సాక్షి, మంచిర్యాల : పంచాయతీలతో పాటు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సైతం నిర్వహించేం దుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోం ది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ, జిల్లా పరిషత్‌ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన గెజిట్‌ను విడుదల చేయకపోవడంతో పాత ఆదిలాబాద్ స్థాయిలోనే జెడ్‌పీ కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా పరిషత్‌లు నామమాత్రంగానే తయారయ్యాయి. నామ్‌కేవాస్తే సమావేశాలు మినహా అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి ముందడుగు లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులను జిల్లా పరిషత్‌లకు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో 2016 నుంచి జెడ్పీల ద్వారా అభివృద్ధి పనులు ఆగిపోయాయి. అదే ఏడాది అక్టోబర్‌లో కొత్త జిల్లాలను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉన్న జెడ్‌పీ స్వరూపమే మారిపోయింది. ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు సంబంధించి జెడ్‌పీల విషయంలో ప్రభుత్వం గెజిట్ సైతం విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలతోపాటు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుండడం చర్చనీయాంశమైంది. జూలై 2019 వరకు జెడ్‌పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ఉన్నప్పటికీ, దాదాపు ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏమిటో నాయకులకు అర్థం కావడం లేదు.
ఉమ్మడి జిల్లా యూనిట్‌గానే ఎన్నికలా..?
జిల్లా పరిషత్‌లకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త విధివిధానాలు రాలేదు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే పంచాయతీ, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదు. దీనికి సంబంధించిన గెజిట్ కూడా విడుదల కాని నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు అనేది ఇప్పట్లో అనుమానమే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి. జిల్లాల పునర్విభజన తరువాత అవి 70కి పెరగడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఎన్నికలు జరిగితే ఈసారి 70 మంది జెడ్‌పీటీసీలు, 70 మంది ఎంపీపీలు జిల్లా పరిషత్‌లో కొలువు తీరుతారు. ఒకవేళ ప్రభుత్వం కొత్త జిల్లాల వారిగా జిల్లా పరిషత్‌లను నోటిఫై చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగు జిల్లా పరిషత్‌లు ఏర్పాటవుతాయి. కానీ కొత్త జిల్లాల వారీగా పరిషత్‌ల ఏర్పాటు ఇప్పట్లో వీలుకాదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకపోయినా.. తీరా జెడ్‌పీటీసీల నుంచి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను ఏ ప్రాతిపదికన ఎన్నుకుంటారనేదే ఇప్పుడు ప్రశ్న.
సిద్ధమవుతున్న గ్రామాల ఓటర్ల జాబితా
కొత్త పంచాయతీ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు దిశానిర్ధేశం చేశారు. ఈనెల 30న అన్ని గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని మే 17న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. దీనిని బట్టి జూన్‌లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి.
రాజకీయ పార్టీల్లో అయోమయం
చివరిసారిగా ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు 2014 ఏప్రిల్‌లో జరిగాయి. అయితే అప్పటికే తెలంగాణను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూలైలో జెడ్‌పీలు కొలువుతీరాయి. అంటే జూలై 2019 వరకు ప్రస్తుత జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు కొనసాగే అవకాశం ఉంది. అయినా ఏడాది ముందుగానే ఈ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయడం వెనుక మతలబు ప్రభుత్వానికే తెలియాలని ఆసిఫాబాద్ జెడ్‌పీటీసీ కొయ్యల ఏమాజీ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల విషయంలోనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అంతగా ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంది. సాధారణ ఎన్నికల ముందు స్థానిక పంచాయతీ పెట్టుకుంటే సమస్యలు ఎదురవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇక జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే వర్గ పోరాటాలు, కుమ్ములాటలతో అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఉత్సాహంతో కనిపిస్తున్నప్పటికీ, ఆ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలకు కొదువ లేదు. బీజేపీ వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే కొన్ని మండలాల్లో ఉనికి చాటుకుంటోంది. టీడీపీ కనుమరుగు కాగా, కొత్త పార్టీలు తెలంగాణ జన సమితి, జనసేన పరిస్థితి అంచనా వేయలేం.
Comments
Please login to add a commentAdd a comment