Bar Council
-
న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్.ద్వారకానాథరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదులు మరణించినప్పుడు వారి నామినీలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం హైకోర్టులోని బార్ కౌన్సిల్లో జరిగింది. కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయవాదులు, వారి కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న వైద్య సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు.బార్ కౌన్సిల్ రోల్స్‌లో నమోదు చేసుకున్న న్యాయవాదులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల మేర పరిహారం అందించాలని తీర్మానించారు. ఈ కొత్త పథకాన్ని ఈ ఏడాది మే 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటికీ అవసరమైన సొమ్మును బార్ కౌన్సిల్ నిధుల నుంచి చెల్లిస్తారు. అనంతరం గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.తెలుగు భాషకు, సాహిత్యానికి చేసిన అసాధారణమైన సేవలకు గానూ ఆయన ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్.కృష్ణమోహన్, సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎస్బ్రహ్మనందరెడ్డి, గంటా రామారావు, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, రావిగువేరా, కార్యదర్శి పద్మలత పాల్గొన్నారు. -
‘వ్యభిచార గృహం నడిపేందుకు రక్షణ కావాలి’.. మద్రాస్ హైకోర్టు షాక్
చెన్నై: ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను చూసి మద్రాస్ హైకర్టు షాక్ గురైంది. సదరు పిటిషనర్‌పై దర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను రద్దు చేయడమే కాకుండా అతడికి జరిమానా కూడా విధించింది. ఇంతకీ ఆ పిటిషన్ ఏంటంటే..తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వ్యభిచార గృహాన్ని నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రాక్టీస్ చేస్తున్న రాజా మురుగన్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా మేజర్లు ఏకాభిప్రాయంతో సెక్స్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ పిటిషనర్ వాదించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. తన వ్యాపార కార్యకలాపాల్లో పోలీసుల జోక్యాన్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు తెలిపారు. అయితే వ్యభిచార గృహాన్ని నడుపుతూ తప్పు చేయడమే కాకుండా తన చర్యలను నిసిగ్గుగా సమర్థించినందుకు జస్టిస్ బి పుగలేంధీ ధర్మాసనం పిటిషనర్‌పై మండిపడడింది. తన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. న్యాయవాదిపై 10 వేల జరిమానా కూడా విధించింది.అదే విధంగా ప్రఖ్యాత లా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకునేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను కోర్టు కోరింది. ఇతర రాష్ట్రాల్లోని సందేహాస్పద సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ల నమోదును బార్ కౌన్సిల్ తప్పనిసరిగా పరిమితం చేయాలని సూచించింది.‘సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ట తగ్గుతోందని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఇక నుంచైనా బార్ కౌన్సిల్ సభ్యులు పేరున్న కళాశాలల నుంచి మాత్రమే నమోదు చేసేలా చూసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి పేరు లేని అనామక సంస్థల నుంచి నమోదును పరిమితం చేయాలి’ అని తెలిపింది. -
సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
లక్నో: అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకను వీక్షించేందుకు జనవరి 22న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని సీజేఐని కోరారు. "అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడానికి కోర్టు సిబ్బందికి సెలవు రోజు అవసరం అవుతోంది." అని బార్ కౌన్సిల్ ఛైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా అన్నారు. తక్షణ విచారణ అవసరమయ్యే అంశాన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయవచ్చు లేదా తదుపరి రోజుకు రీషెడ్యూల్ చేయవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సాధువులు, ప్రముఖులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ దేశాల నుండి దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ -
బార్ కౌన్సిల్‌కు సాయం అందించిన ఒకే ఒక్క సీఎం వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: అనంత నరసింహారెడ్డి.. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. వరుసగా మూడు సార్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఒక న్యాయవాది 17 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి సేవలందించడం దేశంలోనే రికార్డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర బార్ కౌన్సిల్ తొలి చైర్మన్‌గానూ ఆయనే ఎన్నికయ్యారు. ఐదుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసిప్లినరీ కమిటీ కో–ఆప్షన్ సభ్యుడిగానూ పనిచేశారు. బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బార్ కౌన్సిల్‌కు నేరుగా సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొంటున్న నరసింహారెడ్డి వివరాలు ఆయన మాటల్లోనే.. సేవా భావంతోనే బార్ కౌన్సిల్‌కు... జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో సివిల్ కోర్టులో ఎక్కువగా కేసులు వాదించే వాడిని. అప్పటి నుంచే న్యాయవాదుల సంక్షేమానికి ఏదో చేయాలన్న తపన ఉండేది. దీంతో నన్ను బార్ కౌన్సిల్‌కు పోటీ చేయమని చాలా మంది న్యాయవాదులు ప్రోత్సహించారు. నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఎల్లారెడ్డి కూడా ఆహ్వానించారు. అలా 1995లో తొలిసారి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యా. సమరసింహారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో మాట్లాడి న్యాయవాదులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. సహచరులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి(మాజీ ఏజీ), జస్టిస్ ఏ.గోపాల్‌రెడ్డి (జడ్జి)తో కలసి పలు కార్యక్రమాలు చేపట్టాం. మహానేత వైఎస్సార్‌తో అనుబంధం... 2006లో తొలిసారి బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా. కొద్ది రోజుల తరువాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్‌ను కలిసే అవకాశం వచ్చింది. న్యాయవాదుల సంక్షేమం కోసం ఏం చేద్దాం అని ఆయన అడగడంతో కొన్ని వివరాలను చెప్పా. ఒక్కొక్కటిగా చేస్తూ పోదాం అంటూ న్యాయ శాఖ మంత్రిని పిలిచి వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. అప్పటికే ఇతర రంగాలు సాంకేతిక వైపు పరుగులు ప్రారంభించడంతో నాటి సీజే జస్టిస్ మదన్‌లోకూర్ సూచన మేరకు బార్ అసోసియేషన్లలో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ ఏర్పాటు చేశాం. వాటి వినియోగంపై న్యాయవాదులకు శిక్షణనిచ్చాం. స్టైపెండ్ ఇవ్వాలని కోరుతున్నాం.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయవాదులు సంక్షేమం కోసం బార్ కౌన్సిల్‌కు రూ.100 కోట్లు కేటాయించి.. రూ.25 కోట్లు మంజూరు చేశారు. అక్కడ కొత్త న్యాయవాదులకు ఐదేళ్ల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ చేపట్టాలని కోరుతున్నా.. న్యాయవాదులు వినియోగించే స్టాంప్‌ల ద్వారా న్యాయవాదుల సంక్షేమ నిధికి కొంత మేర నిధులు చేకూరుతాయి. ప్రభుత్వ అధికారులు కూడా విధిగా ఈ స్టాంప్‌లు వినియోగించాలని చట్టం చెబుతున్నా వారు పాటించడంలేదు. అడ్వొకేట్ లా అకాడమీ ఏర్పాటు నా కల.. రాష్ట్రంలో లా అకాడమీ ఏర్పాటు చేయలన్నది నా కల. యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వ డం, సీనియర్ న్యాయవాదులతో మార్గనిర్దేశం చేసే కార్యక్రమాలు చేయాలని భావించాం. కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా దీనిపై అడుగు ముందుకు పడటం లేదు. మీడియేషన్ చట్టబద్ధం కానుంది.. కోర్టుల్లో విపరీతంగా పెరిగిపోతున్న కేసులకు మీడియేషనే పరిష్కారం. న్యాయవాదులకు మీడియేషన్‌పై అవగాహన కల్పించాలి. ముందుగా ఏ కేసునైనా మీడియేషన్‌కు పంపిన తర్వాతే విచారణ చేపట్టాలి. ఆ దిశగా కేంద్ర చట్టం చేస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే అధికారికంగా మీడియేటర్లను నియమిస్తారు. వారిచ్చే ఉత్తర్వులు చట్టబద్ధం అవుతాయి. అలాగే, పాత కాలపు పద్ధతులకు స్వస్తి పలికే చర్యలు తీసుకున్నాం. కోర్టుల్లో యువరానర్, మైలార్డ్ పదాలు అవసరం లేదని సర్, మేడమ్ అంటే చాలని నిర్ణయం తీసుకున్నాం. న్యాయవాదులకు ఉజ్వల భవిష్యత్ ఉంది. -
తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా పద్మ లక్ష్మీ
కేరళకు చెందిన పద్మాలక్ష్మీ తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జడ్జీగా నిలిచిన జోయిత్ మోండల్ తర్వాత పద్మ లక్ష్మీ అనే ట్రాన్స్‌జెండర్ ఆ విజయాన్ని సాధించారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని చెబుతూ..ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆమె గురించి మాట్లాడుతూ..ఆదివారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 1500 మందికి పైగా లా గ్రాడ్యుయేట్లలో పద్మాలక్ష్మీ కూడా ఒకరు. ఆమె ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టుభద్రురాలైందని చెప్పారు. తన కోసం ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా విజయాన్ని అందుకోవడం కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొందని, ముఖ్యంగా సమాజం నుంచి ఎదురై చీత్కారాలను అధిగమించి అనుకున్న గమ్యానికి చేరుకుని విజయం సాధించిందని ప్రశంసించారు. ఎట్టకేలకు ఆమె అనుకున్న లక్ష్యం సాధించి న్యాయచరిత్రలో తన పేరును నమోదు చేసుకుందన్నారు. ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే గాక తనలాంటి వాళ్లు ఈ రంగంలో వచ్చేందుకు ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు మంత్రి రాజీవ్. దీంతో నెటిజన్లు అడ్వకేట్ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. కాగా తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జి జోయితా మోండల్ తదనంతరం 2018లో ట్రాన్స్‌జెండర్ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని లోక్ అదాలత్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాదే మూడో ట్రాన్స్‌జెండర్ జడ్జిగా గౌహతి నుంచి స్వాతి బిధాన్ నియమితులయ్యారు. View this post on Instagram A post shared by P Rajeev (@prajeevofficial) (చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి) -
‘గండ్ర మోహన్‌రావుకు రాజ్యసభ ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావును రాజ్యసభకు నామినేట్ చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ సభ్యులు పి.విష్ణు వర్ధన్ రెడ్డి, పి.సునీల్‌గౌడ్, జి.గిరిధర్‌రావు, వెంకట్ యాదవ్ తదితరులు శుక్రవారం సీఎంకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గండ్ర మోహన్‌రావు క్రియాశీలకంగా పనిచేశారన్నారు. -
సీజే జస్టిస్ గోస్వామికి హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి ఆదివారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి చాలా కఠినమైనదని, సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. ఈ వృత్తి జీవితంలో పైకొచ్చిన తరువాత కూడా నిత్యం సవాళ్లను ఎదుర్కొంటునే ఉంటామన్నారు. ఆశను ఎప్పుడూ వదులుకోకూడదని చెప్పారు. విజయానికి దగ్గరిదారులు వెతకొద్దని, కష్టపడే తత్వానికి ప్రత్యామ్నాయం లేనేలేదని పేర్కొన్నారు. తక్కువ కాలమైనా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడం తనకు ఎంతో సంతోషానిచ్చిందన్నారు. తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఏజీ శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ గోస్వామి సేవలను కొనియాడారు. గవర్నర్ తేనీటి విందు: బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి గౌరవార్థం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో ఆదివారం రాత్రి తేనేటి విందు ఇచ్చారు. సీజే గోస్వామి, నీలాక్షి గోస్వామి దంపతులను గవర్నర్ సత్కరించి వీడ్కోలు పలికారు. గవర్నర్ సతీమణి సుప్రవ హరిచందన్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ వించిపేట (విజయవాడ పశ్చిమ): శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం శ్రీలలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీజే గోస్వామి దంపతులకు ఈవో భ్రమరాంబ, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం చీఫ్ జస్టిస్‌కు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. జస్టిస్ పీకే మిశ్రా సీజేగా 13న ప్రమాణం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఈ నెల 13న ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, న్యాయమూర్తులు, మంత్రులు తదితరులు పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి జస్టిస్ మిశ్రా ఈ నెల 12న విజయవాడ చేరుకుంటారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ఆదివారం సీఎం ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు పరిశీలించారు. -
నేడు జస్టిస్ అమానుల్లా ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఉ.10 గంటలకు హైకోర్టులో జరిగే కార్యక్రమంలో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ప్రమాణం చేయించనున్నారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమానుల్లాను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. జస్టిస్ అమానుల్లా 1963 మే 11న బీహార్‌లో జన్మించారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివిన ఆయన 1991 సెప్టెంబర్ 27న బీహార్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి, సుప్రీంకోర్టు, ఢిల్లీ, కలకత్తా జార్ఖండ్ హైకోర్టుల్లో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన కేసులు, సర్వీసు కేసుల్లో మంచి నైపుణ్యం సాధించారు. 2006 నుంచి 2010 వరకు బీహార్ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2010 నుంచి న్యాయమూర్తి అయ్యేంత వరకు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2011 జూన్ 20న పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పాట్నా హైకోర్టులో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన రెండవ స్థానంలో కొనసాగుతారు. నేడు సీజేకు వీడ్కోలు ఇక ఛత్తీస్‌ఘడ్‌కు బదిలీపై వెళ్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి ఆదివారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. జస్టిస్ అమానుల్లా ప్రమాణ కార్యక్రమం పూర్తయిన తరువాత, జస్టిస్ గోస్వామికి వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది జనవరి 6న బాధ్యతలు చేపట్టారు. -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకిరామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకిరామిరెడ్డి 455 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి కె.సత్యనారాయణమూర్తిపై ఘన విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తారనుకున్న పోపూరి ఆనంద్ శేషు 353 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,538 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ విధానం ద్వారా మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వ్యవహరించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా కోనపల్లి నర్సిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవగా.. ఉపాధ్యక్షుడిగా పి.నరసింహమూర్తి విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శిగా దూదేకుల ఖాసిం సాహెబ్, గ్రంథాలయ కార్యదర్శిగా మెట్టా సప్తగిరి, కోశాధికారిగా డాక్టర్ జేవీఎస్‌హెచ్ శాస్త్రి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా సందు సతీష్, మహిళా ప్రతినిధిగా ఎ.సుఖవేణి, ఈసీ సభ్యులుగా బాలినేని పరమేశ్వరరావు, ఎస్వీ భరతలక్ష్మి, ఈతకోట వెంకటరావు, కట్టా సుధాకర్, మేటపాటి సంతోష్‌రెడ్డి, రావుల నాగార్జున ఎన్నికయ్యారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారి సత్యప్రసాద్‌ను సంఘ ప్రతినిధులు అభినందించారు. కొత్తగా ఎన్నికైన ప్రతినిధులకు, వారి గెలుపునకు కృషి చేసిన వారికి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. -
ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాస్త్ర పట్టా పొందిన వారు న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకునేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు సమర్పించవచ్చ ని బార్‌కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత ఏ తేదీన వారికి ఎన్రోల్మెంట్ ఉంటుందో తెలియజేస్తామని, ఆరోజున మాత్రమే బార్ కౌన్సిల్‌కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. కార్యదర్శి రేణుక పదవీ విరమణ బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్.రేణుక శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 32 ఏళ్లుగా ఆమె బార్ కౌన్సిల్‌కు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంగా రామారావు, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బార్ కౌన్సిల్ కార్యదర్శిగా వి.నాగలక్ష్మిని నియమించారు. -
తీసుకుంది రూ.117 కోట్లు.. చూపించింది రూ. 21 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ బార్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కే సింగ్ కార్యాలయంలో గురువారం ఐటీ శాఖ సోదాలు చేసింది. ఢిల్లీ, హరియాణా, ఎన్సీఆర్లోని 38 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 5.5 కోట్ల రూపాయల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ కే సింగ్ తన క్లయింట్ల నుంచి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసి పన్ను ఎగ్గొడుతున్నారనే ఆరోపణలో నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 217 కోట్ల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ‘మనోజ్ కే సింగ్ ఒక క్లయింట్ నుంచి నగదు రూపంలో 117 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం కేవలం 21 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నట్లు చూపించారు. అది కూడా చెక్ ద్వారా పొందినట్లు పేర్కొన్నారు’ అన్నారు అధికారులు. (చదవండి: విజయ్‌ని కావాలనే టార్గెట్ చేశారా !) అలానే మరొక సందర్భంలో మనోజ్ కే సింగ్ ప్రభుత్వ రంగ సంస్థతో మధ్యవర్తిత్వం నెరిపినందుకుగ ఓ మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్ సంస్థ నుంచి 100 కోట్ల నగదు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయన వాణిజ్య, నివాస ఆస్తులు కొనడమే కాక పాఠశాలలో నిర్వహణలో ఉన్న ట్రస్టులను స్వాధీనం చేసుకోవడంలో ఉపయోగించినట్లు వెల్లడించారు. -
మొత్తం సొమ్ము విడుదల చేసి లాయర్లను ఆదుకోండి!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న న్యాయవాదుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసినందుకు గాను న్యాయవాదులందరి తరుపున తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ అకుల ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదులకు సాయం చేయడంలో తోడ్పాటు అందించినందుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, తెలంగాణ బార్‌కౌన్సిల్ అసోసియేషన్ చైర్మన్‌కు, లా సెక్రటరీకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 15కోట్ల రూపాయాలను ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆదుకోవడానికి ఖర్చు చేశారు. (అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం) కరోనా కారణంగా అత్యవసరమున్న సివిల్, క్రిమినల్ కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు. దీని కారణంగా కేవలం ఇదే వృత్తిపై ఆధారపడిన న్యాయవాదులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసరాలు తీరడం కూడా కష్టంగా మారి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క న్యాయవాదికి రూ.10,000 చొప్పున సాయం అందించింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు రూ.15 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బార్‌కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ అకుల్ విజ్ఞప్తి చేశారు. (మరో హామీ అమలుకు శ్రీకారం ) -
‘న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు’
సాక్షి, అమరావతి : ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు చెప్పారు. తమ సమస్యల పరిష్కారంపట్ల సీఎం సానుకూలంగా స్పందించారని అన్నారు. ‘న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరాము. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వారికి గౌరవ వేతనంగా రూ.5 వేలు ఇవ్వాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి ఎదుటకు తీసుకొచ్చాం. న్యాయవాదుల సంక్షేమనిధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీనిచ్చారు. హైకోర్టు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం చెప్పారు’ అని పేర్కొన్నారు. -
యూపీ బార్ కౌన్సిల్ చీఫ్ కాల్చివేత
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బార్ కౌన్సిల్ అధ్యక్షురాలు దార్వేష్ యాదవ్‌ను ఓ అడ్వకేట్ తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వివరాలు.. రెండు రోజుల క్రితం జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దార్వేష్ యాదవ్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బుధవారం ఆమె ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. దీంతో ఈరోజు మధ్యాహ్నం ఆగ్రాలోని కోర్టుకు చేరుకుని.. తోటి న్యాయవాదులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన న్యాయవాది మనీష్ శర్మ తుపాకీతో ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. కాగా వీరిద్దరికి చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మనీష్‌ను ఆస్పత్రిలో చేర్పించామని..అతడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. శర్మ తన లైసెన్సెడ్ గన్‌తో ఈ ఘటనకు పాల్పడ్డాడని..ఇందుకు గల కారణాల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. -
న్యాయవాదులకు అండగా జగన్
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: నాయవాదులు సమాజంలో ఒక భాగం. సామాన్యుడి నుంచి ధనంవంతుడి వరకు అందరికీ న్యాయం కావాలంటే న్యాయవాది ద్వారానే కోర్టులో వాదన వినిపించుకోవాలి. న్యాయవాదికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్ధిక చేయూత ఉండదు. క్లయింట్లు ఇచ్చే కనీన నగదుతో కావాల్సిన మౌలిక సౌకర్యాలతో పాటు కుంటుంబ పోషణ సమకూర్చుకోవాలి. అయితే ఆ ఆదాయం కూడా స్థిరం కాదు. మేధావి వర్గానికి చెందిన న్యాయవాదులలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేధావులకు సాయం చేయలేని ప్రభుత్వాలు సామాన్యులను ఎలా గుర్తిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. వారికి ఇతర వృత్తుల వారిలా సామాజిక భద్రత, సంక్షేమాల అవసరం ఉంది. వారి ఆర్థిక ఇబ్బందులను నల్లకోటుతో కప్పుకుని సగటు మనిషికి న్యాయం కోసం పోరాడుతున్న వృత్తి వారిది. దీనిలో కొత్తగా న్యాయవాద వృత్తికి వచ్చిన వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. వారికి వృత్తి పట్ల ధైర్యాన్ని, సహాయన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇతర వర్గాల వలే న్యాయవాదులకు కూడా సముచిత స్థానం కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు పలుమార్లు ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. వారి న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టారు. అంతే కాదు న్యాయవాదులకు అన్ని విధాలా తోడుగా ఉంటున్న గుమస్తాలకు కూడా పలు సమస్యలు ఉన్నాయి. వారు కూడా ఇటీవల ఉద్యమ బాట పట్టారు. న్యాయవాదులకు సంబంధించిన సంఘాలు ఇటీవల ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో కలిశారు. వారి ద్వారా న్యాయవాదుల కష్టాలు, సమస్యలు, పరిష్కార మార్గాలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. అనంతరం వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా జూనియర్ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 వంతున ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించారు. న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు, స్థలాలు మంజూరుకు కృషి చేస్తామని, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. అలాగే నోటరీ అడ్వకేట్ల సమస్యలు, రెన్యువల్ విషయంలోనూ, ప్లీడర్ గుమస్తాలకు కూడా తగు న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. దీంతో న్యాయవాదులకు ధైర్యం వచ్చింది. గతంలో ఏ నాయకుడూ ఇవ్వని భరోసాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటూ న్యాయవాదులంతా సంతోషంలో ఉన్నారు. న్యాయవాదుల ప్రధాన డిమాండ్లు ఇవే.. ∙న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. ∙న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ∙ఇల్లు నిర్మించుకునేందకు పథకాలు, రుణాలు మంజూరు చేయాలి. ∙బార్ కౌన్సిల్ అఫ్ అంధ్రప్రదేశ్‌కు మ్యాచింగ్ గ్రాంటును మంజూరు చేయాలి. ∙జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టెపెండ్ ఇవ్వాలి. ∙జూనియర్ న్యాయవాదులకు ఈ లైబ్రరీ, లైబ్రరీ సదుపాయాలు కల్పించాలి. ∙ఉత్తరాంధ్రకు హై కోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి. ∙న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు కలించాలి. ∙కేసులకు తగిన విధంగా కోర్టుల సంఖ్యను పెంచాలి. ∙సత్వర న్యాయం కోసం న్యాయమూర్తుల నియామకాలు పెంచాలి. ∙అడ్వకేట్ ఆకాడమీ ఏర్పాటు చేయాలి. ∙న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలి. ∙న్యాయవాదులకు పింఛను సదుపాయం కల్పించాలి. ∙న్యాయవాద గుమస్తాకు రూ.4 లక్షలు సంక్షేమ ఫండ్, ఆరోగ్య బీమా వర్తింప చేయాలి. జగన్ నిర్ణయం హర్షణీయం న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం చాలా హర్షణీయం. గతంలో ఏ నాయకుడూ న్యాయవాదుల సంక్షేమంపై ఇలా భరోసా ఇవ్వలేదు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇస్తామని జగన్ ప్రకటించారు. దీనిని సక్రమంగా అమలు చేస్తే, చాలామంది న్యాయవాద వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. –పొన్నాడ వెంకటరమణ, జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, శ్రీకాకుళం. న్యాయవాదుల ఉన్నతికి ఊతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు వారి ఉన్నతికి ఊతమిస్తాయి. న్యాయవాదుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆసరాగా దొరుకుతుంది. అదేవిధంగా సత్వర న్యాయం కోసం కోర్టుల సంఖ్య, న్యాయమూర్తుల నియామకాలు కూడా చేపట్టాలి, దీంతో సామాన్యుడికి సత్వర న్యాయం అందుతుంది. –కూన అన్నం నాయుడు, జిల్లా బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, శ్రీకాకుళం ఇళ్ల స్థలాలు ఇస్తామనడం సంతోషం న్యాయవాదులు సమాజంలో ఉన్న వారే. అంతేకాకుండా మేధావి వర్గానికి చెందిన వారు. అయినంత మాత్రాన తగినంత ఆర్థిక స్థోమత వారిలో చాలామందికి ఉండదు. ఇల్లు కట్టుకోవడం కష్టమే. అటువంటి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు, అవసరమైతే రుణాలు ఇప్పిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. –కె జీవరత్నం, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, శ్రీకాకుళం. జిల్లాలో న్యాయవాదులు 6, 500 జూనియర్ లాయర్లు 2,500 జిల్లా కోర్టులో న్యాయవాద గుమస్తాలు 84 జిల్లా వ్యాప్తంగా న్యాయవాద గుమస్తాలు 160 -
అమితాబ్‌కు బార్ కౌన్సిల్ లీగల్ నోటీసులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ప్రచార చిత్రాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ఆయన నటించిన ఎవరెస్ట్ మసాలా యాడ్‌పై ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్‌లో ఎటువంటి అనుమతి లేకుండా లాయర్ కోట్‌ను వినియోగించడాన్ని తప్పుపడుతూ బార్ కౌన్సిల్ అమితాబ్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఎవరెస్ట్ మసాలా, యూట్యూబ్, ఓ మీడియా సంస్థకు కూడా బార్ కౌన్సిల్ నోటీసులు పంపింది. ఈ యాడ్‌ను ఎటువంటి అనుమతి లేకుండా ప్రసారం చేసినందుకు చట్టరీత్యా తీసుకునే చర్యలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ యాడ్‌ను తక్షణమే నిలిపివేయాలని కోరింది. నోటీసులు అందుకున్నవారు పది రోజుల్లో స్పందించాల్సిందిగా నోటీసుల్లో పొందుపరిచింది. -
దేశంలో తొలి హిజ్రా న్యాయవాది
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిజ్రాకు బార్ కౌన్సిల్లో సభ్యత్వం లభించింది. 36 ఏళ్ల సత్యశ్రీ శనివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందగలిగానని ఈ సందర్భంగా సత్య శ్రీ ఆవేదన చెందారు. జడ్జిగా ఎదగడమే తన కల అని చెప్పారు. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ జన్మతః బాలుడు. చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి వచ్చి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు. 2007లో సేలం కేంద్రీయ లా కాలేజీ నుంచి లా పట్టా తీసుకున్నారు. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రాతిపదికన జాతీయ న్యాయ వ్యవహారాల కమిషన్ హిజ్రాలు సైతం లాయర్లుగా బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో సత్యశ్రీకి బార్ కౌన్సిల్ సభ్యత్వం లభించింది. -
ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు
ఖమ్మంలీగల్ : రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల అధికారులు పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం బార్ అసోసియేషన్‌లో మొత్తం 674 ఓట్లు ఉండగా 610 ఓట్లు పోలయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ పర్యవేక్షణలో న్యాయమూర్తి వినోద్‌కుమార్ ఎన్నికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎన్నికల అధికారిగా ఖమ్మం బార్అసోసియేషన్ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు వ్యవహరించారు. బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. బార్ కార్యదర్శి కూరపాటి శేఖర్‌రాజు, ఉపాధ్యక్షురాలు పసుమర్తి లలిత, మర్రి ప్రకాష్, పిడతల రామ్మూర్తి మిగిలిన కార్యవర్గం ఎన్నికల అధికారికి సహకరించారు. ఈ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది బోడేపూడి రాధాకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు చివరి వరకు తమకు ఓటు వేసే విధంగా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్కౌన్సిల్లో 86 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఖమ్మం నుంచి ఐదుగురు పోటీ పడుతున్నారు. మొత్తం బార్ కౌన్సిల్ సభ్యులు 25 మంది ఎంపికకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో వారి భవితవ్యం వచ్చేనెలలో వెలువడనున్న ఫలితాలతో తేలనున్నది. ఎన్నికల అధికారులకు శేఖర్‌రాజు, రామ్మూర్తి, లలిత, మర్రి ప్రకాష్, పవన్, నారాయణ, తౌఫిక్, శ్రీలక్ష్మి తదితరులు సహకరించారు. కొత్తగూడెంలో 92 శాతం పోలింగ్ కొత్తగూడెంలీగల్: బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం కొత్తగూడెంలో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు అదనపు జిల్లా జడ్జి భువనేశ్వరరాజు పర్యవేక్షణలో ఎన్నికల అధికారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ నిర్వహణలో ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 183 మంది ఓటర్లకు గాను 169 ఓట్లు పోలయ్యా యి. తొలుత సీనియర్ న్యాయవాది బొల్లేపల్లి లక్ష్మీనారాయణ ఓటుహక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థులు కొల్లి సత్యనారాయణ, బిచ్చాల తిరుమలరావు, విష్ణువర్దన్‌రెడ్డి, దిలీప్‌కుమార్, ఫణీంద్రభార్గవ్, పంబ వెంక య్య, దావూద్ అలీ, జల్లా లింగయ్య తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఒక్కొక్క ఓటరుకు కనీసం 5 నుంచి 7 నిముషాల పాటు సమయం కేటాయించాల్సి వచ్చింది. వన్‌టౌన్ సీఐకుమారస్వామి, సిబ్బంది బందోబస్తు నిర్వí హించారు. అవకతవకలు చోటుచేసుకోకుండా బార్ కౌన్సిల్ తగిన జాగ్రత్తలు పాటించింది. పోలింగ్ కేంద్రంలో వెబ్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఉంచారు. సాధారణ ఎన్నికలు హంగులు, హడావుడితో ఎలా జరుగుతాయో అదేవాతావరణంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్లను జూలై 23 నుంచి కౌంటింగ్ చేయనున్నట్లు సమాచారం. బ్యాలెట్ల కౌంటింగ్‌లో అభ్యర్థుల ప్రాధాన్యతను గుర్తించడంలో ఎక్కువ సమయం పడుతుండడంతో కౌంటింగ్‌కు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. -
ప్రశాంతంగా బార్ కౌన్సిళ్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. న్యాయమూర్తులు జస్టిస్ అంబటి శంకర నారాయణ, జస్టిస్ పి.కేశవరావు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. హైకోర్టులో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 3,461 మంది ఓటర్లకు గాను 2,590 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా 80%పైగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల 100% పోలింగ్ నమోదైనట్లు బార్ కౌన్సిల్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 85% మేర పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఇక హైకోర్టులో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 2,746 మంది ఓటర్లకు గాను 1,552 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన గొడవతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోగా అధికారుల జోక్యంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లోని బ్యాలెట్ బ్యాక్సులకు సీలు వేసి వాటిని హైదరాబాద్‌కు తరలించనున్నారు. బార్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యే 25 మంది తమలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఏపీ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 11న, తెలంగాణ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 23న ఉంటుంది. ఢిల్లీలో 60 శాతం పోలింగ్.. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు అల్లంకి రమేశ్ ఎన్నికల అధికారిగా, న్యాయవాదులు ప్రభాకర్, ఎస్ఏ.నఖ్వీ సహాయ అధికారులుగా వ్యవహరించారు. మొత్తం 60% పోలింగ్ నమోదైందని రమేశ్ తెలిపారు. -
నేడు బార్ కౌన్సిళ్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటిదాకా ఓటింగ్ జరుగుతుంది. తెలంగాణలో 88, ఏపీలో 146 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నమోదైన ఉభయ రాష్ట్రాల లాయర్లు సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేయనున్నారు. రిటర్నింగ్ అధికారులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అంబటి శంకర నారాయణ, పి.కేశవరావు వ్యవహరిస్తున్నారు. ఏపీ ఎన్నికలను జస్టిస్ కేశవరావు, తెలంగాణ ఎన్నికలను జస్టిస్ శంకర నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఏపీ బార్ కౌన్సిల్ బరిలో 107 మంది, తెలంగాణ కౌన్సిల్‌కు 86 మంది బరిలో ఉన్నారు. తెలంగాణలో 21,077 మంది లాయర్లకు, ఏపీలో 27,676 మందికి ఓటు హక్కుంది. ఏపీ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 11న, తెలంగాణకు జూలై 23న జరగనుంది. ఒక్కో రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి 25 మందిని ఎన్నుకుంటారు. వీరిలోంచి చైర్మన్, కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఉభయ రాష్ట్రాలకు వేర్వేరుగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో లాయర్లు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల్లో కొందరు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, ఖరీదైన సెల్ఫోన్లు, వాచీలు, విదేశీ మద్యం, లాయర్లు వేసుకునే గౌన్లు, పుస్తకాలు... ఇలా ఏది కావాలంటే అది ఓటర్లకు తాయిలాలుగా ఇస్తున్నారు. మరికొందరు ఓట్లను కొనేస్తున్నారు. తెలంగాణ అభ్యర్థులతో పోలిస్తే ఏపీ అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. కొందరైతే వ్యక్తిగత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఖర్చు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్నారు. వారికి దన్నుగా ఆయా పార్టీల నేతలు భారీ విందులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలనూ బాగా ఉపయోగించుకుంటున్నారు. కరపత్రాలు, వాట్సాప్ మెసేజ్‌లు, ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
నువ్వా.. నేనా..
తిరుపతి లీగల్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఈనెల 29న జరగనున్నాయి. ప్రస్తుతమున్న ఉమ్మడి కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 13 జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లోని కోర్టుల ఆవరణలో పోలింగ్ ఉంటుంది. 13 జిల్లాల నుంచి 107 మంది న్యాయవాదులు పోటీలో ఉన్నారు. 27,600 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 25 మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఓ టు వేసే న్యాయవాది తమకు ఇష్టమైన అభ్యర్థుల పేర్లు ఎదురుగా ఒకటి, రెండు.. అని ఐదు నంబర్ల వరకు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. జిల్లా అభ్యర్థులు వీరే.. జిల్లా నుంచి ఆరుగురు న్యాయవాదులు బార్ కౌ న్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తిరుపతి నుంచి అత్యధికంగా ఐదుగురు బరిలో ఉండడం విశేషం. తిరుపతి న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షుడు వి.లక్ష్మన్న, గల్లా సుదర్శనరావు, న్యాయవాది, బీజేపీ నాయకుడు కొత్తపల్లి అజయ్‌కుమార్, రాయలసీమ హైకోర్టు సాధన సమితి కో– కన్వీనర్ ఎల్.వెంకటరమణ, తెలుగుదేశం మైనార్టీ నాయకుడు న్యాయవాది గౌస్అలీ పోటీలో ఉన్నా రు. అలాగే చిత్తూరు నుంచి సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు నల్లారి ద్వారకనాథ రెడ్డి పోటీలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,728 మంది న్యాయవాదులు ఓటు వేయడానికి అర్హత కలిగి ఉన్నారు. వీరిలో తిరుపతిలో 708 మంది ఉండడం గమనార్హం. నిబంధనల ప్రకారం తిరుపతిలో 1,300 మందికి పైగా న్యాయవాదులు అసోసియేషన్ సభ్యత్వం కలిగి ఉన్నారు. అయితే గత ఏడాది బార్ కౌన్సిల్ ఉత్తర్వుల మేరకు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) పంపిన వారికి మాత్రమే ఈసారి ఎన్నికల్లో ఓటు వేయడానికి బార్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. కొంతమంది న్యాయవాదులు రెగ్యుల్‌గా ప్రాక్టీస్ చేసేవారు కూడా సర్టిఫికెట్లు పంపక పోవడంతో వారు ఓటు హక్కును కోల్పోయారు. న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఎన్నికలు మొట్టమొదటి సారిగా బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయమూర్తుల పర్యవేక్షణలో జరగనున్నాయి. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు నియమితులయ్యారు. ఎన్నికల అధికారి హోదాలో జిల్లా న్యాయమూర్తి సీహెచ్‌కే దుర్గారావు జిల్లాలో పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని న్యాయమూర్తులు ఆయా ప్రాంతాల్లో జరిగే ఎన్నికలను పరిశీలిస్తారు. పెరిగిన ఎన్నికల ఖర్చు కాగా మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బార్‌కౌన్సిల్ ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరిగిందని పోటీలో ఉన్న అభ్యర్థులు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు తమ శక్తికి మించి ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విందులు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది న్యాయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. మరి కొంతమంది వివిధ రకాలుగా నగదు పంపిణీ చేసినట్టు తెలిసింది. లక్షల్లో సొమ్ము ఖర్చు పెడుతున్నా నేపథ్యంలో.. ఎవరూ నెగ్గుతారోనని న్యాయవాదుల్లో పెద్దఎత్తన చర్చ జరుగుతోంది. ఎన్నికల కౌంటింగ్ .. ఈనెల 29న ఎన్నికలు ముగిసిన తర్వాత జూలై 11 నుంచి సుమారు 10 రోజులపాటు కౌంటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ ఉమ్మడి తెలుగు రా ష్ట్రాల హైకోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. -
ఎల్ఈడీ టీవీలు, ఫారిన్ లిక్కరు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు.. రాజకీయ నాయకులకు ఏ మాత్రం తగ్గకుండా ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. హామీల విషయంలో భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, విదేశీ మద్యం బాటిళ్లు, ఇళ్ల స్థలాలు, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి 86 మంది, ఏపీ నుంచి 107 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఖర్చుకు తగ్గకుండా.. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొందరు అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి భారీ స్థాయిలో హామీలిస్తున్నారు. ఏపీ బార్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పక్కన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఖరీదైన ఎల్ఈడీ టీవీలు, విదేశీ మద్యం బాటిళ్లు, స్మార్ట్ ఫోన్లు, ఖరీదైన వాచీలు ఇస్తామంటూ ఓటర్లకు వీరు వల వేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ అభ్యర్థులు మాత్రం రాజకీయ పార్టీలపై దృష్టి సారించారు. బహుమతుల కన్నా రాజకీయ పలుకుబడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సామూహికం గా పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ నుంచి మద్దతు.. కృష్ణా–గుంటూరు జిల్లాల పరిధిలోని అభ్యర్థుల్లో ఒకరిద్దరు ఖర్చు విషయంలో వెనక్కి తగ్గడం లేదని ప్రచారం జరుగుతోంది. అధికార టీడీపీ నుంచి వారికి మద్దతు లభిస్తోందని సమాచారం. పార్టీ తరఫున ఎమ్మెల్యే లు సైతం రంగంలోకి దిగి వారికి ఓట్లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఆ అభ్యర్థుల గెలుపు బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ అభ్యర్థి కర్నూలులో న్యాయవాదులకు భారీ విందు ఏర్పాటు చేశారు. దీన్ని ఉపముఖ్యమంత్రి సోదరుడు పర్యవేక్షించినట్లు స్థానిక న్యాయవాదులు చెబు తున్నారు. ఈ పార్టీ ఏర్పాటు చేసిన అభ్యర్థి రాయలసీ మ జిల్లాల్లోని కొన్ని న్యాయవాద సంఘాలకు 50 ఇం చుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన కొత్త వారు, యువకులు చేస్తున్న ఖర్చును చూసి బరిలో నిలిచిన పాత వారు ఆశ్చర్యపోతున్నారు. -
బార్ కౌన్సిల్స్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయవాద మండళ్లకి (బార్ కౌన్సిల్స్) ఈ నెల 29న జరగనున్న ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నియమితులయ్యారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు వ్యవహరిస్తారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శిరేణుక బుధవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్నికలకు 107 నామినేషన్లు, తెలంగాణ ఎన్నికలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. గుర్తింపు కార్డు చూపిన ఓటర్‌కి బ్యాలెట్ ఇస్తారని, ఏపీలో జూలై 11న, రాష్ట్రంలో జూలై 23న కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
షాద్‌నగర్‌టౌన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర బార్ అసోసియోషన్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి న్యాయవాదులు అవకాశం కల్పించి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా తనను ఎన్నుకోవాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులను లాభం చేకూర్చే విధంగా వారికి ఉపకార వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ ఉపయోగపడే విధంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అడ్వకేట్స్ ఫండ్ కింద వంద కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని న్యాయవాదుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. షాద్‌నగర్‌లో సబ్‌కోర్టు ఏర్పాటు కావడానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమమే «ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. జూన్ 29న నిర్వహించే రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. 22 ఏళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యుడిగా, వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా ఎన్నో సేవలు అందించానని, మరిన్ని సేవలు అందించేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు చెంది మహేందర్‌రెడ్డి, మోముల బసప్ప, కంచి రాజ్‌గోపాల్, పాతపల్లి కృష్ణారెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి, జగన్, శ్రీనివాస్, ప్రణీత్‌రెడ్డి, కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బార్ కౌన్సిళ్ల’ బరిపై స్పష్టత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ న్యాయవాద మండళ్ల (బార్ కౌన్సిల్స్) ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. గురువారంతో నామినేషన్ల ఉపసంహర ణ గడువు ముగియడంతో బరిలో ఉన్న వారి లెక్కలు తేలాయి. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు 87 నామినేషన్లు దాఖలవగా ఒక ఉపసంహరణ జరిగింది. 86 మంది బరిలో మిగిలారు. ఏపీ కౌన్సిల్‌కు 109 నామినేషన్లు దాఖలవగా 2 ఉపసంహరణలు జరిగా యి. 107 మంది బరిలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదే శాల మేరకు 2 రాష్ట్రాల కౌన్సిళ్లకు జూన్ 29న ఉద యం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ కౌన్సిల్‌కు జూలై 23న, ఏపీలో జూలై 11న కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో పది చోట్ల ఓటింగ్ కేంద్రాలను నోటిఫై చేశారు. అదృష్టం పరీక్షించుకుంటున్న పాతకాపులు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పాతకాపులు మరోసారి బరిలో నిలిచారు. తెలంగాణ నుంచి కాసుగంటి లక్ష్మణకుమార్, ఎ.నర్సింహారెడ్డి, కొల్లి సత్యనారాయణ, సి.ప్రతాప్‌రెడ్డి, కె.సునీల్‌గౌడ్, ఆకుల అనంతసేన్‌రెడ్డి, ఎన్.హరినాథ్, జకీర్ హుస్సేన్ జావీద్ మళ్లీ పోటీ చేస్తున్నారు. వీరిలో నర్సింహారెడ్డి ఉమ్మడి బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా చేశారు. ఏపీ కౌన్సిల్లోనూ ఇదే పరిస్థితి! ఎన్.ద్వారకనాథ్‌రెడ్డి, కలిగినీడి చిదంబరం, గంటా రామారావు, బండారు వెంకటరమణ మూర్తి, వేలూరి శ్రీనివాసరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, ఆలూరు రామిరెడ్డి, సిరిపురపు మాధవీ లత, ముప్పాళ్ల సుబ్బారావు, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, రవి గువేరా, ఎస్.కృష్ణమోహన్ తదితరులు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో నూ కొందరు అభ్యర్థులు పార్టీల మద్దతు తీసుకుంటున్నారు. ముఖ్య నేతల నుంచి లాయర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు విదేశీ మద్యంతో పార్టీలిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ, ఏపీలో వేర్వేరుగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బార్ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం ఇదే తొలిసారి. జూన్ 29 న ఎన్నిక జరుగనుండగా.. ఈ నెల 17 నుంచి 26 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండు రాష్ర్టాల్లోనూ 52 వేల మందికి ఓటు హక్కు ఉండగా, తెలంగాణలో 23 వేల మంది, ఏపీలో 29 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో రాష్ట్రంలో బార్ కౌన్సిల్‌కు 25 మంది చొప్పున ఎన్నికవుతారు. -
నల్ల కోటు.. ఖరీదైన ఓటు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ కావచ్చు.. పార్లమెంటు.. కావచ్చు ఏ ఎన్నికలైనా కరెన్సీ కట్టలు కట్టలుగా ఖర్చుకావాల్సిందే. అయితే ఈరకమైన కరెన్సీ కట్టల భాగోతం ప్రస్తుతం బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సైతం చొరబడింది. ‘నల్లకోటు’ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.30 వేలు పలుకుతున్నట్లు సమాచారం. తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌కు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటుకు నోటుపై విజయనారాయణన్ అనే న్యాయవాది మదురై హైకోర్టు శాఖలో శుక్రవారం ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు కృపాకరన్, ధరణి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలను మించిపోయినట్లుగా భావించాల్సి వస్తున్నదని వారు వ్యాఖ్యానించారు. స్వేచ్ఛగా నగదు చలామణిపై అవసరమైన ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిఘాపెట్టి కరెన్సీని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సక్రమంగా జరగలేదని పిటిషన్ వేసే న్యాయవాదులే నేడు నగదు చలామణికి సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. ఇకపై ఎవరు ఎవరిని తప్పుపడతారని ప్రశ్నించారు. పదవి, అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశ రాజకీయ నేతల్లో పెరిగిపోవడంతో నోటును విసిరి ఓటును పట్టుకుంటున్నారు, ఇది మన కళ్ల ముందు అనాథిగా కనపడే సత్యమని అన్నారు. అయితే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సైతం రాజకీయపార్టీల విధానం అలవడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 230 న్యాయవాదుల సంఘాలు ఉండగా, అన్ని సంఘాలు 1961లో ఏర్పడిన మద్రాసు హైకోర్టులోని బార్ కౌన్సిల్ పరిధిలోకే వస్తాయి. ఎంతో అధికారంతో కూడిన పదవి కావడంవల్లనే బార్ కౌన్సిల్ ఎన్నికలు రానురానూ ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. మద్రాసు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అఖిలభారత బార్ కౌన్సిల్ ప్రతినిధికే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్లో ఓటున్న న్యాయవాదులు ముందుగా 25 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఈ 25 మంది సభ్యులు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎంపికైన 25 మందిలో 13 మంది సభ్యులు ఎవరివైపు ఉంటారో అతనే అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఆ తరువాత ఒక సాధారణ న్యాయవాదిగా చలామణి కాడు. అతనికంటూ ఒక పెద్ద కార్యాలయం, కింద పనిచేసే సిబ్బంది ఉంటారు. న్యాయవాదుల మధ్యలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడికి లభించే గౌరవమర్యాదలే ప్రత్యేకంగా ఉంటాయి. గౌరవం మాత్రమే కాదు గొప్ప అధికారాలు కూడా ఉంటాయి. న్యాయవాదులపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం, న్యాయమూర్తులుగా ఎన్నికైన వారికి సచ్చీల సర్టిఫికెట్ జారీచేసే అధికారం ఉంటుంది. బార్ కౌన్సిల్లో చేర్చుకోవడం, నిరాకరించే అధికారాలు కూడా ఉంటాయి. న్యాయవాదులు మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సహకారం చెల్లించడం అధ్యక్షుని చేతుల్లోనే ఉంటుంది. ఇంతటి అధికారాలు, గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టే పోటాపోటీగా నోట్లు వెదజల్లైనా ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధం అవుతున్నారు. రెండేళ్ల క్రితం జరగాల్సిన ఎన్నికలను వాయిదావేస్తూ పోతుండడంతో కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీచేయడంతో వచ్చేనెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పర్యవేక్షణలోనే బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నందున అక్రమాలు చోటుచేసుకుంటే వేటు తప్పదనే భయం కూడా సభ్యుల్లో ఉంది. -
లా కమిషన్ ప్రతిపాదనలపై నిరసన
⇔ పలు తీర్మానాలు చేసిన బార్‌కౌన్సిల్, న్యాయవాద సంఘాలు ⇔ 21న న్యాయవాదుల బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల చట్టానికి లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపా దించిన పలు సవరణలను ఉభ య రాష్ట్రాల న్యాయవాదులు వ్యతిరేకించారు. లా కమిషన్ ప్రతిపాదనలతో తయారైన న్యాయవాదుల (సవరణ) బిల్లు 2017ను వ్యతిరేకించాలని, నిరసన కార్యక్ర మాలు చేపట్టాలని నిర్ణయించారు. న్యాయవా దుల సవరణ బిల్లు నేపథ్యంలో ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కూడా పలు తీర్మానాలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణంలో ఆదివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు చిత్తరవు నాగేశ్వరరావు, జల్లి కనకయ్యతో పాటు ఉభయ రాష్ట్రాల్లోని పలు న్యాయవాద సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్‌కౌన్సిల్ సభ్యుడు ఎన్.ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ...లా కమిషన్ ప్రతిపాదనలు న్యాయవ్యవస్థ కు, న్యాయవాదులకూ వ్యతిరే కంగా ఉన్నాయన్నారు. బార్ కౌన్సిల్ క్రమ శిక్షణ కమిటీల్లో న్యాయవాదులేతరులకు స్థానం కల్పించాలన్న ప్రతిపాదన ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. బార్ కౌన్సిల్లో విశ్రాం త ప్రధాన న్యాయమూర్తి, విశ్రాంత న్యాయ మూర్తులకు స్థానం కల్పించాలన్న ప్రతిపాదన కూడా సరికాదన్నారు. చిన్న పొరపాటు చేసి నా న్యాయవాదులకు రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలన్న ప్రతి పాదనపై విస్మయం ప్రకటించారు. న్యాయవాదుల స్వేచ్ఛను దెబ్బతీసేలా ప్రతి పాదనలు చేసిన లా కమిషన్, వారి సంక్షే మానికి, రక్షణకు ఎలాంటి సూచనలూ చేయకపోవడాన్ని అందరూ తప్పుపట్టారు. ఈ సమావేశంలో చేసిన ప్రధాన తీర్మానాలివి... న్యాయవాదుల చట్టానికి సవరణకు సంబంధించి లా కమిషన్ చేసిన ప్రతిపాదనలన్నింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 21న అన్ని కోర్టుల్లో భోజన విరామ సమయంలో నిరసన. లా కమిషన్ చైర్మన్ రాజీనామాకు డిమాండ్. ప్రధాని, న్యాయశాఖ మంత్రి, గవర్నర్ లకు వినతిపత్రాలు. అలాగే పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించాలని ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపీలకు వినతి పత్రాల సమర్పణ. బీసీఐ ఆధ్వర్యంలో మే 2న జరగనున్న నిరసన ర్యాలీలో పాల్గొనాలి -
260 మంది లాయర్ల గుర్తింపు రద్దు
అగర్తల(త్రిపుర): పెద్ద సంఖ్యలో లాయర్ల గుర్తింపును రద్దు చేస్తూ త్రిపుర బార్ కౌన్సిల్(టీబీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వీరంతా కోర్టుల్లో ఎటువంటి న్యాయవాద వృత్తి సంబంధ కార్యకలాపాలు చేపట్టలేదని తెలిపింది. న్యాయవాద వృత్తిలో కొనసాగని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని 2010లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల మేరకు తాము ఈ చర్యలు చేపట్టినట్లు త్రిపుర బార్ కౌన్సిల్ ఛైర్మన్ పియూష్ కాంతి బిశ్వాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం డిబార్ అయిన 260మంది న్యాయవాదులు హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని వివిధ బార్ కౌన్సిళ్లలో నమోదయి ఉన్నారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ త్రిపుర కార్యాలయంలో వారి పేర్ల జాబితాను ఉంచింది. ఏళ్ల క్రితమే లా డిగ్రీ పొందిన చాలామంది ప్రాక్టీస్ కోసం బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు చేసుకున్నారని, అయితే వారిలో చాలా మంది వివిధ కారణాలతో ప్రాక్టీస్ చేపట్టలేదని టీబీసీ పేర్కొంది. కొందరు రాజకీయాల్లో, మరికొందరు వేరే వృత్తుల్లో కొనసాగుతున్నారని పేర్కొంది. గుర్తింపు రద్దయిన న్యాయవాదుల్లో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో త్రిపుర అసెంబ్లీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్నాథ్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్‌తోపాటు ఆయన తండ్రి మాజీ సీఎం సమీర్ రంజన్ బర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబాల్ భౌమిక్ తదితరులున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు తాము ఈ చర్య తీసుకున్నట్లు బిశ్వాస్ తెలిపారు. టీబీసీ సభ్యుల్లో న్యాయవాద వృత్తి చేపట్టని వారు, తప్పుడు ధ్రువీకరణలతో నమోదైన వారు, నేరచరితులు ఉన్నట్లు తమ పరిశీలనలో గుర్తించినట్లు పేర్కొన్నారు. న్యాయవాద పట్టా పొందిన వారు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న వారిని కూడా డిబార్ చేసినట్లు బిశ్వాస్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశమంతటా ఉన్న బార్ కౌన్సిళ్లు కూడా ఇదే విధమైన చర్యలు చేపడతాయని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు డిబార్ అయిన వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించారు. డిబార్ అయిన లాయర్లు ఎవరైనా తిరిగి ప్రాక్టీస్ చేపట్టాలని భావిస్తే వారు బార్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆమేరకు వారి పేర్లను, వారు పనిచేయదలచిన ప్రాంతం వివరాలను తెలపాల్సి ఉంటుందని, 2015 వెరిఫికేషన్ నిబంధనల ప్రకారం అంతిమ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కృషి
– రాజ్యసభ సభ్యుడు టీజీ కర్నూలు(లీగల్): కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు వి.వి.శేషుబాబు, జి.రఘురాం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో టీజీ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టుతో పాటు రాష్ట్ర రెండో రాజధానిని కూడా సాధిద్దామన్నారు. న్యాయవాదుల సంఘం కార్యాలయ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.80 లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. అర్హత కల్గిన న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులతో పాటు జిల్లా, మున్సిఫ్ కోర్టుల్లో వాహనాల పార్కింగ్ షెడ్డులతో పాటు మున్సిఫ్ కోర్టు ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంటు నిర్మాణానికి హామీ ఇచ్చారు. 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి వి.వి.శేషుబాబు మాట్లాడుతూ న్యాయవాదులు బాధ్యతతో పనిచేసి గౌరవాన్ని నిలపాలన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.రఘురాం మాట్లాడుతూ సమాజంలో చట్ట వ్యతిరేక నిబంధనలు వచ్చినప్పుడు న్యాయవాదులు ముందుండి పోరాడతారని చెప్పారు. అంతకుముందు బార్ అసోసియేషన్ రూపొందించిన పతాకాన్ని సీనియర్ న్యాయవాది బి.జంగంరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో 40 ఏళ్లు పైబడి వృత్తిలో ఉన్న న్యాయవాదులు బి.జంగంరెడ్డి, ఎం.డి.వై.రామమూర్తి, పోలూరి ఎల్లప్ప, జి.నాగలక్ష్మిరెడ్డిలను న్యాయమూర్తులు, న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.చాంద్‌బాషా, సి.వి.శ్రీనివాసులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రవిగువేరా, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం.సోమశేఖర్, గాయత్రి దేవి, శివకుమార్, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్నారాణి, పి.రాజు, మహిళా ప్రతినిధి గీతామాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి స్కూల్ విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. -
బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా మోహనకృష్ణన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం (బార్ కౌన్సిల్) అధ్యక్షునిగా మోహనకృష్ణన్ మరోసారి ఎన్నికయ్యారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సుమారు 4,777 మంది సభ్యులున్నారు. ఈ సంఘానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సీనియర్ కార్యనిర్వాహక సభ్యులు జూని యర్ కార్యనిర్వాహక సభ్యు లు, లైబ్రేరియన్ ఉంటారు. ఈ కార్యవర్గానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2016-18 సంవత్సరానికిగానూ సంఘం ఎన్నికలు బుధవారం జరి గారుు. అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షులు మోహన్కృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్, పీఎం.దురైస్వామి, ఎస్.కాశీరామలింగం, ఎల్. ఉరుగవేలు, కే. సత్యపాల్, సి.విజయకుమార్ ఇలా మొత్తం ఏడుగురు పోటీపడ్డా రు. ఉపాధ్యక్ష పదవికి ఎ.అబ్దుల్‌రెహమాన్, జార్జ్ చార్లస్, ఎం. జయకుమార్, మదివానన్, ఏ. మోహన్‌దాస్, ఆర్ మురళీ, ఎస్.ముత్తురామన్ ఎస్ పద్మ, ఎన్ ప్రభాకరన్, రువా, ఎమ్ఏఏఆర్ సుధా, విక్టర్, సామువేల్ ఇలా 13 మంది బరిలోకి దిగారు. అలాగే కార్యదర్శి పదవికి పీవీ ఇళంగో, కృష్ణకుమార్, ఎస్ శశికుమార ఆర్ శివశంకర్ ఇలా మొత్తం నలుగురు పోటీపడ్డారు. కోశాధికారి స్థానానికి సీ ఆరోగ్యదాస్, ఎస్ కామరాజ్, టీ శివషణ్ముగం, కే సుబ్రమణియన్ పోటీలో నిలిచారు. ఇక మిగిలి ఉన్న లైబ్రేరియన్ స్థానానికి గజలక్ష్మి రాజేంద్రన్, కే కుమరేశన్, మహావీర్ శివాజీ, వీఎమ్ రఘు, ఏ. రాజారాం, జి. రాజేష్, టి.రవికుమార్, కేకే శివకుమార్, కే తిప్పుకల్థాన్ పోటీపడ్డారు. బుధవారం పోలింగ్ జరిగిన తరువాత బ్యాలెట్ బాక్సులను సంఘం కార్యాలయంలో గట్టి బందోబస్తు మధ్య భద్రపరిచగా గురువారం ఓట్ల లెక్కింపు సాగింది. అధ్యక్షపదవికి పోలైన ఓట్లను తొలుత లెక్కించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన మోహనకృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్ల మధ్య గట్టిపోటీ నెలకొన్నట్లు ఓట్ల లెక్కింపులో తేలింది. మొదటి రౌండు నుంచి మోహనకృష్ణన్ ఆధిపత్యాన్ని చాటుకుని 1001 ఓట్ల మెజారిటీ తో అధ్యక్షులుగా మరోసారి ఎన్నికయ్యారు. -
10 మంది జడ్జీలకు కేంద్రం క్లియరెన్స్
న్యూఢిల్లీ: ‘హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు చేపట్టకుండా న్యాయవ్యవస్థను స్తంభింపజేస్తారా’ అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, గువాహటి హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియామకం కోసం పది మంది పేర్లకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. వీరిలో ఢిల్లీ హైకోర్టుకు 5 మందిని, గువాహటి హైకోర్టుకు 5 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తారు. ఢిల్లీ హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి తీసుకుంటుండగా, గౌహతి హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని బార్ కౌన్సిల్ నుంచి, రాష్ట్ర న్యాయ సేవల నుంచి తీసుకుంటున్నారు. తుది ఆమోదం కోసం ప్రతిపాదనలను కేంద్రం రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. ఈ వారాంతం కల్లా అనుమతి ఆమోదం లభించే అవకాశం ఉంది. -
బ్లాక్‌లిస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పవిత్రమైన న్యాయవాద వృత్తిని అపవిత్రంగా మార్చారనే ఆరోపణలపై పది మంది న్యాయవాదులను తమిళనాడు బార్ కౌన్సిల్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. న్యాయవాద వృత్తికి జీవితాంతం దూరం చేస్తూ నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా టాస్మాక్ సంస్థలో ఉద్యోగం చేస్తూ న్యాయవాద వృత్తిని అభ్యసించడం, నేర చరిత్రను కలిగి ఉండడం వంటి కారణాలపై పదిమందిపై వేటుపడింది. న్యాయవాదిగా పట్టా పుచ్చుకున్న తరువాత సదరు వ్యక్తి తమిళనాడు బార్ కౌన్సిల్లో పేరును నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకునే సమయంలో తనపై ఎటువంటిక్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. అయితే కొందరు న్యాయవాదులు తమ నేరచరిత్రను దాచిపెట్టి తమ పేర్లను నమోదు చేసుకున్నారని తమిళనాడు బార్ కౌన్సిల్‌కు ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో తమిళనాడు బార్‌కౌన్సిల్ పేర్లను నమోదు చేసుకున్నవారి వివరాలను సమీక్షించారు. కన్యాకుమారీ జిల్లాకు చెందిన కార్తికేయన్, ఆదికేశవన్, మురళీ, రామచంద్రన్, స్టాన్లీముల్లవర్ తమపై ఉన్న క్రిమినల్ కేసులను దాచిపెట్టిన సంగతి బైటపడింది. వీరందరికీ బార్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. అలాగే టాస్మాక్ సంస్థలో పనిచేస్తూ చదువుకున్న వెంకటేశన్, కవిదాసన్, తూయవన్, మనివణ్ణన్, ఫార్మసీ వ్యాపారం చేస్తూ న్యాయవాద కళాశాలకు వెళ్లిన రమేష్‌బాబులను కూడా గుర్తించారు. వీరికి కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు వారు పంపిన సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ పదిమందిని బార్ కౌన్సిల్ సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక జీవితాతం వారు న్యాయవాద వృత్తిని చేపట్టరాదని ఆదేశించింది. ఇదిలా ఉండగా, నకిలీ పట్టాలతో న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్న వారిని సైతం గుర్తించేందుకు బార్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. పునఃపరిశీనకు సర్టిఫికేట్లను సమర్పించాల్సిందిగా రాష్ట్రంలోని 90 వేల మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ కోరగా కేవలం 256 మంది మాత్రమే సమర్పించారు. సర్టిఫికెట్ల తనిఖీలకు సహకరించని న్యాయవాదులపై కూడా తగిన చర్య తీసుకుంటామని బార్ కౌన్సిల్ హెచ్చరించింది. ముగిసిన పదవీకాలం: ఇదిలా ఉండగా తమిళనాడు బార్ కౌన్సిల్ పదవీకాలం ఈనెల 19వ తేదీతో ముగిసింది. బార్ కౌన్సిల్‌ను నిర్వహించేందుకు ముగ్గురితో కూడిన ప్రత్యేక బృందాన్ని అడ్వకేట్ జనరల్ నియమించారు. అడ్వకేట్ జనరల్ ఆర్ ముత్తుకుమారస్వామి ఈ బృందానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తుండగా టీ సెల్వం, పీఎస్ అమల్‌రాజ్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ బృందానికి సహాయకులుగా సీనియర్ న్యాయవాదులు ఏ నటరాజన్, ఏఏ వెంకటేశన్, కేఆర్ఆర్ అయ్యప్పమణి తదితర 16 మంది తాత్కాలికంగా నియమితులయ్యారు. -
పెండింగ్ కేసులతో నివేదికలు
ఏటా వెలువరించాలని కోర్టులను కోరిన ప్రధాని మోదీ పట్నా: దేశంలోని పెండింగ్ కేసుల వివరాలతో కోర్టులు వార్షిక నివేదిక విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. శనివారమిక్కడ పట్నా హైకోర్టు శతాబ్ది వేడుకల ముగింపు సభలో మాట్లాడుతూ... కోర్టులు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకునే విషయంలో సలహాలు ఇవ్వాలని కోరారు. ‘నా ఆలోచనతో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. కోర్టుల్లో పేరుకుపోయిన పాత కేసుల వివరాలు ప్రస్తావిస్తూ... ఏటా బులెటిన్ విడుదల చేయాలి. 40, 50 ఏళ్ల పాత కేసులు కూడా అందులో ఉన్నాయి. అలా చేస్తే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. కేసుల పరిష్కారానికి ఈ సమాచారం స్ఫూర్తిగా నిలుస్తుంది. కేసు ఎందుకు పెండింగ్ ఉందో తెలుసుకుని పరిష్కారం కనుగొనేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది..’ అని చెప్పారు. ఇదివరకు లేని సాంకేతికత మన దగ్గర ఉందని, బార్, బెంచ్, కోర్టుల్లో డిజిటల్ టెక్నాలజీ ప్రవేశపెడితే... మంచి తీర్పులు ఇవ్వడంలోను, వాదనల్లో సాయపడుతుందన్నారు. వందేళ్లలో పట్నా హైకోర్టు ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహించిందని కొనియాడారు. బార్ కౌన్సిల్, కోర్టు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వ్యవస్థలు తరచూ మారకపోతే కాలానికనుగుణంగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చలేమన్నారు. ఖాళీలు భర్తీ చేయండి: టీఎస్ ఠాకూర్ దేశంలో పెద్దసంఖ్యలో జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కేసుల పరిష్కారంలో ఇదే అడ్డంకిగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్ అన్నారు. హైకోర్టుల్లో 900 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా 468 మందే ఉన్నారన్నారు. జడ్జిల భర్తీలో అనుమతుల్ని వేగవంతం చేయాలని, ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. గత రెండు నెలల్లో 150 మంది జడ్జిల్ని వేర్వేరు హైకోర్టుల్లో నియమించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్, కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ, బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌లు పాల్గొన్నారు. మోదీ, నితీశ్ భాయ్ భాయ్? సభలో పరస్పర ప్రశంసలు హాజీపూర్: బిహార్ ఎన్నికల్లో ఉప్పు-నిప్పులా ఉన్న ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం ఒకే వేదికపై ఆప్యాయంగా పలకరించుకున్నారు. బిహార్‌లోని హాజీపూర్ రైల్-కమ్-రోడ్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి మోదీ, సీఎం నితీశ్ హాజరయ్యారు. ఇతర వక్తలు మాట్లాడుతుండగా ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. తొలుత నితీశ్ ప్రసంగిస్తూ ‘గంగానదిపై కూలేస్థితిలో ఉన్న బ్రిడ్జి అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసు కుంది. మీరు(మోదీ) ప్రధాని అయ్యా క అభివృద్ధిపై నా అంచనాలు మరింత పెరిగాయి. ప్రజలకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఎన్నికల తర్వాత తొలిసారి బిహార్ వచ్చారు. రాష్ట్రపురోగతికోసం ఇకపై మీరు తరచూ రావాలి’ అని అన్నారు. ఆ సమయంలో జనం మోదీ-మోదీ అని నినాదాలు చేయగా, ప్రధాని లేచి వచ్చి వారిని శాంతపరిచారు. ప్రసంగంలో మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని నితీశ్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈయన వల్లే బిహార్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందడుగేస్తే బిహార్ ఊహించనంత పురోగతి సాధిస్తుంది’ అని అన్నారు. -
నేర చరితులకు నో ఎంట్రీ
బార్ కౌన్సిల్లో నేరచరిత న్యాయవాదులకు సభ్యత్వం ఇక కష్టమే మూడేళ్ల లా పట్టాపై నిషేధం కోసం కమిటీ మద్రాసు హైకోర్టు తీర్పు లా కోర్సులో ప్రవేశానికి పోలీస్ సర్టిఫికెట్ తప్పనిసరి చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల సమస్యలను చట్టపరంగా పరిష్కరించే న్యాయవాదులే సమస్యలో పడ్డారు. నేరచరితులకు బార్ కౌన్సిల్లోకి ప్రవేశం లేదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు కొందరు న్యాయవాదులను ఇరకాటంలో పెట్టింది. అలాగే మూడేళ్ల న్యాయశాస్త్రం పట్టాపై నిషేధం విధించేలా ఒక క మిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని న్యాయవాదుల చట్టంలో మార్పులు చేయాలని, అంతవరకు బార్ కౌన్సిల్ ఎన్నికలను వాయిదా వేయాలని తదితర సంచలన తీర్పులను చెప్పింది. మూడేళ్ల, ఐదేళ్ల న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నవారు బార్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని పొందుతున్నారు. ఈ విధానంపై వచ్చిన అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి కృపాకర న్ కొంతకాలంగా సాగుతున్న విచారణను పూర్తిచేసి మంగళవారం తీర్పు చెప్పారు. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాదులు బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా తమ పేర్లను నమోదు చేసుకోరాదని నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పట్టా పుచ్చుకున్న న్యాయవాదులు తమిళనాడు బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు సమయంలో సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ప్రస్తుతం మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సులు అమలులో ఉన్నాయి, ఇకపై ఐదేళ్ల కోర్సులు మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి నేతృ త్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని లా కోర్సుల చట్టంలో మార్పులు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని చెప్పారు. అలాగే లా కోర్సులో ప్రవేశించేందుకు విద్యార్థులు తమ నడవడికపై పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేసేలా మార్పులు తీసుకురావాలని చెప్పారు. ఈ మార్పులు జరిగే వరకు తమిళనాడు బార్ కౌన్సిల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించారు. న్యాయవాదిగా 20 ఏళ్ల అనుభవం ఉన్నవారే బార్ కౌన్సిల్‌కు పోటీచేయాలని, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని బార్ కౌన్సిల్ ఎన్నికలను అనుమతించరాదని తీర్పులో పేర్కొన్నారు. రిటైర్డు న్యాయమూర్తి కమిటీలో పోలీసులు, మేధావులు సభ్యులుగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని విరమించిన వారు న్యాయవాదులుగా ప్రాక్టీసు చేయడాన్ని అనుమతించరాదని న్యాయమూర్తి తన తీర్పులో కోరారు. -
విచారణ ముగిసిన మూడునెలల్లోగా తీర్పు చెప్పాలి
చెన్నై, సాక్షి ప్రతినిధి:విచారణ ముగిసిన మూడునెలల్లోగా తీర్పు చెప్పని న్యాయమూర్తులకు కేసులు విచారించే అవకాశాన్ని ఇవ్వరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూరియన్ జోసెఫ్ అన్నారు. కేసు విచారణ తరువాత నెల లేదా మూడు మాసాల్లోగా తీర్పు చెప్పనివారు కొత్త కేసుల విచారణకు అర్హులు కారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలభారత బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన సదస్సులో సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన సూరియన్ జోసెఫ్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక కేసు విచారణ ముగిసిన తరువాత తీర్పు చెప్పేందుకు కనిష్ట కాలం నెల గరిష ్టకాలం మూడు నెలలని ఆయన అన్నారు. మూడు నెలలకు మించి కేసుల తీర్పును మూలనపడేసే న్యాయమూర్తులకు కొత్త కేసులు విచారించే అవకాశాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కల్పించరాదని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులపై తీర్పులు పూర్తిచేసిన తరువాతనే కొత్త కేసుల బాధ్యతలను అప్పగించాలని ఆయన సూచించారు. అలాగే, న్యాయవాదులు కోర్టులను బహిష్కరించరాదని అనేక సందర్భాల్లో మూడుమార్లు తీర్పుచెప్పినా బహిష్కరిస్తూనే ఉన్నారని ఆయన తప్పుపట్టారు. కోర్టు నిర్ణయాలకు విరుద్ధంగా విధులను బహిష్కరించే చర్యలను మానుకోవాలని ఆయన కోరారు. మీడియాకు చెప్పొద్దు: కేసు విచారణ సమయాల్లో న్యాయమూర్తులు వెలిబుచ్చే అభిప్రాయాలను మీడియాకు తె లపడం మానుకోవాలని ఆయన హితవుపలికారు. తీర్పుకోసం వేచిచూసే కేసుల్లో మీడియానే తీర్పు చెప్పేస్తోందని ఆయన అన్నారు. నిర్భయ కేసులో నిందితునికి తీవ్రస్థాయిలో శిక్షకు గురిచేసేలా మీడియా కథనాలు వెలువడ్డాయని తీర్పు చెప్పిన న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానించారని సూరియన్ జోసెఫ్ గుర్తు చేశారు. మీడియాలో సామాజిక బాధ్యతలను ఎరిగి మసలుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే చలమేశ్వర్ మాట్లాడుతూ కేసులు సుదీర్ఘ కాలం కొనసాగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కారణమని అన్నారు. 1975లో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను వేసేందుకు తీసిన గొయ్యి స్థలం తమకు చెందినదని అటవీశాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనేక సంవత్సరాల పాటూ సాగిన ఈ కేసులో కొన్నేళ్ల క్రితమే తీర్పు చెప్పారని ఆయన ఉదహరించారు. కాబట్టి కేసుల్లో జాప్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారకులు కారాదని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఫ్ఎమ్ ఇబ్రహీం కలీబుల్లా మాట్లాడుతూ ఎటువంటి లోపాలు లేని చట్టాన్ని తేవడం, అది సక్రమంగా అమలయ్యేలా చూడడం ప్రభుత్వాల బాధ్యతని అన్నారు. లంచం, అవినీతిని సమాజం నుంచి పారదోలాలని ఆయన కోరారు. ఎంబీబీఎస్, ఎండీ చదువులకు ఇంత ఫీజు అనే చట్టం ఉండి కూడా రూ.50లక్షలు, అంతకు మించి వసూలు చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంవై ఇక్బాల్ మాట్లాడుతూ నాకు తెలిసినంత వరకు మద్రాసు హైకోర్టులో 20 మంది వరకు ధనికులైన న్యాయవాదులు ఉన్నారు, పార్లమెంటు సభ్యల వలెనే ఈ న్యాయవాదులు సైతం గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో న్యాయశాస్త్రం, కంప్యూటర్ విద్య వంటి ఉన్నతమైన గ్రంథాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు ప్రధానంగా భాగస్వామ్యులు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీ నాగప్పన్ పిలుపునిచ్చారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు సమాజం కోసమే పాటుపడుతున్నారని చెప్పారు. అయితే కేసుల పరిష్కారంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. కోర్టు విధుల బహిష్కరణ ఏవిధంగానూ సమస్యకు పరిష్కారం చూపదని, జపాన్ విధానంలో న్యాయవాదులు సైతం ఏడాదికి 15 రోజులు అధికంగా పనిచేయడం ద్వారా తమ నిరసనను వెలిబుచ్చాలని కోరారు. అఖిలభారత బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎంకే మిశ్రా మాట్లాడుతూ భారత్‌లోని మొత్తం న్యాయవాదుల్లో 30 శాతం మంది నకిలీలు, 20 శాతం మంది నకిలీ సర్టిఫికెట్లను దాఖలు చేసి న్యాయవాదులగా నమోదు చేసుకుని విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. మరో 10 శాతం మంది చట్టాన్నే చదవకుండా బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు చేసుకుని న్యాయవాదులుగా చలామణి అవుతున్నారని వివరించారు. ఈ కారణంగా దేశంలోని న్యాయవాదుల సర్టిఫికెట్లను తనిఖీ చేసే కార్యక్రమాన్ని తాము చేపట్టామని తెలిపారు. పవిత్రమైన న్యాయవాద వృత్తిని తప్పుడు పనులకు వాడుకునేందుకు ఎంతమాత్రం అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాద వృత్తి పేరుతో వేరు వృత్తులు చేసుకుంటున్న వారిని నిరోధించేందుకు చట్టంలో సవరణలు చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్ భానుమతి, వీ గోపాల గౌడ, హైకోర్టు న్యాయమూర్తులు సతీష్‌కుమార్ అగ్నిహోత్రి, తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ అధ్యక్షులు టీ సెల్వం పాల్గొన్నారు. -
న్యాయశాఖ మంత్రి డిగ్రీ పత్రాలు నకిలీవే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ఇక్కట్లు పెరుగుతున్నాయి. ఆయన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసే విషయాన్ని కూడా బార్ కౌన్సిల్ యోచిస్తోంది. జితే ంద్ర సింగ్ తోమర్ పత్రాలు నకిలీవని దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదుచేసింది. తోమర్ సమర్పించిన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ కార్యదర్శి జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీ పట్టా నకిలీదిగా యూనివర్సిటీ తేల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి రిజిష్టర్ నంబర్ 3687 తో పొందినట్లు ఎల్ఎల్బీ పట్టా నకిలీదని సంబంధిత యూనివర్సిటీ తేల్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించవలసిందిగా బార్ కౌన్సిల్ ఢిల్లీ పోలీసులను కోరింది. తోమర్ 2011లో బార్‌కౌన్సిల్ సభ్యత్వం కోసం ధరఖాస్తు చేసి అదే సంవత్సరం సభ్యత్వం పొందారు. న్యాయమంత్రిని అరెస్టు చేయాలి: బీజేపీ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో న్యాయమంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను అరెస్టు చేయాలని బీజేపీ బుధవారం డిమాండ్ చేసింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు మంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు.. ఆప్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గే పోలీసులు ఇంతవరకూ తోమర్‌ను అరెస్టు చేయలేదని విమర్శించారు. గ త 12 రోజులుగా ఈ విషయమై బీజేపీ ప్రశ్నిస్తున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిడికీ తలొగ్గి పని చేయరాదన్నారు. ఢిల్లీని పాలిస్తున్న నకిలీ ప్రభుత్వం, దాని నకిలీ మంత్రుల నిజ స్వరూపాలు బయట పడాల్సి ఉందని ఉపాధ్యాయ అన్నారు. -
ప్రత్యేక బార్‌కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి
హైదరాబాద్: తెలంగాణకు రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడంతో పాటు బార్ కౌన్సిల్‌ను విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫిబ్రవరి 2 న ఛలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పిబ్రవరి 2 వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల విధులను బహిష్కరించాలని నిర్ణయించింది. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, నాంపల్లి క్రిమినిల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి నేతృత్వంలో నాంపల్లి కోర్టులో శనివారం అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ సాధించుకున్నా...ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. -
హైకోర్టును వెంటనే విభజించాలి
టీ న్యాయవాదుల జేఏసీ డిమాండ్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం ఈనెల 31న ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు, బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో తెలంగాణకు చెందిన అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఏడు నెలలు గడచినా హైకోర్టు విభజనతోపాటు బార్ కౌన్సిల్ ఏర్పాటుపై జాప్యం చేస్తున్నారని, దీంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని వారు అంటున్నారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు. 31న సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వెంటనే హైకోర్టు విభజన, ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు దిశగా చొరవ తీసుకోవాలని కోరనున్నారు. దీంతోపాటు హైకోర్టు ఎదుట ఆందోళ చేపట్టాలని యోచిస్తున్నట్టు జేఏసీ నేతలు శ్రీరంగారావు, కొండారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు గురువారం విలేకరులకు తెలిపారు. నియామకాలు ఆపాలి: జూనియర్ లాయర్లు న్యాయవ్యవస్థలో విభజన ప్రక్రియ చేపట్టకుండా నియామకాలు చేస్తే తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యాయవ్యవస్థలో ఇప్పటికే తెలంగాణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ పేర్కొన్నారు. ఏపీలో 595 కోర్టులు ఉండగా, తెలంగాణలో 439 కోర్టులు ఉన్నాయని...జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో ఏపీకి చెందిన వారు 338 మంది ఉండగా, తెలంగాాణకు చెందిన వారు 159 మంది మాత్రమే ఉన్నారన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో ఏపీకి చెందిన వారు 155 మంది ఉండగా, తెలంగాణకు చెందిన వారు కేవలం 44 మంది మాత్రమే ఉన్నారన్నారు. జిల్లా జడ్జి కేడర్‌లో 181 మంది ఏపీ వారు ఉండగా, తెలంగాణకు చెందిన వారు 39 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. జేసీజే నియామకాలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఈ దశలో నియామకాలు చేపడితే తెలంగాణకు మరోసారి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ న్యాయవాదులకు మరోసారి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన కోరారు. -
తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుపై వైఖరేమిటి..?
బీసీఐకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేస్తున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే బార్ కౌన్సిల్ ఉండటం, ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు శనివారం విచారణ జరిపారు.