public interest litigation(PIL)
-
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
ఢిల్లీ, సాక్షి: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించాలని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే.. ఢిల్లీ హైకోర్టు గురువారం ఆ పిల్‌ను కొట్టేసింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమని.. అలాగే జైలు నుంచి కేజ్రీవాల్ పాలన నడిపించడాన్ని కూడా తాము అడ్డుకోలేమని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ మన్మోహన్(తాత్కాలిక), జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన రైతు, సామాజిక వేత్త సుర్జిత్‌సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. -
ప్రభుత్వం ఘనతలను చెప్పుకోవడంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో అధికారులు పాల్గొనకుండా, ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తన ఘనతలను ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వివరించడంలో తప్పేమీ లేదంది. ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుందని వ్యాఖ్యానించింది. ఇది ప్రచారం మాత్రమే కాదని, ప్రజలకు సమాచారం అందించడం కూడా అని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజూ వాటి ఘనతల గురించి పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నా యంది. తాము (హైకోర్టు) కూడా ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను బుక్లెట్ రూపంలో న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వివరిస్తున్నామంది. ఇందుకు ప్రభుత్వసాయం కూడా తీసుకుంటున్నామని చెప్పింది. ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పిల్ ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జర్నలిస్ట్ కట్టెపోగు వెంకయ్య దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ, ఈ కార్యక్రమాన్ని మొదట అధికార పార్టీ కార్యక్రమంగా చేపట్టారన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్లో కూడా చెప్పారన్నారు. ఆ తరువాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని, వాలంటీర్లను, అధికారులను భాగస్వాములను చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ బుక్లెట్లు ముద్రించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారన్నారు. ఇందుకోసం రూ.20 కోట్లు విడుదల చేశారని చెప్పారు. వాలంటీర్లు అధికార పార్టీ జెండాలను ఎగురవేస్తున్నారని, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్నారు. పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. వాలంటీర్లు జెండాలు ఎగురవేస్తున్నారనడానికి ఆధారాలు ఏమున్నాయని అడిగింది. పత్రికల్లో కథనాలు వచ్చాయని నర్రా శ్రీనివాసరావు చెప్పగా.. వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉమేష్ చంద్ర స్పందిస్తూ.. పత్రికా కథనాలను హైకోర్టులు సుమోటో పిల్‌గా పరిగణిస్తూ విచారణ జరుపుతున్నాయన్నారు. విచారణ సందర్భంగా పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇటీవల చాలా స్పష్టంగా చెప్పిందని సీజే స్పష్టం చేశారు. రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి వంటి కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధమని శ్రీనివాసరావు అనగా.. ఆ రూల్స్ ఐఏఎస్‌లకే వర్తిస్తాయని, మిగిలిన వారికి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలను అధికారుల ద్వారా ప్రచారం చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. తన స్వరాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో కూడా ఇలాగే చేశారని సీజే జస్టిస్ ఠాకూర్ వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) మహేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. -
తవ్వి తలకు పోసుకుందామా?
పిచ్చి కుదిరింది... తలకు రోకలి చుట్టమన్నాడట! చరిత్ర పేరుచెప్పి, దేశంలో ప్రతి ఊరి పేరు, వీధి పేరు, స్థలం పేరూ మార్చేయాలని చూస్తున్న వేలంవెర్రిని గమనిస్తే, ఆ నానుడి గుర్తుకొస్తుంది. సర్వోన్నత న్యాయస్థానానికి సైతం అదే గుర్తొచ్చింది. ఆ మాటనే పస లేని పిటిషన్‌తో వచ్చిన ఫిర్యాదీతో సహా పదుగురికీ మరో పద్ధతిలో గుర్తూ చేసింది. ‘ఆటవిక విదేశీ దురాక్రమణదారులు మార్చిన’ చారిత్రక ప్రదేశాల ‘అసలు’ పేర్లను పునరుద్ధరించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది. జస్టిస్ జోసెఫ్, నాగరత్నల ధర్మాసనం పిటిషనర్ అత్యు త్సాహాన్ని తప్పుబట్టింది. భారత్ పదేపదే దాడులకు గురైంది నిజమే. విదేశీయులు మనల్ని పాలించినదీ నిజమే. దాన్ని గుర్తిస్తూనే, ‘సమాజంలో విభేదాల’ సృష్టికి ‘చరిత్రను కొంతమేరకే తవ్వి తలకుపోస్తున్న’ ప్రయత్నాలను సుప్రీమ్ నిరసించడం సరైన సమయంలో వెలువడింది. చరిత్ర పట్ల ఏదో నిర్ణీత దృక్పథం పెట్టుకొని, తదనుగుణంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశాన్ని గత చరిత్రలో బందీని చేయరాదంటూ పిటిషనర్‌కు కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. వర్తమాన భారతావనిలో పరిష్కరించాల్సిన అనేక అంశాలుండగా, ఈ పేర్ల మార్పిడినే అజెండాగా పాలకులు, వారి భావజాల దాసులు తలకెత్తుకోవడం విచిత్రం. తాజాగా మహారాష్ట్రలో మొఘల్ పాలకులు ఔరంగజేబ్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేర్ల మీద వెలసిన నగరాలైన ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా ఆ రాష్ట్ర పాలకులు మార్చేశారు. గత వారమే కేంద్రం దానికి రాజముద్రా వేసింది. ఇప్పుడిక అహ్మద్‌నగర్‌ను రాణి అహిల్యాదేవి హోల్కర్ పేరిట మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. సరిగ్గా అదే రోజున పేర్ల మార్పిడిపై సుప్రీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కళ్ళు తెరిపించేలా ఉన్నాయి. ఆత్మశోధనకు ప్రేరేపిస్తున్నాయి. పేరులో ఏముంది పెన్నిధి అన్నారు పెద్దలు. కానీ, పేరులోనే అంతా ఉంది, ఒక వర్గం పాల కులు వచ్చి మన పేర్లు మార్చేశారంటూ రాగద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం నేటి వికృత ధోరణి. పాత పేర్లను మార్చడం ద్వారా సమాజంలో ఒక వర్గం ఏకీకృతమై, తమ వైపు మొగ్గేలా చేసుకోవాలన్న వ్యూహం దేశ రాజకీయాల్లో ఇటీవల ప్రబలుతోంది. ఇది ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ‘నేను క్రైస్తవుణ్ణి. అయితేనేం, నాకు హిందూయిజమూ ఇష్టం. ఎంతో గొప్పదైన హిందూ ధర్మాన్ని తక్కువ చేయకూడదు’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించడం విశేషం. మన దేశానికి పునాదులుగా నిలిచిన సహనం, సౌభ్రాతృత్వం, భిన్నత్వం, సమ్మిళితత్వాలకు ఒక రకంగా ఇది పునరుద్ఘాటన. భిన్నత్వంలో ఏకత్వానికి ఘనత వహించిన గడ్డపై ఒక విధమైన భావజాలమే ఉండాలనీ, ఈ దేశాన్ని పాలించిన విభిన్న వర్గీయులంతా వట్టి ‘దురాక్రమణదారులు, విదేశీ దోపిడీదారులు’ అనీ ప్రచారం చేస్తే మూర్ఖత్వమే. అన్ని పేర్లూ మార్చి, అన్ని ముఖాలకూ సున్నం కొట్టి ఒకే ఉనికిని ధ్రువపరచాలనుకోవడం సాంస్కృతిక, భావజాల సామ్రాజ్యవాదమే తప్ప సమానత్వం కానేరదు. గద్దె మీది పెద్దలైనా, సమాజంలోని ఇతరులైనా ఈ ఉన్మాదాన్ని పెంచిపోషిస్తే, సామరస్యం దెబ్బతింటుంది. ఎవరైనా చేయాల్సింది మెరుగైన ప్రజాజీవనానికి తోడ్పడేలా విధానపరమైన మార్పులు తప్ప, ఒకరిపై మరొకరిని ఉసిగొలిపే పేరు మార్పులు కాదు. పాత గాయాలను కెలికి, ప్రజల్లో విభేదాలు సృష్టించే ఇలాంటి చర్యలను న్యాయవ్యవస్థే కాదు... బుద్ధిజీవులతో పాటు రాజకీయ సారథులూ నిర్ద్వంద్వంగా ఖండించాలి. అయితే, అధికారం చేపట్టిన ప్రతి పార్టీ ఇదే పేర్ల మార్పిడి తప్పు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ దేశ రాజధానిలోని ప్రసిద్ధ కన్నాట్ ప్లేస్‌ను రాజీవ్ చౌక్‌గా, కన్నాట్ సర్కిల్‌ను ఇందిరా చౌక్‌గా పేర్లు మార్చింది. రెండు తడవలుగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ గడచిన కొన్ని నెలల్లో ఎన్ని పేర్లు మార్చిందో లెక్కే లేదు. బ్రిటీషు, మొఘల్ పాలకుల గతాన్ని వదిలించుకోవడానికంటూ కొత్త పేర్ల కథను సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్తమానమే వివాదాలమయం అయినప్పుడు గతం అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. వివాదాలు నిండిన ఆ గతాన్ని పట్టుకొని వేలాడి, ఆగతాన్ని వదిలేసి, నవ నామ్నీకరణలకు దిగితే... కాలహరణమే తప్ప ప్రజానీకానికి పైసా ప్రయోజనం లేదు. దాని బదులు పాలనపై శ్రద్ధపెట్టి, అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ఇప్పుడు ముఖ్యం. ప్రస్తుత పాలకులు రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్ అన్నా, మొఘల్ గార్డెన్స్‌ను అమృతోద్యానంగా మార్చినా, ఢిల్లీలోని ఔరంగ్జేబ్ రోడ్, యూపీలోని అలహాబాద్, మొఘల్ సరాయ్లకు కొత్త పేర్లు పెట్టినా సామాన్యుల జీవితమేమైనా మారిందా? చరిత్రను భూతంగా, ఒక వర్గం పాలకులనంతా పీడకులుగా, హిందువులు తప్ప మిగతా అందరూ ‘బయటివాళ్ళు’, ‘దోపిడీదొంగలు’గా అసత్య చిత్రణ వల్ల లాభం ఎవరికి? ఈ మిడిమిడి వాట్సప్ జ్ఞానంతో, మధ్యతరగతిని రెచ్చగొట్టే భావోద్వేగ రాజకీయ విన్యాసంతో ఓట్లు, సీట్ల లెక్కల్లో తాత్కాలిక ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ, స్వార్థంతో నాటుతున్న నేటి ఈ విషబీజాలు రేపటి సమాజాన్ని చీలుస్తుంటే ఆ శాశ్వత ప్రమాదానికి బాధ్యు లెవరు? కులమత విభేదాలకు అతీతమైన నవ భారత నిర్మాణాన్ని నిజంగా స్వప్నించేవారెవరూ ఈ పని చేయరు. పాలకుల స్వప్రయోజనాలతో రోజుకో రకం చరిత్ర చదివితే, అసలు కథ మరుగునపడే దుఃస్థితి దేశానికి దాపురిస్తుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడడమంటే ఇదే! -
ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ రిజర్వేషన్‌కు పిల్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డాక్టర్ వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఎన్సీసీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ సర్టిఫికెట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫెడరేషన్ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసయ్య నర్సింహ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కవిత గొట్టిపాటి వాదనలు వినిపిస్తూ.. ఎన్సీసీ కోటా విషయంలో అధికారులు ప్రభుత్వ జీవో ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బాధిత విద్యార్థులు వస్తే ఈ వ్యవహారంపై తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇది సర్వీసు వివాదమని, ఇలాంటి వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అయినా కూడా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. కవిత జోక్యం చేసుకుంటూ.. ప్రవేశాలు జరుగుతున్నాయని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టేయకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. నోటీసులు జారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని పేర్కొంది. -
రుషికొండ తవ్వకాలపై సర్వే
సాక్షి, అమరావతి: విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల విషయంలో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ(ఎంవోఈఎఫ్)ను హైకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకోసం బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలు... ఏపీఎండీసీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు పనుల్లో భాగంగా తొలగించిన చెట్ల స్థానంలో కొత్తవి నాటుతున్నామని, అది భారీ స్థాయిలో చేపట్టామని వివరించారు. ఈ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో పిటిషనర్ల చిత్తశుద్ధి, నిజాయితీని చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పిల్ దాఖలు చేసే ప్రతి వ్యక్తి ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలం గానే ఉంటారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. -
భూ ఆక్రమణలపై కన్నెర్ర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ భూముల ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. మునిసిపాలిటీ, అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని రెండు నెలల్లోగా గుర్తించి ఆ తరువాత ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించిన తరువాత తిరిగి కబ్జాల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే విషయంలో నిబంధనలు అనుసరించాలని అధికారులకు సూచించింది. పంచాయతీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల పేరు మీద క్రమబద్ధీకరించరాదని, వాటిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాల్సిందేనంటూ జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2011లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జీవో 188 జారీ చేసి ఆక్రమణల తొలగింపునకు నిబంధనలు రూపొందించిందని తెలిపింది. అయినప్పటికీ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆక్రమణలపై పలు వ్యాజ్యాలు దాఖలు.. జీవో 188 జారీ అయినప్పటికీ ప్రభుత్వ భూములు, నీటి వనరులు, అటవీ, క్రీడా స్థలాలు, శ్మశానాల స్థలాలను ఆక్రమణల నుంచి అధికారులు కాపాడటం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది బుస్సా రాజేంద్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై పలు పిల్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సీజే ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. ఆక్రమణల చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి మారాలి... ‘జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 2011లో జీవో 188 జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ (ఆస్తుల పరిరక్షణ) రూల్స్‌ను తెచ్చింది. వీటి ప్రకారం పంచాయతీ భూములను మూడు రకాలుగా వర్గీకరించింది. 1.సొంతవి, సేకరించిన భూములు 2. దానంగా, విరాళంగా, పంచాయతీలకు బదిలీ చేసిన భూములు 3. పంచాయతీకి చెందిన భూములు. ఏటా పంచాయతీ పరిధిలోని భూముల వివరాలను సేకరించి గెజిట్‌లో ప్రచురించాలి. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపు కోసం కలెక్టర్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ మూడు నెలలకొకసారి సమావేశమై ఆక్రమణల తొలగింపు పురోగతిని సమీక్షించాలి. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా దురదృష్టవశాత్తూ అధికారులు వీటిని అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏటా పెరిగిపోతున్నాయి. హైకోర్టులో పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు నిబంధనలను అమలు చేయడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. çపంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలి’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే ముందు నోటీసు ఇచ్చి వారి వాదన వినాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయం నిర్ణయించుకుని ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని మునిసిపల్ అధికారులకు తేల్చి చెప్పింది. పంచాయతీ కార్యదర్శులంతా జీవో 188 ప్రకారం ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీ భూముల నుంచి ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్దేశించింది. వక్ఫ్ భూములను ఈ జాబితాలో చేర్చలేం.. ధర్మాసనం మొదట తన ఉత్తర్వులను పంచాయతీ, మునిసిపల్, అటవీ భూములకే పరిమితం చేయగా రెవెన్యూ, దేవదాయశాఖ భూములను కూడా జత చేయాలని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ రెవెన్యూ భూములను ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చింది. దేవదాయ శాఖ భూములపై వేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ మరో న్యాయవాది ఖాదర్ బాషా జోక్యం చేసుకుంటూ వక్ఫ్ భూములు కూడా పెద్ద సంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని, వాటిని కూడా ఆ ఉత్తర్వుల్లో చేర్చాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ వక్ఫ్ భూముల విషయంలో బహుళ వివాదాలుంటాయని, అందువల్ల వాటిని ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురాలేమని పేర్కొంది. -
‘పిల్’లు దుర్వినియోగం
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్) పేరుతో కొందరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు హెచ్చరించింది. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కొందరి వెనుక ఉంటూ డబ్బులిచ్చి హైకోర్టులో వీటిని దాఖలు చేయిస్తున్నారని పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో జరుగుతోందని, ఇలాంటి వ్యాజ్యాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉందని తేల్చి చెప్పింది. హైకోర్టులో కొందరి తరఫున పిల్లు దాఖలు చేయించేందుకు మధ్యవర్తులు కూడా ఉన్నారని తెలిపింది. తప్పుడు పిల్లు దాఖలు చేసే వారికి భారీగా ఖర్చులు విధించి తద్వారా గట్టి సందేశం పంపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోడంతో అదే అంశంపై తిరిగి ధర్మాసనం ఎదుట పిల్ దాఖలు చేసిన వ్యక్తులకు ఖర్చులను కచ్చితంగా విధిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకు ఇది అన్ని రకాలుగా అర్హమైన కేసు అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ నేపథ్యం.. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి పరిధిలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటును సవాలు చేస్తూ జి.సుధాకర్‌రెడ్డి మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత విచారణ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇదే అంశంపై సింగిల్ జడ్జి ఎదుట ఓ వ్యక్తి పిటిషన్ వేశారని, అందులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. ఆ విషయం తెలిసి కూడా పిటిషనర్లు పిల్ దాఖలు చేయడం కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. అత్యధిక శాతం దుర్వినియోగం చేసేవే.. తాజాగా ఈ పిల్ విచారణకు రావడంతో ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్లకు ఎంత మేర ఖర్చులు విధించాలో చెప్పాలని పేర్కొంది. ఈ రోజుల్లో నిజమైన పిల్లు చాలా స్వల్ప సంఖ్యలో దాఖలవుతున్నాయని, అత్యధిక శాతం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసేవేనని తెలిపింది. ఎవరో వేస్తారు.. ఎవరికో డబ్బు అందుతుంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు నిరక్ష్యరాస్యులని నివేదించారు. కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి ఎంత మాత్రం లేదన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదన్న విషయం వారికి తెలియదన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ పిల్లు దాఖలు చేసే వారికి భారీ మొత్తంలో ఖర్చులను విధించాల్సిందేనని, అయితే పిటిషనర్లు ఆ కోవలోకి రారని విన్నవించారు. అయితే నిరర్థక వ్యాజ్యాలపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి వ్యాజ్యాల కోసం తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, ఇన్ని రోజులకు అలాంటి వ్యాజ్యం ఎదురైందని, రూ.25 లక్షలను ఖర్చుల కింద విధించాలన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను సైతం సిద్ధం చేశామని తెలిపింది. ఎవరో పిల్ వేస్తారని, ఎవరికో డబ్బులు చెల్లిస్తారని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడం తమ పని కాదని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యంలో ఖచ్చితంగా ఖర్చులు విధిస్తామని, అయితే అది ఎంతనేది తరువాత నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
అది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం
సాక్షి, అమరావతి: పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలమని హైకోర్టు తేల్చి చెప్పింది. అధికరణ 226 కింద తాము ప్రభుత్వాన్ని నడపడంలేదని స్పష్టం చేసింది. తామున్నది ప్రభుత్వాలను నడిపేందుకు కాదని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవోలను సవాలు చేస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి.రమేశ్చంద్ర సింహగిరి పట్నాయక్ తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంతో పాటు ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలు మంగళవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కొందరు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందన్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని చెప్పారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది (పాఠశాల విద్య) ఎల్వీఎస్ నాగరాజు స్పందిస్తూ, తాజా వ్యాజ్యంలో కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు. ఏ వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయలేదో వాటన్నింటిలో కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. -
టీబీఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, మరమ్మతులు, సర్వీస్ కాంట్రాక్ట్ ఒప్పందం విషయంలో టెలీమ్యాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ (టీబీఎస్) సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.100 కోట్లకు పైగా బకాయిల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. బకాయిల చెల్లింపు, ఒప్పందం అమలు విషయంలో ప్రభుత్వంతో నెలకొన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించాలని కోరుతూ టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టేసింది. భవిష్యత్‌లో ఈ విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే దానిపై మధ్యవర్తిత్వానికి వెళ్లాలన్న నిబంధన ఏదీ ఇరుపక్షాలు మధ్య కుదిరిన ఒప్పందంలో లేదని తేల్చి చెప్పింది. బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ఎంతమాత్రం ఒప్పందం కిందకు రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ఇటీవల తీర్పు వెలువరించారు. కేసు నేపథ్యమిదీ.. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, సర్వీసు, మరమ్మతుల విషయంలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, టీబీఎస్ మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. 2018 వరకు ఈ ఒప్పందం అమలైంది. పరికరాల నిర్వహణలో టీబీఎస్ రూ.కోట్లమేర అక్రమాలకు పాల్పడినట్టు నిరూపణ అయింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, కోర్టు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ బయో మెడికల్ పరకరాల నిర్వహణలో టీబీఎస్ అక్రమాలు నిజమేనంటూ హైకోర్టుకు నివేదించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీబీఎస్‌కు చెల్లింపులను నిలిపేసింది. అనంతరం టీబీఎస్తో ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందం అమలుకు సంబంధించి భవిష్యత్‌లో ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒప్పందం ఏమీ ఇరుపక్షాల మధ్య లేదు. అయినప్పటికీ టీబీఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన వస్తు సేకరణ మాన్యువల్‌లో మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని, అందువల్ల వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలని కోరుతూ హైకోర్టులో మధ్యవర్తిత్వ దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా విచారణ జరిపారు. అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడమేంటి! దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. బయో మెడికల్ పరికరాల నిర్వహణ విషయంలో టీబీఎస్ అక్రమాలను ఏసీబీ నిర్ధారించిందని, దీనిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసిందని హైకోర్టుకు నివేదించారు. రూ.కోట్ల మేర అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడం దారుణమన్నారు. అక్రమాలు జరిగిన చోట మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదన్నారు. అంతేకాక మధ్యవర్తిత్వానికి ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని, అందువల్ల మధ్యవర్తి నియామకమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. సుధాకరరెడ్డి వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించారు. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వానికి ఒప్పందం లేనప్పుడు మధ్యవర్తి నియామకం సాధ్యం కాదంటూ టీబీఎస్ దరఖాస్తును కొట్టేశారు. కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన ‘వస్తు సేకరణ మాన్యువల్’లో పేర్కొన్న అంశాలు కేవలం సలహా పూర్వకమైనవేనని, అందులో మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించినంత మాత్రాన, అది మధ్యవర్తిత్వ నిబంధన కాజాలదని హైకోర్టు తెలిపింది. అందువల్ల టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. -
బాలల అక్రమ రవాణా చాలా తీవ్రమైన విషయం
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా.. ముఖ్యంగా చిన్న పిల్లల అక్రమ రవాణా చాలా తీవ్రమైన వ్యవహారమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా నియమిస్తున్నట్లు తెలిపింది. మానవ అక్రమ రవాణా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలను తెలియజేయాలని శ్రీరఘురాంను కోరింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు చిన్నారుల అక్రమ రవాణాపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇద్దరు చిన్నారులను విక్రయించిన ఘటనలో క్రిమినల్ చర్యల గురించి ధర్మాసనం ఆరా తీసింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, 11 మందిని నిందితులుగా చేర్చారని తెలిపారు. వారంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని, బెయిల్ ఇచ్చేందుకు కింది కోర్టు నిరాకరించిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ అక్రమ రవాణాను ఆపేందుకు ఏం చేయాలని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను ధర్మాసనం కోరింది. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా చిన్నారుల అక్రమ రవాణా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపింది. ఈ వ్యాజ్యాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను శ్రీరఘురాంకు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 2021లో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రస్తుత సుమోటో వ్యాజ్యాలను వాటితో కలిపి విచారించాలని సుమన్ కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. గతంలో దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
అధికార భాషా చట్టం అమలుకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ 70 నుంచి 80 శాతం వరకు తెలుగులోనే సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అధికార భాషా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. చట్టం తీసుకొచ్చిన స్ఫూర్తికి అనుగుణంగా అధికార భాష అమలుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామంది. తగిన సమయంలో చట్ట ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపింది. అధికార భాష అమలుకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లు అమలుకు నోచుకోలేదని, ఈ నేపథ్యంలో 2020లో అధికార భాష కమిషన్‌ను ఏర్పాటు చేశారని వివరించింది. అధికార భాషా చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆశ్రమ్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ కౌంటర్ దాఖలు చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
శిశు విక్రయాలపై హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: శిశు విక్రయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలిచిన హైకోర్టు బుధవారం వాటిపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే శిశువు ఆరుసార్లు విక్రయం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మెడబలిమి మనోజ్ తన మూడు నెలల ఆడ శిశువును నల్గొండ జిల్లా కొండప్రోలు గ్రామానికి చెందిన మేఘావత్ గాయత్రికి రూ.70 వేలకు విక్రయించాడు. తరువాత ఆ శిశువును పలువురు కొనుగోలు చేశారు. చివరకు ఏలూరుకు చెందిన వర్రే రమేశ్ రూ.2.50 లక్షలకు కొనగా.. ఆ దశలో శిశువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను చదివిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో రిజిస్ట్రీ ఆ కథనాన్ని పిల్‌గా మలిచింది. స్పందించిన జువెనైల్ జస్టిస్ కమిటీ ఇదే రీతిలో ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన జి.చిలకమ్మ అనే మహిళకు పుట్టిన శిశువును తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో విక్రయించారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వడ్డిబోయన సుజాతలతో కూడిన జువెనైల్ జస్టిస్ కమిటీ స్పందించింది. ఈ కథనాన్ని సుమోటో పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ రెండు సుమోటో వ్యాజ్యాలు బుధవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. -
చెరువు మధ్యలో పట్టా మంజూరు చేస్తారా?
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తికి రెవెన్యూ అధికారులు చెరువు మధ్యలో పట్టా మంజూరు చేయడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు కలెక్టర్, తిరుపతి ఆర్డీవో, రేణిగుంట తహసీల్దార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పట్టా పొందిన చిరంజీవి అనే వ్యక్తికి కూడా నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, యర్రమరెడ్డి పాళ్యం గ్రామంలోని సాగునీటి చెరువును టి.చిరంజీవి అనే వ్యక్తి పూడ్చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆ గ్రామానికి చెందిన గూలూరు జయరామయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కొండపర్తి కిరణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ చెరువు ఆక్రమణను అడ్డుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చిరంజీవి గతంలో పట్టా పొందారని, ఆ భూమినే ఇప్పుడు చదును చేసుకుంటున్నారని తెలిపారు. అది అతని సొంత భూమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫొటోలను చూస్తుంటే చెరువు మధ్యలో ఉన్న భూమిని చిరంజీవి చదును చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చెరువు మధ్యలో పట్టా ఇవ్వడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. -
అసైన్డ్‌దారులే అంగీకరించినప్పుడు మీకొచ్చిన ఇబ్బందేమిటి?
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కోసం ప్రభుత్వానికి భూములిచ్చేందుకు అసైన్డ్‌దారులే అంగీకారం తెలిపినప్పుడు మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అసైన్డ్‌దారులు అంగీకరించినప్పుడు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఎందుకు విచారించాలని కూడా ప్రశ్నించింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ, అసైన్డ్ భూముల సమీకరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి మండలాల పరిధిలో పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 6,116 ఎకరాలు సమీకరిస్తోందంటూ రైతు కూలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై 2020లో విచారణ జరిపిన సీజే ధర్మాసనం భూములను స్వాధీనం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం తుది విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 1.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం సమీకరిస్తోందని తెలిపారు. అసైన్డ్ భూములు ఇచ్చేందుకు అసైన్డ్‌దారులు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేశారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు. అసైన్డ్‌దారులే వ్యవసాయ కూలీలని, అందువల్ల భూ సమీకరణ వల్ల ప్రత్యేకంగా వ్యవసాయ కూలీలు ప్రభావితం కావడం లేదని చెప్పారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూ సమీకరణ చేస్తున్నారని తెలిపారు. అసైన్డ్ భూముల సమీకరణకు చట్టం నిర్దేశించిన విధి విధానాలను ప్రభుత్వం అనుసరించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. -
ప్రభుత్వ కౌంటర్ పరిశీలించాకే మహిళా పోలీసులపై నిర్ణయం
సాక్షి, అమరావతి: పోలీసుల నియామకానికి సంబంధించి ప్రత్యేక బోర్డు, నిబంధనలు ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణించేందుకు రాజ్యాంగంలోని అధికరణ 309 కింద ఉన్న అధికారాన్ని ఇలా ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొంది. చట్ట నిబంధనలు లేనప్పుడు మాత్రమే అధికరణ 309 కింద అధికారాలను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రామ,వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను (మహిళా సంరక్షణ కార్యదర్శులు) పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణించడం అంటే మహిళా పోలీసులను దొడ్డి దారిలో నియమించినట్లేనని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఈ కేసు అర్హమైందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, సిలబస్, జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీసు నిబంధనలను ఖరారు చేస్తూ ఇచ్చిన ఈ రెండు జీవోలను పోలీసు చట్టానికి, నియామక నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ప్రజల నుంచి ఫిర్యాదుల్లేవు
సాక్షి, అమరావతి: వివిధ శాఖలకు చెందిన జీవోలను అధికారిక వెబ్సైట్లో ఉంచకపోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ సాధారణ ప్రజల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. జీవోలను వెబ్సైట్లో ఉంచే విషయంలో ఎలాంటి నిషేధం విధించలేదని, గతంలో జీవోఐఆర్ వెబ్సైట్లో ఉంచితే, ఇప్పుడు ఈ–గెజిట్ వెబ్సైట్లో ఉంచుతున్నామని తెలిపింది. అలాగే చిన్నచిన్న ఖర్చులు, చెల్లింపుల బిల్లులు కూడా వెబ్సైట్లో ఉంచే వాళ్లమని, ఇప్పుడు వాటిని వెబ్సైట్లో ఉంచటంలేదని పేర్కొంది. దీనివల్ల వెబ్సైట్లో ఉంచే జీవోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలకు సంబంధించిన జీవోలను వెబ్సైట్లో ఉంచుతున్నామని తెలిపింది. గతంలో జీవో నంబర్లను కంప్యూటరే నిర్ణయించేదని, ఇప్పుడు ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్, ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం మాన్యువల్‌గానే జీవో నంబర్లు ఇస్తున్నట్లు వివరించింది. గత ఏడాది ఆగస్టు 17 నుంచి గత నెల 28 వరకు 33 శాఖలకు చెందిన జీవోల్లో 620 జీవోలను ఈ–గెజిట్ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం రహస్య, అతి రహస్య, ఇతర జీవోల్లో 7,837 జీవోలను వెబ్సైట్లో ఉంచలేదంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టును కోరింది. జీవోలను వెబ్సైట్లో ఉంచకపోవడంపై దాఖలైన వ్యాజ్యాల్లో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ కోర్టు రికార్డుల్లోకి చేరకపోవడంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచారహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జి.ఎం.ఎన్.ఎస్.దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు దాఖలు చేయలేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ అభ్యంతరం తెలుపుతూ తాము ఇప్పుడే అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. న్యాయవాది బాలాజీతోపాటు ఇతర న్యాయవాదులకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పంపామన్నారు. ప్రభుత్వ అఫిడవిట్ హైకోర్టు రికార్డుల్లోకి రాకపోవడంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేసింది. -
హెచ్చార్సీకి కల్పించిన మౌలిక సదుపాయాలేంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ)కు కర్నూలులో కల్పించిన మౌలిక సదుపాయాలు ఏమిటి? కమిషన్‌లో ఇప్పటివరకు దాఖలైన ఫిర్యాదులు ఎన్ని? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. వాటి ఆధారంగా తగిన ఆదేశాలు ఇస్తామంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్సీ పనిచేసేందుకు వీలుగా కార్యాలయం, సిబ్బంది, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని, దీంతో ఫిర్యాదులు తీసుకుని విచారించడం సాధ్యం కావడం లేదంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరుతూ అమరావతి జేఏసీ నాయకురాలు మద్దిపాటి శైలజ మరో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారించింది. మల్లేశ్వరరావు న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ కర్నూలులో హెచ్ఆర్సీ ఓ అతిథి గృహంలో కొనసాగుతోందని చెప్పారు. కేవలం భౌతికరూపంలో, పోస్టు ద్వారా మాత్రమే ఫిర్యాదులను పంపే వెసులుబాటు ఉందే తప్ప, ఆన్లైన్లో పంపే ఏర్పాటు హెచ్ఆర్సీ చేయలేదన్నారు. దీంతో ఫిర్యాదులు పంపడం కష్టంగా ఉందన్నారు. ఈ సమయంలో మద్దిపాటి శైలజ న్యాయవాది డి.ఎస్.ఎన్.వి.ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ లోకాయుక్త పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉందని చెప్పారు. విజయవాడలో కోట్ల రూపాయలు వెచ్చించి కార్యాలయం సిద్ధం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కర్నూలులో లోకాయుక్త ఏర్పాటునకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హెచ్ఆర్సీకి కల్పించిన మౌలిక సదుపాయాలు, ఫిర్యాదుల స్వీకరణ యంత్రాంగం, ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారు? తదితర వివరాలతో ఓ చిన్న అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ను ఆదేశించింది. -
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్ దాఖలు చేశారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ పిటిషనర్ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిల్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. అయితే పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జన్ భూయాన్ బెంచ్ తెలిపింది. -
విశాఖ కలెక్టర్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు విశాఖ జిల్లా కలెక్టర్ జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సబ్బవరంలోని 255, 272, 277 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎస్.చినవెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కలెక్టర్‌పై మండిపడింది. -
సెకీ విద్యుత్ కొనుగోలుపై కేంద్రం, రాష్ట్రానికి నోటీసులు
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు, ఏపీ, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండళ్లకు కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఏటా 7 వేల మెగా వాట్లను యూనిట్ రూ.2.49కే కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. దీనిని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తక్కువ ధరకు సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కాదని ఎక్కడో రాజస్తాన్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేసిన సెకీ నుంచి ఎక్కువ రేటుకు కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. మంత్రి మండలి నిర్ణయం వల్ల ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రతి ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరలేరు
సాక్షి, అమరావతి: చట్ట సభలో ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని న్యాయస్థానాలను కోరడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బడ్జెట్లో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరలేరని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపలేవని చెప్పింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చే విషయంలో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ వ్యాజ్యాన్ని ఇదే అంశంపై 2018లో పోలూరి శ్రీనివాసరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ఇచ్చిన హామీని అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేశ్చంద్ర వర్మ ఇటీవల దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్జీ హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక హోదాపై గతంలో దాఖలైన వ్యాజ్యంలో తమ వైఖరితో కౌంటర్ దాఖలు చేశామన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ, ప్రత్యేక హోదా కింద కేంద్రం పలు రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి మాత్రం అలాంటివి ఏవీ ఇవ్వలేదని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాన మంత్రి స్వయంగా చట్ట సభలో హామీ ఇచ్చారని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రధాన మంత్రి హామీని అమలు చేయాలని కోర్టును కోరలేరని చెప్పింది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇస్తారంది. అలాగే బడ్జెట్ హామీలను అమలు చేయాలని కూడా కోరలేరని తెలిపింది. -
ప్రభుత్వ ప్రతీ చర్యను పిల్‌తో సవాలు చేయలేరు
సాక్షి, అమరావతి: వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎంత ముఖ్యమో వైద్య కళాశాలలు కూడా అంతే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య కళాశాలలు కూడా ప్రజా సంక్షేమం కోసమేనని వ్యాఖ్యానించింది. మెడికల్ కాలేజీలు లేకుంటే ప్రజల ఆరోగ్యం తీవ్ర స్థాయిలో ప్రభావితమవుతుందని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య కళాశాలల ఏర్పాటు ఎంతైనా అవసరమని గుర్తు చేసింది. ప్రభుత్వ ప్రతీ చర్యను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పేరుతో సవాల్ చేయడానికి వీల్లేదని పేర్కొంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, వైద్య కళాశాలను నిర్మించినా అంతిమంగా అది ప్రజల కోసమేనని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇచ్చే ప్రత్యామ్నాయ భూమిలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం కోసం బదలాయించేలా ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ పాలక మండలి చేసిన తీర్మానంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, విశ్వవిద్యాలయ వర్గాలను హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, పాలక మండలి చైర్మన్, విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్లకు నోటీసులు జారీ చేస్తూ ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో దీన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది జూన్ 20న చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరాథరామిరెడ్డి మరో నలుగురు దాఖలు చేసిన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పరిశోధన కేంద్రానికి 120 ఏళ్ల చరిత్ర... పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ముఖ్యమైనదన్నారు. ఇక్కడ అత్యంత అరుదుగా లభించే వంగడాలను సృష్టిస్తున్నారని, పరిశోధన కేంద్రానికి 120 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. ఎంతో పేరు పొందిన కర్నూలు సోనా మసూరి బియ్యం కూడా ఇక్కడే అభివృద్ధి అయిందన్నారు. వర్సిటీ వర్గాలు వ్యతిరేకిస్తున్నా పాలక మండలి పట్టించుకోకుండా భూమిని ప్రభుత్వానికి బదలాయించేలా తీర్మానం చేసిందన్నారు. ప్రత్యామ్నాయ భూమి తీసుకోండి... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మరోచోట పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నించింది. పరిశోధన కేంద్రంలో భూమి అత్యంత కీలకమని, ప్రస్తుతం ఉన్న స్థితికి తీసుకురావాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని వివేక్ పేర్కొన్నారు. అయితే వ్యవసాయ పరిశోధన ఎంత ముఖ్యమో వైద్య కళాశాల కూడా అంతే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతీ చర్యను ఇలా పిల్ పేరుతో సవాలు చేయడానికి వీల్లేదని తెలిపింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని ఇస్తున్నప్పుడు తీసుకోవాలని సూచించింది. కానీ ఇప్పుడే ఆ భూమి కూడా ఇవ్వడం లేదని, ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు జీవోను అబయన్స్‌లో ఉంచుతూ జీవో ఇచ్చారని వివేక్‌రెడ్డి నివేదించారు. అబయన్స్ జీవో ఉపసంహరించుకోవాలని ఏఏజీ సూచించారు.. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది ఖాదర్ మస్తాన్ స్పందిస్తూ ప్రత్యామ్నాయంగా 50 ఎకరాల కేటాయింపు జీవోను అబయన్స్‌లో ఉంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సూచించారని అయితే కార్యదర్శి పొరపాటున జీవో ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే
సాక్షి, అమరావతి: వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పోలీసులు హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించ కుండా.. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ పరిధిలోని మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తామంది. అర్నేష్‌కుమార్ కేసులో తీర్పును అమలు చేయని మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అర్నేష్‌కుమార్ తీర్పును మేజిస్ట్రేట్లు పాటించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇస్తామంటూ తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మీడియాకు సంబంధించిన వ్యక్తులతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ను 24 గంటల్లో అప్లోడ్ చేయడం లేదంటూ టీవీ 5 న్యూస్ చానల్ యజమాని బొల్లినేని రాజగోపాల్‌నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది ఉమేశ్‌చంద్ర.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా పోలీసులు నేరుగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్ఐఆర్లను 24 గంటల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనలను ఓసారి గమనించాలంటూ ఏజీ చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. పిటిషనర్ అభ్యర్థనలు అస్పష్టంగా, పసలేకుండా ఉన్నాయని తెలిపింది. పోలీసు అధికారం లేని రాష్ట్రం మనుగడ సాధించలేదని పేర్కొంది. -
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడం వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరుతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంది. పరిశ్రమలు, కాలేజీల నిర్మాణం వంటివి ఇలానే ఆగిపోతున్నాయని పేర్కొంది. వైద్య కళాశాలల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన భూమిని వైద్య కళాశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ బొజ్జా దశరాథరామిరెడ్డి, మరికొందరు హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిల్ దాఖలు చేసిన ఆది రామకృష్ణుడు పార్టీ ఇన్‌పర్సన్‌గా వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. స్టే ఉత్తర్వుల వల్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎలాంటి పనులు జరగడం లేదని తెలిపారు. మరో పిటిషనర్ న్యాయవాది బొజ్జా అర్జునరెడ్డి.. ఈ వ్యాజ్యంలో విచారణను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాయిదాను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే పిటిషనర్ పలు వాయిదాలు తీసుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారికి అనుకూలంగా స్టే ఇవ్వడంతో ఇలా పదేపదే వాయిదాలు కోరుతున్నారని తెలిపారు. వాయిదాల వల్ల మెడికల్ కాలేజీల నిర్మాణం ముందుకెళ్లడం లేదని చెప్పారు. ప్రభుత్వం సైతం ప్రజల కోసమే మెడికల్ కాలేజీలు కడుతోందన్నారు. ఈ సమయంలో అటు అదనపు ఏజీ సుధాకర్, ఇటు పిటిషనర్ న్యాయవాది అర్జున్‌రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వాదనలతో తమకు దీపావళి వేడుకలను ముందుగానే జరుపుకొన్నట్లు ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించింది. దీపావళి తరువాత కూడా కాల్చుకోవడానికి టపాసులను (వాదనలు) దాచుకోవాలని ఇరుపక్షాలకు సూచించింది. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులతోసహా అందరూ నవ్వుకున్నారు. ఇలాంటి వ్యాజ్యాల వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. -
ఆన్లైన్లో ఉంచితే నష్టమేంటి?
సాక్షి, అమరావతి: సీక్రెట్, టాప్ సీక్రెట్ అంశాలకు సంబంధించినవి తప్ప, రొటీన్ అంశాలకు సంబంధించిన జీఓలన్నింటినీ ఎందుకు వెబ్సైట్లో అప్లోడ్ చేయకూడదని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్ని జీఓలను వెబ్సైట్లో ఉంచడంవల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని అడిగింది. సీక్రెట్, టాప్ సీక్రెట్ వ్యవహారాలకు సంబంధించిన వాటిని వెబ్సైట్లో ఉంచకపోవడాన్ని ఎవరూ తప్పుపట్టరని.. అయితే, రొటీన్ జీఓలను కూడా వెబ్సైట్లో ఉంచకపోవడం సరికాదేమోనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాధనంతో ముడిపడి ఉన్న విషయాలకు సంబంధించిన జీఓలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం మేలని సూచించింది. అన్ని జీఓలను 24 గంటల్లో వెబ్సైట్లో ఉంచేలా చూడాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఆ హక్కు ప్రజలకుందని.. జీఓలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శ్రీకాంత్, యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. జీఓలను వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. వీటి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుందని తెలిపారు. వెబ్సైట్ మాత్రమే మార్చాం.. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ జీఓలు మినహా మిగిలిన వాటిని వెబ్సైట్లో ఉంచుతున్నామన్నారు. అంతకుముందు.. జీఓఐఆర్ వెబ్సైట్లో ఉంచే వారమని, ఇప్పుడు ఏపీ ఈ–గెజిట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని, కేవలం వెబ్సైట్ మాత్రమే మార్చామని చెప్పారు. చిన్నచిన్న చెల్లింపులకు సంబంధించిన జీఓలను పెట్టడంలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అసలు కాన్ఫిడెన్షియల్ జీఓలు అంటే ఏమిటని ప్రశ్నించింది. ఏపీ సెక్రటేరియట్ మాన్యువల్‌లో కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ జీఓలంటే ఏమిటో వివరించారంటూ సుమన్ వాటి గురించి చదివి వినిపించారు. రొటీన్ విషయాలకు సంబంధించిన జీఓలను కూడా వెబ్సైట్లో ఎందుకు ఉంచడం లేదని, అలా ఉంచడంవల్ల ప్రభుత్వానికి నష్టంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.