలోకి ప్రశ్నలను అనువాదం చేసేందుకు ట్రాన్స్‌లేటర్లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఉర్దూ ఎంతో తియ్యనైనది
హైదరాబాద్: ఉర్దూ భాష ఎంతో తియ్యనైనదని... మా తాత కూడా చదివేవారు, మాట్లాడేవారని ఐటీ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. మంచి భాషను ప్రోత్సహించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం రెండవ రాష్ట్ర భాషగా ఉర్దూకు గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ‘రోడ్ టు జీఈఎస్’ పేరిట ఢిల్లీలో ప్రారంభమైన ‘షురువాత్’ బస్సు నగరానికి చేరుకోగా ఉర్దూ విశ్వవిద్యాలయంలో దానికి మంత్రి ‘ఫ్లాగ్ ఇన్’స్వాగతం పలికారు. అనంతరం నీతి ఆయోగ్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ సంయుక్తంగా గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఓపెన్ ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటు న్నాయన్నారు. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్‌తో మరింతగా ప్రోత్సాహకం లభిస్తుందని, ఇది ప్రారంభమేనని, భవిçష్యత్తులో మరిన్ని అద్భుతాలు చూసే అవకాశం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేశ్‌వాలా, గెల్ఫ్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, వర్సిటీ వీసీ డాక్టర్ షకీల్ ఆహ్మద్, ‘షురువాత్’ బస్ టీమ్ సభ్యులు, విద్యార్థులు, స్టార్టప్ నిర్వాహకులు పాల్గొన్నారు. -
ఉర్దూలో మాట్లాడుతూ.. మధ్యలో 'అధ్యక్షా'
ఉర్దూ భాషను అన్ని జిల్లాల్లో రెండో భాషగా గుర్తిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. అలాగే జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూములను సొంతం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిపై బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో కమిటీని నియమించామని, ఆ కమిటీ ఎక్కడెక్కడ వక్ఫ్ భూములున్నాయో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. కమిటీ సమావేశాలకు మజ్లిస్ నేతలు కూడా వెళ్లి తాము గుర్తించిన విషయాలను కూడా చెప్పాలని అన్నారు. వక్ఫ్ భూములు, ఉర్దూ భాషకు సంబంధించిన విషయం కావడంతో తన సమాధానం అంతా ఉర్దూలోనే ఇచ్చిన కేసీఆర్.. మధ్యలో మాత్రం అలవాటుగా 'అధ్యక్షా' అని రెండుసార్లు తెలుగులోనే సంబోధించారు. దానికి ముందు, తర్వాత కూడా ఉర్దూలోనే మాట్లాడిన ఆయన.. ఉర్దూ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా వాసి
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాకు చెందిన సీ.ఖలందర్‌బాషా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, ఉర్దూ ఎస్సీఆర్టీ కోఆర్డినేటర్ ఇర్షాద్‌అలీబేగ్ శుక్రవారం విలేకర్లకు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఉర్దూ భాషోపాధ్యాయులు కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఎండీ అబ్దుల్ రవూఫ్ (కర్నూలు), ఉపాధ్యక్షుడిగా ఎండీ అబ్దుల్హ్రమాన్‌ఖాన్ (నెల్లూరు), ప్రధాన కార్యదర్శిగా ఎస్ఏ.సత్తార్ ఫయాజి (కడప), జాయింట్ సెక్రటరీగా ఎస్.మహమ్మద్‌సాహెబ్ (గుంటూరు), కోశాధికారిగా కే.ఫిరోజ్‌అహ్మద్ (చిత్తూరు) ఎన్నికయ్యారు. (మదనపల్లె) -
తెలుగు తేటగీతి వెలుగు ‘యాది’
ఆయన రచనలు చదువుతుంటే ఆత్మీయులు ముందు కూర్చొని ముచ్చటిస్తున్నట్టు ఉంటుంది. వాటిలో సాహిత్యంతో పాటు సాహితీకారుల వ్యక్తిగత జీవితాల్లోని వివిధ పార్శ్వాలు తొంగి చూస్తుంటాయి. సదాశివ సాహితీ ప్రయాణం కొన్ని శతాబ్దాల జీవితాన్ని బోధపరుస్తుంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ సరిహద్దు జిల్లా కావడంతో సహజంగానే అది బహుభాషా ప్రాంతం. సరస్వతీ పుత్రుడు డాక్టర్ సామల సదాశివ ఆ ప్రాంతంలోని తెలుగుపల్లె గ్రామంలో 1928లో కన్ను తెరిచారు. తెలుగుతో పాటు ఉర్దూ, మరాఠీలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజల వాడుకలో ఉండేవి. నిజాం పాలనలో అధికారిక వ్యవహారాలన్నీ ఉర్దూలోనే జరిగేవి. ఉద్యోగాల కోసం ఉర్దూ నేర్చుకోక తప్పేది కాదు. నాటి ఉర్దూ ఉపాధ్యాయులు ఎలాంటి శిక్షణ లేకున్నా తాదాత్మ్యంతో, ఆవేశంతో పాఠాలు బోధిస్తుంటే విద్యార్థులు లీనమైపోయేవారు. తెలుగు ఉపాధ్యాయులు అలా ఆకట్టుకోకపోయేవారు. దీంతో విద్యార్థిగా ఉండగానే సదాశివకు తెలుగు కంటే ఉర్దూపైనే అమితాసక్తి కలిగింది. తండ్రి నాగయ్య పంతులుతో సన్నిహితంగా ఉండే రియాదల్ రెహమాన్ దగ్గర పార్సీ భాషను నేర్చుకున్నారు. సహజ సిద్ధంగానే ఆసక్తి ఉండ టం అవసరం. ఆ ఆసక్తికి తోడు తగిన పరిసరాలు, పెద్దలు, గురువుల సాంగత్యం లభించటం వల్ల సదాశివలో రచనాసక్తి పెంపొందింది, ఆయన రచనా వ్యాసంగం ఫలప్రదమైంది. ఆయన వచనంలో సరళత, స్పష్టత, సహజత్వం ఉట్టిపడతాయి. ఆయన రచనలు చదువుతుంటే ఆత్మీయులు ముందు కూర్చొని ముచ్చటిస్తున్నట్టు ఉంటుంది. సదాశివ రచనల్లో సాహిత్యంతో పాటు సాహితీకారుల వ్యక్తిగత జీవితాల్లోని వివిధ పార్శ్వాలు కూడా తొంగి చూస్తుంటాయి. సదాశివ సాహితీ ప్రయాణం కొన్ని శతాబ్దాల జీవితాన్ని బోధపరుస్తుంది. సదాశివ తన ‘యాది’ రచనలో ఉర్దూ భాషతో తనకున్న అనుబంధాన్ని, ఉర్దూ గజల్స్‌ను, రుబాయీలను, వాటిలోని సూఫీ వేదాంతాన్ని పాఠకులతో పంచుకున్నారు. సందర్భానుసారంగా వాటిని పరిచయం చేశారు. గజల్ పార్సీ కవితా ప్రక్రియే తప్ప అరబ్బీ దానికి మూలం కాదంటారు సదాశివ. పార్సీ గజల్ గమనాన్ని తొలిసారిగా తెలుగులోకి అనువదించిన వారు గురజాడ అప్పారావు, కాళోజీ. ఉర్దూ గజల్ స్వరూపాన్ని, ఉర్దూ కవిత్వపు రుచిని చూపిన వారిలో ఆద్యులు దాశరథి. ఆ తదుపరి డాక్టర్ సి. నారాయణరెడ్డి వంటి వారు ఉర్దూ కవితా లతను తెలుగునాట ప్రవర్ధిల్లజేయడంలో విశేష కృషి చేశారు. గజల్ తరువాత సదాశివ సందర్భానుసారంగా ‘యాది’లో ప్రస్తావించిన మరో ప్రక్రియ రుబాయీ. అది మన తేటగీతి పద్యం వంటి నాలుగు పంక్తుల కవిత. మూడు పంక్తులకు ఖఫియారదీపుల నియమముంటుంది. మూడవ పంక్తికి ఉండదు. అంటే 1, 2, 4 చరణాలకు అంత్య ప్రాస నియమం పాటించాలి. ఉమర్ ఖయ్యూం రాసిన రుబాయీలు జగత్ప్రసిద్ధమైనవి. మరోకవి హజ్రత్ అమ్జద్. ఈయన హైదరాబాద్ గర్వించదగిన రుబాయీలను రచించారు. అమ్జద్ రుబాయీలను సదాశివ తెలుగులోకి అనువదించడం వల్ల వాటి ప్రస్తావన యాదిలో కనబడుతుంది. సురవరం ప్రతాపరెడ్డి, వేలూరి శివరామశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి వంటి ప్రముఖులు సదాశివ రుబాయీలను, పద్యానువాదాన్ని ప్రశంసించారు. తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రాంతం చాలా కాలంగా తీవ్ర నిరాదరణకు గురైంది. ఒకప్పుడు గ్రాంథిక భాష అని, మరొకప్పుడు శిష్ట వ్యావహారికమని ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ భాషాసంస్కృతులను చిన్నచూపు చూశారు. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని, నిలచి తనదైన సొంత శైలిని ఏర్పరచుకున్న గొప్ప సాహిత్యవేత్త సదాశివ. జన వ్యవహారంలోని ఉర్దూ, హిందీ, మరాఠీ తదితర భాషల్లోని పదాలను తన రచనల్లో వాడి ఆదిలాబాద్ భాషకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. తెలంగాణ సాహిత్యం నిరాదరణకు గురవుతోందని ఆయన ఆవేదన చెందేవారు. నన్నయకన్నా ముందు పాల్కురికి సోమనాథుని వంటి తెలంగాణ కవులున్నా, నన్నయనే ఆదికవిని చేశారు. తెలంగాణ చిన్నది, సీమాంధ్ర ప్రాంతం పెద్దది. చరిత్ర రచన, పత్రికలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని సదాశివ ఆవేదన చెందేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో నేటికైనా తెలుగు సాహిత్య చరిత్రను నిష్పాక్షికంగా, రాగద్వేషాలకు అతీతంగా పునర్నిర్మించి, తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలను సుసంపన్నవంతం చేయడంలో తెలంగాణ పాత్రను వెలుగులోకి తేవడమే సాదాశివకు అర్పించగల నిజమైన నివాళి. కిషోర్ రాథోడ్ -
ఉర్దూకు ‘మహా’ గౌరవం
భివండీ, న్యూస్‌లైన్: ఉర్దూ భాషకు మహారాష్ట్రలో సముచిత స్థానం లభించిందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం జరిగిన జి.ఎం.మోమిన్ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన అఖిల భారతీయ ఉర్దూ మహా సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉర్దూ భాష తన అస్తిత్వాన్ని కాపాడుకుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషను సరిగా పట్టించుకోవడం లేదన్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రం గౌరవం లభించిందన్నారు. ఉర్దూ భాష ఉనికిని కాపాడడం కోసం జీ.ఎం. మోమిన్ గర్ల్స్ కళాశాల ఇటువంటి మహాసమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు కూడా చేపట్టాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉర్దూ భాష వికాసం కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కె.శంకరనారాయణన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఫౌజియాఖాన్, ఠాణే జిల్లా ఇంచార్జి మంత్రి గణేశ్ నాయిక్, మైనారిటీ శాఖ మంత్రి ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.