voter lists
-
‘స్థానిక’ ఖాళీల భర్తీకి 8న ముసాయిదా ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వివిధ పంచాయతీరాజ్, పురపాలక సంస్థల్లోని వివిధ స్థానాలకు ఏర్పడిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 8న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించి, వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరించాలని సంబంధిత పీఆర్, మున్సిపాలిటీ శాఖల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఈ జాబితాలపై రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరబాట్లు లేకుండా పక్కాగా తయారు చేస్తే ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల స్థానాల భర్తీకి సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీపై సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా పార్థసారథి మాట్లాడుతూ 2022 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని అదే నెల 6న ఈసీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలను ఈ నెల 21న ప్రచురించాలని సూచించారు. వీటి తయారీలో సాధారణ ఎన్నికల్లో ఏర్పరిచిన వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాక ఎస్ఈసీ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పబ్లికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని పార్థసారథి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, వివిధ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 1న జారీకానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీ. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరుగుతుంది. షెడ్యూల్ వెల్లడి కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందినందున ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితాతో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను విధించింది. హుజూరాబాద్‌లో కూడా.. మరోవైపు.. తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా అదేరోజు ఉపఎన్నిక జరగనుంది. బద్దేలు, హుజూరాబాద్‌తో కలిపి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ ఆంక్షలు ఇవే.. ► నామినేషన్ వేసే ముందుగానీ, తరువాతగానీ ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం. ► రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బంది, అధికారులను మాత్రమే ఎన్నికల ప్రక్రియలో వినియోగించాలి. ► సభ చుట్టూ వలయాలు, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చును అభ్యర్థులు లేదా పార్టీ భరించాల్సి ఉంటుంది. బారికేడ్లు ఏర్పాటు చేయదగిన బహిరంగ స్థలాలను మాత్రమే సభలకు ఎంపిక చేయాలి. ► స్టార్ క్యాంపేయినర్స్ సంఖ్యపై కూడా పరిమితి ఉంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు 20 మంది, గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు 10 మంది మాత్రమే ఉండాలి. ► రోడ్డు షోలు, బైక్, కార్, సైకిల్ ర్యాలీలకు అనుమతిలేదు. ► ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు, వారి ప్రతినిధులు సహా మొత్తం ఐదుగురికి మాత్రమే అనుమతి. ► ఒక అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి గరిష్టంగా 20 వాహనాలు.. అందులోని సీట్ల సామర్థ్యంలో 50శాతం మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి. -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. తప్పుల సవరణకు సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేశామన్నారు. తమ పేర్లు ఓటర్ల జాబితాలో తప్పుగా ఉన్నాయని భావిస్తే, ఆ వ్యక్తులు సంబంధిత అధికారులను ఆశ్రయించి తప్పులను సవరించుకునే వెసులుబాటు ఉందన్నారు. కానీ పిటిషనర్లు కోర్టుకొచ్చి, మొత్తం ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయించారన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి అనుమతివ్వాలని కోరారు. శేషుకుమారి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయన్న కారణంతో ఎన్నికలను నిలిపివేయడం సరికాదన్నారు. ఎన్నికల నిలుపుదలకు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేసిన చిరంజీవి తదితరుల తరఫు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ఈ అప్పీళ్లకు విచారణార్హత లేదని, వీటిని కొట్టేయాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
ఓటర్ల జాబితాలో తప్పులపై పూర్తి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులన్నాయంటూ దాఖలైన వ్యాజ్యంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, వీటిని సరి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నెల్లూరుకు చెందిన వి.భువనేశ్వరి ప్రసాద్‌తో పాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఒకే ఇంటి నంబర్‌తో వందల సంఖ్యలో ఓటర్లున్నారని తెలిపారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ తప్పుల తడకగా ఉందని వివరించారు. వీటిని సవరించిన తర్వాతే ఎన్నికలు పెట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ.. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
‘పంచాయతీ’లో జోక్యానికి హైకోర్టు నో
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేలి్చచెప్పింది. సర్పంచ్ సీట్ల ఖరారు సక్రమంగా లేదని, ఓటుహక్కు కల్పించట్లేదని, ఓటరు గుర్తింపు కార్డున్నా ఓటర్ల జాబితాలో పేరు తీసేశారని.. ఇలా రకరకాల అభ్యర్థనలతో దాఖలైన పలు వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల నిమిత్తం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాలవారీగా ఓటర్ల ముసాయిదా జాబితాల ప్రకటన
సాక్షి, అమరావతి: జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను జిల్లాల కలెక్టర్లు సోమవారం ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారిని ఓటర్‌గా నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ల జాబితాలో పేరులేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. డిసెంబర్ 15 వరకు ఓటర్‌గా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో, డిసెంబర్ 12, 13 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ఓటర్లుగా చేరేందుకు, ఏదైనా మార్పులు, చేర్పులున్నా బూత్ స్థాయి ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో, లేదో సరిచూసుకుని జనవరి 15న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుత ముసాయిదా జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్లు ఖాళీలను భర్తీ చేయండి ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు, బూత్ స్థాయి ఆఫీసర్ల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుని.. ఇంకా ఖాళీలుంటే ఆ వివరాలతో నివేదిక పంపించాలని కోరారు. రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్య ఇలా -
మున్సిపల్ రిజర్వేషన్లపైనే ..అందరి దృష్టి!
సాక్షి, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన వార్డుల పునర్విభజన, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణనతో పాటు వార్డు ఓటరు జాబితా ముసాయిదా సైతం పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో అన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తాజా మాజీ కౌన్సిలర్లతోపాటు ఈసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న వారు సైతం అనుకూల రిజర్వేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నిలబడి సత్తా చాటాలని భావిస్తున్న ఆశావహులు తాము పోటీ చేద్దామనుకుంటున్న వార్డులు తమకు అనుకూల రిజర్వేషన్ వస్తుందా, లేక ఇతర సామాజిక వర్గాల వారీకి రిజర్వు అవుతుందా అన్న అంచనాల్లో మునిగిపోయారు. నల్లగొండ మున్సిపాలిటీ 40 వార్డుల నుంచి 48 వార్డులకు పెరిగింది. పట్టణంలో 1,24,117 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల సంఖ్య ప్రకారం వార్డు రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. 24 వార్డులు జనరల్..! నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నందున 24 వార్డులు జనరల్ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉన్నా రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని ఉన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో 24 వార్డులు మాత్రం వివిధ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయి. పట్టణంలో తక్కువ సంఖ్యలోనే దాదాపు 1400 వరకు గిరిజన ఓటర్లు ఉన్నందున వారికి ఒక వార్డు రిజర్వు కానుంది. 48 వార్డులలో 24 జనరల్, ఒకటి ఎస్టీలకు రిజర్వు కానుండగా ఇంకా 23 వార్డుల ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ 23 వార్డులలో 7 వార్డులు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన 16 వార్డులు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఎస్సీలకు 1 వార్డు పెరిగి 8 అయితే బీసీలకు 1 వార్డు తగ్గి 15 వార్డులు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, బీసీలకు కేటాయించే వార్డుల్లో ఒకటి అటు, ఇటు అయినా.. దాదాపు ఈ సంఖ్య ప్రకారమే వార్డుల రిజర్వేషన్ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన బీసీ ఓటర్లు 2014 మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి పట్టణంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ముస్లిం ఓటర్లను ఎక్కువ సంఖ్యలో బీసీ సామాజిక వర్గంలో కలపడంతోనే బీసీ ఓటర్లు ఎక్కువగా పెరిగాయని అంటున్నారు. దీంతో పట్టణంలో ఓసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల పెరిగిన ఓటర్ల ప్రకారం ప్రస్తుతం మున్సిపాలిటీలో సుమారుగా ఓసీ ఓటర్లు 27 వేలు, బీసీ ఓటర్లు 77,350, ఎస్సీ ఓటర్లు 18,750, ఎస్టీ ఓటర్లు 1450 మంది ఉన్నట్లు సమాచారం. -
ఓటు చుట్టూ రక్షణ చట్రం
ఉదయం నిద్ర లేవగానే...ఓటరు జాబితాలో మన పేరుందో లేదో చూసుకుని హమ్మయ్య అనుకోవాలి!మధ్యాహ్నం భోజనం పూర్తికాగానే...మరోసారి తనిఖీ చేసుకుని నిశ్చింతగా పని చేసుకోవాలి!రాత్రి నిద్రపోయే ముందు...ఎందుకైనా మంచిదని పరిశీలించుకుని భరోసా చెప్పుకోవాలి! సాక్షి, అమరావతి :...ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతున్న జోక్ ఇది. ఇందులో కొంత హాస్యమున్నా వాస్తవ పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఉంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా... ‘మా ఓటు భద్రమేనా?’ అనే మాటే వస్తోంది. ఏ నలుగురు జమ కూడినా చర్చంతా ‘ఓటు’పైనే సాగుతోంది. దీనంతటికీ ప్రధాన కారణం... రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం. పెద్దఎత్తున ఓటర్లను అక్రమంగా తొలగించే ఉద్దేశంతో, ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏకంగా సర్కారే ‘ఐటీ గ్రిడ్స్’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించడం...! ఈ నేపథ్యంలో ప్రజల ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాలు, ఓటరు నంబరు, ఇతర వ్యక్తిగత వివరాలన్నీ వ్యక్తిగత గోప్యత నిబంధనలకు వ్యతిరేకంగా ఆ ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళ్లిపోయాయి. మరోవైపు ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థ ఓ యాప్ తయారుచేసి తమ సిబ్బందితో నకిలీ సర్వేలు చేయించింది. ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నవారు, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను మూకుమ్మడిగా తొలగించేందుకు పూనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే మేల్కోండి... అసలు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదోనన్న సందేహం అందరిలో సహజంగానే నెలకొంది. ఎన్నికల రోజు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి ‘అయ్యో ఓటు లేదే’ అని బాధ పడేకంటే... ఇప్పుడే ఓసారి సరిచూసుకోవడం ఉత్తమం. ఎలాగూ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలన్నీ నియోజకవర్గాల వారీగా ఆన్లైన్లో ఉంచుతుంది. ప్రజలు తమ పేర్లు ఆ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మన వంతుగా ఏం చేయాలంటే... స్థానిక అధికారులను సంప్రదించిప్రతి గ్రామంలో, పట్టణాల్లో డివిజన్లలో ఇద్దరు పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఉంటారు. వారి వద్దకు వెళ్లి ఓటరు జాబితానులో పేరును సరి చూసుకోవచ్చు. పేరు, ఇంటి నంబర్ తదితర వివరాలు ఇస్తే వారే పరిశీలించి చెబుతారు. మండల స్థాయిలో అయితే తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విభాగం ఉంటుంది. మీ వివరాలు చెబితే తనిఖీ చేస్తారు. జిల్లా కలెక్టరేట్లోనూ ఎన్నికల విభాగం ఉంటుంది. అక్కడ అధికారులకు మీ వివరాలు తెలిపి ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబర్1950కు డయల్ చేసి.. ఓటర్ల సౌలభ్యం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 1950 నంబర్‌కు ఫోన్ చేసి మీ పేరు, వివరాలు గాని, ఓటరు కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్ గాని చెబితే ఓటు ఉందో లేదో స్పష్టం చేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా... ఇది మరింత తేలికైన పద్ధతి. కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపించి ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఓటరు కార్డు నంబర్‌ను 1950 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే మీ ఓటు వివరాలతో తిరిగి సమాధానం ఇస్తారు. వెబ్సైట్లోకి వెళ్లొచ్చు... ‘నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్’ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచింది. గూగుల్‌లో ఈ పోర్టల్‌ను ఓపెన్ చేసి అందులో మీ పేరు, వివరాలు గాని, మీ ఓటరు ఐడీ కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్‌ను గాని ఎంటర్ చేస్తే వెంటనే సమాచారం లభిస్తుంది. మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుస్తుంది. అలాగే ‘నో యువర్ ఓట్’ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీ పేరు, వివరాలు, ఓటరు ఐడీ కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్‌ను ఎంటర్ చేస్తే మీ ఓటు ఉందో లేదో తెలుస్తుంది. ఫాం 6తోకొత్తగా నమోదు కోసం... ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ. అయితే ఇప్పుడు మరో 4 రోజుల వరకు పేరు నమోదుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ‘ఫాం 6’ను ప్రత్యేకంగా రూపొందించింది. దీని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే ‘ఏపీ సీఈవో’ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీ జిల్లా, నియెజకవర్గాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఫాం 6 అప్లికేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాలి. పుట్టిన తేదీ, వయసు, ఇంటి అడ్రస్ ఆధారాలు తెలిపే గుర్తింపు కార్డులను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, పదో తరగతి ధ్రువపత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్టు, ఇంటి పన్ను రసీదు, వంట గ్యాస్ బిల్లు రసీదు మొదలైన గుర్తింపు కార్డులలో ఏవైనా రెండు అప్లోడ్ చేయాలి. ఇలా దరఖాస్తు సమర్పిస్తే వారం, పది రోజుల్లో సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదించి గుర్తింపు కార్డులను పరిశీలించి ఓటరు కార్డు జారీ చేస్తారు. ఫాం7అంటే... ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగింపునకు... ఫాం 7ను రెండు ప్రయోజనాల కోసం రూపొందించారు. 1) ఎవరైనా తమకు తాముగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగించుకోవాలని భావిస్తే... 2) ఓటరు జాబితాలో అనర్హులు ఉన్నారని భావిస్తే... ఈ రెండు సందర్భాల్లో ఫాం 7 ద్వారా ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించవచ్చు. ♦ ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలోనే ఓటరుగా ఉండాలి. వేరేచోట ఓటరుగా నమోదు చేసుకోవాలని భావిస్తే... ప్రస్తుతం ఓటరుగా ఉన్నచోటు నుంచి పేరు తొలగించుకోవాలి. తనను ఓటరుగా తొలగించమని ఫాం 7 ద్వారా కోరాలి. ఆన్లైన్లో దీని ద్వారా దరఖాస్తు చేయాలి. అనంతరం అధికారులు మిమ్మల్ని సంప్రదించి, నిర్ధారించుకున్న అనంతరం ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారు. ♦ అదే విధంగా ఒక నియోజకవర్గం ఓటరు జాబితాలో అనర్హులు ఉన్నారని ఎవరైనా భావిస్తే అలాంటి వారిని తొలగించమని అధికారులను కోరవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో ఫాం 7ను భర్తీ చేసి దరఖాస్తు చేయాలి. లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్లో ఎన్నికల విభాగాలు ఉంటాయి. అక్కడకు వెళ్లి అనర్హుల పేర్లను తొలగించమని ఫాం7 ద్వారా కోరవచ్చు. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేసినా, నేరుగా దరఖాస్తులు సమర్పించినా వాటిపై అధికారులు స్పందించి విచారణ నిర్వహిస్తారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులిచ్చి వాస్తవాలను నిర్ధారిస్తారు. అనర్హులున్నారని నిర్ధారణ అయితేనే జాబితా నుంచి తొలగిస్తారు. -
పిల్లి అనంతలక్ష్మి కుటుంబ ఓట్లపై విచారణ
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ‘1+1, 1+2 ఆఫర్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వారి ఓట్లపై విచారణ చేపట్టారు. ఒకే చోట ఒకే ఓటు ఉండాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను విస్మరించి రెండు, మూడు చోట్ల ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ ఓట్లను తొలగించేందుకు వారు చర్యలు చేపట్టారు. వీటిని అధికారికంగా తొలగించేందుకు కాకినాడ రూరల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విచారణ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే కలెక్టర్‌కు ఫైల్ పంపుతామని రూరల్ తహసీల్దార్ చెబుతున్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ సభ్యుల ఓట్లను అధికారికంగా తొలగించేందుకు చర్యలు చేపట్టడం కొసమెరుపు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ ఓట్లపై విచారణ కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ‘1+1, 1+2 ఆఫర్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వారి ఓట్లపై విచారణ చేపట్టారు. ఒకే చోట ఒకే ఓటు ఉండాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను విస్మరించి రెండు, మూడు చోట్ల ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ ఓట్లను తొలగించేందుకు వారు చర్యలు చేపట్టారు. వీటిని అధికారికంగా తొలగించేందుకు కాకినాడ రూరల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విచారణ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే కలెక్టర్‌కు ఫైల్ పంపుతామని రూరల్ తహసీల్దార్ చెబుతున్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ సభ్యుల ఓట్లను అధికారికంగా తొలగించేందుకు చర్యలు చేపట్టడం కొసమెరుపు. -
ఓట్ల తొలగింపు, చేర్పు విధానం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా తయారీకి అనుసరిస్తున్న విధానంతోపాటు ఓట్ల తొలగింపు, చేర్పులకు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దాని వల్ల లాభనష్టాలు ఏమిటి? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఓట్ల తొలగింపు విషయంలో రిటర్నింగ్ అధికారికి ఉన్న అధికారాలు ఏమిటో కూడా చెప్పాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాఫ్ట్వేర్ ఏమిటో వెల్లడించాలి... ఓటర్ల జాబితా తయారు సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైదరాబాద్ మియాపూర్‌కి చెందిన ఇంజనీర్ కొడాలి శ్రీనివాస్ హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది. సమాచారమంతా బయటకు పొక్కుతోంది... పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎన్‌ఆర్‌డీహెచ్)కు అందచేస్తున్న ఓటర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమంతా, ఆధార్ కార్డు వివరాలతో సహా బయటకు పొక్కుతున్నాయని చెప్పారు. ఓటరు కులం ఏమిటి..? ఓటరు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే వివరాలను తెలుసుకోవడం సులభవుతుందని, దీని వల్ల ఇష్టమొచ్చిన రీతిలో ఇతరుల ఓట్లను తొలగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం ప్రతి దశలోనూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల సంఘం తన సాఫ్ట్వేర్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలంగాణలో 27 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ వ్యక్తి వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించింది. గూగుల్‌లో బోలెడంత సమాచారం దొరుకుతుందని తెలిపింది. అయితే, ఓటరు గోప్యత హక్కు, ఓటర్ల జాబితా స్వచ్ఛత రెండు వేర్వేరుగా అంశాలని, వీటిని అలాగే చూడాల్సిన అవసరం ఉందంది. డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తుందే తప్ప.. తొలగించదు... ఆ తరువాత ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదన్నారు. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తుందే తప్ప, దానంతట అది ఓటర్లను జాబితా నుంచి తొలగించదన్నారు. ఎవరైనా పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తే, ఆ వ్యక్తికి ముందు నోటీసు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తిరిగి ఓటరుగా చేరేందుకు దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కూడా ఉందని వివరించారు. ఎన్‌ఆర్‌డీహెచ్ ఉన్న డేటాను ఏ రాజకీయ పార్టీ అడిగినా ఇస్తామన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు విషయంలో రిటర్నింగ్ అధికారికి విస్తృతాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం సైతం ఈ విస్తృతాధికారాల్లో ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఓటర్ల జాబితాలో తొలగింపులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానం ఏమిటి? అలాగే ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు? దాని వల్ల ఉన్న లాభనష్టాలు ఏమిటి? తదితర వివరాలను కౌంటర్ రూపంలో తమ ముందుంచాలని అవినాశ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. -
ఓటరు జాబితా పవిత్ర గ్రంథం
‘‘ఈనెల 8న ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒత్తిళ్లకు భయపడకూడదు. దరఖాస్తుల విచారణ మందకొడిగా సాగుతోంది. ఎవరైనా ఒత్తిళ్లకు లొంగినట్లు తెలిస్తే జైలుకు పంపడం ఖాయం. నిజాయితీగా విధులు నిర్వహిస్తే వారికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది’’ అంటూ కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్ : ఓటరు జాబితా పవిత్ర గ్రంథమని, దానిపట్ల ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటా యని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని బీఎల్వోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో చిన్న పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపు, చేర్పుల కోసం అత్యధికంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఫారం–7ను సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తులు చేశారన్నారు. వాటిని బీఎల్వోలు నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. కరెక్ట్‌గా ఉంటే ఆమోదించాలని చెప్పారు. తప్పుగా ఉంటే తిరస్కరించాలన్నారు. రాజకీ య ఒత్తిళ్లకు బీఎల్వో, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తలొగ్గకూడదన్నారు. ఎవరు ఎంత ఒత్తిడి పెట్టినా భయపడకూడదన్నారు. ఎవరైనా ఒత్తిళ్లకు లొంగినట్లు తెలిస్తే జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తే వారికి జిల్లా యంత్రాం గం అండగా ఉంటుందన్నారు. 8న ఎన్నికలకోడ్ ....? ఈనెల 8న ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. 7న జిల్లాలోని 66 మండలాల్లో నియమించిన మానిటరింగ్ టీమ్‌లు, ఎంసీసీ, ఫ్లైయింగ్ స్క్వాడ్లు సమన్వయంతో ముం దుకెళ్లాలన్నారు. వారందరూ గురువారం నుంచి క్షేత్రస్థాయి విధుల్లో ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు ఓటరు జాబితా సిద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. ఆ లోపు ప్రస్తుతం చేస్తున్న ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. చేర్పులు, మార్పులు, ఆక్షేపణలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విచారణ చేయడానికి ఏడు రోజుల సమయంతో సంబంధం లేదన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట నే విచారణ చేపట్టవచ్చునన్నారు. జిల్లాలో 1,12,000 దరఖాస్తులు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలని ఈఆర్వో, ఏఈఆర్వోలను ఆదేశించారు. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే దరఖాస్తుల విచారణ చిత్తూరు జిల్లాలో పనులు మందకొడిగా జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో ఉందన్నారు. దరఖాస్తుల విచారణలో ఏదో సమస్య ఉందని, అందుకే కావట్లేదన్న అనుమానం తనలో రేకెత్తిస్తోందన్నారు. 12 మందికి షోకాజ్ నోటీసులు అనుమతి లేకుండా ఒక ఓటును తొలగించినందుకు తంబళ్లపల్లె ఈఆర్వో ఈశ్వరయ్యపై కలెక్టర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అనుమతి లేనిదే ఓటును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ‘‘తమాషాలు చేస్తున్నావా.. నేను అనుకుంటే ఇప్పుడే నీ ఉద్యోగం పోతుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల ఈఆర్వోలతో రోజువారి పనితీరు నివేదికలను అడిగి తెలుసుకున్నారు. ఫారం–6,7 లలో క్షేత్రస్థాయి విచారణ, తిరస్కరణల్లో వెనుకబడి ఉన్న శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు, పలమనేరు, నగరి, తంబళ్లపల్లె నియోజకవర్గాల ఆరు ఈఆర్వోలకు, అదే మండలాల ఏఈఆర్వోలు ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జా యింట్ కలెక్టర్ గిరీషను ఆదేశించారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు కనబడకూడదు జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పథకాల ప్రచార బ్యానర్లు గురువారం నుంచి తొలగించే కార్యక్రమం మొదలు పెట్టాలన్నారు. 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం, 15న వినియోగదారుల అవగాహన దినోత్సవం కార్యక్రమాలను అధి కారికంగా నిర్వహించాలన్నారు. నాయకులను ఆహ్వానించకూడదని చెప్పారు. -
ఎర వేసి.. మోసానికి తెర తీసి..
తూర్పుగోదావరి, రామచంద్రపురం: టీడీపీ నేతలు ఓటర్లను మభ్యపెట్టేందుకు వేస్తున్న ఎత్తుగడలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రూ.ఐదు లక్షల ఇన్సూరెన్స్ అంటూ కోడ్ ఉల్లంఘన చేస్తున్న వైనం మండలంలోని కాపవరంలో శుక్రవారం వెలుగు చూసింది. అయితే స్థానిక టీడీపీ నేత చెప్పడంతోనే ఈ విధంగా చేస్తున్నానని సదరు వ్యక్తి అనడంతో అసలు మోసం బయట పడింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కార్యకర్తలు, నాయకులతో కలిసి ‘రావాలి జగన్ కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రకు వెళ్లారు. ఒక ఆలయం వద్ద సుమారుగా 200 మంది మహిళలు ఉండడంతో ఆయన వారి వద్దకు వెళ్లి ఏం జరుగుతుందని ఆరా తీశారు. ఎవరో వచ్చారని, స్థానిక యానిమేటర్ ఆధార్ కార్డులు తీసుకురావాలని చెబితే వచ్చామని తెలిపారు. అయితే అక్కడ పెదపూడి మండలం యాడ్ర గ్రామానికి చెందిన ఆచంట గోపాల్ అనే యువకుడు మహిళల నుంచి ఆధార్ నంబర్ తీసుకుని వేలిముద్రలు సేకరిస్తున్నాడు. ఎందుకోసం వేలి ముద్రలు తీసుకుంటున్నారని ఆ యువకుడిని ప్రశ్నించగా ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్ర అభియాన్ పథకం ద్వారా డిజిటలైజేషన్ చేస్తున్నానని, ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు ఇన్సూరెన్సు వస్తుందని చెప్పాడు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇలా ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తే అవిషయాలు తనకు తెలియదని చెబుతూ గత ఏడాది మే నెలలో జేసీ మల్లికార్జున్ పేరు మీద ఉన్న ఆర్డర్ కాపీని చూపించారు. దీనిపై ఉన్న జిల్లా కో ఆర్డినేటర్ జి.రవికిరణ్‌కు ఫోన్ చేసి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని అడుగగా సరైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కో ఆర్డినేటర్ వేణు ఆర్డీఓ ఎన్.రాజశేఖర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేయగా ఎంపీడీవో పీవీవీ సత్యనారాయణ, ఈవోపీఆర్డీ రామకృష్ణారెడ్డిని సంఘటన స్థలానికి పంపారు. అధికారులు అక్కడి వచ్చి డిజిటలైజేషన్ చేస్తున్న వ్యక్తి నుంచి కంప్యూటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తాను స్థానిక టీడీపీ నేత రెడ్నం సతీష్ చెప్పడంతోనే ఇక్కడికి వచ్చి డ్వాక్రా మహిళల నుంచి వేలి ముద్రలు, ఆధార్ నంబర్లను తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇలా దొడ్డిదారిన టీడీపీ నేతలు మోసాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. ఈ విషయంపై ఎంపీడీవో సత్యనారాయణను స్థానిక విలేకరులు వివరణ కోరగా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇటువంటివి చేయకూడదని దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని సంబందిత వ్యక్తిని పోలీసులకు అప్పగించామని, ఆయన వద్ద ఉన్న కంప్యూటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు చెప్పారు. టీడీపీ చేస్తున్న మోసాలకు పరాకాష్ట: ఎన్నికల్లో ఏదోలా గెలవాలనే ధ్యేయంతో టీడీపీ చేస్తున్న మోసాలు పరాకాష్టకు చేరాయని కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
గుట్టలుగా దరఖాస్తులు
ఆన్లైన్లో గుట్టలు గుట్టలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. కొత్తగా ఓటు హక్కు కోసం.. జాబితాల్లో చేర్పులు, మార్పులు.. ఉన్న ఓట్ల రద్దు.. ఇలా వెల్లువెత్తుతున్న దరఖాస్తులతో అధికారులు విస్తుపోతున్నారు. ఈ దరఖాస్తులు ఒక్కని పేరుతోనే వేల సంఖ్యలో వస్తుండటంతో ఏవి వాస్తవమో.. ఏవి తప్పుడువో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వాటిని పరిష్కరించాలో.. వద్దో తెలియక సతమతమవుతున్నారు. వచ్చిన సమాచారంతో పరిష్కరిస్తే ఎక్కడ సైబర్ నేరం తలకుచుట్టుకుంటుందోనని భయపడుతున్నారు. మరికొందరు మాత్రం అధికార పార్టీ నేతల ఒత్తిడితో అక్రమ దరఖాస్తులను సైతం ఆమోదించి దొంగ ఓట్లను చేరుస్తూ, వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: కొత్తగా ఓటు హక్కు కోసం, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో గుట్టలు గుట్ట లుగా దరఖాస్తులు నమోదువుతున్నాయి. చనిపోయిన వారి ఓట్లు తొలగించాలంటూ ఒక వ్యక్తి ఏకంగా 40,50 దరఖాస్తులు ఆన్లైన్ చేయడంతో అధికారులు తలలు పట్టుకొంటున్నారు. మరో వైపు అధికార పార్టీ నేతలు కొందరు బీఎల్వోల సహకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల తొలగింపు కోసం ఎవరైనా ఫారం–7 సమర్పిస్తే సంబం«ధిత బీఎల్వోలు ఆ దరఖాస్తులను పరిశీలించి, చనిపోయిన వారి కుటుంబ సభ్యుల సంతకం తీసుకొని, నివేదిక తయారుచేసిన అనంతరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అ«ధికారికి పంపాల్సింది. రిటర్నింగ్ అధికారి ఆ నివేదికను పరిశీలించాక ఓట్లు తొలగింపుకు సిఫారసు చేస్తారు. ఓటర్ల తుది జాబితా 2019 జనవరిలో విడుదల చేశారు. ఆ తరువాత ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కోసం 3,84,236 దరఖాస్తులు వచ్చాయి. ఫారం–6 కింద 2,23,773 దరఖాస్తులు రాగా ఇప్పటికి 65,519 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఫారం–6ఏ కింద 1,484 దరఖాస్తులు రాగా 125, ఫారం –7 కింద 1,09,079 దరఖాస్తులు రాగా 14,302, ఫారం–8 దరఖాస్తులు 40,311 రాగా 25,928, ఫారం–8ఏ కింద 9,589 దరఖాస్తులు రాగా 3,899 పరిష్కారమయ్యాయి. మొత్తం 3,84,236 దరఖాస్తులకు 1,09773 దరఖాస్తులను అధికారులు పరిష్కరిం చారు. మిగిలిన 2,74,463 దరఖాస్తులు విచారణ దశలో అంటే పెండింగ్‌లో ఉన్నాయి. గురజాల అత్యధికం జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పుల కోసం గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా 36,207 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా బాపట్లలో 10,377 దరఖాస్తులు నమోదయ్యాయి. పెదకూరపాడులో 23,460, తాడికొండలో 15,558, మంగళగిరిలో 20,256, పొన్నూరులో 19,034, రేపల్లెలో 17,794, మాచర్లలో 22,652, ప్రత్తిపాడులో 25,391, గుంటూరు వెస్ట్ 34,864, గుంటూరు ఈస్ట్ 26,439, చిలకలూరిపేట 24,824, నరసరావుపేట 20,662, సత్తెనపల్లి 25,110, వినుకొండ నియోజకవర్గంలో 21,281 దరఖాస్తులు అందాయి. ఓట్లు తొలగించాలని గుంపగుత్తగా దరఖాస్తులు వస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులకు సంబంధించి బీఎల్వోల అండతో అధికార పార్టీనేతలు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు చేర్పులు, మార్పులు, తొలగింపులపై కలెక్టర్ కోనశశిధర్కు వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గురజాల సమన్వయకర్త కాసుమహేష్‌రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు గురువారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల అండతో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కలెక్టర్ దృష్టి తెచ్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. -
మహా కుట్ర
ఒంగోలు సిటీ: వీరు మనోళ్లు కాదు. మనకు ఓటెయ్యరు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పని చేస్తారు. ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తారు. వీరి వల్ల ఫలితాల్లో నష్టపోతాం. ఇలా రకరకాలుగా ఓటర్లను బేరీజు వేసి, వారి ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ సానుబూతి పరుల ఓట్లనే టార్గెట్ చేశారు. జిల్లాలో ఓట్ల తొలగింపునకు కనీ వినీ ఎరుగని రీతిలో దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఒక ప్రాంతంలో పుట్టి, పెరిగి నివాసం ఉంటున్న వారివి, దాదాపు 30 ఏళ్ల పైబడి ఒకే చోట నివాసం ఉంటున్న వారి ఓట్లను తొలగించమని ఫారం–7లు వేలాదిగా దాఖలయ్యాయి. మార్చి 27వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 25వేల ఫాం–7 దరఖాస్తులు అందాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గడచిన రెండు రోజుల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఓట్ల తొలగింపు కుట్రల వెనుక అధికారపార్టీ నేతలున్నారనే ఆరోపణలు ప్రభలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో 24,95,383 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 12,43,411 మంది, మహిళలు 12,51,823 మంది ఉన్నారు. థర్డ్ జన్ ఓటర్లు 149 మంది ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 11వ తేదీన ప్రకటించిన ఎన్నికల సంఘం కొత్తగా ఓటు హక్కు పొందడానికి అర్హులైన వారికి, ఓటరు జాబితాలో తమ ఓట్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీనిని ఆసరాగా అధికార పార్టీ నేతలు తెగబడ్డారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించడం. వారి ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులను పెట్టడం పనిగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫారం–7 (ఓటు తొలగింపునకు దరఖాస్తు)లు పెద్ద సంఖ్యలోనే దాఖలయ్యాయి. ఫారం–7 దరఖాస్తులు దాఖలు 24,650 జిల్లాలోని ఒంగోలు, చీరాల,దర్శి, కందుకూరు, కొండపి, అద్దంకి, కనిగిరి, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, పర్చూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి బుధవారం నాటికి ఓట్ల తొలగింపునకు 24,650 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో చీరాలలో 3,827, దర్శిలో 2,458, కందుకూరు 3,084, అద్దంకి 4,673, గిద్దలూరు 2,098, పర్చూరు 2,986 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎక్కువ భాగం పారం–7లు ఆన్లైన్ ద్వారానే వచ్చాయి. అధికార పార్టీ నాయకులు ఆన్‌లైన్‌ను బాగా ఉపయోగించుకున్నారు. మాన్యువల్‌గా వందల సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. ముందుగా తమకు వ్యతిరేకులను గుర్తించడం, వారి వివరాలను తీసుకొని ఆన్లైన్ ద్వారా తొలగింపునకు దరఖాస్తు చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో 4,712 దరఖాస్తులను ఇంకా పరిశీలించనే లేదు. వీటిలో 9,237 దరఖాస్తులను పరిశీలనకు బీఎల్వోలకు ఇచ్చారు. 1,127 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో బీఎల్వోలు పరిశీలించారు. పరిశీలించిన వాటిలో అధిక భాగం ఓట్లను తొలగింపునకే సిఫార్సు చేయడం గమనార్హం. దాఖలయిన ఫారం–7 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 1,641 తిరస్కరించారు. 19,011 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు.. జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు నానాటికి పెరుగుతున్నాయి. జిల్లాలో 3,269 మంది బీఎల్వోలు ఈ దరఖాస్తులను పరిశీలించే పనిలో ఉన్నారు. వీరిలో అత్యధిక భాగం బీఎల్వోలపై టీడీపీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయి. కొందరైతే తెగబడి నేతలు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులో పోలింగ్ బూత్ 192లో విశ్వాస్నగర్కు చెందిన బ్రహ్మయ్య, 180 పోలింగ్ బూత్‌లో రాజపానగల్రోడ్డు 14వ అడ్డరోడ్డుకు చెందిన సుంకర మేఘనాథ్, 176వ బూత్‌లో సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన దాసరి చిరంజీవి, 183వ బూత్‌లో గద్దలగుంట ఎస్సీకాలనీకి చెందిన జ్యోతుల తిరుపతిరాయుడు ఇలా పలువురి ఓట్లును తొలగించారు.చీరాల, దర్శి, కందుకూరు, అద్దంకి, సంతనూతలపాడు, గిద్దలూరు, పర్చూరు, మార్కాపురంలో ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడానికి వచ్చిన దరఖాస్తులపై అధికార పార్టీ ఒత్తిళ్లు పని చేస్తున్నాయి. తూతూ మంత్రంగానే విచారణ.. అక్రమ దరఖాస్తులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం. ఓటర్లకు తెలియకుండానే జాబితా నుంచి పేర్లను తొలగించాలని , కొత్త వారిని చేర్చడానికి ఆన్లైన్లో దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒంగోలు శివారు మండవవారిపాలెంలో వందల సంఖ్యలో ఓట్లను చేర్చడానికి దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకుంది.ఇలాంటి ఘటనలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నది ఎన్నికల సంఘం ఆదేశం. ఓటర్లకు తెలియకుండా జాబితా నుంచి వారి పేర్లను తొలగించమని ఫారం–7 వస్తే అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోమన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఈ ఆదేశాలను ఇప్పటికే వీడియో సమావేశం ద్వారా ఆర్వోలకు సమాచారాన్ని ఇచ్చారు. తప్పుడు పద్దతిలో మోసగిస్తున్న వారి వివరాలను ప్రజలు సేకరించి ఇవ్వవచ్చు. బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలించి తొలగింపు దరఖాస్తు కచ్చితమైనది అయితేనే తొలగించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే బీఎల్వోలు బాధ్యులే. జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన బీఎల్వోలు కొందరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. తొలగింపులకే చర్యలు తీసుకుంటున్నారు. జాబితా నుంచి ఓట్లు పోయిన వారు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసే వీలుంది. జిల్లా ఎన్నికల అధికారి, తొలగింపునకు దరఖాస్తు చేసిన వ్యక్తిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వీలుంది. ఓటర్లు చైతన్యవంతులై ముందుగా జాబితాలో తమ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకొని ఎందుకు తొలగింపునకు గురయిందో అధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. నగరంలో పేరున్న న్యాయవాది ఓటును జాబితా నుంచి తొలగించారు. ఆయన అధికారులను నిలదీశారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు తమ ఓటు ఉందో లేదో ముందుగా తెలుసుకొనే బాధ్యత ఉంది. తేలిన దొంగ ఓట్లు.. ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడానికి తమకు అనుకూలమైన వారి ఓట్లను చేర్పించుకొనే పనిలో టీడీపీ నేతలు ఉన్నారు. జిల్లాలో 5,927 ఓట్లు దొంగ ఓట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. సాప్ట్‌వేర్‌తో సరి చూసినప్పుడు మొత్తం 8,518 ఓట్లు డీ డూప్లికేట్ ఓట్లుగా గుర్తించారు. దొంగ ఓట్లు 5,927 తేలాయి. అసలు గుర్తింపు కార్డులోనే ఫొటో సరిపోలనివి(పేరుకు, ఫోటోకు) 1,581 ఉన్నాయి. వీటిలో 264 ఓట్లను క్షేత్ర స్థాయిలో విచారించారు. 5,539 ఓట్లను బీఎల్వోలు విచారిస్తున్నారు. వీటిలో 1,010 ఓట్లను పెండింగ్‌లో ఉంచారు. ఒంగోలు నగరం శివారులో డోర్ నంబర్లు లేకుండానే పొరుగు ప్రాంతాల వారు ఓటర్లుగా నమోదయ్యారు. రకరకాల మతలబులు చేసి దొంగ ఓటర్లను టీడీపీ చేర్చింది. వీటిని విచారించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు నెలకున్నాయి. -
వెంటాడుతాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పలుచోట్ల ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో ఇష్టానుసారం దరఖాస్తులు చేస్తున్నారని, ఆ నేరస్తులను పట్టుకోవడానికి వెంటాడుతామని, వదిలేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి 11న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తరువాత ఫారం–7 ద్వారా ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో అధికంగా దరఖాస్తు చేస్తున్నారని చెప్పారు. ఈ సమస్య మొదట్లో చంద్రగిరి నియోజకవర్గంలో వచ్చిన వెంటనే స్పందించి మొదటి పది మంది దరఖాస్తుల ఐపీ అడ్రస్సులు కావాలని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. రెండు మూడు రోజులుగా ఫారం–7 దరఖాస్తులు ఎక్కువ అయినట్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల ఆర్వోలకు ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా సైబర్ క్రైమ్‌లో కేసు పెట్టాలని ఆర్వోలకు సూచించామని చెప్పారు. విచారణ లేకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించబోమని స్పష్టం చేశారు. మరణించిన వారి ఓట్లను మరణ ధ్రువీకరణపత్రం ద్వారా తొలగిస్తున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన వారి ఓట్లు ఇంటి పక్కన ఉన్న వారి సంతకం తీసుకుని తనిఖీ చేశాకే తొలగిస్తారని తెలిపారు. తొలగించిన ఓట్లను ప్రతి గ్రామంలో పేర్లతో సహా వెల్లడిస్తామని చెప్పారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్ఏలను నియమించి నివేదికలివ్వాలన కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా ఐదారు అంశాలపై దృష్టి పెడతారని చెప్పారు. మార్చి 1,2 తేదీల్లో తిరుపతిలో ఆర్వో, ఈఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లచే ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇటీవల పోలీస్ శిక్షణ మైదానం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేశారని, అదే సమయంలో ధర్నా చేసిన టీడీపీ నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించగా, ఎస్పీకి చెప్పాను... ఈ విషయంపై ఆరా తీస్తామంటూ కలెక్టర్ సమాధానాన్ని దాటవేశారు. -
ఆ ‘బాబుల’ కుట్రతోనే ఓటర్ల తొలగింపునకు యత్నం
ఓట్లను తొలగించడానికి తప్పుడు ఫారం–7 లను ఆన్లైన్లో సమర్పించి, అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్ సీపీ నేతలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కొందరు మీ సేవ నిర్వాహకులతో ఈ పని చేయిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. తప్పుడు ఫారాలు దాఖలు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. తూర్పుగోదావరి, అమలాపురం రూరల్: నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలవే కాకుండా పార్టీ సానుభూతిపరుల ఓట్లను ఓ పథకం ప్రకారం తొలగించేందుకు కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆన్లైన్ ద్వారా కుట్రలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆర్డీఓ బి.వెంకటరమణకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రతోనే వైఎస్సార్ సీపీ ఓటర్ల తొలగింపునకు చర్యలు తీసుకున్నారని వారు ఆరోపించారు. అమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి కార్యకర్తలకు చెందిన 4390 ఓటర్లు తొలగింపునకు దరఖాస్తులు చేయడంపై నియోజకవర్గంలో పార్టీ నాయకులతో కలిసి గురువారం ఆర్డీఓ వెంకటరమణ కలసి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి వెనుక ఉన్న నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఓటు తొలగించినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ సంఘనపై విచారణ చేస్తున్నామని ఆర్డీఓ అన్నారు. నోటీసులు ఇవ్వకుండా ప్రజల ఓట్లను తొలగించే అధికారం తమ పరిధిలో లేదన్నారు. ఆనంతరం విలేకర్లతో విశ్వరూప్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవలేక దొడ్డిదారిన కుట్రలు చేస్తోందన్నారు. 60 గ్రామాలకు సంబంధించి ఒక్కో గ్రామంలో 40 నుంచి 200 వరకు ఓట్లు తొలగించారని ప్రయత్నాలు చేశారని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన బూత్ కన్వీనర్లే ఆన్లైన్ ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకున్నట్టు ఆ అజ్ఞాత వ్యక్తులు నకిలీ అభ్యర్థనలతో మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. దీనిపై తాను ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. గ్రామగ్రామాన వీఆర్వోలతో ప్రత్యేక తనిఖీలు చేయించి ఓట్ల తొలగింపు చర్యలను అడ్డుకుని, తొలగించిన ఓట్లు తిరిగి జాబితాలోకి చేర్చకపోతే ధర్నాలు చేస్తామని విశ్వరూప్ హెచ్చరించారు. మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, నియోజకవర్గం పార్టీ బూత్ కమిటీల ఇన్చార్జి సంసాని నాని, కౌన్సిలర్ వాసంశెట్టి సత్యం, పార్టీ నాయకులు గొవ్వాల రాజేష్, కముజు రమణ రాజులపూడి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
అధికార మంత్రం.. ఓటు కుతంత్రం!
ఇప్పటివరకు చంద్రగిరి నియోజకవర్గంలో వెలుగుచూసిన ఓట్ల తొలగింపు తాజాగా చిత్తూరుకు కూడా పాకింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా అధికార పార్టీ చాలా తెలివిగా పావులు కదుపుతోంది. చిత్తూరు నియోజకవర్గంలో దాదాపు 4 వేల మంది తమ ఓట్లను తొలగించాలని కోరినట్టు ఆన్లైన్లో వినతులు వచ్చాయి. తీరా విచారణకు వెళితే తాము అసలు ఆన్లైన్లో దరఖాస్తే చేసుకోలేదని అసలు వ్యక్తులు చెప్పడంతో నిస్సిగ్గుగా టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర బట్టబయలవుతోంది. చిత్తూరు అర్బన్: ‘చిత్తూరు నగరంలోని ఆఫీసర్స్ లైన్లో కాపురముంటున్న హరి అనే వ్యక్తి పూతలపట్టు గృహనిర్మాణశాఖలో పనిచేస్తున్నారు. ఈయన ఓటు కూడా తొలగించాలని ఆన్లైన్ అభ్యర్థన వచ్చింది.’ ఇలా చిత్తూరు నియోజకవర్గంలో వేలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. సోమవారం చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తహసీల్దారు చంద్రశేఖర్‌తో పాటు ఎన్నికల డెప్యూటీ తహసీల్దారు, ఇతర రెవెన్యూ అధికారులు ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులపై ఆన్లైన్లో వచ్చిన వినతులు చూసి షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలో 8,020 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు ఇవ్వగా సవరణల కోసం 1,019మంది, బూత్ మార్పు కోసం 439 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో 4 వేల మందికి పైగా ఓట్లను తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అసలు కథ ఇదీ.. ఓట్ల తొలగింపుపై టీడీపీ నేతలున్నట్లు పక్కాగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు యాప్‌నకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వే వివరాలను లింకు చేసినట్లు తెలుస్తోంది. ప్రజాసాధికార సర్వేలో సామాజిక వర్గాలు, ఓటర్ల వివరాలు, ఆధార్ కార్డుల నంబర్లు ఉండడంతో ప్రతి బూత్‌లో కనీసం రెండు వందల మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కుట్ర పన్నారు. దీనికితోడు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా..? అసంతృప్తిగా ఉన్నారా..? అంటూ సెల్ఫోన్లకు 1100 నంబరు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్‌తో ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. ఈ ప్రశ్నలకు అసంతృప్తిగా ఉన్నామని సమాధానం చెప్పేవారి సెల్‌ఫోన్ నంబర్లను నోట్ చేసుకుని ప్రజాసాధికార సర్వేలో ఉన్న సెల్‌ఫోన్‌తో సరిపోల్చి చూసుకుంటూ వారి ఓట్లను కూడా తీసేస్తున్నారని తెలుస్తోంది. సైబర్‌క్రైమ్ దర్యాప్తు అవసరం ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం, పోలీసుశాఖ రంగంలోకి దిగితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన దరఖాస్తులు ఏయే ఐపీ అడ్రస్ నుంచి వచ్చాయో గుర్తిస్తే నిందితులను పట్టేయొచ్చు. దరఖాస్తులు నెట్ సెంటర్లలో చేసినట్లు గుర్తిస్తే స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా అసలు దోషులను గుర్తించొచ్చు. ఈ దిశగా అధికారయంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ఓట్ల తొలగింపునకు పాల్పడితే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో మరొకరి పేర్ల మీదుగా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ సహకారంతో విచారణ మొదలైందన్నారు. జనవరి 11న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై ఇప్పటివరకు వచ్చిన క్లైమ్లు, ఆక్షేపణలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. 1.05 లక్షల క్లైమ్లను పరిశీలించిన తరువాతనే ఆన్లైన్ ప్రక్రియకు పూనుకుంటారన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు అందే దరఖాస్తులను పరిశీలించి తాను, ఈసీఐ ఆమోదించిన తరువాతే పేర్లను తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. ఈసీఐ ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్‌లో రెండుసార్లు వెరిఫికేషన్ చేశారన్నారు. ప్రజల ఓటును ఓటరు జాబితాలో ఉంచే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనని చెప్పారు. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో 99 శాతం అన్ని వసతులు కల్పించామన్నారు. 118 పోలింగ్ కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత యాజమాన్యాలు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. పేర్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారి గురించి విచారణ మొదలైందని, వారెవరో పేర్లు బట్టబయలైనప్పుడు చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉంటుందన్నారు. ఓటు తొలగించారని ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ పరిధిలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించా లన్నారు. జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు వీవీ ప్యాట్లు, ఈవీఎంలపై అవగాహన కల్పించామని, మూడో విడత అవగాహన మొదలు పెట్టామన్నా రు. ఈసీ ఆదేశాలతో వీడియోల రూపంలో అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నా రు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, టీవీలలో పెయిడ్ న్యూస్‌లు వస్తే సంబంధిత అభ్యర్థి ఖాతా కింద వాటిని పరిగణిస్తామన్నారు. ఫేక్ న్యూస్‌ను కనిపెట్టడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. అనంతరం ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఓటు చిత్తూరు ఓటు పేరుతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఓటు నమోదుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం వచ్చే నెల 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనుంది. స్థానిక బూత్‌స్థాయి అధికారులు(బీఎల్వో) పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు స్వీకరించనున్నారు. ఈ నెల 22న రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ–2019లో తమ పేర్లు ఉన్నాయో.. లేదో.. తెలుసుకునేందుకూ అవకాశం కల్పించింది. ఇందుకోసం స్థానిక పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఓట రు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిబిరాలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తులను అక్కడికక్కడే పూర్తిచేసి బీఎల్వోకు సమర్పించాలని అన్నారు. ఈ శిబిరాల వద్ద ఫారం–6, 7, 8, 8ఏ దరఖాస్తులనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్‌స్థాయి ఏజెంట్లను శిబిరాల వద్దకు పంపించాలని విజ్ఞప్తి చేశా రు. ఓటరు నమోదుకు సంబంధించి ఫిర్యాదులు, అనుమానాలుంటే 1950 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్నారు. -
ఈ ఉద్యోగం నాకొద్దు!
అనంతపురం, ఆత్మకూరు: ఓటరు జాబితా పరిశీలన.. సవరణ.. మార్పులు.. చేర్పులు.. ఈ ప్రక్రియ చిరుద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినాల్సి వస్తుండటం.. ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగం వదులుకోవడం నయమనుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఇందుకు ఆదివారం ఆత్మకూరు మండలంలో చోటు చేసుకున్న ఉదంతమే తాజా ఉదాహరణ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ శని, ఆదివారాల్లో బూత్ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ప్రత్యేక శిబిరంలో ఆదివారం ఓటరు జాబితాతో వీఆర్వో డంకన్న సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న గ్రామం కావడంతో ఓటరు జాబితాలో పలువురిని తప్పించేలా అధికార పార్టీ నాయకులు పావులు కదిపారు. ఈ నేపథ్యంలోనే వీఆర్వో డంకన్నపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లి తమ పనిచక్కబెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలింగ్‌బూత్ వద్దకు చేరుకుని జాబితా పరిశీలనకు అడిగారు. జాబితా వారి చేతిలో పడితే తొలగింపులు బయటపడతాయని భయపడిన వీఆర్వో డొంకతిరుగుడు సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేశారు. ఓటరు నమోదు కోసం తాము దరఖాస్తులు ఇచ్చినా ఎందుకు చేర్చలేదంటూ పలువురు నిలదీశారు. అనర్హులను ఓటర్లుగా చేర్చారంటూ మండిపడ్డారు. దీంతో డంకన్న అసహనానికి లోనయ్యారు. ‘మీరు చెబితే నేను చేయాలా? చేసిది లేదు. అంటూ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పలువురు అతడిని చుట్టుముట్టి తమకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోతే ఎలా అంటూ అడ్డుకున్నారు. ఆ సమయంలో తనకు ఈ ఉద్యోగం వద్దని, వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పి బైక్‌ను వెనక్కు తిప్పుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాప్తాడు నియోజకవర్గంలో చిరుద్యోగులపై టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోంది. మంత్రి సునీత ప్రోద్బలం, టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు రూపొందించిన ఓటరు జాబితా బయటపెడితే గ్రామస్తులు తమను గ్రామాల్లో తిరగనివ్వరనే భయం చిరుద్యోగులను వెన్నాడుతోంది. అందుకే జాబితాను బయటపెట్టలేని స్థితిలో ఇలా పలాయనం చిత్తగిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎపిక్ కార్డు ఉన్నా జాబితాలో లేకపోతే ఓటు ఉండదు
విజయనగరం గంటస్తంభం: ఓటర్లు గుర్తింపు కార్డు (ఎపిక్‌కార్డు) ఉన్నా ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే ఓటు వేసే అవకాశం ఉండదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిజవహర్‌లాల్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో ఓటు నమోదుకు ప్రత్యేక కార్యక్రమని, ఓటు లేని వారు నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు వేసిన వారు, ఎపిక్ కార్డులు ఉన్న వారు ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు తుది ఓటర్ల జాబితాతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారని, ఒకసారి పరిశీలించుకుని, ఓటు లేకుంటే వెంటనే నమోదు చేసుకోవచ్చుని పేర్కొన్నారు. నిరాక్షరాస్యులకు బీఎల్వోలు చదివి వినిపిస్తారని, రాజకీయ పార్టీలు బూత్ సహాయకులను నియమించాలని తెలిపారు. వారు పోలింగ్ కేంద్రాల వద్ద హాజరై ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హత ఉన్న ఓటర్ల నమోదుకు సహకరించి ఫారం–6 దరఖాస్తు చేయించాలన్నారు. ఓటు నమోదుకు ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు ఫారం–8, ఓటు బదిలీకి ఫారం–8ఎ దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ప్రజలకు అవగహన కల్పించేందుకు అన్ని పంచాయతీల్లో టాంటాం ద్వారా, మున్సిపాల్టీల్లో లౌడు స్పీకర్లు ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు గురువారం ఉదయం సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ వెంకటరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ప్రసాద్ పాత్రో, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఓట్ల కుట్రలపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర
చిత్తూరు, తిరుపతి రూరల్: జిల్లావ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అర్హుల ఓటర్లను తొలగించేందుకు జరిగిన కుట్రలపై భారత ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. అర్హులైన వారి ఓట్లను తొలగించేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని 15 రోజుల క్రితం వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం–7 పేరుతో తమకు తెలియకుండానే తమ ఓట్లను తామే తొలగించాలని కోరినట్లు కొందరు ఆన్లైన్లో దరఖాస్తు చేయడంపై పూర్తి స్థాయిలో విచారించాలని నాలుగు రోజుల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాష్ట్ర›ఎన్నికల కమిషన్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జాతీయ ఎన్నికల కమిషన్‌కు మెయిల్ ద్వారా సమాచారం పంపించారు. దీంతో కమిషన్ కార్యదర్శి మలైమాలిక్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం మూడు రోజుల పర్యటన కోసం బుధవారం జిల్లాకు వచ్చింది. పోలింగ్ బూత్‌ల వారీగా ఏర్పాట్లను పరిశీలించటంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలోనే వచ్చిన వేలాది దరఖాస్తులపై కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక నియోజకవర్గంలో తమ ఓటును తొలగించాలని తామే దరఖాస్తు చేసుకున్నట్లు అన్ని వేల ఆన్లైన్ దరఖాస్తులు ఎలా వచ్చాయని పరిశీలిస్తున్నారు. కావాలనే కొందరు వ్యక్తులు, కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని ఇలా దరఖాస్తు చేశారని స్థానికులు కమిషన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పోలింగ్ బూత్‌ల వారీగా నివేదిక ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలైమాలిక్ ఆధ్వర్యంలోని బృందం ముందుగా అవిలాల, మంగళం, పేరూరు పంచాయతీల్లో పర్యటించింది. పోలింగ్ బూత్‌లను పరిశీలించి ఓటర్లతో ముచ్చటించింది. తమకు తెలియకుండానే తమ ఓటును తొలగించాలని దరఖాస్తు చేశారని, కొందరు బీఎల్వోలు పూర్తి స్థాయిలో విచారించకుండానే ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. దొంగ దరఖాస్తులు తీవ్ర నేరమని, అలాంటి వారిని గుర్తించి, దేశద్రోహం, సైబర్‌క్రైం చట్టాల కింద కేసులు నమోదు చేయాలని కమిషన్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. కదులుతున్న డొంక..! ఎన్నికల కమిషన్‌కు వైఎస్.జగన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదులపై దేశ ఎన్నికల కమిషన్ విచారణ మొదలుపెట్టడంతో జిల్లాలోని అధికారుల్లో వణుకు మొదలైంది. వేలాదిగా వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులపై ఆరా తీయడం మొదలుపెట్టారు. చాలా వరకు దరఖాస్తులను కంప్యూటర్ సెంటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, కొన్ని మీ–సేవ కేంద్రాల ద్వారానే చేసినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి ఐపీ అడ్రసులను సేకరిస్తున్నారు. అవి ఎవరి పేరుతో ఉన్నాయి? ఎవరు వాడుతున్నారు? వాటి నుంచి ఎవరెవరికీ సమాచారం వెళ్లింది? వాటికి సంబంధించి కాల్‌డేటాను సైతం విశ్లేషిస్తున్నారు. డేటాను విశ్లేషించేందుకు పుణేలోని డేటా విశ్లేషణ సంస్థకు పంపించారు. టీడీపీ బూత్ కన్వీనర్లకు ఆ పార్టీ పంపిణీ చేసిన ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్ల నుంచి కూడా ఈ ఆన్లైన్ అర్జీలు చేసినట్లు సమాచారం. ఓట్ల తొలగించేందుకు దొంగచాటుగా చేసిన అర్జీల కుట్రలో భాగస్వామ్యం ఉందని చంద్రగిరి నియోజకవర్గంలో ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ ఎన్నికల అధికారులకు స్వయంగా తెలిపారు. టీడీపీ మండలాధ్యక్షుడితో పాటు మరో ఇద్దరిపై దేశద్రోహం, సైబర్ క్రైం చట్టాల కింద కేసులు నమోదు చేíసినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తే మరిన్ని ఈ తొలగింపు కుట్ర వెనుక ఉన్న పెద్దల హస్తం బయటపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో కీలకపాత్రదారుల పాత్ర నిర్ధారణ అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అవకాశముందని ఎన్నికల నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలే బీఎల్వోలు.. చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల వి«ధుల్లో కీలకమైన బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో)గా ఉన్నారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భారత ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పాకాల, చంద్రగిరి మండలాల్లో కొందరు బీఎల్వోలుగా ఉన్న వారికి సంబంధించిన టీడీపీ సభ్యత్వం కార్డు, వారు పార్టీ జెండాను పట్టుకుని చేస్తున్న ప్రచారం వంటి ఆధారాలను కమిషన్‌కు అందించారు. పూర్తి స్థాయిలో విచారించకుండా ఎన్నికల విధుల్లో ఓ రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తులను ఎలా నియమిస్తారని ఈ సందర్భంగా కమిషన్ బృందం జేసీ, సబ్ కలెక్టర్‌పై మండిపడింది. వారిని వెంటనే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి కమిషన్ అధికారులను కోరారు. -
ఓటర్ల జాబితాలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. వచ్చే జూలై 3,4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీపీల కాలపరిమితి ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు ముగియగానే కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ నెల 22న ప్రకటించనున్న (2019 జనవరి 1 నాటి) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) సిద్ధం చేయాలని ఎస్ఈసీ సూచించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి చర్యలు వేగవంతం చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కి ఎస్ఈసీ సూచించింది. ఈ జాబితాలకు అనుగుణంగా మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా సీఈవోలు తయారు చేయాల్సి ఉంటుంది. గురువారం ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), జిల్లా ఎన్నికల అధికారులకు లేఖ లు పంపించారు. గ్రామ పంచాయతీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి, ప్రచురించడానికి ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీకి ఒక అధికారిని నియమించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను తయారుచేసేందుకు పంచాయతీ కార్యదర్శి కేడర్ అధికారిని డిజిగ్నేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలు పాటిం చాలని సూచించింది. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలను సరిచూసుకునే కార్యక్రమాన్ని ముందుగానే పూర్తిచేసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించింది. -
ఓటు కుతంత్రం
ఓటమి భయంతో అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అధికారులను పావుగా వాడుకుని తమకుఅనుకూలంగా లేని ఓటర్లను తొలగించే పనిలో పడ్డారు. దీనికోసం ఆక్షేపణాస్త్రాన్ని వినియోగిస్తు న్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తమకు అనుకూలంగా లేని వారిని పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించారు. వారి పేర్లు ఓటర్ల జాబితాలో తొలగించేందుకు ఆన్లైన్లో ఫారం–7కు ఆ పార్టీ నేతలే దరఖాస్తు చేశారు. దీనిపై ఓటర్లు రగిలిపోతున్నారు. చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాగైనా గద్దెనెక్కాలన్న దురుద్దేశంతో టీడీపీ నాయకులు కుతంత్రాలు చేస్తున్నారు. అధికారబలంతో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు. తమ పార్టీకి అనుకూలమైన వారిని బీఎల్వోలుగా నియమించుకున్నారు. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో గుర్తించిన వారిద్వారా తమ ఇష్టానుసారం ఓట్లను తొలగిస్తున్నారు. ఎలాంటిఆధారాలు లేకుండానే, ఎన్నికల నియమాలకు విరుద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రగిరిలో చేస్తున్న అక్రమాలే నిదర్శనం చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని కుట్ర రాజకీయాలను టీడీపీ అమలుచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎన్నికల్లో కుతంత్రాలకు పాల్పడుతోంది. ఆ నియోజకవర్గంలోని 321 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 25 నుంచి 40 ఓట్లు ఎత్తివేసేలా ఆ పార్టీ నాయకులు ప్రణాళికలు సృష్టించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అనుకూలంగా లేని వారిని గుర్తించి ఓట్లను తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ నియోజకవర్గంలో తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం 2,70,495 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,33,434 మంది పురుషులు, 1,37,018 మంది మహిళలు, ఇతరులు 43 మంది ఉన్నారు. వారిలో టీడీపీకి అనుకూలంగా లేని వారిని ఐవీఆర్ఎస్ వాయిస్ ద్వారా గుర్తించారు. వారి ఓట్లను తొలగించేందుకు బీఎల్వోలను వాడుకుంటున్నారు. గుర్తించిన వారి పేర్లపై ఆన్లైన్లో ఫారం–7 (ఆక్షేపణలు)కు భారీగా దరఖాస్తు చేయించారు. సంబంధిత వ్యక్తులకు తెలియకుండానే ఆన్లైన్లో ఓట్ల నమోదు, సవరణ కోసం చంద్రగిరి నియోజకవర్గంలో 23,516 మంది దరఖాస్తులు చేయించారు. అందులో ఫారం–7 ద్వారా 10,164 మందిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయించి, తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు. అలా చేసిన దరఖాస్తులు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం బీఎల్వోకు అదే నియోజకవర్గంలోని బీఎల్వోల వద్దకు వస్తాయి. టీడీపీ నేతలు అక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలుపెట్టారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే టీడీపీ నేతలు ఇచ్చిన జాబితాను పెట్టుకుని ఓట్లను ఇష్టానుసారం తొలగించేస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే చంద్రగిరి నియోజకవర్గంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆధారాలే ఉండవు ఓటర్ల జాబితాలో తొలగిస్తున్న ఓట్లకు ఆధారాలు లేకుండానే చేస్తున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 30,25,222 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 15,03,477 మంది, మహిళలు 15,21,401 మంది, ఇతరులు 344 మంది ఉన్నారు. గత ఏడాది జరిగిన ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో 5,350 మంది మృతి చెందిన వారిని, 8,942 మంది వలస వెళ్లిన వారిని, డూప్లికేట్ పేరుతో 2,030 మందిని తొలగించారు. ఆ తరువాత జరిగిన ప్రక్రియలో సవరణ కోసం 12,255 దరఖాస్తులు అందాయి. అందులో తంబళ్లపల్లెలో 355, కుప్పంలో 32, పలమనేరులో 67, పూతలపట్టులో 296, చిత్తూరులో 154, జీడీనెల్లూరులో 78, నగరిలో 31, సత్యవేడులో 167, శ్రీకాళహస్తిలో 600, తిరుపతిలో 133, చంద్రగిరిలో 10,164, పుంగనూరులో 52, మదనపల్లెలో 63, పీలేరులో 63 కలిపి 12,255 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నింది. అదేవిధంగా 14 నియోజకవర్గాల్లో లేని వ్యక్తులను ఉన్నట్లుగా సృష్టించి 38,344 మందిని బోగస్ ఓటర్లుగా చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. కావాలనేరెచ్చగొడుతున్నారు నాకు తెలియకుండానే నా పేరుతో నా ఓటు తొలగించాలని దరఖాస్తు చేశారు. ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా నీచానికి దిగారు. కావాలనే రెచ్చగొడుతున్నారు. ఈ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయి. – మొక్కల తిమ్మారెడ్డి, వైఎస్సార్‌సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెల్లో చిచ్చు పెట్టేందుకేపల్లెల్లో చిచ్చు పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నాకు తెలియకుండానే నా ఓటు తొలగించాలని నా పేరుతో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. బీఎల్వో చెప్పేంతవరకు తెలియదు. ఇలా మా కుంట్రపాకం పంచాయతీలో 50కు పైగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారు. మా ప్రమేయం లేకుండా మా పేరుతో దరఖాస్తు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. – శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కుంట్రపాకం -
బోగస్ బృందాలకు అధికారం అండ!
సాక్షి, అమరావతి బ్యూరో: విపక్షం ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు నియోజకవర్గాల వారీగా టీడీపీ సర్వే బృందాలను మోహరించిన ప్రభుత్వ పెద్దలు తమ కనుసన్నల్లో మెలిగే పోలీస్ ఉన్నతాధికారుల అండదండలతో ఆగమేఘాలపై పని చక్కబెట్టే కుతంత్రంలో నిమగ్నమయ్యారు! ఎన్నికల ముందు ‘ముఖ్య’నేత వ్యూహ రచన చేసిన ఈ ఓట్ల తొలగింపు ఆపరేషన్‌ను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ఇంటెలిజెన్స్ విభాగం క్షేత్రస్థాయిలో పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఒక్కో నియోజక వర్గానికి 15,000 చొప్పున వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా చాపకింద నీరులా రాష్ట్రమంతటా సాగిస్తున్న ఈ అక్రమాల తీరు ఇదిగో..! విపక్షం ఓట్ల తొలగింపే లక్ష్యంగా ముగ్గురు అధికారులు.. తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ సర్కారు ఎన్నికల అక్రమాలకు బరి తెగిస్తోంది. భారీగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే పన్నాగానికి తెర తీసిన ముఖ్యనేత ఈ కుట్ర అమలు బాధ్యతను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు అప్పగించారు. వారిలో ఒకరు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక ఉన్నతాధికారి. ఆయన 2014 నుంచి టీడీపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారనే గుర్తింపు పొందారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అధికార టీడీపీ కొనుగోలు చేయడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. ఇక మరో ఉన్నతాధికారి రాష్ట్ర శాంతి భద్రతల విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అక్రమాల కోసమే శాంతి భద్రతల విభాగంలో ప్రత్యేకంగా ఓ పోస్టును సృష్టించి మరీ ఆయన్ను నియమించారు. ఇందులో పాలు పంచుకుంటున్న మరొకరు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో ‘ప్రత్యేక కారణాల’తో ఓ పోస్టును సృష్టించి మరీ కొనసాగిస్తుండటం గమనార్హం. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఇలా ఈ ముగ్గురు అధికారులు రంగంలోకి దిగారు. నకిలీ సర్వే బృందాల కోసం రూ.150 కోట్లు.. ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో టీడీపీ నకిలీ సర్వే బృందాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచరిస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా పని చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి 15 మందితో ప్రత్యేక బృందాలను నియమించి ట్యాబ్‌లు, సెల్ఫోన్లు, ఇతర మౌలిక వసతులు సమకూర్చారు. బృందంలోని ఒక్కో సభ్యుడికి నెలకు రూ.50 వేలు జీతంతోపాటు ఇతర భత్యాలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం రూ.150 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతుండటం గమనార్హం. విపక్షం ఓట్ల తొలగింపు కుట్ర అమలులో భాగంగా సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి ఓటర్లు, కుటుంబాల సమాచారాన్ని టీడీపీ బృందాలకు చేరవేశారు. ఈ బృందాలకు క్షేత్రస్థాయిలో పూర్తిగా సహకరించేందుకు జిల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. అడ్డుకుంటే రంగంలోకి దిగుతున్న నిఘా అధికారి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నకిలీ బృందాలు పర్యటిస్తూ సర్వేలు నిర్వహిస్తున్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మాట్లాడే ఓటర్ల వివరాలతో డేటాబేస్ తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 వేల మంది వైఎస్సార్ సీపీ అభిమానులు, సానుభూతిపరుల జాబితాతో డేటా బేస్ తయారు చేయాలని వారికి లక్ష్యంగా నిర్దేశించారు. వీరంతా ఈ జాబితాను ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తారు. అనంతరం ఆ అధికారులు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సర్వే చేస్తున్న సమయంలో ఈ బృందాలను ఎవరైనా అడ్డుకున్నా, అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినా వెంటనే జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్ అధికారి రంగంలోకి దిగుతున్నారు. టీడీపీ టీమ్‌లకు సహకరించాలని, సర్వే బృందాలను ‘బాస్’లే పంపించారంటూ స్థానిక పోలీసులకు చెప్పి వారిని విడిపిస్తున్నారు. వారిపై ఎలాంటి కేసులూ నమోదు చేయడం లేదు. అంతేకాదు.. సర్వేలు చేయడం తప్పేమీ కాదంటూ జిల్లా ఎస్పీలతో ముందుగానే ప్రకటనలు కూడా ఇప్పించారు. మరోవైపు టీడీపీ సర్వే బృందాలను అడ్డుకున్నవారిపై తిరిగి ‘రింగ్ఫుల్ రిస్ట్రెయింట్’ కేసులు నమోదు చేయాలంటూ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారి స్థానిక పోలీసులను ఒత్తిడి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మీద అదేవిధంగా అక్రమ కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. నకిలీ బృందాలపై కేసులు లేవు.. రాష్ట్రమంతటా జోరుగా తిరుగుతున్న నకిలీ సర్వే బృందాలు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ బృందాలు సర్వేల పేరుతో విపక్షం ఓట్లను తొలగిస్తున్న విషయం బహిర్గతమైంది. అయితే ఇంతవరకు ఎవరిపైనా సరైన కేసు పెట్టకపోవడం గమనార్హం. ఎన్నికల అక్రమాల కోసం టీడీపీ ప్రభుత్వం బరితెగించడం, అందుకు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులతోపాటు అధికార యంత్రాంగం సహకరిస్తుండటం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ సునీల్ ఆరోరాను కలసిన వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న తీరును ఆయన దృష్టికి కూడా తెచ్చారు. ఈసీ వెంటనే స్పందించి ఈ నకిలీ సర్వేలు, ఎన్నికల అక్రమాలకు తెరదించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అడ్డుకున్న విపక్ష నేతలపై అక్రమ కేసులు.. విపక్షం ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్ సంస్థల ముసుగులో అధికార పార్టీ చేస్తున్న కుట్రలు విజయనగరం జిల్లాలో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ట్యాబ్‌లతో తిరుగుతూ ఓటర్ల జాబితాలతో సర్వే చేస్తున్న బృందాన్ని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో గత నెల 24న అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిని పట్టుకున్నందుకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే అక్రమంగా కేసులు బనాయించడం గమనార్హం. జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును అరెస్టు చేయడంతోపాటు మరో 14 మందిని పోలీస్స్టేషన్లకు తరలించినప్పుడు కూడా నకిలీ సర్వే బృందాలు ప్రజల వద్దకు వెళ్లగలిగాయంటే వారికి ప్రభుత్వం, పోలీసుల అండ ఉందని స్పష్టమవుతోంది. ఓట్ల దొంగలొచ్చారు జాగ్రత్త! విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురంలో నెల రోజుల క్రితం సర్వే పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న కొందరు యువకులు టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు క్రాంతినగర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో వైఎస్సార్సీపీ మద్దతుదారుల వివరాలను నమోదు చేస్తున్న తెనాలికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పట్టుకుని టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 25 ఇళ్లలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించినందుకు రూ.800 చొప్పున తమకు చెల్లిస్తున్నట్టు సర్వేలో పాల్గొంటున్న వారు వెల్లడిస్తున్నారు. ఫారం 7 లేకుండానే ఓట్ల తొలగింపు ఏదైనా ఓటు తొలగించాలంటే ఫారం 7ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఓటరు నుంచి వివరణ తీసుకున్న తర్వాతే తొలగింపు ప్రక్రియ చేపట్టాలి. ఇవేమీ లేకుండా జాబితా నుంచి ఓటర్ల వివరాలు మాయం కావడంపై నిలదీస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను అధికారం అండతో ప్రభుత్వం అరెస్టు చేయిస్తోంది. పోలీసుల అండతోనే నకిలీ సర్వే బృందాలు గ్రామాల్లో ధైర్యంగా తిరుగుతున్నాయి. అభిప్రాయం కోసం ఓటరుకార్డుతో ఏం పని? - అనంతపురం జిల్లా గుంతకల్లులో గత డిసెంబర్ 18వతేదీన ఓటర్ల వద్దకు వెళ్లి రహస్యంగా సర్వే నిర్వహిస్తూ పేర్లు, అభిప్రాయాలు అడిగి ట్యాబ్‌లో వేలిముద్ర వేయాలని సూచిస్తున్న 40 మంది సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారి వివరాలు, ఓటరు కార్డు నంబర్‌తో ఏం పని? అని నిలదీయటంతో బోగస్ సర్వే బృందాల గుట్టు బయట పడింది. గతంలో కూడా జిల్లాలో పలు చోట్ల రకరకాల పేర్లతో నకిలీ బృందాలు తిరుగుతుండగా స్థానికులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. - గతేడాది నవంబర్ 1వ తేదీన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మడమనూరులో ఎన్డీటీవీ తరపున వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతూ వ్యక్తిగత వివరాలను ఆరా తీస్తూ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు నమోదు చేసుకుంటున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
22న ఓటర్ల తుది జాబితా
సాక్షి, సిటీబ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 22న తుది ఓటరు లిస్టు ప్రకటిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ తెలిపారు. ఆదివారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అర్హులని, 11వ తేదీ లోపు తమకు వచ్చిన దరఖాస్తులపై ఎంక్వయిరీ పూర్తిచేస్తామన్నారు. ఈ నెల 4వ తేదీ నాటికి 1,74,966 ఫామ్–6 దరఖాస్తులు, ఫామ్6ఏ 487, ఫామ్7..42,479, ఫామ్–8..35,982, ఫామ్ 8ఏ.. 59,132 కలిపి మొత్తం 3,13,426 దరఖాస్తులు వచ్చాయన్నారు. విచారణ పూర్తితో ఇప్పటి వరకు 1.47 వేల కొత్త ఓటర్లు చేరారన్నారు. మొత్తం మీద 28,500లకు పై ఓట్లను తొలగించినట్లు చెప్పారు. సోమవారం నుంచి ఈవీఎంలకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఉంటుందన్నారు. ఇందు కోసం ముగ్గుర్ని నోడల్ అధికారులుగా నియమించామని, సమగ్రంగా ఓటరు జాబితాను తయారు చేయడానికి గతంలో డిలీట్ చేసిన వారిని కూడా పరిశీలించి జాబితా రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాంపల్లిలో ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకునట్లు వివరించారు. -
ఎస్‌ఎంపల్లెలో కలకలం
చిత్తూరు, సదుం: ఎస్‌ఎంపల్లెలో ఓ సర్వే బృంద సభ్యులు ఆదివారం పర్యటిం చారు. గ్రామస్తులు వెంటనే వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని సర్వే బృంద సభ్యులను ప్రశ్నించారు. వారి వద్ద చీటీల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ అంటూ పేర్లు రాసి, ఫోన్ నంబర్లు ఉండడంపై ఆరా తీశారు. హైదరాబాదుకు చెందిన సోషల్ పోస్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ తరఫున సర్వే చేస్తున్నట్టు వారు బదులిచ్చారు. చిన్నపాటి చీటీల్లో ఎందుకు వివరాలు నమోదు చేస్తున్నారని ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అక్కడి నుంచి నిష్క్రమించడంతో వివాదం సద్దుమణిగింది. సెల్‌ఫోన్ నంబర్లు, ఓటర్ ఐడీ, ఆధార్ వివరాలు ఇవ్వడం వల్ల ఓట్లను తొలగించే అవకాశం ఉందని పెద్దిరెడ్డి గ్రామస్తులకు సూచించారు. ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన చెప్పారు. -
సర్వేలతో ఓటర్లలో ఆందోళన
విజయనగరం, డెంకాడ (నెల్లిమర్ల): ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితాల ను పొందుపరచుకుని, పలు అంశాలపై అభిప్రా య సేకరణపేరుతో గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్న వారితో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల జాబితాల్లో కీలక నాయకులతో పాటు ప్రతిపక్షపార్టీకి చెందిన ఓట్లను పలుగ్రామాల్లో తొలగించిన నేపథ్యంలో ఇలాంటి సర్వేలు చేస్తున్న వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సర్వేకి వస్తున్న వారి వద్ద ఉన్న ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా ఉంటుండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఓట్ల తొలగింపులో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారన పలువురు అంటున్నారు. చొల్లంగిపేట పంచాయతీలోని ద్వారపురెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం ఇంటింటికీ ట్యాబ్‌లు పట్టుకుని సర్వే పేరిట తిరిగారు. వారి ట్యాబ్‌లలో ఓటర్ల జాబి తాలు ప్రత్యక్షమవడంతో పాటు వారు అడిగే ప్రశ్నలు కూడా తేడాగా ఉండడంతో వీరిని డెంకా డ పోలీసులకు అప్పగించారు. అలాగే చింతలవలసకి కూడా కొందరు సభ్యులు సర్వే పేరిట వచ్చారు. వారి ట్యాబ్‌ల్లో కూడా ఓటర్ల జాబితా లు ఉండడంతో సర్వే చేయడం సరికాదని చెప్పడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తమ వివరాలు కూడా చెప్పడం లేదు. కొందరు బెంగళూరుకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పేరిట ఐడెంటీ కార్డులు చూపుతున్నారు. వీటిల్లో సర్వే చేస్తున్న వ్యక్తుల ఫొటోలు లేవు. పూర్తిస్థాయివిచారణ చేయాలి సర్వేల పేరుతో వచ్చిన వారు అధికార పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబుతున్న వారి ఓట్లను తొలగిస్తున్నారన్న ఆందోళన చాలా మందిలో ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డెంకాడ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బంటుపల్లి వాసుదేవరావు పోలీసులను కోరారు. సర్వే బృందాల వద్ద ట్యాబ్‌లను పూర్తిస్థాయిలో పరిశీలించడంతో పాటు, వీరిని వెనుకనుంచి నడిపిస్తున్న వారిని కనిపెట్టి విచారిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు. పోలీసులు, ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించాలని కోరారు. -
తప్పుల తడకగా ఓటరు జాబితా!
గుంటూరు. పిడుగురాళ్ల: ఎన్నికల అధికారులు ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆసాంతం తప్పుల తడకగా ఉంది. జాబితాలో అర్హుల లిస్టులో మరణించిన వారి ఓట్లు ఉండడం ఒక విశేషమైతే, బతికున్న పలువురి ఓట్లు గల్లంతుకావడం గమనార్హం. స్థానికంగా ఉంటున్న వారి ఓట్లను అసలు గ్రామంలోనే లేనట్లుగా తొలగింపుల జాబితాలో చేర్చారు. ఒక్క పిడుగురాళ్ల పట్టణంలోనే సుమారు వెయ్యికి పైగా ఓట్లు ఓటర్ల జాబితాలో తొలగింపులు జరిగాయని తెలుస్తోంది. తప్పుల తడక జాబితాపై ప్రజలు మండిపడుతున్నారు. పిడుగురాళ్ళ పట్టణంలోని 30 వార్డుల్లో వేలాది ఓట్లు గల్లంతవడంతో ఓటర్లు లబోదిబోమంటున్నారు. ఆయా బూత్‌ల కన్వీనర్లు బూత్‌ల వారీగా జాబితాలను పరిశీలిస్తుంటే ఒక్కో బూత్‌లో వందల సంఖ్యలో ఓట్లు గల్లంతవడంతో పాటు తప్పులు దొర్లినట్టు గుర్తించారు. 28వ వార్డులోని 293 బూత్‌లో వరుసగా 50 మంది ఓట్లను తొలగించారు. వారంతా స్థానికంగా ఏళ్ల తరబడి ఇక్కడే నివశిస్తున్నారు. షేక్ మాబుసుభాని(ఎల్హెచ్ఎల్1886209) అనే వ్యక్తి, సయ్యద్ నాగవరం సైదా(ఏపీ171060597035) మరణించినా, వారు జీవించి ఉన్నట్లుగా వారి ఓట్లు జాబితాలో క్షేమంగా ఉన్నాయి. వీరి ఓట్లు 293వ బూత్ నంబర్లో ఉన్నాయి. స్థానికంగా నివాసముంటున్న షేక్ హోటల్ కరిముల్లాతో పాటు సయ్యద్ జాన్‌బీ, షేక్ మస్తాన్‌వలి ఇలా సుమారు 50 మంది వరకు మైనార్టీల ఓట్లు గల్లంతయ్యాయి. నా ఓటు తొలగింపురాజకీయ కుట్రే గత నాలుగు ఎన్నికల్లో ఓటు వేశాను. మొన్న సర్వేలో కూడా నా ఓటు ఉంది. ఇప్పుడు ఫైనల్ లిస్టులో నా ఓటు లేకపోవడం కేవలం రాజకీయ కుట్రే. నేను వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడనని తొలగించి ఉంటారు. ఇటీవలే సామాజిక సర్వే అంటూ ప్రభుత్వంపై అభిప్రాయం అడిగితే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశాను. అందుకే నా ఓటు తొలగించి ఉంటారు. –షేక్ కరిముల్లా, 203 బూత్ నంబర్, పిడుగురాళ్ల 40 ఏళ్ల నుంచిఓటు వేస్తున్నా.. గత 40 ఏళ్ల నుంచి నేను ఓటు వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా ఓటు తీసేశారు. సర్వే చేసేవారు సక్రమంగా చేయకుండా ఇలా మా లాంటి వారిని ఇబ్బంది పెట్టడం తగదు. –సయ్యద్ జాన్‌బీ,పాటిగుంతల, పిడుగురాళ్ల -
పాత జాబితాకే కొత్త రంగు
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం నియోజకవర్గ ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉంది. ఓటరు జాబితాలో తప్పులపై రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ఇప్పటికి మూడుసార్లు అభ్యంతరాలు తీసుకున్నారు. కానీ తుది జాబితాలో మాత్రం అవే తప్పులు కొనసాగించారు. గతంలో ఉన్న డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు, ఒక బూత్‌లోని పేర్లు, ఇంకో బూత్‌లో కూడా ఉండటం వంటి తప్పులు ఏ ఒక్కటీ సరిచేయకుండా మళ్లీ యథాతధంగా జాబితాలు ముద్రించేశారు. ఈ మాత్రం దానికి అభ్యంతరాలు ఎందుకు తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి. నియోజకవర్గంలో బోగస్ ఓట్లు 5వేలు పైనే ఉన్నట్టు సమాచారం. టీడీపీ నేతల వత్తిళ్లకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. 2004 ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పునర్విభజన చేయడంతో జిల్లాలో నరసాపురం చిన్న నియోజకవర్గం అయిపోయింది. యలమంచిలి మండలంలోని కొన్ని గ్రామాలు పాలకొల్లు నియోజకవర్గంలో కలిశాయి. దీంతో నరసాపురం, నరసాపురం మండలం, మొగల్తూరు మండలాలు మాత్రమే ఈ నియోజకవర్గంలో మిగిలాయి. ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం ఓటర్లు 1,56,432 మంది. అయితే వీటిలో 5 వేలు వరకూ బోగస్ ఓట్లు ఉన్నట్టు అంచనా. టీడీపీ నాయకులు ఇష్టానుసారం దొంగ ఓట్లు రాయించారని, వాటిని తొలగించమని వీటిని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోని పరిస్థితి. ఒకే వ్యక్తికి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు ఒకే వ్యక్తికి పలు బూత్‌ల్లో ఓట్లు ఉన్నాయి. వేరే ఊళ్లలోని వారిపేర్లు కూడా నియోజకవర్గంలో ఉండటం విశేషం. చనిపోయినవారు, విదేశాల్లో ఉన్నవారు, వేరే ప్రాంతావారి పేర్లు చాలాకాలంగా ఓటర్ జాబితాలో కొనసాగుతున్నాయి. వివాహమై వేరే ప్రాంతాలకు వెళ్లిన మహిళల ఓట్లు చలామణిలో ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ ఓటర్ జాబితాల పరిస్థితి ఘోరంగా ఉంది. పట్టణంలోని 54వ బూత్‌లో పంజా ఝాన్సీ, పంజా జగన్మోహన్ హరిశ్చంద్ర పేర్లు 41వ బూత్‌లో కూడా ఉండటం విశేషం. దీనిపై గ్రామ సభలో వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీల వారు అభ్యంతరం చెప్పారు. కానీ పరిస్థితి మారలేదు. అజమాయిషీ లేకే అలక్ష్యమా! కీలకమైన సబ్‌కలెక్టర్ పోస్టు 9 నెలల నుంచి ఖాళీ. దీంతో డివిజన్లో రెవెన్యూ పాలన కుటుంపడింది. తహసీల్దార్ నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ సవ్యంగా పనిచేయడం లేదు. ఓటర్ జాబితాలు రూపొందించటంలో పాత జాబితాలనే కొత్తగా ముద్రించడం మినహా రెవెన్యూ అధికారులు ఇంకేమీ చేసినట్టు కనిపించడంలేదు. టీడీపీ నేతల ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది ఈ తతంగాన్ని కొనసాగిస్తూ వచ్చారనే విమర్శలు ఉన్నాయి. పోలింగ్‌లో లబ్ధిపొందేందుకు, దొంగ ఓట్లు వేసుకునేందుకు ఇష్టానుసారం ఓటర్ జాబితాలను మార్చేశారనే విమర్శలున్నాయి. వెంటనే తప్పులు సరిదిద్దాలి ఓటరు జాబితాల తయారీలో రెవెన్యూ అధికారులు సవ్యంగా వ్యవహరించలేదు. గ్రామసభల్లో మా పార్టీ నాయకులు ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదులపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పదే పదే అవే డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు ఎందుకొస్తున్నాయి. అసలు రెవెన్యూ అధికారులు పాత జాబితాలు, కొత్త జాబితాలు చూస్తున్నారో?లేదో? అర్థం కావడం లేదు. వెంటనే తప్పులు సరిదిద్దాలి. మా పార్టీ తరఫున రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాము.–ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ -
దగ్గరుండి చూసుకోండి!
సాక్షి, హైదరాబాద్: కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అర్హులైన అందరి పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రతి గ్రామంలోనూ చొరవ తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా సవరణ, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ‘ఓటర్ల జాబితాలో సవరణలపై దృష్టి సారించాలి. ఎన్నికల కమిషన్ మరో నెల రోజులపాటు కొత్త ఓటర్ల నమోదుకు, జాబితాలో గల్లంతైన ఓటర్లను చేర్పించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రతి గ్రామంలోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునిపోవాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు.. ఎమ్మెల్యేలతో, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమన్వయం చేస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ జాబితాలో చేర్పించేలా చొరవతీసుకోవాలి. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పార్టీ అధినేత ఆదేశించారు. ఈనెల రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్ల జాబితాలో చేర్చేలా చూడాలి. పార్టీ మండలాధ్యక్షులతో, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నేరుగా మాట్లాడి ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రధాన కార్యదర్శులు ఈ నెలలో వీలైనన్ని ఎక్కువ రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తెలంగాణభవన్‌లో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాల్లో భవనాలు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలన్ని వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ‘టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ మనకు అప్పగించారు. ప్రభుత్వ అనుమతి మేరకు ప్రతి జిల్లా కార్యాలయానికి ఒక ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశముంది. ఇప్పటికే దాదాపు 20 జిల్లా కేంద్రాల్లో స్థలాల ఎంపిక పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో స్థలాలను ఎంపిక కోసం ఎమ్మెల్యేలతోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు స్వయంగా వెళ్లి పరిశీలించాలి. సంక్రాంతి తర్వాత వరుసగా జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి’అని ఆయన వెల్లడించారు. పెద్దపల్లి గొడవపై దృష్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న వర్గపోరుకు తెరదించడంపై కేటీఆర్ దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ తమకు ఇబ్బంది కలిగించారని ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), బాల్క సుమన్ (చెన్నూరు), దాసరి మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి) ఇటీవల కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జ్ బస్వరాజు సారయ్య, జి.వివేక్, బాల్క సుమన్‌లను క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. నేతల మధ్య సమన్వయలోపంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను విన్న తర్వాత ఇకముందు ఇలాంటివి జరగొద్దని.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేశ్‌లు కూడా క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలిశారు. యాంకర్ సుమ భేటీ తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్‌ను టీవీ యాంకర్ సుమ కలిశారు. ‘ఒక మంచి పని కోసం వచ్చాను. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను వెల్లడిస్తాను’అని భేటీ అనంతరం ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యేలు టి.రాజయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జి.విఠల్ రెడ్డి, ఎన్. నరేందర్, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
పాయకరావుపేటలో ఓట్లు తొలగించే ముఠా !
నక్కపల్లి(పాయకరావుపేట): పాయకరావుపేట మండలం పీఎల్‌పురం గ్రామంలో సర్వే పేరుతో వైఎస్సార్సీపీ అభిమానుల నుంచి వివరాలు సేకరించి ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్న ముగ్గురి ముఠాను స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సందీప్ అనే యువకుడు పాయకరావుపేటకు చెందిన వరదా శ్రీను, వరదా సాంబ అనే వ్యక్తులతో కలసి పీఎల్‌పురంలో సర్వే చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభిమానుల ఇంటికి వెళ్లి మీ పేరేంటి, మీరు ఏ పార్టీకి చెందిన వారు, ఏ పత్రికలు చదువుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు, మీ ఓటరు ఐడి నంబరు ఎంత..? అంటూ ఆరా తీసి వారి వద్ద నున్న ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఆనుమానం కలిగి న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణ, దివాణం వారిని పంచాయ తీ వద్ద నిలదీసి మండల స్థాయి నా యకులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి వచ్చి చేరుకుని సర్వే చేస్తున్న ముగ్గురిని ఎక్కడ నుంచి వచ్చారు.. దేని కోసం సర్వే చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు పంపించారు, ఓట ర్ల వివరాలు ఎందుకు సేకరించాల్సి వచ్చిందని నిలదీశారు. తాము ఎన్టీవీ, ఎన్డీటీవీల నుంచి వచ్చామని ఏ పార్టీకి ఓటేస్తారనే దానిపై సర్వే చేస్తున్నామని వారు చెప్పారు. వారి వద్ద ఎటువంటి ఐడెంటిటీ కార్డులు లేకపోగా, ఫొటో లేకుండా ఉన్న రిపబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూపుకు చెందిన కార్డు ఒకటి చూపించారు. డబ్బులు ఇస్తామంటే ఇతని వెంట వచ్చామని మాకేమీ తెలియదంటూ వారిలో వరదా శ్రీను, వరదా సాంబ తెలిపారు. దీంతో అనుమానం కలిగిన చిక్కాల రామారావు తదితరులు వారు ముగ్గురిని స్థానిక పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఫిర్యాదు అందించారు. అనంతరం రామారావు, పట్టణ శాఖ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయి తదితరులు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు తొలగించడం కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి వ్యక్తులను పంపించి సర్వేలు చేయిస్తున్నారని ఆరోపించారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న ట్యాబ్‌లో సమాచారాన్ని సీజ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
వేటు మొదలయ్యింది....!
చిత్తూరు కలెక్టరేట్ : ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు జిల్లాలో గట్టి కసరత్తు జరుగుతోంది. సవరణ జాబితా ప్రక్రియలో అలసత్వం చూపిన 33 మంది ఉద్యోగులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం కలెక్టర్ తిరుపతి నియోజకవర్గంలోని 181వ నెంబరు పోలింగ్ బూత్‌లో బీఎల్వోను సస్పెండ్ చేశారు. సెలవుకు ముందస్తు అనుమతి తీసుకోనందుకు, ఓటర్ల ప్రక్రియలో వెనుకబడినందుకు పలమనేరు ఈఆర్వో(జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి) ప్రభాకర్‌రెడ్డికి చార్జి్జమెమో జారీచేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. ఈ ప్రక్రియపై కలెక్టర్ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఎల్వోను ఎందుకు సస్పెండ్ చేశారంటే .. తిరుపతి నియోజకవర్గంలోని పోలింగ్‌బూత్ నెంబర్ 181లో ఆశావర్కర్ (శివనేశ్వరి)ని సస్పెండ్ చేశారు. ఆ పోలింగ్ బూత్‌లోని సుమంత్ అనే యువకుడు ఆమెపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో సిసోడియాకు ఫిర్యాదు చేశారు. సుమంత్ తన ఓటు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. క్షేత్రస్థాయిలో తనిఖీకి వెళ్లిన బీఎల్వో అతని ఆధారాలు చూపాలని కోరింది. సుమంత్ తన ఆధార్‌కార్డు గతంలో వైఎస్సార్ జిల్లాలో ఉండేదని ప్రస్తుతం తిరుపతిలో ఉద్యోగరీత్యా ఉన్నానని చెప్పారు. ఓటు మార్పునకు ఏదో ఒక ఆధారం కావాల్సిందే. ఆధారం లేకుండా ఓటును ఆమోదించాలంటే రూ.20 ఇవ్వమని కోరినట్లు సుమంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కలెక్టర్ ప్రద్యుమ్న ఆమెను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ అప్రమత్తం కా వాలని టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయాల తనిఖీకి ఆదేశాలు ఆకస్మికంగా తనిఖీలుంటాయని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. 15 నుంచి జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీ చేస్తామన్నారు. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల మ్యాన్యువల్ నివేదికలు, ఈఆర్వో నెట్ నివేదికలు తప్పనిసరిగా ఉండాలన్నారు. వీఐపీ ఓట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. వీఐపీ ఓట్ల మార్కింగ్ విషయంలో వారు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించాలన్నారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాకు ఎన్నికల అబ్జర్వర్ వచ్చేసరికి(17నాటికి) ప్రక్రియ పూర్తవ్వాలన్నారు. ఓటర్ల సమస్యల పరిష్కారానికి కాల్‌సెంటర్ ఓటర్ల సమస్యల ఫిర్యాదుకు, పరిష్కారం కోసం కలెక్టరేట్లో కాల్‌సెంటర్ ను ప్రారంభిం చారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇది పనిచేస్తుందని డీఆర్ఓ గంగాధర్‌గౌడ్ వెల్లడించారు. జిల్లాలోని ఓటర్లు సమస్యలుంటే 08572–240899 నెంబర్‡ తెలియజేయాలన్నారు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నట్లు తెలిపారు. -
ఓటరు జాబితాలో అక్రమాలను సరిదిద్దండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై వైఎస్సార్ సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అధికార టీడీపీ దొంగ ఓట్లను సృష్టిస్తున్న వైనంతోపాటు ఇప్పటివరకు పలు నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులతో ఒకే వ్యక్తి పేరును నాలుగైదు చోట్ల ఓటరు జాబితాలో చేర్చడంపై వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ వరప్రసాదరావు గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునిల్ ఆరోరాను కలసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో 45,920 పోలింగ్ బూత్‌లవారీగా ఎన్నికల సంఘం 2018 సెప్టెంబర్ 1న విడుదల చేసిన ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను వైఎస్సార్ సీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. దీనిపై ఈసీకి ఆధారాలను సైతం అందజేశారు. అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఒక క్రమంలో 50 శాతం వరకు పరిశీలిస్తే ప్రధానంగా రెండు రకాల తప్పులను గుర్తించినట్టు నేతలు వివరించారు. నకిలీ ఓటర్ల సంఖ్య అరకోటికిపైనే.. ఒకే వ్యక్తికి పేరులో స్వల్ప మార్పులతో ఒకే నియోజకవర్గంలో లేదా వేరే నియోజకవర్గాల్లో నాలుగైదు చోట్ల ఓటరు జాబితాలో పేర్లు నమోదు కావడాన్ని గుర్తించినట్టు తెలిపారు. డూప్లికేట్ / పలుచోట్ల ఓటుహక్కుకలిగి ఉండటం / పూర్తి వివరాలు లేని ఓటర్ల సంఖ్య 34,17,125 వరకు ఉందని వెల్లడించారు. ఇక మరో 18,50,511 మందికి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం 52.67 లక్షల మంది ఇలా అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలనే మార్చేసే ఇలాంటి ఓటర్లను తొలగించి అక్రమాలను వెంటనే సరిదిద్దాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్టు సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌తో లింక్ చేసే విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. -
ఈ నగరానికి ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో పోలింగ్ శాతం మళ్లీ నిరుత్సాహ పరిచింది. శుక్రవారంతోపాటు వారంతం కావడంతో చాలా మంది సెలవులు తీసుకుని కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. నగరంలో ఉన్న వారు సైతం ఓటు వేసేందుకు నిరాసక్తత కనబరిచారు. హైదరాబాద్‌లో జిల్లాలో 50.86%, మేడ్చల్ జిల్లాలో 54.99% పోలింగ్ నమోదైంది. ఓటింగ్‌లో పాల్గొనాలని అధికారులు, పార్టీలు అనేక విజ్ఞప్తులు చేసినా.. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదు. పోలింగ్ బూత్‌లు, ఓటరు స్లిప్‌లకు ఆధునిక సాంకేతిక సహాయం అందుబాటులోకి వచ్చినా, అనేక చోట్ల ఓట్ల గల్లంతు, నివాసాల నుండి సుదూర ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటుతో చాలా మంది ఓటేసేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు నగరంలో ఓటరు గుర్తింపు కార్డులున్నా ఓటరు జాబితాలో పేరు లేకపోవటం, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించిన అంశం కూడా పోలింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఓటు గల్లంతైన వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, దర్శకుడు రాజమౌళి సతీమణి రమ తదితర ప్రముఖులుండటం గమనార్హం. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మల్కాజిగిరిలో 51.68%, కుత్బుల్లాపూర్‌లో 55.77%, కూకట్‌పల్లిలో 57.72%, ఉప్పల్‌లో 51.04% నమోదు కాగా, ఎల్బీనగర్లో 49%, మహేశ్వరంలో 55.09%, రాజేంద్రనగర్‌లో 57.29% ,శేరిలింగంపల్లిలో 48% పోలింగ్ నమోదైంది. ముషీరాబాద్‌లో 51.34%, అంబర్‌పేటో 55.20%, ఖైరతాబాద్‌లో 54%, జూబ్లీహిల్స్ 54.60%, సనత్‌నగర్‌లో 52.63%, నాంపల్లిలో 44.02%, సికింద్రాబాద్‌లో 57%, మలక్‌పేటలో 55.54%, కార్వాన్లో 50.89%, గోషామహల్లో 50.28%, చార్మినార్‌లో 46.03%, చంద్రాయణగుట్టలో 48%, యాకుత్‌పురాలో 45%, బహుదూర్‌పురాలో 49.50%, కంటోన్మెంట్లో 48.90% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. భారీగా తగ్గిన పోలింగ్ 2014తో పోలిస్తే శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నగరంలో పోలింగ్ తగ్గింది. 2014లో హైదరాబాద్‌లో 53% పోలవగా, ఈ ఎన్నికల్లో 50.86% నమోదైంది. 2014తో పోలిస్తే ముషీరాబాద్, సనత్‌నగర్,నాంపల్లి,కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహుదూర్‌పురా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోగా, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లో పెరిగింది. -
అవే తప్పులు మళ్లీమళ్లీ
సాక్షి,సిటీబ్యూరో: ఈనెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ కూడా సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 4.93 లక్షల బోగస్ ఓట్లను ఏరివేశామని ప్రకటించారు. ఇందులో 1.80 లక్షల ఓట్లు మరణించిన వారివి ఉన్నాయన్నారు. అయితే, గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ‘డబుల్’ ఓట్లు, వార్డు నంబర్ లేని బోగస్ ఓట్లు, ఒకే పేరు మీద, ఒకే పోలింగ్ బూత్‌లో సీరియల్‌గా 17 ఓట్లు, 2008 నుంచి 2018 ఆగస్టు మధ్య మరణించిన వారి పేర్లు వందలకొద్దీ తాజా లిస్టులో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు గతంలో స్వచ్ఛందంగా ఓట్లు తొలగించుకున్న పేర్లు సైతం ఈ లిస్టులో ఉన్నాయి. ఫిర్యాదులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఓటరు లిస్టును పరిశీలించి సవరిస్తామని ఉన్నతాధికారులు చెప్పిన మాటలు కింది స్థాయిల అధికారులు అమలుచేసినట్టు ఎక్కడా కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలోని ఈఆర్ఓల నుంచి బూత్ లెవల్ అధికారుల వరకు ఓటరు లిస్టుల పరిశీలన చేశారా లేదా అన్న సందేశాలు ఉత్పన్నమవుతున్నాయి. తాజా లిస్టులో తప్పులు మచ్చుకు కొన్ని.. నాంపల్లి నియోజకవర్గాంలో బూత్ నంబర్ 269, క్రమ సంఖ్య 28, 29లో వేర్వేరు పేర్లతో ఒకే మహిళ ఓట్లు ఉన్నాయి. ఇదే బూత్‌లో 12–2–830/ఎ/50/ఎ, 122830/1/50/1/ఎ ఇంటి నంబర్‌పై మహిళల ఫొటో ఒక్కరే. ఆమె పేరు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నంబర్ 234లో కూడా క్రమ సంఖ్య 1217 నుంచి 1233 వరకు పలువురు వ్యక్తుల ఓట్లు ఒకే ఫొటోతో మూడు నుంచి నాలుగు సార్లు నమోదు చేశారు. వార్డు నంబర్ లేని ఓట్లు కూడా నాంపల్లి నియోజకవర్గంలో వార్డు నంబర్ 10, 11, 12 వరకు ఇంటి నంబర్లు ఉన్నాయి. ఈ వార్డు నంబర్ల అధారంగా ఓటరు లిస్టుల్లో పేర్లు నమోదు చేశారు. అయితే పోలింగ్ బూత్ నంబర్ 1లో క్రమ సంఖ్య 1 నుంచి 30 వరకు వార్డు నంబర్లు పొంతన లేకుండా 1–1–946, 4–2, ఇలా 30 మంది ఓట్లు నమోదు చేశారు. అదే బూత్ క్రమ సంఖ్య 31 నుంచి వార్డు నంబర్లు సక్రమంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని 271 పోలింగ్ బూత్‌లో క్రమ సంఖ్య 1024 నుంచి 1053 వరకు ఇంటి నంబర్లు సైతం సక్రమంగా లేవు. ఒకే పేరుపై 17 ఓట్లు యాకుత్‌పురా నియోజకవర్గం బూత్ నంబర్ 120లో క్రమసంఖ్య 33 నుంచి 37 వరకు ఓ మహిళ పేరుతో ఓట్లు నమోదు చేశారు. అంతేకాదు ఇదే పోలింగ్ బూత్‌లో క్రమ సంఖ్య 116 నుంచి 128, 129 నుంచి 135 వరకు ఒకే వ్యక్తి పేరుతో 17 ఓట్లు ఉన్నాయి. లిస్టులో మరణించినవారి పేర్లు సైతం.. నాంపల్లి నియోజకవర్గంలోని బూత్ 16 పరిధిలో ఉండే రఫత్ ఉన్నీసా బేగం 2008లో ఆగస్టులో మరణించినట్లు జీహెచ్ఎంసీ ధ్రువీకరించింది. అయినా ఆమె పేరుతో అదే బూత్‌లో క్రమసంఖ్య 555లో ఓటు ఉంది. అలాగే బూత్ నంబర్ 14 పరిధిలో ఉండే సయ్యద్ ఇఫ్తకార్ ఉద్దీన్ సైతం మరణించినట్టు జీహెచ్ఎంసీ ధ్రువీకించింది. అయినా తాజా ఓటర్లు లిస్టులో అతడి పేరు కూడా ఉంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఓట రు లిస్టుల్లో తప్పులు యథాతధంగా ఉన్నాయి. ♦ ఖైరతాబాద్‌లోని బూత్ నంబర్ 61, క్రమసంఖ్య 1006లో జహీరుద్దీన్ అహ్మద్‌ఖాన్‌కు ఓటుంది. ఇతడికి నాంపల్లి నియోజకవర్గం బూత్ నంబర్ 94లోనూ ఓటు ఉంది. ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. ♦ గత జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్లో ఉంటున్న ఇతర జిల్లాలు, గ్రామాల ఓటర్ల పేర్లు నగరంలో కూడా ఉంటే తొలగించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో పలువురు తమ ఓటును వారు సొంత ప్రాంతాల్లో ఉండాలని, నగరంలో తొలగించుకున్నారు. ప్రస్తుతం అలాంటి వారికి కూడా నగరంలో ఓట్లు తిరిగి నమోదు చేశారు. వారికి రెండుచోట్ల ఓట్లు ఉన్నాయి. ♦ నాంపల్లి, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోనే కాదు.. గ్రేటర్లో ఇదే పరిస్థితి ఉంది. గ్రేటర్‌లోని ప్రతి నియోజకవర్గంలోను దాదాపు 150 మంది మరణించిన వారి పేర్లతో ఓట్లున్నాయి. అధికారులు ఏ స్థాయిలో ఓటరు లిస్టు పరిశీలనలో నిర్లక్ష్యం వ్యవహరించారంటే.. 2009 నుంచి 2018 మధ్య మరణించి వారు సైతం ఓటరు లిస్టులో దర్శనమిస్తున్నారు. -
బోగస్ ఓటర్లను తొలగిస్తారా..?
విజయనగరం గంటస్తంభం: ఓటర్ల జాబితాలో లోపాలుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం. ఓటు నమోదు చేసుకున్న ఓటరుకు ఓటు లేకపోయినా... ఒకరు అనేక ఓట్లు వేసే అవకాశం కల్పించినా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితికి ఓటర్ల జాబితా సక్రమంగా తయారు చేయలేని ఎన్నికల సంఘానిది. అందులో పని చేసే అధికారులది. అందుకే ఎన్నికలసంఘం ముందే మేల్కొంది. ఓటర్ల జాబితాలో లోపాలపై వస్తున్న ఆరోపణలపై స్పందించింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను సరి చేసే పక్రియ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్ని బోగస్ ఓట్లు తేలుతాయి? ఎంతమందిని తొలిగిస్తారన్నది వేచి చూడాలి. ఎనలిస్టు అండ్ స్ట్రాటజీ టీమ్ రెండు రాష్ట్రాల్లో ఇటీవల జరిపిన ఆధ్యయనంలో ఓటర్ల జాబితాలో అనేక లోపాలు వెలుగుచూసిన విషయం విధితమే. ఒకే ఓటరు ఐడీతో బహు ఓట్లు.. రెండేసి ఓటరు ఐడీతో వేర్వేరు చోట్ల ఓట్లు.. ఒకే పేరుతో పలు పోలింగు కేంద్రాల్లో ఓట్లు.. తదితర లోపాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 57 లక్షలకు పైగా ఓట్లు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో బోగస్ ఓట్లు చాలా వరకు ఉన్నాయి. జిల్లాలో కూడా వేలాది ఓట్లు ఉన్నట్లు తేలింది. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక పలు వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విధితమే. ఈ నేప్యథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలను సవరించాలని నిర్ణయించింది. ఒక ఓటరు బహు ఓట్లు పొందడం.. స్థానికంగా లేని వారికి ఓటుహక్కు ఉండడం వంటి విషయాలపై దృష్టి పెట్టింది. జిల్లాకు అనుమానిత ఓటర్ల వివరాలు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తించిన డవుట్ ఫుల్ (అనుమానాస్పద) ఓటర్ల వివరాలు జిల్లా అధికారులకు పంపించింది. జిల్లా అధికారులకు తాజాగా చేరిన వివరాల ప్రకారం జిల్లాలో 1,10,036 మంది అనుమానిత ఓటర్లున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఓటర్లు వేలాదిగా ఉన్నారు. ఇందులో బోగస్ ఓటర్లు ఉండవచ్చునని ఎన్నికలసంఘం భావిస్తోంది. ఒకే పేరుతో ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండడం.. వేర్వేరు ప్రాంతాల్లో అదే పేరుతో ఓట్లు ఉండడం.. ఓటరు ఐడీ మారి జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు పరిశీలించి బోగస్ ఓట్లు తొలగించాలని నిర్ణయించింది. అదేవిధంగా వయస్సు, లింగం, ఇతర వివరాలు తప్పుగా నమోదైన ఓట్లు కూడా 7 వేలకుపైగా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలించి సరి చేయడం వంటివి కూడా చేయాలని నిర్ణయించారు. నేటి నుంచి పరిశీలన ఓటర్ల జాబితా ఆధారంగా శుక్రవారం నుంచి ప్రతి పోలింగ్ కేంద్రంలో రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిశీలించనున్నారు. బీఎల్ఓ ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ఆ వివరాలు అప్లోడ్ చేస్తారు. అనుమానంగా ఉన్నా, ఓటరు లేకపోయినట్లు తేలినా, బోగస్ ఓటుగా తేలినా వెంటనే తొలిగించేందుకు సిఫార్సు చేస్తారు. ఇందుకు సంబంధించి పోలింగ్ బూత్ వారీగా అనుమానిత ఓటర్ల జాబితా జిల్లా అధికారులకు చేరింది. వాటిని జిల్లా అధికారులు తహసీల్దార్లకు పంపించారు. వారు బీఎల్వోలకు ఇచ్చి శుక్రవారం నుంచి పరిశీలన చేయిస్తారని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తెలిపారు. -
ఏపీ ఓటర్ల జాబితాపై పూర్తి వివరాలు మా ముందుంచండి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా తయారు, ముసాయిదా జాబితా ప్రచురణ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను, అనర్హులను, డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో 34.17 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. 17 లక్షలమంది ఓటర్లు అటు ఏపీ, ఇటు తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉన్నారని వివరించారు. అంతేగాక అధికారపార్టీకి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో స్లీపర్ సెల్స్‌గా ఓటర్ల జాబితాలో ఉన్నారని తెలిపారు. ఓటర్ల జాబితా తయారీలో అనేక అవకతవకలున్నాయని, ఏడాది వయస్సున్న చిన్నారిని వివాహితగా పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఓటర్ల వయస్సును 248 సంవత్సరాలుగా కూడా పేర్కొన్నారని తెలిపారు. ఎప్పుడో రాజుల కాలంలో పుట్టినట్లుగా వయస్సును ఓటర్ల జాబితాలో పేర్కొన్నారని, దీన్నిబట్టి ఓటర్ల జాబితా తయారీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చునని నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్రియ ఏ దశలో ఉందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది బదులిస్తూ.. 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నామని, జనవరి 4 నాటికి ముసాయిదా ప్రచురిస్తామని బదులిచ్చారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. -
తమ్ముళ్ల బోగస్ మంత్రం
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు ఓటరు జాబితాలో గుట్టుచప్పుడు కాకుండా బోగస్ ఓట్లు చేర్పించారు. ఫొటో ఒక్కటే.. వేర్వేరు ఐడీ నెంబర్లతో కొన్ని , ఇంటి నెంబర్, భర్త/తండ్రి పేరు మార్పుతో కొన్ని, అడ్రస్ మార్పుతో మరికొందరి పేర్లు, ఒక పోలింగ్ కేంద్రంలో ఇంటి పేరు ముందు వస్తే... మరో పోలింగ్ కేంద్రంలో ఇంటి పేరు తర్వాత ఇలా ఎక్కడ, ఎటు అవకాశం ఉంటే అలా ఓటరు జాబితాలో బోగస్ ఓట్లు చేర్పించారు. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 31 వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో అడ్డుగోలుగా బోగస్ ఓట్లు చేర్పించేందుకు అధికార పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు బోగస్ ఓటర్లను చేర్పిస్తునే మరోవైపు జాబితాలో ఉన్న బోగస్ ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. జిల్లాలో డూప్లికేట్/ మల్టీపుల్ ఓటర్లు ఏకంగా 62,757 ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రత్యేక సాప్ట్వేర్ ద్వారా గుర్తించడం ఇందుకు నిదర్శనం. ఇంటింటి పరిశీలన చేపట్టి వీటిని తొలగించాలని కమిషన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు గత జూన్‌లో డూప్లికేట్/ మల్టిపుల్ ఓటర్ల వివరాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి విచారణ జరిపినట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో కేవలం 4,784 మందిని మాత్రమే గుర్తించి జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. డూప్లికేట్ దేశంలో ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రంలో ఉన్నా.. గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, దీని ద్వారా అలాంటి ఓటర్లను తొలగించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నా ఇదంతా ఒట్టిదేనని తెలుస్తోంది. సెప్టెంబరు 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో లక్షకు పైగానే బోగస్ ఓట్లున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటరు జాబితాతయారీకి డిప్యూటీకలెక్టర్ల కొరత ఓటర్ల జాబితా తయారీలో కీలకంగా వ్యవహరించే డిప్యూటీ కలెక్టర్(ఈఆర్వోలు) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 17 ఉండగా 14 పోస్టులను ఈఆర్వోలుగా ఎన్నికల కమిషన్ నోటిఫై చేసింది. అయితే 17 పోస్టుల్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బనగానపల్లి, పత్తికొండ, ఆలూరు, శ్రీశైలం నియోజకవర్గాలకు ఈఆర్వోలు లేరు. శ్రీశైలానికి రెవెన్యూ యేతర అధికారి ఈఆర్వోగా వ్యవహరిస్తున్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరిగే సమయంలో విధిగా ఎన్నికల కమిషన్ నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా, ఆగస్టులోనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏకపక్షంగా ఓటరు జాబితా తయారు చేయించుకోవాలనే లక్ష్యంతోనే డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేసీ–2, శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్, ఎస్ఎస్పీ ఎల్ఏ అండ్ ఆర్ఈహెచ్ డిప్యూటీ కలెక్టర్, అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే డిప్యూటీ కలెక్టర్లు ఈఆర్వోలుగా ఉన్నారు. ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఓటరు జాబితా అధికార పార్టీకి అనుకూలంగా తయారయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు 369 మంది అనధికార వ్యక్తులు బీఎల్ఓలుగా పనిచేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓటర్ల జాబితా ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఊహించవచ్చు. కర్నూలు139వపోలింగ్ కేంద్రంలో భారీగాబోగస్ ఓటర్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 139వ పోలింగ్ కేంద్రంలో పలువురికి వేర్వేరు ఐడీ కార్డులతో రెండు, మూడు ఓట్లున్నాయి. పార్వతీబాయి అనే మహిళ ఐడీనెంబర్ జెడ్‌జీఎఫ్ 2578235, 2578300తో రెండు ఓట్లు కల్గి ఉంది. ఈ పోలింగ్ కేంద్రంలో 100కుపైగా బోగస్ ఓటర్లున్నట్లు సమాచారం. చాంద్‌బాషా, ఎస్ఏ ఖలీల్, మరికొందరు మరణించినప్పటికీ ఓటర్లుగానే ఉన్నారు. -
అతడు ఆమె.. ఆమె అతడుగా మార్పులు
ఓటర్ల జాబితాలో అవకతవకలు చూస్తుంటే అధికార పార్టీనాయకుల సిఫార్సులకు అధికారులు కొమ్ము కాస్తున్నట్టుంది. ఓటర్ల జాబితాల్లో ఇష్టానుసారంగా మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. పురుషులను స్త్రీలుగాను, స్త్రీలను పురుషులుగాను మార్చేశారు.ఇంటిపేర్లను అటు ఇటుగా మార్చి రెండు మూడు చోట్ల ఓటు హక్కు కల్పించేలా చూశారు. ఒకే బూత్‌లో ఓటరు పేరు, తండ్రి పేరు, డోర్ నెంబరు ఒకేలా ఉంటూ.. వేర్వేరు ఐడీ నంబర్లు, వయసులతో ఓటరుకు రెండు నుంచి మూడు ఓటర్ కార్డులు జారీ చేశారు. సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఓటర్ల పేర్లు, ఇంటి పేర్లను కుడి ఎడమలుగా చేసి వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు పథక రచన చేశారు. ప్రస్తుత ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కళ్లు తిరిగే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. అయితే వీరి ఎత్తుగడతో జిల్లాలో వేలాది మంది తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో పడనున్నారు. పాయకరావుపేటలో1320 ఓట్లు పాయకరావుపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,24,492లు ఉండగా వీరిలో పురుషులు 1,10,961, స్త్రీలు 1,13,531 మంది ఉన్నారు. ఇక తప్పుడు ఓట్లు (ఒకే పేరు, తండ్రి పేరు మార్పు, లేదా వయసు మార్పు, లేదా ఒక ఓటరు పేరు స్మాల్లెటర్స్లో ఉంటే ఇంకొక చోట అవే వివరాలతో క్యాపిటల్ లెటర్స్తోను, ఫొటోలు మార్చి నమోదయినవి) ఏకంగా 1320 ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఏంటనేది అర్థమవుతోంది. ♦ పాయకరావుపేట మండలం పెంటకోటలో నాలుగు బూత్‌లలో 3,700 ఓట్లు ఉండగా వీటిలో వెయ్యి ఓట్లు ఒకే డోర్ నంబరుతో ఉన్నాయి. ఇదే గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయినా వారికి ఇక్కడ ఓట్లు పదిలంగా ఉంచారు. ♦ విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో 45 నుంచి 49వ వార్డుల్లో చాలా మంది ఓటర్లకు తమ పేర్లు జాబితాలో లేకపోవడం, ఉన్నవారికి మూడు, నాలుగు చోట్ల నమోదవడంతో ఒకే డోర్ నంబర్, ఒకే పేరుతో ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు ఓట్లున్నాయి. 48వ వార్డు ఇందిరాకాలనీ–1, బూత్ నంబరు 112, డోర్ నెంబర్ 63–2–146/3లో సుధీర్ సబ్బతి పేరుపై ఒక వ్యక్తి పొటో ఉంటే అదే డోన్ నంబర్, అదే చిరునామాపై సుధీర్ సబ్బాతి అనే పేరుపై మరో వ్యక్తికి ఓటు ఉంది. తొలి వ్యక్తి ఓటర్ కార్డులో ఓటరు భర్తపేరు లక్ష్మి సబ్బతి అనే ఉంటే రెండో వ్యక్తి ఓటర్ కార్డులో తండ్రి పేరు అర్జునరావు అని ఉంది. ఇదే వార్డులో సుమారు 20 మంది వైఎస్సార్సీపీ అభిమానుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకుండా చేశారు. గతంలో ఈ ప్రాంతంలోకి సర్వే పేరిట కొంతమంది స్థానిక టీడీపీ నేతలతో రావడంతో టీడీపీ అనుకూలురను జాబితాలో ఉంచి, ఇతర పార్టీల వారిని తొలగించారని స్థానిక ఓటర్లు చెబుతున్నారు. తవ్వే కొద్దీ వెలుగులోకి అక్రమాలు.. ఉత్తర నియోజకవర్గంలో సుజాత దార అనే మహిళ ఓటరు భర్త/తండ్రి పను రమేష్చందు దార అని పోలింగ్ బూత్ నెంబరు 183, సీరియల్ నెంబరు 403గా నమోదైంది. అదే ఓటరుకు తిరిగి తండ్రి/భర్త పేరు చందు (ఇంటి పేరు లేదు)గా పోలింగ్ బూత్ 183లో సీరియల్ నంబరు 894గా నమోదైంది. స్థానికంగా లేకపోయినాఓట్లు పదిలం.. ఇతర జిల్లాలకు తరలిన వెళ్లిన వారితో పాటు నగరంలోని వేరే చోట్లకు ఇళ్లు మారిపోయిన వారి ఓట్లు రద్దు చేయకపోగా వారికి మరిన్ని ఓటరు గుర్తింపు నంబర్లు ఇవ్వడం విడ్డూరంగా మారింది. వీరి ఓట్లకు సరిహద్దులే లేని విధంగా ఉన్నాయి. ♦ ఉదాహరణకు వార్డులోని 22వ బూత్‌లో లక్ష్మి నక్కా (బీజీవై 6208078) (డోర్ నంబరు 37–11–192 పట్టాభిరెడ్డి గార్డెన్స్) (వయసు 56) అనేపేరుతో ఉత్తర నియోజకవర్గంతోపాటు, ఆమె పేరు ఓటరు ఐడీ నంబరు సీవై జెడ్ 1554021తో నక్కాలక్ష్మిగా(వయసు 35) నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా)లో డోర్‌నంబరు 1–5లో నమోదైంది. ♦ బూత్ నంబరు 23లో భాగ్యలక్ష్మి బొట్ట(32)(ఐడీవై 1224138) డోర్ నంబరు 37–12–36/1గా పట్టాభిరెడ్డి గార్డెన్స్‌లో నమోదైంది. ఈమె పేరు డోర్‌నంబరు మారుస్తూ (5–401) విశాఖ తూర్పు బూత్ నంబరు 65లో నమోదు అయింది. ♦ కామాక్షినగర్‌లోని బూత్ నంబరు 42లో షేక్ ఖలీల్ భాషా (31), డోర్‌నంబరు 36–92–22, చాకలి గెడ్డ, ఓటరు ఐడీ నంబరు ఏసీకే 8383465, నమోదు కాగా అతని పేరు కొద్దిగా మారుస్తూ షిఫ్టెడ్ ఓటుగా ఖలీల్ భాషా షేక్ (30)గా డోర్‌నంబరు 4–69 మర్రిపాడులోని ఆత్మకూరులో (నెల్లూరు) నమోదైంది. ఖలీల్ భాషా షేక్ పేరును అటుఇటు తారు మారు చేస్తూ 8 ఓట్లు నమోదయ్యాయి. ♦ షిఫ్టెడ్ ఓట్లకు సంబంధించి టెక్కలి వెళ్లిపోయిన ప్రభావతి రోణంకి (ఎంజేడబ్ల్యూ 0928244) అదే నంబరుతో 25వనంబరు బూత్Œ లో ఉంది. ఆమె భర్త శ్యామలరావు (ఎంజేడబ్లు్య 0928251) పేరు కూడా రెండు చోట్ల ఉంది. ఎచ్చెర్లకు తరలి వెళ్లిన చెల్లా లక్ష్మి (38సం) (ఏపీ 030180039243)తో ఎచ్చెర్లో ఉండగా, ఉత్తర నియోజకవర్గంలోని బూత్‌నంబరు 36లో లక్ష్మి చెల్లా (43సం)గా బర్మా కాలనీలో (ఏసీకే 9019209) నమోదైంది. ఆమె పేరు చల్లా లక్ష్మిగా నెల్లిమర్లలో కూడా నమోదైంది. ఆమె పేరున ఆరు ఓట్లు ఉన్నాయి. నర్సీపట్నంలో అధికశాతం బోగస్ నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించి అధిక సంఖ్యలో బోగస్ ఓట్లను చేర్పించారు. నియోజకవర్గంలోని కొందరి ఓట్లు ఒకే పేరు, తండ్రి, భర్త పేర్లు ఒకేలా ఉంచి పొటోలు మార్చేశారు. నాతవరం మండలం వైబీ అగ్రహారానికి చెందిన ఓటరు జాబితాలో ఓటరు వనిమిన సూర్యకాంతం పొటోకు బదులుగా ఎవరో గుర్తు తెలియని పురుషుడి పొటో అమర్చారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం 210 పోలింగ్ బూత్‌లో నమ్మి దేముడమ్మ ఓటు ఉంది. వాస్తవంగా ఈ పేరు గల ఆమె ఊరులో లేదు. కానీ ఆమె పేరున ఇక్కడ ఓటరుగా చేర్పించారు. ఇదే పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీకి చెందిన ప్రస్తుత తాజా మాజీ సర్పంచ్ భర్త అసలు పేరు పోలిరెడ్డి రమణ కాగా ఓటు హక్కు లేకుండా చేసేందుకు ఓటరు జాబితాలో టీడీపీ నాయకులు రమణకు బదులు వెంకటరమణగా నమోదు చేయించారు. రెండు మూడు కార్డులు.. ఉత్తర నియోజకవర్గంలో ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు జారీ చేశారు. భర్త పేరు, వయసు, చిరునామా అంతా ఒకేలా ఉన్నా , రెండు వేర్వేరు పేర్లతో ఒకే వ్యక్తికి ఓట్లు ఇచ్చేశారు. జీవీఎంసీ 12వ వార్డు రామకృష్ణానగర్‌లో ఉంటున్న మహిళకు భారతి వూన, ధనలక్ష్మి వూన వేర్వేరు పేర్లతో రెండు ఓటరు కార్డులు జారీ చేశారు. భర్త పేరు, వయసు, చిరునామా ఒకటే ఉన్నాయి. ఏసీకే0764481, ఏసీకే0911685 వేర్వేరు ఐడీలతో కార్డులు ఉన్నాయి. ♦ 12వవార్డు శంఖువానిపాలెంలో ఉంటున్న మహిళలకు ఒకే పోలింగ్ బూత్‌లో ఏసీకే1039502, ఏసీకే1039486, ఏసీకే1039494 ఐడీలతో మూడు ఓటు కార్డులు జారీ అయ్యాయి. రెండు కార్డులలో వెంకట శివలక్ష్మి జ్యోత్స్నరెడ్డి, మూడవ కార్డులో వెంకట శివలక్ష్మి జ్యోత్స్న అని ఉన్నాయి. ఆమె భర్త పేరు పేరు మాత్రం ఒక్కో కార్డులో ఒక్కోలా ఉంది. వెంకట రవిశంకర్, రాఘవరపు వెంకట రవిశంకర్, రాంబాబు రెడ్డి ఇలా వేర్వేరుగా ఉన్నాయి. వయసు, చిరునామా ఒకేలా ఉన్నాయి. ♦ 12వ వార్డు శంఖువానిపాలెంకు చెందిన సతీష్‌కుమార్ ఆకుల పేరుతో రెండు ఓటరు కార్డులు జారీ చేశారు. తండ్రి పేరు, చిరునామా, ఒకటే ఉన్నాయి. ఏకేసీ1008812, ఏసీకే1002617 వేర్వేరు ఐడీలతో రెండు కార్డులు జారీ చేశారు. -
సర్వే పేరుతో ఓట్ల తొలగింపు
కర్నూలు, ఆదోని టౌన్: సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సూచించారు. ఆదోని పట్టణంలో బుధవారం సర్వే చేస్తున్న రెండు బృందాలను వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కొన్ని రోజులనుంచి 50 మంది సర్వే చేస్తున్నారన్నారు. సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సానుభూతిపరులని తేలితే ఓట్లను తొలగిస్తున్నారన్నారు. సర్వే పేరుతో ఇళ్లవద్దకు వచ్చే వారికి ఎలాంటి వివరాలు చెప్పవద్దని, ఆధార్, రేషన్‌కార్డులు చూపమని అడిగితే తమవద్ద లేవని సమాధానంగా చెప్పాలని ప్రజలకు సూచించారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, టీడీపీకి ఓటమి తప్పదని భావించే సీఎం చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఎవరైనా ఇంటివద్దకు వస్తే సమాచారం అందించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సర్వే బృందంపై ఫిర్యాదు సర్వే ముసుగులో ఓట్లను తొలగిస్తున్నారని టూ టౌన్ సీఐ భాస్కర్, వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు, త్రీ టౌన్ సీఐ శ్రీరాములుకు వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సర్వే చేస్తున్న యువకులపై తమకు సమాచారం అందించాలని, విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐలు.. వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలిపారు. ఆదోని పట్టణం ప్రధాన రోడ్డులోని లాడ్జీల్లో ఉంటూ యువకులు సర్వే చేస్తున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు దేవా, నల్లారెడ్డి, యూత్ నాయకుడు శ్రీనివాసరెడ్డి తెలుసుకున్నారు. లాడ్జిలలోని యువకుల వద్దకు బుధవారం వెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ సంస్థ తరఫున సర్వే చేస్తున్నారు.. ఐడీ కార్డు ఇవ్వాలని అడగగా..యువకులు ఎలాంటి ఆధారాలు చూపలేదు. దీంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే చేసున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సర్వేల పేరుతో ఓట్ల తొలగింపు
కర్నూలు, వెల్దుర్తి: జిల్లాలో కొందరు సర్వేలు చేస్తున్నామని చెబుతూ..ఓట్లను తొలగిస్తున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి సూచించారు. మండలంలో 20మంది గ్రూపులుగా విడిపోయి సోమవారం సర్వే చేస్తున్నారంటూ ఆమెకు సమచారం అందింది. దీంతో చెరుకులపాడు గ్రామంలో సర్వే చేస్తున్న ముగ్గురు యువకులను పిలిచి పూర్తిస్థాయిలో విచారణ చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఆరా తీశారు. వారి వద్ద ఏదో గ్రూప్ పేరుతో గల ఫోటో, పేరు, సంతకాలు లేని ఐడీలను గుర్తించారు. వారి వద్ద నున్న ట్యాబ్‌లు, ఫోన్లు, రికార్డులు పరిశీలించారు. సర్వే పేరుతో నియోజకవర్గంలోని ఓటర్ల వద్దకు వెళ్లి.. ఏ టీవీ చానల్ చూస్తున్నారు, ఏ పేపరు చదువుతున్నారు, ఏ పార్టీకి ఓటు వేస్తారు.. అని తెలుసుకుని అధికారపార్టీకి వ్యతిరేకంగా సమాచారమిచ్చిన వారి వివరాలు రికార్డులలో పొందుపరుచుకుంటున్నట్లు గుర్తించారు. అనంతరం వారు తమ ట్యాబ్‌లలోని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వైఎస్సార్సీపీ ఓటర్లను తొలగిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో కంగాటి శ్రీదేవి సర్వే చేస్తున్న యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మండలంలో సర్వే చేసేందుకు వచ్చిన పట్టణంలోని ౖప్రైవేట్ లాడ్జ్‌లో తిష్టవేసిన వారందరినీ స్టేషన్‌కు తరలించి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. దొంగ సర్వేల పేరుతో వచ్చే ఎవరికైనా ప్రజలు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని కోరారు. అనుమానం వచ్చిని వారిపై పోలీసులకు, రెవన్యూ అధికారులకు సమచారం అందించాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సర్వే పట్ల అప్రమత్తమై ఉండాలన్నారు. జిల్లా అధికారులు సైతం సర్వే చేస్తున్న వారిని పూర్తిస్థాయిలో విచారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు గుంటుపల్లె జనార్దన్ రెడ్డి, చెర్లకొత్తూరు శేఖర్, సూదేపల్లె వెంకటేశ్వరరెడ్డి, గోవర్ధనగిరి కేశవ్, ఎల్ నగరం రంగడు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసు సర్వే పేరుతో ఓటర్లను తొలగిస్తున్న వారిని వదిలేసి పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేశారు. తాము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్వే చేస్తుండగా విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కడప జిల్లాకు చెందిన దినేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎల్ బండ గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, చిన్నరంగడు, చెరుకులపాడుకు చెందిన లక్ష్మన్నపై కేసు నమోదు చేయడం బట్టి చూస్తే పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఎన్నారై.. ఎవరికి సై?
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా పాతబస్తీ నుంచి వేల సంఖ్యలో జనం విదేశాల్లో నివసిస్తున్నారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అంచనా ప్రకారం విదేశాల్లో ఉంటున్నవారిలో మొదటి స్థానంలో కేరళవాసులు ఉండగా, రెండో స్థానంలో పంజాబ్ ఉంది. మూడో స్థానంలో తెలంగాణవాసులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో వీరి ఓటు గెలుపు ఓటములను ప్రభావితం చేయనుందా.. ఏ పార్టీ వైపు వీరు మొగ్గు చూపనున్నారనే అంశం ఉత్కంఠగా మారింది. కాగా ఓటర్ జాబితాలో వీరి పేర్లు ఎన్నారైలుగా గుర్తించి లేవు. గతంలో ఓటర్ జాబితాలోని చివరి పేజీలో ఎన్నారైల సంఖ్య ఉండేది. ఇటీవల విడుదలైన జాబితాలో ఎన్నారై కాలమ్ లేకపోవడం గమనార్హం. అయితే వీరి పేర్లు ఓటర్ లిస్ట్‌లో వేరుగా లేకపోవడంతో బోగస్ ఓటింగ్ అయ్యే ప్రమాదం ఉందని పలు రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాలపై ప్రత్యేక కథనం. సుమారు ఇంటికి ముగ్గురు చొప్పున.. చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్‌పేట్, చార్మినార్, నాంపల్లి నియోజకవర్లాల్లోని పలు బూత్‌ల్లో సుమారు ఇంటికి సుమారు ముగ్గురు చొప్పున విదేశాల్లో ఉంటున్నారు. ఇది కేవలం చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో కాదు.. చార్మినార్, యాకత్పురా, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్, ఖైరతాబాద్, ఎల్బీనగర్తో పాటు గ్రేటర్‌లోని వివిధ నియోజవర్గాల ప్రజలు విదేశాల్లో ఉంటున్నారు. ఎమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 1.5 లక్షల మంది విదేశాల్లో ఉంటున్నారు. ఇందులో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం పాతబస్తీలోని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌నంబర్ 93 నుంచి 110లో ఎన్నారైలు అత్యధికంగా ఉన్నట్లు సాక్షి సర్వేలో తేలింది. దీంతో పాటు కార్వాన్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 116 నుంచి, 185 వరకు ఇదే నియోజకవర్గంలోని బూత్ నంబర్ 223 నుంచి 240 వరకు ఉన్న ఇళ్లలో ఉంటున్న వారు కూడా విదేశాల్లో ఉంటున్నారు. బోగస్లనుఅరికట్టడం కష్టమే.. ఓటరు లిస్టులో ఎన్నారై ఓటుగా నమోదు కాకపోవడంతో బోగస్ ఓట్లను అరికట్టడం కష్టమవుతుందని నియోజకవర్గాల ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఓటేసే వ్యక్తి పురుషుడై తే అతని ముఖం చూసి గుర్తు పట్టవచ్చని, మహిళ అయితే మాత్రం గుర్తించడం కష్టమేనని భావిస్తున్నారు. విదేశాల్లో ఉండే వ్యక్తులు ఎన్నారైలుగా ఓటరు లిస్ట్‌లో ప్రత్యేకంగా గుర్తించాలని, దీంతో బోగస్ ఓట్లను పోల్ కాకుండా చర్యలు తీసుకోచ్చని రిట్నరింగ్ అధికారుల అంచనా. పాస్‌పోర్టు చూపించి ఓటేయవచ్చు.. భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి అయినా విదేశాల్లో ఉంటే అతను తన ఓటును ఎన్నారైగా నమోదు చేసుకొవాల్సి ఉంటుంది. ఎన్నారైగా నమోదు అయి ఉంటే అతడు ఉంటున్న దేశంలో ఓటు వేసుకునే సౌకర్యం ఉంటుంది. ఒకవేళ అతడు విదేశాల్లో ఉండి కూడా ఓటు స్థానికంగా ఓటరు లిస్ట్‌లో నమోదు అయి ఉంటే అతని ఓటు వేరేవారు వినియోగించే అవకాశం ఉంటుంది. ఎన్నారైగా నమోదు చేసుకున్న ఎన్నికల సందర్భంగా అతడు స్వదేశానికి వచ్చి ఉంటే ఏ ప్రాంతంలో ఓటు ఉందో అక్కడి వెళ్లి తన పాస్‌పోర్టును చూపించి ఓటు వినియోగించుకోవచ్చు. ఎన్నారైల ఓట్లు యథాతథంగా.. పాతబస్తీలోని బార్కస్తో పాటు కార్వాన్‌లోని టోలిచౌకి, మలక్‌పేటలోని సైదాబాద్ తదితర ప్రాంతాలకు చెందినవారిలో విదేశాల్లో ఉంటున్న వారి పేర్లు ఓటర్ లిస్టులో ఎన్నారైలుగా నమోదై లేవు. అయినా వీరి పేర్లు యథాతథంగా ఓటర్ లిస్టులో ఉన్నాయి. 2009 కంటే ముందున్న ఓటర్ లిస్టును పరిశీలిస్తే అందులో చివర బూత్‌లో పురుషులు, మహిళలు, ఇతరులు ( థర్డ్‌జెండర్స్)లో పాటు ఎన్నారైలుగా వీరి పేర్లు స్పష్టంగా ఉన్నాయి. ఈ అక్టోబర్ 12న విడుదలైన ఓటరు లిస్ట్‌లో ఎన్నారై కాలమ్ లేకపోవడం గమనార్హం. ఎన్నారైల ఓట్లనువేరుగా గుర్తించాలి ఎన్నారైల ఓట్లు ఓటరు లిస్ట్‌లో వేరుగా నమోదు కాకపోవడంతో ఎన్నికల అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురి కానున్నారు. బోగస్ ఓట్లు వేసే ప్రమాదం ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాం. ఎన్నారైలను ఓటర్ లిస్టులో వేరుగా గుర్తించాలి. – అంజదుల్లాఖాన్ ఖాలిద్, ఎంబీటీ అధికార ప్రతినిధి -
ఒకే ఇంట్లో 202 ఓట్లు!
కూకట్పల్లి: ఓటర్ జాబితాలో తప్పులపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. అధికారులు వాటిని సరిదిద్దడంలేదు. ఇందుకు ఉదాహరణగా ఒకే ఇంట్లో 202 ఓట్లను నమోదు చేసిన ఘనత కూకట్పల్లి ఎన్నికల అధికారులకు దక్కింది. నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి ఇప్పటివరకు మనుషులు చేరకముందే అదే ఇంటి నెంబర్‌పై 73 ఓట్లను చేర్చారు. పిల్లర్ల నిర్మాణంలో మరో ఇంటిలో కనీసం పైకప్పు కూడా లేని ఇంటిలో 74 మంది ఓటర్లు ఉన్నారంటే ఎన్నికల అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో పోలింగ్ బూత్‌నెంబర్ 282లోని ఎం.ఐ.జి.15–25–890 ఇంటిపై 202 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో సీరియల్ నెంబర్ 497నుంచి698 వరకు ఉన్నాయి. ఈ ఇల్లు కేవలం రెండు ఫ్లోర్లు మాత్రమే ఉంది. ఇందులో ఐదు పోర్షన్లకు మించి లేవు. ఇలాంటి ఇంటిలో 202 మంది ఓటర్లు ఉన్నారా అంటూ చూసే వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇదే డివిజన్లోని 281 పోలింగ్‌బూత్‌లో 15–25–702 ఇంటినెంబర్‌పై సీరియల్ నెంబర్ 45 నుంచి 118 నెంబర్ వరకు ఓటర్లు ఉన్నట్లు లిస్ట్‌లో ఉంది. ఈ ఇల్లు నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం ఇందులో మనుషులే ఉండటం లేదు. నిర్మాణ చివరి దశలో ఉన్న ఈ ఇంటిలో 73 ఓటర్లను ఎలా ఉంచారో, ఏ విధంగా తనిఖీలు చేశారో ఇట్టే తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే ఇదే బూత్‌లోని 15–25–761 ఇంటి నెంబర్‌పై 74 మంది ఓటర్లు ఉన్నారు. సీరియల్ నెంబర్ 156 నుంచి 230 వరకు లిస్ట్ ఈ నెంబర్‌పై ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఇల్లు లేదు. ఇప్పుడే నిర్మాణం ప్రారంభమై పిల్లర్ల దశలోనే ఉంది. కనీసం పైకప్పు కూడా లేని ఈ ఇంటిలో 74 మంది ఓటర్లు ఎలా ఉన్నారని ఆశ్చర్యా¯నికి గురిచేస్తోంది. -
ఓటుకు ఆధార్ లింక్ చేస్తామంటూ..
కృష్ణాజిల్లా, అక్కపాలెం (తిరువూరు రూరల్) : ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం వచ్చామంటూ కొందరు యువకులు మండలంలోని అక్కపాలెంలో రెండు రోజులుగా హడావుడి చేస్తున్నారు. తాము రెవెన్యూ కార్యాలయం నుంచి వచ్చామని, ఓటరు గుర్తింపు కార్డులు పరిశీలించి ఓటు హక్కు కొనసాగింపునకు సిఫారసు చేస్తామని చెబుతుండటంతో స్థానికులు అనుమానించి తహసీల్దార్ కార్యాలయ అధికారుల్ని సంప్రదించారు. తాము ఓటర్ల జాబితా పరిశీలన విధులకు ఎవరినీ పంపలేదని, మోసపూరిత వ్యక్తుల్ని నమ్మవద్దని అధికారులు చెప్పారు. గ్రామ రెవెన్యూ అధికారి లేదా బీఎల్వోగా వ్యవహరించే అంగన్వాడీ కార్యకర్త మాత్రమే ఓటరు దరఖాస్తుల పరిశీలనకు వస్తారని రెవెన్యూ కార్యాలయ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఆ యువకుల్ని నిలదీశారు. వారిని తిరువూరు పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు అక్కపాలెం గ్రామస్తులు తెలిపారు. మందలించి పంపేశాం.. దీనిపై ఎస్ఐ మోహనరావును వివరణ కోరగా గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో వెళ్లి సంబంధిత యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించామని చెప్పారు. ఓటుకు ఆధార్, సెల్‌ఫోన్ లింక్ చేయించాలంటూ తమను అధికార పార్టీ బూత్ కమిటీ పంపిందని వారు చెప్పారని తెలిపారు. అయితే, గ్రామస్తుల అంగీకారం లేకుండా అలాంటి పనులు చేయకూడదని మందలించి పంపించేశామని చెప్పారు. -
వినుడు..వినుడు ఓట్ల కథ
సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని ఓటరు లిస్టులో గమ్మత్తు విషయాలు బయపడుతున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన వారి పేర్లు కూడా తాజా ఓటరు లిస్టులో అలాగే ఉన్నాయి. ఓ మతస్తుడి ఇంట్లో మరో మతానికి చెందిన వారి పేర్లు.. ఒకే నియోజకవర్గంలోని రెండు, మూడు పోలింగ్ బూత్‌లలో ఒకే వ్యక్తికి మూడు ఓట్లు నమోదు చేశారు. మరో ఓటరు పేరును అతడుండే ఇంటి నంబర్‌తో నమోదు చేయడంతో పాటు.. అదే ఇంటి నంబర్‌తో అదే వ్యక్తికి మరో నియోజకవర్గంలో సైతం ఓటు ఉండడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల ఓటరు లిస్టు తప్పుల తడకగా ఉంది. ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం వల్ల భారీగా తప్పులు దొర్లాయి. ఇదిలా ఉంటే.. సవరణలు సైతం అదేస్థాయి నిర్లక్ష్యంతో చేయడంతో తప్పులు పెరిగాయే కానీ ఏమాత్రం తగ్గింది లేదు. మరణించిన వారికీ ఓట్లున్నాయ్ నాంపల్లి నియోజకవర్గం వార్డు నంబర్ 12, సర్కిల్ నంబర్ 7లో పోలింగ్ బూత్ నంబర్ 16, సీరియల్ నంబర్ 152, ఇంటి నంబర్ 10–1–1148లో నివసించే ‘నబి షరీఫ్’ ఈ ఏడాది ఫిబ్రవరి 27న మరణించారు. జీహెచ్ఎంసీ సైతం మార్చి 3న మరణ ధృవీకరణ ప్రతం జారీ చేసింది. అయినా, ఇతని పేరు ఫొటో ఇంకా ఓటరు లిస్టులోనే ఉంది. ఈ ఏడాదే మరణించాడు కనుక ఓటరు లిస్టు నుంచి తొలగించలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ నాంపల్లి నియోజకవర్గం బూత్ నంబర్ 16, సీరియల్ నంబర్ 555, ఇంటి నంబర్ 10–1–1183లో నివసించే ‘రఫత్ ఉన్నీసా బేగం’ 2008 సెప్టెంబర్ 11న మరణించింది. ఆమె మరణించినట్లు జీహెచ్ఎంసీధృవీకరణ పత్రం కూడా జారీ చేసింది. ఇప్పుడు ఆమె పేరు కూడా తాజా ఓటరు లిస్టులో దర్శనమిస్తోంది. అంటే పదేళ్లుగా ఓటరు లిస్టు నుంచి పేరు తీయలేదంటే అధికారులు, సిబ్బంది ఓటరు నమోదు, సరవణలు ఎంత జాగ్రత్తగా చేశారో ఇట్టే అర్థం అవుతుంది. ఓటర్ల మతాలూ మార్చేశారు.. నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్ 11–1–889లో గంగారాం 40 ఏళ్లుగా ఉంటున్నారు. పైగా ఈ ఇంట్లో ఉంటున్నవారిలో 11 మందికి ఓట్లున్నాయి. అయితే, ఈ ఇంటి నంబర్‌పై ఓటరు లిస్టులో 40 ఓట్లు ఉన్నాయి. పైగా ఇక్కడ మరో మతానికి చెందిన ఐదుగురు వ్యక్తుల ఓట్లు సైతం నమోదు చేశారు. తమ ఇంట్లో వేరే మతస్తులు ఏనాడూ లేరని, పైగా 40 మంది ఓట్లు రాయడం దారుణమని గంగారాం కుమారుడు సన్ని యాదవ్ ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, ఓటరు లిస్టు నుంచి ఆయా పేర్లు తొలగించలేదన్నారు. తమ బూత్ నంబర్ 108 ఓటరు లిస్టులో బయటి వారి పేర్లు భారీగా ఉన్నాయని చెప్పారు. ఫొటో, పేరు మార్చి డూప్లికేట్ ఓట్లు నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్ 10–2–317/76లో నివసిస్తున్న ఎస్.మంజుల ఓటు బూత్ నంబర్ 28, సీరియల్ నంబర్ 645గా ఓటరు లిస్టులో ఉంది. బూత్ నంబర్ 25, సీరియల్ నంబర్ 630 కలీమాబేగం పేరుతో మంజుల ఫొటో పెట్టి డూప్లికేట్ ఓటు రూపొం దించారు. ఈ పోలింగ్ బూత్‌ను పరిశీలించగా ఇందులో ఉన్న ఇళ్ల నంబర్లన్నీ జీహెచ్ఎంసీ సీరియల్ నంబర్లకు భిన్నంగా ఉండడం గమనార్హం. న్యాయ పోరాటం చేస్తున్నాం.. నాంపల్లి నియోజవర్గం నుంచి 2009, 2014లో రెండు సార్లు పోటీ చేశాను. నాటి నుంచి నియోజకవర్గం ఓటర్ లిస్టును పరిశీలిస్తున్నా. 2009లో సుమారు 30 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించాం. ఈసారి మరీ పెరిగాయి. ఇంటి నంబర్లు లేని ఓట్లు, అపార్టమెంట్ పేరు లేని ఓట్లు, రెండు మూడు పోలింగ్ బూత్‌లలో ఒకే వ్యక్తి ఓట్లు, ఇతర నియోజకవర్గాల వ్యక్తుల ఓట్లు, జీహెచ్ఎంసీ వార్డు నంబర్ లేనివి ఇలా ఓటరు లిస్టులో నమోదు చేశారు. అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించాం. కోర్టుపై పూర్తి నమ్మకం ఉంది. న్యాయం మావైపే ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నా.– ఫెరోజ్‌ఖాన్, నాంపల్లి కాంగ్రెస్ నేత -
తప్పుల తిప్పలు
సాక్షి నెట్వర్క్: గ్రేటర్ పరిధిలో ‘చెక్ యువర్ ఓటు, నూతన ఓటర్ల నమోదు’ ప్రక్రియకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన లభించగా.. మరికొన్ని చోట్ల ఓటరు జాబితాలోని లోపాలు ఓటర్లను గందరగోళానికి గురిచేశాయి. నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఆదివారం అన్ని పోలింగ్‌బూత్‌లలో చేపట్టిన ఓటరు నమోదుకు అర్హులైన ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. జాబితాలో తమ పేర్లు పరిశీలించేందుకు యువ ఓటర్లు ఉత్సాహం చూపారు. అంబర్పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్ బహదూర్‌పురా తదితర నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం విజయవంతం కాగా.. కంటోన్మెంట్, మల్కాజ్గిరి తదితర నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితాలు గందరగోళానికి గురిచేశాయి. అంబర్‌పేటలో ఇలా.. నియోజకవర్గం పరిధిలో 234 బూత్‌లలో కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి జాబితాల్లో తమ ఓటు ఉందో లేదో పరిశీలించారు. తమ ఓటు హక్కు జాబితాలో క్రమసంఖ్య, పేజీ నెంబర్ తెలుసుకొని వెళ్లారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ నమోదును అర్హులైన వారు సద్వినియోగం చేసుకున్నారు. తమకు అందిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి వచ్చే ఎన్నికల్లోపు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని డీఎంసీ కృష్ణయ్య తెలిపారు. ఒక్కరోజు కా>ర్యక్రమంలో ఇక్కడ కొత్తగా సుమారు 1000 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ప్రక్రియను వివిధ పార్టీల నాయకులు సైతం పరిశీలించారు. కంటోన్మెంట్లో గందరగోళం ఈ నియోజకవర్గంలో ఓటరు నమోదు ప్రక్రియ గందరగోళానికి తెరలేపింది. జాబితా పరిశీలన కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందిని నియమించినప్పటికీ చాలాచోట్ల వారు ఆలస్యంగా వచ్చారు. ఉదయం 10 గంటలకు కేంద్రాలకు రావాల్సిన అధికారులు మధ్యాహ్నం అయినా రాకపోవడంతో ఓటర్లు అసహననం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 4, 5 వార్డుల్లో గతంలో నమోదు చేసిన ఓటర్ల పేర్లు లిస్టులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో తాము ఉన్న చోటు కాకుండా మకోచోట ఓటు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం తెలిసీ తెలియని వారితో ఓటరు నమోదు చేయించడం వల్లనే ఈ తప్పులు దొర్లాయని పలువురు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓల్డ్ వాసవీనగర్‌లో సీనియర్ సిటిజన్స్ ఆందోళనకు దిగారు. మల్కాజ్‌గిరిలోనూ అంతే.. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి పేర్లు కూడా నియోజకవర్గంలోని జాబితాల్లో మాయమయ్యాయి. ఇంట్లో ఇద్దరి పేర్లు ఉంటే మరో ఇద్దరికి లేవు. చనిపోయిన వారి పేర్లు సైతం జాబితాలో అలాగే ఉంచారు. మల్కాజిగిరి నుంచి వెళ్లిపోయిన వారి పేర్లు కూడా జాబితాలో దర్శనమిచ్చాయి. ఏడాది క్రితం ప్రత్యేక సిబ్బందికి ట్యాబ్‌లు అందజేసి ఇంటింటికీ సర్వే చేయించారు. అయినా జాబితాల్లో లోపాలు అలాగే ఉన్నాయి. బీఎల్ఓల నిర్లక్ష్యంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓల్డ్ మల్కాజిగిరికి చెందిన ఓ వృద్ధుడు ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. కానీ అతడి పేరు జాబితాలో అలాగే ఉంది. ఆర్కేనగర్కు చెందిన ఓ కుటుంబంలోని అందరి పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. సంజయ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి ఇద్దరు కుమార్తెలు ఆరేళ్లుగా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. వారి పేర్లు తొలగించమని ఇంటింటికి సర్వేకు వచ్చిన సిబ్బందికి చెప్పినా చర్యలు తీసుకోలేదు. మారుతీనగర్‌లో ఓ కుటుంబంలోని ఓటర్ల పేర్లు జాబితాలో రెండు సార్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇలాంటి తప్పులు కుప్పలుగా ఉన్నాయి. బహదూర్‌పురాలో బెటర్.. ఇక్కడి 261 పోలింగ్ బూత్‌లను రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆదివారం 1237 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్‌లో స్పందన భేష్.. నియోజకవర్గంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్లలో 237 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం జరిగిన చెక్ యువర్ ఓట్‌కు మంచి స్పందన లభించింది. చాలా మంది ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో నిర్థారించుకున్నారు. లేని వారు అప్పటికప్పుడు ఫారం–6 ఇచ్చారు. -
ముగిసిన తొలి ఘట్టం..
విజయనగరం గంటస్తంభం: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి తొలిఘట్టం ముగిసింది. ఓటర్ల నమోదు, తొలగింపులు, సవరణ, ఓటు బదిలీలకు సంబంధించిన గడువు గత నెలాఖరుతో ముగిసింది. మొత్తం రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో ఓటు నమోదుతో పాటు తొలగింపులకు సైతం భారీగా దరఖాస్తులు రావడం విశేషం. అయితే వీటి విచారణ పూర్తయిన తర్వాత ఎంతమంది ఓటర్లు చేరుతారు.. ఎంతమంది వైదొలుగుతారన్నది చూడాలి. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన విషయం విధితమే. ఇందులో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీన అంతకుముందున్న ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించి అదే రోజు నుంచి ఓటు నమోదుకు ఫారం–6, ఓటు తొలిగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు ఫారం–8, ఓటు నియోజకవర్గ అంతర్గత బదిలీకి ఫారం–8ఎ లను స్వీకరించారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీతో ముగిసింది. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు వాటిని పరిశీలించి, విచారణ చేసి అర్హత ఉన్న వాటిని పరగణలోనికి తీసుకుంటారు. వచ్చే నెలలో తుది జాబితా తయారు చేసి జనవరి 4న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. నమోదుకు భారీగా దరఖాస్తులు ఓటు నమోదుకు ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు నెలల్లో ఓటు కోసం ఏకంగా 68,755 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 49,409 మంది నేరుగా ఫారాలు కార్యాలయాలకు సమర్పించారు. మరో 19,346 మంది ఆన్లైన్ ద్వారా ఎన్నికల సంఘం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నారు. విచారణ తర్వాత కొన్ని దరఖాస్తులు తిరస్కరించినా అవి రెండువేల లోపే ఉంటాయి. అంటే కొత్తగా 66 వేల వరకు ఓట్లు పాత జాబితాకు కలుస్తాయి. తొలిగింపులకు 11 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. 11 వేల ఓట్లు పోయినా ప్రస్తుతం ఉన్న ఓటర్లకు 55 వేల ఓటర్లు అదనంగా కలుస్తారు. పాత ఓటర్లు 16.78 లక్షల వరకు ఉన్నందున కొత్తవి కలిస్తే జనవరి 4వతేదీ నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 17.33 లక్షలు దాటిపోనుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం జనాభాలో 70 శాతం మంది ఓటర్లు ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 23,44,474 మంది జనాభా ఉండగా ఎనిమిదేళ్లలో పెరుగుదల ప్రకారం 24,25,128 మంది ఉంటారని అధికారుల అంచనా. ఈలెక్కన జిల్లాలో 16,97,589 మంది ఉండాలి. అంటే జనాభా నిబంధన కంటే ఎక్కువ మంది ఓటర్లు భవిష్యత్‌లో ఉండడం విశేషం. ఒక విధంగా ఇది అనుమానించాల్సిన విషయమే. తొలిగింపులకు అంతే తొలిగింపులకు కూడా ఎప్పుడూ లేనంతగా దరఖాస్తులు రావడం విశేషం. ఈసారి దరఖాస్తుల స్వీకరణలో 11,588 దరఖాస్తులు రాగా ఇందులో నేరుగా కార్యాలయాల్లో ఫారం–7 ఆఫ్‌లైన్‌లో ఇచ్చిన వారు 10,915 మంది కాగా ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న వారు 673 మంది. అయితే రెండు రోజుల కిందట వరకు 4 వేల వరకు దరఖాస్తులు రాగా అఖరిలో ఏకంగా 11వేలకు చేరడం విశేషం. అధికార పార్టీ నాయకులు భారీగా దరఖాస్తులు ఇచ్చి వాటిని తొలిగించాలని కోరడంతో ఒకేసారి తొలిగింపులకు ఇన్ని దరఖాస్తులు వచ్చాయన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి జులై, ఆగస్టులో జరిగిన ఇంటింటికి సర్వే పక్రియలో ఏకంగా 14,359 ఓట్లు తొలిగించారు. తాజాగా వచ్చిన వాటిలో కొన్ని తిరస్కరించినా 10 వేలకు పైగానే తొలిగిస్తారు. అంటే ఈఏడాదిలో 24 వేలకు పైగా ఓట్లు తొలిగించడం అనుమానాలకు తావిచ్చే అంశం. దీనివెనుక ఏమి జరుగుతుందో గమనించాల్సిన అంశం ఓటర్లపై ఉంది. కావున ముందే అప్రమత్తమై ప్రస్తుతం అభ్యంతరాలు స్వీకరిస్తున్నందున తొలిగింపులపై కన్నెసి ఉంచితే ఓటు కోల్పోకుండా ఉంటారు. -
ఉంటుందా.. ఊడుతుందా.?
కడప కార్పొరేషన్: కడప, పులివెందుల, బద్వేలు నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే లక్ష్యంగా ఓట్లను తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని భావించి కడపలో గతంలో ఏకంగా లక్షా పన్నెండు వేల ఓట్లు తొలగించారు. ఇందులో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు ముప్పై ఐదు వేల వరకు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రెండేళ్ల క్రితం నగరపాలక సంస్థలో కొత్త డోర్ నంబర్లు ఏర్పాటు చేశారు. నగరాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే నాలుగు జోన్లుగా విభజించి ఈ డోర్ నంబర్లు కేటాయించారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్లకు నంబర్లు వేయకపోగా, రెండు, మూడు అంతస్తులు ఉన్న ఇంటికి గ్రౌండ్‌ఫ్లోర్‌కు మాత్రమే ఒకే డోర్ నంబర్ ఇవ్వడంతో పై రెండు అంతస్తుల్లో ఉన్నవారి ఓట్లు తొలగించారు. ఇలా కొత్త డోర్ నంబర్లు లేనిఇళ్లలో ఉన్న ఓట్లన్నీ ఎలాంటి విచారణ చేపట్టకుండానే తొలగించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు పలుసార్లు కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ బీఎల్ఓలను పంపించి విచారణ చేశారు. ఈ మేరకు కొన్ని ఓట్లు నమోదు చేయించారు. వైఎస్ఆర్సీపీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఓటు నమోదు కార్యక్రమాలు చేపట్టి ఆన్లైన్లో ఓట్లు నమోదు చేయించారు. ఇక కడప తహసీల్దార్ కార్యాలయానికైతే ఓటరు నమోదు ఫారాలు గుట్టలు, గుట్టలుగా వచ్చిపడ్డాయి. వీటి సంఖ్య సుమారు 40వేలుగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే వీటన్నింటిలో ఎన్ని ఓట్లు ఓటర్ల జాబితాలో నమోదవుతాయో తెలియడం లేదు. చెల్లాచెదురైన ఓట్లు: పోలింగ్ బూత్‌లను రేషన్లైజేషన్ చేయడం వల్ల గతంలో 245 పోలింగ్ బూత్‌లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 267 కు పెరిగింది. అలాగే ఒక డివిజన్లో ఓట్లు ఇతర డివిజన్లకు విసిరేయబడ్డాయి.ఉదాహరణకు అక్కాయపల్లె 47వ డివిజన్‌కు సంబంధించి 16,17,18,19 పోలింగ్ బూత్‌ల్లో ఉండాల్సిన ఓట్లు కొన్ని 12, 27 బూత్‌లలో ఉన్నాయి. 40వ డివిజన్ మరియాపురం, అరుంధతి నగర్లలోని ఓట్లు రామకృష్ణ కాలేజీ పోలింగ్ బూత్‌లో ఉన్నాయి. చెమ్ముమియ్యాపేటలోని కొన్ని ఓట్లు ఆలంఖాన్‌పల్లెలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఓటర్లు పోలింగ్ బూత్ ఎక్కడో కనుక్కోలేక గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్క ఓటును తొలగించాలన్నా చుట్టుప్రక్కల వారి అభ్యంతరాలు స్వీకరించి, విచారణ జరిపి నోటీసు ఇచ్చిన తర్వాతే తొలగించాలి. అయితే ఎలాంటి విచారణ చేయకుండా 1.12లక్షల ఓట్లను తొలగించడంపై వైఎస్ఆర్సీపీతోపాటు పలు పార్టీలు ఆగ్రహిస్తున్నాయి. కడప, పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఎక్కువ మెజార్టీ వచ్చినందునే ఓట్లను గుంపగుత్తగా తొలగించారని వారంటున్నారు. దీనిపై న్యాయపోరాటం కూడా చేసేందుకు సన్నద్ధవుతున్నట్లు తెలుస్తోంది. గడువు పెంచాలని కోరిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఓటరు నమోదుకు మరో మూడు వారాలు గడువు పెంచాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాలు ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చే శారు. అవగాహనరాహిత్యంతో చాలామంది ఓటు నమోదు చేసుకోలేక పోయారని ప్రజా ప్రయోజనార్థం గడువును పొడించాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. మరి ఎన్నికల కమిషన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. -
ఓట్ల గల్లంతు
ఓ వైపు ఓటర్లనమోదుపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొత్తగా ఓటర్ల చేర్పింపు ప్రక్రియ జోరుగాచేపడుతున్నారు. కానీ మరోవైపు చాపకింద నీరులా పాతవాటి తొలగింపు ప్రక్రియ కూడా అంతే జోరుగా సాగుతోంది. తాజా పరిస్థితులు ఓటర్లను ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిరంతరం జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో కాపలా కాసుకోవడానికీ సమయం కేటాయించాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతోంది. విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే వేలాది ఓట్లు తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చేర్పులు ఓ వైపు సాగుతుండగా ఇంతగా తగ్గుతున్నాయంటే దీనివెనుక అసలు కారణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓట్లు చాలా కీలకం. భారతీయ పౌరుడై 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి. అర్హులకు ఓటుహక్కు లేకపోతే, వారే ఓటువినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇం తటి కీలకమైన ఓటర్ల విషయంలో ఏమాత్రం తప్పు జరిగినా మెజార్టీ ప్రజల అభిప్రా యం ప్రతిబింబించదు. అంతేకాదు సరైన పాలకులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకా శం ఉండదు. కానీ జిల్లాలో అనేక మంది ఓట్లు జాబితా నుంచి ఆదృశ్యమవుతున్నాయి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 40,247 ఓట్లు తగ్గుదల 2014లో సాధారణ ఎన్నికల నాటికి జిల్లాలో 17,18,744మంది ఓటర్లు జాబితాలో ఉన్నా రు. అధికశాతం మంది ఓటుహక్కు కూడా వినియోగించుకున్నారు. ఈ సంఖ్య నాలుగేళ్లలో గణనీయంగా తగ్గింది. తాజాగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి 2018 సెప్టెంబర్ ఒకటోతేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన విషయం విదితమే. అందులో జిల్లాలో 16,78,497మంది ఓటర్లే ఉన్నట్టు తేలింది. అంటే జిల్లాలో 40,247 ఓట్లు తగ్గాయి. వాస్తవానికి ఏటా మృతి చెందిన, ఇతర ప్రాంతాల కు శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లను తొలగించడం సహజం. కానీ అదే సమయంలో ఓటర్లు చేర్పులు కూడా జరుగుతున్నందున సంఖ్యలో పెద్ద తేడా రాకూడదు. పైగా తొలగింపులు కంటే చేర్పులు ఎప్పుడూ ఎక్కువగా ఉంటున్నందున గత జాబితా కంటే కాస్తో కూస్తో పెరగాలి. కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే వేలాది ఓట్లు మాయం కావడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు సాలూరు నియోజకవర్గంలో స్వల్పంగా పెరిగి, నెల్లిమర్ల నియోజకవర్గంలో వందల్లో ఓట్లు తగ్గగా మిగతా నియోజకవర్గాలో భారీగా తగ్గడం గుర్తించాల్సిన అంశం. ఒకేసారి కాకుండా...: ఇన్ని ఓట్లు ఒకేసారి కాకుండా దశలవారీగా తొలగిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల తర్వాత ఈ మధ్య కాలంలో ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరగలేదు. దీనివల్ల ఓట్లు ఉన్నాయా? లేదా? అన్న విషయం ఓటర్లు తెలుసుకోలేదు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు లేనందున ఓటర్ల జాబితా సవరణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. బీఎల్వోలు స్థానికంగా లేకపోతే చాలు తీసేశారు. తాత్కాలికంగా వలస వెళ్లిన వారి ఓట్లు కూడా లేపేశారు. ఇక ప్రతిపక్షాలకు చెందిన సానుభూతిపరుల ఓట్లు అధికారపార్టీ నాయకులకు తలొగ్గి తీశారు. గుర్లమండలం చింతలపేటలో బీఎల్వో అధికారపార్టీ నాయకులకు ఒత్తిడికి తలొగ్గి వైఎస్సాఆర్సీసీ సానుభూతిపరుల ఓట్లు తొలిగించారని ఆపార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త జేసీకి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపుపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓట్ల తొలిగింపుపై అప్రమత్తంగా ఉండాలి. బుధవారంతో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఇతర దరఖాస్తులు స్వీకరణ గడువు ముగియడంతో గురువారం నుంచి అభ్యంతరాలు తెలపవచ్చు. ఈ అవకాశాన్ని పేర్లు గల్లంతైనవారు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనాభాకు తగ్గట్టుగానే ఓటర్లు ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభా అంచనా వేయగా అందులో 70శాతం ఓటర్లు ఈ ఏడాదికి ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఉన్న ఓటర్ల కంటే తగ్గే ప్రసక్తి లేదు. ఒకవేళ అప్పట్లో బినామీ ఓటర్లు, తర్వాత వలస వెళ్లిన వారి ప్రకారం అప్పట్లో ఎక్కువ ఉండొచ్చు. ఏదిఏమైనా పరిశీలిస్తాం. అనవసరంగా ఒక్క ఓటు తొలగిపోవడానికిగానీ, చేరడానికిగానీ లేదు. అలాంటిదేమైనా జరిగి ఫిర్యాదులు వస్తే తహసీల్దార్లు బాధ్యులవుతారు. – జె.వెంకట్రావు, డీఆర్వో, విజయనగరం -
మగ్గూరు జాబితా తప్పుల తడక!
శ్రీకాకుళం, వంగర: మండలంలోని మగ్గూరులో టీడీపీ నేతల బెదిరింపులకు బూత్ లెవెల్ అధికారు(బీఎల్ఓ)లు తలొగ్గారు. ఏ ఒక్క ఓటరును తొలగించవద్దని, వైఎస్సార్ సీపీ అభిమాన ఓటర్లను చేర్చవద్దని బీఎల్ఓలకు బెదిరింపులకు పాల్పడడంతో ఇంత వరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్క ఓటు నమోదు చేయలేదు. అలాగే గత పదేళ్లుగా ఓటర్లు జాబితా ప్రక్షాళన చేయకపోవడమే బీఎల్ఓలు ఇక్కడ టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అన్యాయంగా తప్పుడు ఓట్లును ఇంత వరకు కొనసాగించారనే విమర్శలు గ్రామ ప్రజల్లో నెలకొంది. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మగ్గూరు ఓటర్లు జాబితాను ప్రక్షాళన చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంలో మండల రెవెన్యూ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించడంపై రాజకీయ కోణం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నేతల ఒత్తిడే కారణం టీడీపీ నేతలు ఒత్తిడి కారణంగా తప్పుల తడకగా ఉన్న ఓటర్లు జాబితాను సవరణ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గత కొన్నేళ్లులో ఏ ఒక్క ఓటును కూడా సవరణ చేయకపోవడమే అధికార పార్టీ నేతల దుర్మార్గపు చర్యకు పరాకాష్టగా అభివర్ణించవచ్చునని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓటర్లు జాబితాలో 1400 ఓట్లకు పైగా ఉండగా అందులో 173 ఓట్లు తొలగించాల్సి ఉన్నాయి. మరణించిన ఓట్లు–67, పెళ్లి అయిన ఓట్లు–34, డబుల్ ఎంట్రీ–16, వేరే గ్రామంలో స్థిరపడిన వారు–35, గ్రామానికి సంబంధం లేనివారు–20 మంది ఉన్నారని, ఈ ఓట్లు తొలగింపునకు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు పోలిరెడ్డి రామకృష్ణ, కొచ్చెర్ల తవిటయ్య, బూరెడ్డి సంగంనాయుడు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండి పడుతున్నారు. ఉలిక్కిపడిన అధికారులు ఈ విషయంపై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత గంటా ఖగేంద్రనాయుడు ఒత్తి డి వల్లే ఓటర్లు జాబితా సవరణ జరగడం లేదని, ఇది అన్యాయమని, తక్షణమే జాబితా ప్రక్షాళన జరగాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు బీఎల్ఓల తీరును ఎండగడుతూ గ్రామంలో దర్యాప్తు నిర్వహించారు. ఓటర్ల జాబితాను పరిశీలించిన అనంతరం రెవెన్యూ అధికారులు అవాక్కయ్యారు. -
అయ్యా ! నేను బతికే ఉన్నా
పశ్చిమగోదావరి , నిడదవోలు: బతికి ఉండగానే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పేర్లను మృతి చెందారని పేర్కొంటూ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తీసెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. పట్టణంలోని ఒకటో వార్డు లింగంపల్లికి చెందిన నీరుకొండ అప్పలరాజు సాధారణ పౌరుడు. ఆయన బతికి ఉండగానే చనిపోయినట్లుగా జాబితా నుంచి పేరు తొలగించారు. దీంతో బాధితుడు తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకున్నారు. అయ్యా నేను బతికే ఉన్నాను. నా ఓటు పునరుద్ధరించండి అంటూ తహసీల్దారు ఎం. శ్రీనివాసరావుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మద్దిపాటి ఫణీంద్ర, అయినీడి పల్లారావులు విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఓట్లను టీడీపీ నాయకులు కావాలని తొలగిస్తున్నారని ఆరోపించారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని టీడీపీ నాయకులు రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం శోచనీయమన్నారు. -
ఓటర్ల జాబితాలో మళ్లీ లోపాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణలో తప్పులు దొర్లాయి. దాదాపు 25వేల మంది ఓటర్ల పేర్లు జాబితాలో పునరావృతమయ్యాయి. అయితే.. సాంకేతిక కారణాలతోనే తుది జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ శనివారం వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈఆర్వో నెట్ వెబ్సైట్లో ఈ జాబితాను ప్రచురించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. ‘వెబ్సైట్లో ఓటర్ల వివరాలను నమోదు చేసి ‘సబ్మిట్’బటన్ నొక్కినా.. ఆ కమాండ్ పూర్తి కాలేదు. దీంతో డీటీపీ ఆపరేటర్లు రెండు, మూడు సార్లు మళ్లీ సబ్మిట్ బటన్‌ను నొక్కారు. దీంతో ఓటర్ల పేర్లు జాబితాలో పునరావృతమయ్యాయి. దాదాపు 25 వేల మంది ఓటర్ల పేర్లు రిపీట్ అయినట్లు గమనించాం. ఈ విషయాన్ని సుమోటోగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో పునరావృతమైన పేర్లను తొలగించి వారం రోజుల్లో అనుబంధ ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురిస్తాం’అని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి ఆమ్రపాలితో కలసి ఆయన శనివారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఉర్దూలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరాఠీలో 3 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ప్రచురించాల్సి ఉందని, మరో నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్లు 11,81,827 గత నెల 10న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,61,36,776గా ఉండగా, తాజాగా ప్రకటించిన తుది జాబితాలో ఈ సంఖ్య 2,73,18,603కు పెరిగింది. రెండో సవరణ అనంతరం విడుదల చేసిన తుది జాబితాలో 1,37,87,920 మంది పురుషులు, 1,35,28,020 మంది మహిళలు, 2,663 మంది ఇతర ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 17,68,873 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోగా.. వివిధ కారణాలతో 5,87,046 మంది పేర్లను తొలగించారు. మార్పులు, చేర్పులు పూర్తయిన తర్వాత.. తుది జాబితాలో సరాసరిగా 11,81,827 మంది ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో వందేళ్లకు పైబడిన ఓటర్లు 2472 మంది ఉండటం గమనార్హం. నమోదులో మహిళలదే ఆధిక్యం! ఓటర్ల జాబితాలో మొత్తంగా పోల్చితే.. పురుషుల కన్నా మహిళల సంఖ్య తక్కువగా ఉన్నా, కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని రజత్‌కుమార్ పేర్కొన్నారు. 9,36,969 మంది మహిళలు, 8,31,472 మంది పురుషులు, 432 మంది ఇతరులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అదే విధంగా 18–19 ఏళ్ల వయసున్న వారిలో 3,22,141 మంది యువకులు, 2,53,247 మంది యువతులు, 112 మంది ఇతరులున్నారు. తుది ఓటరు జాబితాలో 3,01,723 మంది మరణించిన, 1,93,586 మంది పునరావృతమైన 91,737 మంది చిరునామా మారిన ఓటర్ల పేర్లను తొలగించారు. దీంతో తొలగించిన ఓటర్ల సంఖ్య 5,87,046గా నమోదైంది. బెల్ట్‌షాపులపై కఠినంగా.. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టుషాపులను మూసివేయాల్సిందేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖను ఆదేశించినట్లు రజత్‌కుమార్ తెలిపారు. మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ఇటీవల కొకైన్, గంజాయి సరఫరా ఎక్కువైందని.. వాటిపై ఉక్కుపాదం మోపాలని సూచించామన్నారు. అమల్లో ఉన్న పథకాలపై ఎన్నికల ప్రవర్త నియమావళి ప్రభావం ఉండదన్నారు. అయితే, సంక్షేమ పథకాలకు.. కొత్త లబ్ధిదారుల ఎంపిక జరపరాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ వర్తింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, అవసరమైతే ఈసీ వివరణ కూడా కోరతామన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతులు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుకు అనుమతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరముందని.. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రజత్ కుమార్ తెలిపారు. -
ఓటే ఆయుధం.. నమోదు ముఖ్యం
సాక్షి, అమరావతి: ఉత్తమ పాలన అందించే నేతలను ఎన్నుకోవడానికి ఓటే ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుని తన ఆశలను నెరవేర్చే నేతలను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలంటే ఓటు హక్కు తప్పనిసరి. ఓటుకు ఇంత ప్రాధాన్యం ఉన్నందున ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకుని లేకపోతే ఈనెలాఖరులోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓట్లు ఉన్నప్పటికీ ఏ కారణంగానైనా జాబితా నుంచి మీ పేరు తొలగించి ఉండవచ్చు. పొరపాటున/సాంకేతిక సమస్యవల్ల కూడా ఓటర్ల జాబితా నుంచి మీపేరు తొలగిపోయే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మీ పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదా వెంటనే చూసుకోవాలి. ఒక వేళ లేకపోతే ఆధార్‌కార్డు లేదా ఇతర ధ్రువపత్రాలు సమర్పించి మీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. యువతరం పాత్ర కీలకం వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటు హక్కునమోదుకు అరుŠహ్లే. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ వరకూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులంతా జనన ధ్రువీకరణ పత్రం లేదా తల్లిదండ్రులచే ధ్రువీకరణ పత్రం, తాజా ఫొటోతో సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారం–6 నింపి అక్కడి సిబ్బందికి సమర్పించి రసీదు తీసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను (ఫారం –6ను) డిప్యూటీ కలెక్టర్/ తహసీల్దారు/ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించవచ్చు. www.nvsp.in అనే వెబ్‌సైట్‌కు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణ కోసం ఈనెల 31వ తేదీ వరకూ ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. అనర్హులు జాబితాలో ఉంటే.. అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగించాలంటూ ఎవరైనా ఫారం–7ను సమర్పించవచ్చు. ఓటరు జాబితాలో పేరు రెండు చోట్ల ఉన్నా ఒకచోట తొలగింపునకు కూడా ఇదే ఫారం –7 దాఖలు చేయవచ్చు. ఓటరు జాబితాలో పేరు తప్పు ఉన్నా, తండ్రి/భార్య/భర్త పేర్లలో తప్పులు ఉన్నా సవరణ కోసం ఫారం–8 దాఖలు చేయవచ్చు. చిరునామాలో మార్పు కోసం కూడా ఇదే ఫారం సరిపోతుంది. ఒకే నియోజకవర్గంలో ఇల్లు మారినా.. ఉన్న పోలింగ్ కేంద్రం నుంచి కొత్త పోలింగ్ కేంద్రం పరిధిలోకి ఓటు మార్చుకోవాలన్నా కోసం ఫారం–8ఎ సమర్పించాలి. ఇప్పటికే నమోదైన ఉందో లేదో తెలుసుకోవాలంటే ceoandhra.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ల జాబితాలో పేరు చూసుకోవచ్చు. మిస్స్డ్ కాల్ ఇస్తే... ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలన్నా, కొత్తగా ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నా 8367797101కు మిస్స్డ్ కాల్ ఇస్తే సీఈవో కార్యాలయం నుంచి సూచనలతో కూడిన ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ సౌకర్యం ఈనెల 31వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్పీ సిసోడియా ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందుకు అర్హులందరికీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి’ అనే నినాదంతో మిస్స్డ్ కాల్ సదుపాయం ప్రవేశపెట్టామని సిసోడియా చెప్పారు. ప్రజలను ఓటు హక్కుపై చైతన్యపరచడం కోసం త్వరలో సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. -
ఓటరు వెల్లువ
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఓటరు జాబితా స్పెషల్ రివిజన్ కోసం కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు, చిరునామా మార్పులు తదితరాల కోసం సెప్టెంబర్ 25తో గడువు ముగిసింది. ఆ తేదీ నాటికి హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, గడువు ముగిశాక కూడా ఈ దరఖాస్తుల సంఖ్యపెరుగుతూనే ఉంది. ఈ వారంరోజుల్లో కొత్తగా 56,368 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొత్తగా ఓటరు నమోదుతో పాటు చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నప్పటికీ, 75 శాతం కొత్త ఓటరు కోసం వచ్చినవే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను అధికారులు ఇంకా ప్రారంభించలేదు. 25వ తేదీ గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించి, అర్హులైన వారివి జాబితాలో చేర్చారు. ఈనెల 8వ తేదీన తుది జాబితా వెలువరించాకే, గడువు తర్వాత అందిన వాటిని పరిశీలించనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారిలో 1.46 లక్షల మంది కొత్త ఓటర్లు కాగా, 16,889 మంది పొరపాట్ల సవరణకు దరఖాస్తు చేసుకున్నారు. మరణించిన వారు, స్థానికంగా లేనివారివి మరో 6755 దరఖాస్తులు ఉన్నాయి. ఇల్లు మారిన వారెందరో.. నగరంలో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లో ఉండడం తెలిసిందే. అలాంటి వారు తాము ఇల్లు మారిన ప్రతిసారి ఓటరు జాబితాలోనూ చిరునామా మార్చుకోవాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారిన వారి సంగతటుంచి, ఒక నియోజకవర్గంలోనే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారిన వారు 22,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే, స్థానికంగా ఒక చోట ఉండేందుకు అలవాటు పడిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక, పిల్లల చదువులు తదితరమైన వాటి దృష్ట్యా అదే ప్రాంతంలో ఇతర ఇళ్లకు మారుతున్నారు. కోర్ సిటీలోనే ఇంతమంది ఉండగా, గ్రేటర్ మొత్తంలో ఇలాంటి వారు 50వేల మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలన పూర్తి ఓటర్ల జాబితాపై అభ్యంతరాల పరిశీలన పూర్తయిందని, ఈమేరకు జాబితాను రూపొందించి, కొత్తగా ఓటర్లయిన వారి వివరాల జాబితా ప్రచురణ 7వ తేదీకి పూర్తవుతుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) జయరాజ్ కెన్నెడి తెలిపారు. 8వ తేదీన తుది జాబితాలను వెల్లడించనున్నట్లు ఆయన వివరించారు. -
హైదరాబాద్‌లో ఒక ఇంట్లో ఒకే ఓటరు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల జాబితాల్లో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓటర్లున్న విచిత్రాలు బహిరంగం కాగా, ఒక ఇంట్లో కేవలం ఒకే ఓటరున్న ఇళ్లు కూడా తక్కువేం లేవు.హైదరాబాద్ జిల్లా పరిధిలోని దాదాపు 10.36 లక్షల ఇళ్ల ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్(ఐఆర్‌ఈఆర్)లో ఇలాంటి వారి సంఖ్య 4.64 లక్షలుగా ఉంది. అంటే దాదాపు 45 శాతం మంది ఒంటరి ఓటర్లే. జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఇంటింటికీ సర్వే చేసి పొరపాట్లు సరిదిద్దినట్లు పేర్కొన్నప్పటికీ, చాలా వరకు సర్వేలు సరిగ్గా జరగలేదని వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇటీవల రాజకీయ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేత పి. వెంకటరమణ ఈ విషయాలు వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది మొక్కుబడి తంతుగా జాబితాల సవరణ చేస్తున్నందునే ఓటరు జాబితాలో పొరపాట్లుంటున్నాయని పలువురు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు ఉండటం మాత్రమే ఇప్పటి వరకు వెల్లడికాగా, ఒక ఇంట్లో ఒక్క ఓటరు మాత్రమే ఉన్న ఇళ్లు కూడా భారీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
పొర‘పాట్లు’ లేకుండా ఓటరు జాబితా!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీ చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఒకే వ్యక్తి పేరు రెండుచోట్ల, ఒకరి పేరు దగ్గర మరొకరి ఫొటో ఉంటే తొలగించడంతోపాటు అర్హులైనవారి ఓట్లు, ముఖ్యంగా వీఐపీలవి గల్లంతు కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందుకుగాను తొలిసారిగా రెవెన్యూ సేవల్ని కూడా వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి నేతృత్వంలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, 15 మంది తహసీల్దార్లు, 100 మంది వీఆర్వోలు జిల్లాలోని ఓటర్ల జాబితాను జల్లెడ పట్టనున్నారు. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారి పేర్లను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుతో కలసి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ నిర్వహించిన రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో 1,22,700 మంది మరణించినట్లు రికార్డులు తెలుపుతుండగా, వీరి ఓట్లూ తొలగించలేదు. కొత్తగా ఓటు హక్కు పొందేవారు సాధారణంగా జనాభాలో 3.75 శాతం ఉండగా, ఆ మేరకు నమోదు కాలేదు. వీటిపై కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోనున్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ దానకిశోర్ ఈ వివరాలు వెల్లడించారు. ‘ముసాయిదా జాబితాలను మూడురోజులు పరిశీలించాక, గుర్తించిన లోపాల్ని సరిదిద్దేందుకు ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళతారు. ఒక్కరికే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే తొలగిస్తారు. ఇతర జిల్లాల పరిధిలో ఉన్నా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఇటీవల అందించిన ఆధునిక సాఫ్ట్వేర్ ఇ.ఆర్.ఓ నెట్ 2.5 ద్వారా గుర్తిస్తారు. నోటీసులు అందజేసి ఓటరు కోరుకున్న చోట మాత్రమే ఉంచి, మిగతా చోట్ల తొలగిస్తారు. ఈ ప్రక్రియను హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్‌రావు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి పర్యవేక్షిస్తార’ని తెలిపారు. నూతన ఓటర్ల నమోదు, చిరునామా మార్పిడి, అనర్హుల తొలగింపు తదితర అంశాలపై సందేహాల నివృత్తి కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 15 లైన్లతో టోల్ ఫ్రీ నంబర్ 1800–599–2999ను శనివారం నుంచే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకు నగరంలో 600కుపైగా ఉన్న సీనియర్ సిటిజన్ క్లబ్‌ల సహకారం తీసుకుంటామన్నారు. దివ్యాంగ ఓటర్ల పేర్లూ నమోదు చేయడంతోపాటు పోలింగ్ బూత్‌ల్లో వారు ఓటేసేందుకు ర్యాంపులు, తదితర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో వెయ్యి వీఐపీ ఓట్ల పరిశీలన.. ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి మంది వీఐపీల ఓట్లను ఎన్నికల సిబ్బంది పరిశీలిస్తారని దానకిశోర్ చెప్పా రు. ఓటరు జాబితాలో వారి పేర్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూడటంతోపాటు ఫొటోలు, చిరునామా సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారన్నారు. ఇప్పటి వరకు పేర్ల నమోదు, చిరునామా మార్పిడి తదితర అంశాలకు సంబంధించి ఆయా ఫారాల ద్వారా 6,680 క్లెయిమ్లందాయని, ఇవి కాక ఆన్లైన్ ద్వారా అందాయన్నారు. ఓటరు చైతన్య ప్రచార రథాలు ఓటర్ల నమోదు, సవరణతోపాటు అర్హులైన వారందరూ పోలింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు ఓటరు చైతన్య ప్రచార రథాలను ఏర్పాటు చేయనున్నట్లు దానకిశోర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఆధునిక సాంకేతికతతో కూడిన ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్లూ వినియోగిస్తారని, దీంతో ఓటరు తాము వేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవచ్చన్నారు. -
‘ఉచిత’ హామీలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో వ్యక్తిగత లబ్ధి కలిగించే ఉచిత హామీలు ఉండరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాతే ఏ అంశంలోనైనా చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లభిస్తుంది. అయితే ఒక్క మేనిఫెస్టో విషయంలో మాత్రం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందు కూడా చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఉండాలి. పార్టీలు తమ ముసాయిదా మేనిఫెస్టోలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి ఏవైనా ఉల్లంఘనలు ఉంటే మేనిఫెస్టోలను సవరించాలని కోరుతుంది’’అని వెల్లడించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లను వేగవంతం చేశామని రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు చట్టబద్ధంగా పూర్తి చేయాల్సిన ఓటరు జాబితా రూపకల్పన, ఈవీఎం యంత్రాల సమీకరణ, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతి భద్రతల ఏర్పాట్లు తదితర అంశాలపై సంతృప్తి చెందిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఈ క్రమంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించిందని, ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత మళ్లీ అధికారుల బృందాన్ని పంపించి అధ్యయనం జరపనుందని తెలిపారు. ఏర్పాట్లపై సంతృప్తి చెందితేనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్నారు. లేని పక్షంలో లోపాలను సరిదిద్దాలని కోరుతుందని, అనంతరం మరోసారి అధికారుల బృందాన్ని పంపిస్తుందని చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిరంతర సమీక్ష నిర్వహిస్తోందని, కొన్ని అంశాల్లో ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష సమీక్ష జరుపుతోందని వెల్లడించారు. రాజకీయ పార్టీలకు అనుమతుల జారీ ప్రక్రియపై ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో ఇకపై ఆన్లైన్ చేశామని, ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి ముందు అనుమతులిస్తామని తెలిపారు. ఓటర్ల నమోదుకు భారీ ప్రచారం రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో 32,574 పోలింగ్ స్టేషన్లున్నాయి. ప్రతి బూత్‌లో సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) రోజూ విధులకు హాజరై ప్రజలకు సహకరించాలని ఆదేశించాం. ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటర్ల జాబితాలను పంపిణీ చేశాం. వారి నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు రాజకీయ పార్టీలు సైతం బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి’’అని ఆయన కోరారు. ఓటర్ల నమోదు కోసం ఈనెల 15, 16 తేదీల్లో భారీ ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో స్థానిక పోలింగ్ బూత్‌లలో ఓటర్ల జాబితాలను చదివి వినిపిస్తారని తెలిపారు. ఫిర్యాదులు, ఓటరు నమోదు దరఖాస్తులను బీఎల్ఓలు తొలుత పరిశీలిస్తారని, అనంతరం సహాయ రిటర్నింగ్ అధికారులు సంతృప్తి చెందితేనే అంగీకారం తెలుపుతారన్నారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఓటరు జాబితా సవరణ కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఒక్కో బూత్ స్థాయిలో 14 వందల ఓటర్లు ఉన్నారని, ఈ సారి పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్త ఈవీఎంలతో ఎన్నికలు రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని రజత్ కుమార్ వెల్లడించారు. ‘‘ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ పాట్ యూనిట్ అనే మూడు పరికరాలుంటాయి. 52,100 బ్యాలెట్ యూనిట్లు, 40,000 కంట్రోల్ యూనిట్లు, 44,000 వీవీ పాట్ యూనిట్లు రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక బ్యాలెట్ యూనిట్లో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థుల పేర్లకు చోటు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తొలిసారిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ పాట్) యంత్రాలను వినియోగిస్తున్నాం. యంత్రాలు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీల సమక్షంలో ప్రాథమిక స్థాయి తనిఖీలు నిర్వహించి పనితీరు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతనే ఎన్నికల్లో వినియోగిస్తాం. ఓటు వేసిన వెంటనే వీవీ పాట్ యూనిట్ డిస్ప్లే స్క్రీన్‌పై ఏడు క్షణాలపాటు ఎవరికి ఓటు వేశామో కనిపించి మాయం అవుతుంది. ఒకవేళ ఓటు వేరే అభ్యర్థికి పడినట్లు స్క్రీన్ మీద కనిపిస్తే వెంటనే ఓటర్లు పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. పోలింగ్ అధికారి ఈవీఎంను పరీక్షించి చూస్తారు’’అని వివరించారు. 1982 నుంచి దేశంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారని, అనుమానాలు వద్దని అన్నారు. ఈవీఎంలపై ఇప్పటి వరకు కోర్టుల్లో 37 కేసులు నడిచాయని, అన్ని కేసుల్లో ఈవీఎంలకు అనుకూలంగా తీర్పులొచ్చాయని తెలిపారు. ఏ ఈవీఎం ఎక్కడికి వెళ్తుందో చివరి వరకు ఎవరికీ తెలిసే అవకాశం లేదని చెప్పారు. ఈనెల 20లోగా అన్ని జిల్లాలకు ఈవీఎంలు చేరుతాయని, ఆ తర్వాత ప్రతి పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. మన పోలీసులు సరిపోతారు... ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలీసు బలగాలు రాష్ట్రంలో ఉన్నాయని, కేంద్ర బలగాల అవసరం రాకపోవచ్చని రజత్ కుమార్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి పెద్ద ఘటనలు జరగలేదని, సాధారణ నేరాలు సైతం తక్కువగానే ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు భద్రత మ్యాప్, ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. బలహీన వర్గాలుండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఏడు జిల్లాల్లో తీవ్రవాద ప్రాబల్యముందని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, అవసరమైతే కేంద్ర బలగాలను వినియోగించుకుంటామన్నారు. రౌడీలను బైండోవర్ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా రూ.76 కోట్లను జప్తు చేశారని చెప్పారు. మొబైల్ టీంలతో అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెడతామన్నారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే సైబర్ క్రైం పోలీసుల సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో ఫిర్యాదుల స్వీకరణకు అన్ని జిల్లాల్లో 1950 నంబర్‌తో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో విలీనమైన ఏడు మండలాల విషయంలో నియోజకవర్గాల పునర్విభజన జరపాలన్న అంశంపై ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు. కోడ్ వస్తే రైతుబంధుపై పరిశీలన ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రధాన కార్యదర్శుల స్థాయి అధికారుల కమిటీ పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్యక్రమాలను నిలుపుదల చేయాలని కోరుతుందని రజత్ కుమార్ తెలిపారు. వచ్చే రబీ సీజన్ కోసం రైతులకు ప్రభుత్వం అక్టోబర్ నుంచి రైతుబంధు కార్యక్రమం కింద డబ్బు పంపిణీ చేయనుందని విలేకరులు ప్రశ్నించగా, ఆయన పైవిధంగా స్పందించారు. కమిటీ పరిశీలించిన తర్వాతే చర్యలుంటాయన్నారు. గత ఎన్నికల్లో నమోదైన పెండింగ్ కేసుల విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలితే ఎన్నికల్లో పాల్గొనకుండా అభ్యర్థులపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. -
తక్షణమే ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల నమోదు అర్హత తేదీ 2019 జనవరి 1 గడువుతో రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2019’ను రాష్ట్ర శానససభ రద్దయిన నేపథ్యంలో తక్షణమే నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు, అభ్యంతరాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు కీలక సూచనలు చేసింది. ఓటరుగా నమోదుకు 2018 జనవరి 1, 2019 జనవరి 1 తేదీల నాటికి అర్హత సాధించే వ్యక్తుల దరఖాస్తులు, అభ్యంతరాలను రెండుగా విభజించాలని ఆదేశించింది. 2018 జనవరి 1 నాటికి అర్హత సాధించే వ్యక్తుల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు.. ముందస్తు ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ‘రెండో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2018’కింద ఓటు హక్కు కల్పించాలని కోరింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా 2019 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిలుపుదల చేసి, 2018 జన వరి 1 అర్హత తేదీగా తక్షణమే ‘రెండో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2018’ను ప్రారంభించాలని ఆదేశిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి అర్హత సాధించిన వ్యక్తులు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2019 కింద దరఖాస్తు చేసుకొని ఉంటే మళ్లీ తాజాగా నిర్వహిస్తున్న 2018కి సంబంధించిన రెండో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉత్పన్నం కావద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అనంతరం పునరుద్ధరించనున్న 2019 సంబంధించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కింద 2019 జనవరి 1 నాటికి అర్హత సాధించే వ్యక్తులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలని కోరింది. తొలగింపు జర భద్రం! - ముందస్తు ఎన్నికల కోసం నిర్వహిస్తున్న 2018కి సంబంధించిన రెండో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కింద ఓటర్ల తొలగింపులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతే చనిపోయిన, చిరునామా మారిన, డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని కోరింది. - ఒకటికి మించిన ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కలిగిన వ్యక్తుల ఓట్లను తొలగించినప్పుడు ఆయా వ్యక్తుల నుంచి అదనంగా ఉన్న ఎపిక్ కార్డులను వెనక్కి తీసుకుని వాటి రికార్డులను భద్రపరచాలి. - ఓటరు జాబితా డేటాబేస్‌లో ఆధారంగా తొలగించిన ఓటర్లకు పోస్టు/ఈ–మెయిల్/సెల్‌ఫోన్ ద్వారా సమాచారమివ్వాలి. - ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్న ఓటర్ల పేర్లతో జాబితాను రూపొందించి వారం ముందు ఓటరు నమోదు అధికారి తన కార్యాలయం గోడలపై అతికించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్‌సైట్‌పై మీద ఈ జాబితాలను ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు స్వీకరించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సైతం ఈ జాబితాలను అందించాలి. - తొలగింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత తొలగించిన తుది ఓటర్ల జాబితాలను సైతం రాజకీయ పార్టీలకు ఇవ్వాలి. - ఓటర్ల తొలగింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఈ కేసుల్లో ప్రత్యేక పరిశీలన.. - మరణం మినహా ఇతర ఏ కారణాలతోనైనా ఒకే పోలింగ్‌స్టేషన్ పరిధిలో 2 శాతానికి పైగా ఓటర్లను తొలగిస్తే ప్రతి కేసును తహశీల్దార్, ఆపై స్థాయి అధికారి ప్రత్యేక పరిశీలించాలి. - ఒకే వ్యక్తి ఐదుకి మించిన కేసుల్లో అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రత్యేక పరిశీలన నిర్వహించాలి. - 2 శాతం కేసులను ఉప జిల్లా ఓటరు నమోదు అధికారి క్రాస్ చెక్ చేయాలి. 1 శాతం కేసులను జిల్లా ఎన్నికల అధికారి, 0.5% కేసులను ఎన్నికల పర్యవేక్షణాధికారి క్రాస్ చెక్ చేయాలి. ప్రముఖుల ఓట్లు ప్రత్యేకం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కళలు, జర్నలిజం, క్రీడలు, న్యాయాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ వ్యక్తుల ఓట్లను తొలగించడానికి వీల్లేకుండా ఓటర్ల జాబితా డేటాబేస్‌లో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. -
పరిషత్ ఎన్నికలు ఎట్లా..?
సాక్షి, మంచిర్యాల : పంచాయతీలతో పాటు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సైతం నిర్వహించేం దుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోం ది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ, జిల్లా పరిషత్‌ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన గెజిట్‌ను విడుదల చేయకపోవడంతో పాత ఆదిలాబాద్ స్థాయిలోనే జెడ్పీ కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా పరిషత్‌లు నామమాత్రంగానే తయారయ్యాయి. నామ్కేవాస్తే సమావేశాలు మినహా అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి ముందడుగు లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులను జిల్లా పరిషత్‌లకు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో 2016 నుంచి జెడ్పీల ద్వారా అభివృద్ధి పనులు ఆగిపోయాయి. అదే ఏడాది అక్టోబర్‌లో కొత్త జిల్లాలను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉన్న జెడ్పీ స్వరూపమే మారిపోయింది. ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు సంబంధించి జెడ్పీల విషయంలో ప్రభుత్వం గెజిట్ సైతం విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలతోపాటు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుండడం చర్చనీయాంశమైంది. జూలై 2019 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ఉన్నప్పటికీ, దాదాపు ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏమిటో నాయకులకు అర్థం కావడం లేదు. ఉమ్మడి జిల్లా యూనిట్‌గానే ఎన్నికలా..? జిల్లా పరిషత్‌లకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త విధివిధానాలు రాలేదు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదు. దీనికి సంబంధించిన గెజిట్ కూడా విడుదల కాని నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు అనేది ఇప్పట్లో అనుమానమే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి. జిల్లాల పునర్విభజన తరువాత అవి 70కి పెరగడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఎన్నికలు జరిగితే ఈసారి 70 మంది జెడ్పీటీసీలు, 70 మంది ఎంపీపీలు జిల్లా పరిషత్‌లో కొలువు తీరుతారు. ఒకవేళ ప్రభుత్వం కొత్త జిల్లాల వారిగా జిల్లా పరిషత్‌లను నోటిఫై చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగు జిల్లా పరిషత్‌లు ఏర్పాటవుతాయి. కానీ కొత్త జిల్లాల వారీగా పరిషత్‌ల ఏర్పాటు ఇప్పట్లో వీలుకాదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకపోయినా.. తీరా జెడ్పీటీసీల నుంచి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను ఏ ప్రాతిపదికన ఎన్నుకుంటారనేదే ఇప్పుడు ప్రశ్న. సిద్ధమవుతున్న గ్రామాల ఓటర్ల జాబితా కొత్త పంచాయతీ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు దిశానిర్ధేశం చేశారు. ఈనెల 30న అన్ని గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని మే 17న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. దీనిని బట్టి జూన్‌లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో అయోమయం చివరిసారిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2014 ఏప్రిల్‌లో జరిగాయి. అయితే అప్పటికే తెలంగాణను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూలైలో జెడ్పీలు కొలువుతీరాయి. అంటే జూలై 2019 వరకు ప్రస్తుత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొనసాగే అవకాశం ఉంది. అయినా ఏడాది ముందుగానే ఈ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయడం వెనుక మతలబు ప్రభుత్వానికే తెలియాలని ఆసిఫాబాద్ జెడ్పీటీసీ కొయ్యల ఏమాజీ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల విషయంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతగా ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంది. సాధారణ ఎన్నికల ముందు స్థానిక పంచాయతీ పెట్టుకుంటే సమస్యలు ఎదురవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే వర్గ పోరాటాలు, కుమ్ములాటలతో అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఉత్సాహంతో కనిపిస్తున్నప్పటికీ, ఆ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలకు కొదువ లేదు. బీజేపీ వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే కొన్ని మండలాల్లో ఉనికి చాటుకుంటోంది. టీడీపీ కనుమరుగు కాగా, కొత్త పార్టీలు తెలంగాణ జన సమితి, జనసేన పరిస్థితి అంచనా వేయలేం. -
పంచాయతీ ఎన్నికలనిర్వహణకు అడుగులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వచ్చే ఆగస్టు నాటికి గ్రామపంచాయతీ పాలకవర్గాల పద వీకాలం ముగియనుంది.. అయితే, అంతకు ముందే లేదా ఆ వెంటనే ఎన్నికలు నిర్వహి స్తారా? లేక ఆలస్యమవుతుందా? అంటూ ఇంతకాలం ఉన్న అనుమానాలకు తెరపడినట్లే! అధికారుల హడావుడి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను పరిశీలిస్తే నిర్ణీత సమయంలోగానే ఎన్నికలు జరుగుతాయని భావించాల్సి వస్తోంది.. పంచాయతీల వారీగా వార్డులు, ఓటర్లను విభజించి జాబితాలు రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గత కొంత కాలంగా ఉన్న ఉత్కంఠతకు తెర పడినట్లయింది. 2013 ఆగస్టు 2వ తేదీన పాలకవర్గాలు ఏర్పడిన విషయం విదితమే. గడువులోగా ఎన్నికలు పూర్తి చేసి పాత పాలకవర్గాల పదవీకాలం ముగియనేగా కొత్త పాలకవర్గాలు కొలువు దీరేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుండగా.. ఆ మేరకు ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కొత్త, పాత పంచాయతీలకు కలిపి ఒకే సారి ఎన్నికలునిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 30వ తేదీన గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురిస్తారు. మే 1వ తేదీన గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై జాబితాలపై చర్చించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 3వ వ తేదీన మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించచాక మే 1నుంచి 8వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వార్డు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 10వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సరిచేశాక 17వ తేదీన తుది ఓటరు జాబితాలను విడుదల చేయనున్నారు. జాబితా తయారీకి కసరత్తు... ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాగం ఓటర్ల వివ రాల సేకరణలో నిమగ్నమైంది. ఇప్పటికే ఓటరు న మోదు ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల నాటికి పూర్తి ఓటరు జాబితా విడుదల కానుంది. కాగా, 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్న అధికార, విపక్ష పార్టీలకు సర్పంచ్ ఎన్నికలు కీలకం కానున్నాయి. గ్రామ స్థాయి నుంచే ప్రజల మద్దతు కూడగట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లోపు బలపడాలని భావిస్తున్నారు. 265 కొత్త పంచాయతీలు జిల్లాలో కొత్తగా 265 పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 468 పంచాయతీలు ఉండగా.. 500 జనాభా ఉన్న ఆవాసాలు, తండాలను పంచాయతీలుగా ఏ ర్పాటుచేస్తూ ఇటీవల అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమో దించారు. దీంతో జిల్లాలోని గ్రామపంచాయతీల సంఖ్య 733కు చేరింది. గ్రామ సరిహద్దు లు, జనాభా, సర్వే నంబర్లు ఇతర అంశాల ఆధారం గా వార్డులు, ఓటర్ల జాబితాలు విభజించనున్నారు. కర్ణాటక నుంచి బ్యాలెట్ బాక్సులు గ్రామపంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ కోసం సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి బ్యాలెట్ బాక్సులు తెప్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు 4,685 బ్యాలెట్ బాక్సులు చేరుకోగా జిల్లా కేంద్రంలోని కొత్త గంజ్‌లో ఉన్న గోదాంలో భద్రపరిచారు. జిల్లాలో మరో మూడు వేల బాక్సులు ఉండగా.. వాటన్నింటికీ మరమత్తులు చేయిస్తున్నారు. కాగా, 733 పంచాయతీల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతున్న అధికారులు.. రెండు లేదా మూడు విడతల్లో జరగొచ్చని చెబుతున్నారు. 12 శాఖల ఉద్యోగుల వివరాలు సేకరణ... ఎన్నికల విధుల కోసం మానవ వనరుల వివరాలను సేకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశిం చింది. దీంతో వివిధ శాఖల్లో ఉ ద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 12 శాఖల ఉద్యోగుల వివరాలను సకరరి ఆన్లైన్లో పొందుపర్చారు. ఓటర్లు, వార్డుల విభజనకు నోటిఫికేషన్ మహబూబ్‌నగర్ న్యూటౌన్: నూతన గ్రామపంచాయితీల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. ప్రక్రియను పూర్తి చేసి మే 17న వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నిక ల కమిషనర్ నాగిరెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు మార్గనిర్దేశం చేశా రు. నూతనంగా ఏర్పడిన జీపీల వారీగా ప్రత్యేకాధికారులను నియమించి ఓటర్ల జాబితాలు రూపొందించాలని, వారానికోసారి జిల్లా, ప్రతీరోజు మండ ల స్థాయిలో సమీక్షించుకోవాలని సూచించారు. ఈనెల 30న డ్రాఫ్ట్, మే 17న తుది జాబితాలు వార్డుల విభజన వివరాలతో పాటు ఫొటో ఎలక్టోరల్ డ్రాఫ్టులను గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్‌ను విడుదల చేసిన అనంతరం మే 1న జిల్లా స్థాయిలో పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి నూతన గ్రామపంచాయతీల వారీగా వార్డులు, ఓటర్ల జాబితాల విభజనపై చర్చించాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు మే 3న సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వార్డుల వారీగా డ్రాఫ్టు ఓటర్ల జాబితాలపై మే 1 నుండి 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను మే 10న పరిశీలించాలని సూచించారు. వార్డుల వారీగా రూపొందించిన ఫొటో ఎన్నికల జాబితాలను డీపీఓ ద్వారా గ్రామపంచాయతీల్లో ఫైనల్ పబ్లికేషన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్.. జిల్లాలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లోకార్యదర్శుల కొరత, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. తెచ్చారు. వీసీకి కలెక్టర్‌తోపాటు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. -
జీవించి ఉన్నా.. జాబితాతో చంపేశారు
పిడుగురాళ్లరూరల్: అధికార పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన ఓట్లను గల్లంతు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. అందుకు నిదర్శనమే పిడుగురాళ్ల పట్టణం, మండలంలోని ఓటర్ల జాబితా తగ్గడమే. 2017 ఓటర్ల జాబితా ప్రకారం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 51,784 మంది ఓటర్లు ఉన్నారు. అదే విధంగా మండలంలోని 14 గ్రామాల్లో 46,889 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2018 ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే ఒక్కసారిగా పట్టణం, మండలంలో 6796 ఓట్లు గల్లంతయ్యాయి. ఇందులో బతికి ఉన్న వారిని కూడా చచ్చినట్లుగా చిత్రీకరించి ఓట్లను తొలగించారు. జీవించి ఉన్నా.. జాబితాతో చంపేశారు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యర్రంరెడ్డి గురవమ్మ(70) జీవించే ఉన్నప్పటికీ ఆమె చనిపోయినట్లు ఓటును తొలగించారు. ఇదే గ్రామానికి చెందిన యర్రంరెడ్డి తిరుపతమ్మ(90) కూడా జీవించే ఉన్నా, ఆమె కూడా చనిపోయినట్లు ఓటును తొలగించారు. ఉద్యోగ రిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్తే ఊరు వదలిపెట్టి పోయారని, బతికున్న వారిని చనిపోయారని రిపోర్టు రాసుకుని ఓట్లను తొలగించారు. ఈ క్రమంలోనే మండలంలోని 14 గ్రామ పంచాయితీల్లో 389 ఓట్లను తొలగించారు. పట్టణంలో 6407 ఓట్లు పలు కారణాలతో తొలగించారు. తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీకి మద్దతుదారులు కావడం విశేషం. మళ్లీ చేరుస్తాం.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే ఓటర్లు ఫారం 6ఏ పూర్తి చేసి తహసీల్దార్ కార్యాలయంలో అందిస్తే మళ్లీ చేరుస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారు. ఎంత దుర్మార్గం నేను చనిపోయినట్లు చూపించి ఓటు తొలగించడం ఎంత దుర్మార్గం. మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులం కనుకే నా ఓటును తొలగించారు. నా భర్త యర్రంరెడ్డి యేగిరెడ్డి బ్రాహ్మణపల్లి, కామేపల్లి జంట గ్రామాలకు సర్పంచిగా పని చేశారు. అదేవిధంగా స్వతంత్య్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కాగడ గుర్తుపై పోటీ చేశారు. మేము అంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉండటంతోనే నా ఓటును తొలగించారు. – యర్రంరెడ్డి గురవమ్మ -
ఓటర్ల నమోదును పరిశీలించాలి
సాక్షి, యాదాద్రి : అధికార పార్టీ ఒత్తిళ్లతో తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నల్లగొండ జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని బూత్ లెవెల్ ఆఫీసర్స్ వద్దకు వెళ్లి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పార్టీ సానుభూతిపరులతో పాటు అర్హులైన అందరి పేర్లు నమోదు చేయించాలన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అ«ధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, కమిటీ సభ్యులు ఉన్నారు. -
6.79 లక్షల ఓటర్లు మృతి
- రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లో కొత్త అంశాలు హైదరాబాద్: ఓటర్లకు ‘ఆధార్’ను అనుసంధానించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలకు సంబంధించి పలు కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన ఓటర్ల వివరాలతోపాటు, ఒకచోట నుంచి మరోచోటకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలు బయటపడ్డాయి. రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలకు సంబంధించి.. ఇప్పటి వరకు 6,79,452 మంది ఓటర్లు మృతి చెందినట్లు తేలింది. తెలంగాణ రాష్ట్రంలో 2,65,316 మంది, ఆంధ్రప్రదేశ్‌లో4,14,136 మంది ఓటర్లు మృతి చెందినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 45 లక్షల మంది ఓటర్లు ఒకచోట నుంచి మరోచోటకు తరలిపోయినట్లు స్పష్టమైంది. ఇందులో తెలంగాణలో 23,56,968 ఓటర్లు ఒకచోట నుంచి మరోచోటకు తరలివెళ్లగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఓటర్లు 21,45,308 మంది ఉన్నట్టు తేలింది. వీరు శాశ్వతంగా తరలి వెళ్లినపక్షంలో.. పేర్లను అక్కడ తొలగిస్తారు. ఎక్కడకు తరలి వెళ్లారో అక్కడ ఓటరుగా నమోదుకు అవకాశమిస్తారు. రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం విలేకరుల భేటీలో వెల్లడించిన ఆధార్ అనుసంధానం వివరాల పట్టిక ఈ విధంగా ఉంది.