సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్‌ను ఓసారి పరిశీలించి అవసరమైతే అదనపు వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణను జనవరి చివరి వారంలో జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. అసలు వివాదం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తారని.. దీని వల్ల పంపిణీ నష్టాలుంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment