సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కేవలం బీఆర్‌ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష నిర్ణయాలుండవు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. లోక్ సభ సన్నాహక సమావేశాల తొలిరోజు బుధవారం తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పేగులు తెగేదాకా పోరాడేది బీఆరెస్సే
‘బీఆర్‌ఎస్ దళం, గళం పార్లమెంటులో ఉండాలి. బీఆర్‌ఎస్ వల్లే పార్లమెంటులో తెలంగాణ మాట ప్రతిధ్వనిస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్‌ఎస్ మాత్రమే. బెంగాల్‌కు మమతా బెనర్జీ, తమిళనాడుకు డీఎంకే స్టాలిన్, ఏపీకి జగన్, చంద్రబాబు, ఒడిశాకు నవీన్ పట్నాయక్, బీహార్‌కు నితీశ్‌కుమార్, మహారాష్ట్రకు శరద్ పవార్ తరహాలో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక, పర్యాయపదం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆ తర్వాత విభజన హామీల అమలు, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కొట్లాడింది కూడా కేసీఆర్ మాత్రమే. మోదీ, రాహుల్ ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడరు. తెలంగాణ గళానికి బలం లేకపోతే పార్లమెంటులో తెలంగాణ పదం వినపడకుండాపోయే చాన్స్ ఉంది..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు కార్యాచరణ
‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటాం. చిన్న చిన్న లోటు పాట్లను సరిదిద్దుకునే దిశగా అంతర్గతంగా కార్యాచరణ ప్రారంభించాం. కేసీఆర్ కోలుకునేందుకు మరో ఐదారు వారాలు పడుతుంది. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చి అందరితోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు.
ఆదిలాబాద్ లోక్‌సభ సమీక్ష సందర్భంగా సుమారు 26 మంది నేతలు మాట్లాడిన అంశాలను క్రోడీకరించి కేసీఆర్‌కు వివరిస్తాం. స్థానిక వ్యతిరేకతతో కొందరు ఎమ్మెల్యేలు ఓడినా సీఎంగా కేసీఆర్ ఉంటారని ప్రజలు భావించినట్లు మా నేతలు చెప్తున్నారు. అభివృద్ధి విషయాల్లో ఎక్కడా బీఆర్‌ఎస్ పనితీరుపై ఫిర్యాదులు లేవు. కాంగ్రెస్ ఫేక్ ప్రాపగాండాతో యువత, ఉద్యోగులు కొంత దూరమయ్యారు. పార్టీ, పాలనలో కొన్ని లోటుపాట్లు సవరించక పోవడం వల్ల ఓటమి పాలయ్యామనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దానికనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తాం..’ అని చెప్పారు.
కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడతాం
‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమని స్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యా లుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్ని స్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం.
రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. కేడర్‌కు అండగా ఉంటూ కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం..’ అని కేటీఆర్ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment