
హైదరాబాద్: ఉర్దూ భాష ఎంతో తియ్యనైనదని... మా తాత కూడా చదివేవారు, మాట్లాడేవారని ఐటీ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. మంచి భాషను ప్రోత్సహించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం రెండవ రాష్ట్ర భాషగా ఉర్దూకు గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ‘రోడ్ టు జీఈఎస్’ పేరిట ఢిల్లీలో ప్రారంభమైన ‘షురువాత్’ బస్సు నగరానికి చేరుకోగా ఉర్దూ విశ్వవిద్యాలయంలో దానికి మంత్రి ‘ఫ్లాగ్ ఇన్’స్వాగతం పలికారు. అనంతరం నీతి ఆయోగ్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ సంయుక్తంగా గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఓపెన్ ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటు న్నాయన్నారు. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్‌తో మరింతగా ప్రోత్సాహకం లభిస్తుందని, ఇది ప్రారంభమేనని, భవిçష్యత్తులో మరిన్ని అద్భుతాలు చూసే అవకాశం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేశ్‌వాలా, గెల్ఫ్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, వర్సిటీ వీసీ డాక్టర్ షకీల్ ఆహ్మద్, ‘షురువాత్’ బస్ టీమ్ సభ్యులు, విద్యార్థులు, స్టార్టప్ నిర్వాహకులు పాల్గొన్నారు.