పేరూరులో విచారిస్తున్న ఎన్నికల కమిషన్ బృందం
చిత్తూరు, తిరుపతి రూరల్: జిల్లావ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అర్హుల ఓటర్లను తొలగించేందుకు జరిగిన కుట్రలపై భారత ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. అర్హులైన వారి ఓట్లను తొలగించేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని 15 రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం–7 పేరుతో తమకు తెలియకుండానే తమ ఓట్లను తామే తొలగించాలని కోరినట్లు కొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంపై పూర్తి స్థాయిలో విచారించాలని నాలుగు రోజుల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాష్ట్ర›ఎన్నికల కమిషన్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జాతీయ ఎన్నికల కమిషన్‌కు మెయిల్ ద్వారా సమాచారం పంపించారు. దీంతో కమిషన్ కార్యదర్శి మలైమాలిక్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం మూడు రోజుల పర్యటన కోసం బుధవారం జిల్లాకు వచ్చింది. పోలింగ్ బూత్‌ల వారీగా ఏర్పాట్లను పరిశీలించటంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలోనే వచ్చిన వేలాది దరఖాస్తులపై కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక నియోజకవర్గంలో తమ ఓటును తొలగించాలని తామే దరఖాస్తు చేసుకున్నట్లు అన్ని వేల ఆన్‌లైన్ దరఖాస్తులు ఎలా వచ్చాయని పరిశీలిస్తున్నారు. కావాలనే కొందరు వ్యక్తులు, కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని ఇలా దరఖాస్తు చేశారని స్థానికులు కమిషన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
పోలింగ్ బూత్‌ల వారీగా నివేదిక
ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలైమాలిక్ ఆధ్వర్యంలోని బృందం ముందుగా అవిలాల, మంగళం, పేరూరు పంచాయతీల్లో పర్యటించింది. పోలింగ్ బూత్‌లను పరిశీలించి ఓటర్లతో ముచ్చటించింది. తమకు తెలియకుండానే తమ ఓటును తొలగించాలని దరఖాస్తు చేశారని, కొందరు బీఎల్వోలు పూర్తి స్థాయిలో విచారించకుండానే ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. దొంగ దరఖాస్తులు తీవ్ర నేరమని, అలాంటి వారిని గుర్తించి, దేశద్రోహం, సైబర్‌క్రైం చట్టాల కింద కేసులు నమోదు చేయాలని కమిషన్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.
కదులుతున్న డొంక..!
ఎన్నికల కమిషన్‌కు వైఎస్.జగన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదులపై దేశ ఎన్నికల కమిషన్ విచారణ మొదలుపెట్టడంతో జిల్లాలోని అధికారుల్లో వణుకు మొదలైంది. వేలాదిగా వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తులపై ఆరా తీయడం మొదలుపెట్టారు. చాలా వరకు దరఖాస్తులను కంప్యూటర్ సెంటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, కొన్ని మీ–సేవ కేంద్రాల ద్వారానే చేసినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి ఐపీ అడ్రసులను సేకరిస్తున్నారు. అవి ఎవరి పేరుతో ఉన్నాయి? ఎవరు వాడుతున్నారు? వాటి నుంచి ఎవరెవరికీ సమాచారం వెళ్లింది? వాటికి సంబంధించి కాల్‌డేటాను సైతం విశ్లేషిస్తున్నారు. డేటాను విశ్లేషించేందుకు పుణేలోని డేటా విశ్లేషణ సంస్థకు పంపించారు. టీడీపీ బూత్ కన్వీనర్లకు ఆ పార్టీ పంపిణీ చేసిన ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్ల నుంచి కూడా ఈ ఆన్‌లైన్ అర్జీలు చేసినట్లు సమాచారం. ఓట్ల తొలగించేందుకు దొంగచాటుగా చేసిన అర్జీల కుట్రలో భాగస్వామ్యం ఉందని చంద్రగిరి నియోజకవర్గంలో ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ ఎన్నికల అధికారులకు స్వయంగా తెలిపారు. టీడీపీ మండలాధ్యక్షుడితో పాటు మరో ఇద్దరిపై దేశద్రోహం, సైబర్ క్రైం చట్టాల కింద కేసులు నమోదు చేíసినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తే మరిన్ని ఈ తొలగింపు కుట్ర వెనుక ఉన్న పెద్దల హస్తం బయటపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో కీలకపాత్రదారుల పాత్ర నిర్ధారణ అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అవకాశముందని ఎన్నికల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలే బీఎల్వోలు..
చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల వి«ధుల్లో కీలకమైన బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో)గా ఉన్నారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భారత ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పాకాల, చంద్రగిరి మండలాల్లో కొందరు బీఎల్వోలుగా ఉన్న వారికి సంబంధించిన టీడీపీ సభ్యత్వం కార్డు, వారు పార్టీ జెండాను పట్టుకుని చేస్తున్న ప్రచారం వంటి ఆధారాలను కమిషన్‌కు అందించారు. పూర్తి స్థాయిలో విచారించకుండా ఎన్నికల విధుల్లో ఓ రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తులను ఎలా నియమిస్తారని ఈ సందర్భంగా కమిషన్ బృందం జేసీ, సబ్ కలెక్టర్‌పై మండిపడింది. వారిని వెంటనే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి కమిషన్ అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment