
పలు నిర్ణయాలు తీసుకున్న బార్ కౌన్సిల్
న్యాయవాదులకు చెల్లించే పరిహారం రూ.6 లక్షలకు పెంపు
వైద్య సాయంగా రూ.1.5 లక్షలు
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్.ద్వారకానాథరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదులు మరణించినప్పుడు వారి నామినీలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం హైకోర్టులోని బార్ కౌన్సిల్‌లో జరిగింది. కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయవాదులు, వారి కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న వైద్య సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు.
బార్ కౌన్సిల్ రోల్స్‌లో నమోదు చేసుకున్న న్యాయవాదులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల మేర పరిహారం అందించాలని తీర్మానించారు. ఈ కొత్త పథకాన్ని ఈ ఏడాది మే 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటికీ అవసరమైన సొమ్మును బార్ కౌన్సిల్ నిధుల నుంచి చెల్లిస్తారు. అనంతరం గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.
తెలుగు భాషకు, సాహిత్యానికి చేసిన అసాధారణమైన సేవలకు గానూ ఆయన ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్.కృష్ణమోహన్, సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎస్‌బ్రహ్మనందరెడ్డి, గంటా రామారావు, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, రావిగువేరా, కార్యదర్శి పద్మలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment