
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ 70 నుంచి 80 శాతం వరకు తెలుగులోనే సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అధికార భాషా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. చట్టం తీసుకొచ్చిన స్ఫూర్తికి అనుగుణంగా అధికార భాష అమలుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామంది. తగిన సమయంలో చట్ట ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపింది. అధికార భాష అమలుకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లు అమలుకు నోచుకోలేదని, ఈ నేపథ్యంలో 2020లో అధికార భాష కమిషన్‌ను ఏర్పాటు చేశారని వివరించింది.
అధికార భాషా చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆశ్రమ్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ కౌంటర్ దాఖలు చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment