సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చదవండి: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్!
మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దీన్ని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment