
యశోద ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో వాకర్ సాయంతో నడుస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్, ఆయనకు తోడుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రతిపాదనను బలపరిచారు.
పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రతిపాదనను బలపరుస్తూ చప్పట్లు కొట్టడంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. శాసనసభా పక్ష డిప్యూటీ లీడర్ నియామకం ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశాన్ని హరీశ్‌రావు సమన్వయం చేశారు.
సమావేశం ముగిశాక ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.