
దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక ఆధారాలు సేకరించింది
నిందితులకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: యువతులకు బ్రెయిన్‌వాష్ చేసి వారిని నిషేధిత మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్న వ్యవహారంలో నిందితులుగా ఉన్న డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన కేసులో బెయిల్ కోసం వారు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కింది కోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
పిటిషనర్లు యువతులకు బ్రెయిన్‌వాష్ చేసి మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
నా కుమార్తెను బలవంతంగా చేర్చారు..
డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప మరికొందరు కలిసి మావోయిస్టు పార్టీలోకి యువతులను చేర్పించేందుకు చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) పేరుతో ఓ సంఘం ఏర్పాటుచేశారు. సామాజిక సేవ నెపంతో యువతులను చేరదీసి, వారు మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి, ఆ తరువాత మావోయిస్టుల్లో చేర్పిస్తున్నారు. ఇదే రీతిలో విశాఖపట్నం, పెద్దబయలుకు చెందిన రాధా అనే యువతిని 2017లో మావోయిస్టుల్లో చేర్పించారు.
2021లో రాధా తల్లి తన కుమార్తెను బలవంతంగా మావోయిస్టుల్లో చేర్పించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకి అప్పగించారు. ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదిలాఉంటే.. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలంటూ డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ 2024 మే 29న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ వారిరువురూ హైకోర్టులో క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ. సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. 2017లో రాధాను తీసుకెళ్లారంటూ ఆమె తల్లి 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారని.. కానీ, అప్పటికే ఆమె నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్నారన్నారు. ఎన్‌ఐఏ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు కీలక ఆధారాలు సేకరించిందన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఎన్‌ఐఏ సేకరించిన ఆధారాలను, అది దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించింది. పిటిషనర్లకు బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment