
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు, ఏపీ, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండళ్లకు కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఏటా 7 వేల మెగా వాట్లను యూనిట్ రూ.2.49కే కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. దీనిని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తక్కువ ధరకు సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కాదని ఎక్కడో రాజస్తాన్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేసిన సెకీ నుంచి ఎక్కువ రేటుకు కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. మంత్రి మండలి నిర్ణయం వల్ల ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రతి ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment