తిరుపతి లీగల్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఈనెల 29న జరగనున్నాయి. ప్రస్తుతమున్న ఉమ్మడి కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 13 జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లోని కోర్టుల ఆవరణలో పోలింగ్ ఉంటుంది. 13 జిల్లాల నుంచి 107 మంది న్యాయవాదులు పోటీలో ఉన్నారు. 27,600 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 25 మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఓ టు వేసే న్యాయవాది తమకు ఇష్టమైన అభ్యర్థుల పేర్లు ఎదురుగా ఒకటి, రెండు.. అని ఐదు నంబర్ల వరకు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
జిల్లా అభ్యర్థులు వీరే..
జిల్లా నుంచి ఆరుగురు న్యాయవాదులు బార్ కౌ న్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తిరుపతి నుంచి అత్యధికంగా ఐదుగురు బరిలో ఉండడం విశేషం. తిరుపతి న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షుడు వి.లక్ష్మన్న, గల్లా సుదర్శనరావు, న్యాయవాది, బీజేపీ నాయకుడు కొత్తపల్లి అజయ్‌కుమార్, రాయలసీమ హైకోర్టు సాధన సమితి కో– కన్వీనర్ ఎల్.వెంకటరమణ, తెలుగుదేశం మైనార్టీ నాయకుడు న్యాయవాది గౌస్‌అలీ పోటీలో ఉన్నా రు. అలాగే చిత్తూరు నుంచి సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు నల్లారి ద్వారకనాథ రెడ్డి పోటీలో ఉన్నారు.
జిల్లాలో మొత్తం 1,728 మంది న్యాయవాదులు ఓటు వేయడానికి అర్హత కలిగి ఉన్నారు. వీరిలో తిరుపతిలో 708 మంది ఉండడం గమనార్హం. నిబంధనల ప్రకారం తిరుపతిలో 1,300 మందికి పైగా న్యాయవాదులు అసోసియేషన్ సభ్యత్వం కలిగి ఉన్నారు. అయితే గత ఏడాది బార్ కౌన్సిల్ ఉత్తర్వుల మేరకు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) పంపిన వారికి మాత్రమే ఈసారి ఎన్నికల్లో ఓటు వేయడానికి బార్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. కొంతమంది న్యాయవాదులు రెగ్యుల్‌గా ప్రాక్టీస్ చేసేవారు కూడా సర్టిఫికెట్లు పంపక పోవడంతో వారు ఓటు హక్కును కోల్పోయారు.
న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఎన్నికలు
మొట్టమొదటి సారిగా బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయమూర్తుల పర్యవేక్షణలో జరగనున్నాయి. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు నియమితులయ్యారు. ఎన్నికల అధికారి హోదాలో జిల్లా న్యాయమూర్తి సీహెచ్‌కే దుర్గారావు జిల్లాలో పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని న్యాయమూర్తులు ఆయా ప్రాంతాల్లో జరిగే ఎన్నికలను పరిశీలిస్తారు.
పెరిగిన ఎన్నికల ఖర్చు
కాగా మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బార్‌కౌన్సిల్ ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరిగిందని పోటీలో ఉన్న అభ్యర్థులు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు తమ శక్తికి మించి ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విందులు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది న్యాయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. మరి కొంతమంది వివిధ రకాలుగా నగదు పంపిణీ చేసినట్టు తెలిసింది. లక్షల్లో సొమ్ము ఖర్చు పెడుతున్నా నేపథ్యంలో.. ఎవరూ నెగ్గుతారోనని న్యాయవాదుల్లో పెద్దఎత్తన చర్చ జరుగుతోంది.
ఎన్నికల కౌంటింగ్ ..
ఈనెల 29న ఎన్నికలు ముగిసిన తర్వాత జూలై 11 నుంచి సుమారు 10 రోజులపాటు కౌంటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ ఉమ్మడి తెలుగు రా ష్ట్రాల హైకోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో లెక్కింపు కార్యక్రమం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment