అంబర్‌పేట్‌లో ఓటరు నమోదును పరిశీలిస్తున్న కార్పొరేటర్ పులి జగన్, తహసీల్దార్ జ్యోతి
సాక్షి నెట్‌వర్క్: గ్రేటర్ పరిధిలో ‘చెక్ యువర్ ఓటు, నూతన ఓటర్ల నమోదు’ ప్రక్రియకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన లభించగా.. మరికొన్ని చోట్ల ఓటరు జాబితాలోని లోపాలు ఓటర్లను గందరగోళానికి గురిచేశాయి. నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఆదివారం అన్ని పోలింగ్‌బూత్‌లలో చేపట్టిన ఓటరు నమోదుకు అర్హులైన ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. జాబితాలో తమ పేర్లు పరిశీలించేందుకు యువ ఓటర్లు ఉత్సాహం చూపారు. అంబర్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్ బహదూర్‌పురా తదితర నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం విజయవంతం కాగా.. కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి తదితర నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితాలు గందరగోళానికి గురిచేశాయి.
అంబర్‌పేటలో ఇలా..
నియోజకవర్గం పరిధిలో 234 బూత్‌లలో కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి జాబితాల్లో తమ ఓటు ఉందో లేదో పరిశీలించారు. తమ ఓటు హక్కు జాబితాలో క్రమసంఖ్య, పేజీ నెంబర్ తెలుసుకొని వెళ్లారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ నమోదును అర్హులైన వారు సద్వినియోగం చేసుకున్నారు.
తమకు అందిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి వచ్చే ఎన్నికల్లోపు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని డీఎంసీ కృష్ణయ్య తెలిపారు. ఒక్కరోజు కా>ర్యక్రమంలో ఇక్కడ కొత్తగా సుమారు 1000 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ప్రక్రియను వివిధ పార్టీల నాయకులు సైతం పరిశీలించారు.
కంటోన్మెంట్‌లో గందరగోళం
ఈ నియోజకవర్గంలో ఓటరు నమోదు ప్రక్రియ గందరగోళానికి తెరలేపింది. జాబితా పరిశీలన కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందిని నియమించినప్పటికీ చాలాచోట్ల వారు ఆలస్యంగా వచ్చారు. ఉదయం 10 గంటలకు కేంద్రాలకు రావాల్సిన అధికారులు మధ్యాహ్నం అయినా రాకపోవడంతో ఓటర్లు అసహననం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 4, 5 వార్డుల్లో గతంలో నమోదు చేసిన ఓటర్ల పేర్లు లిస్టులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో తాము ఉన్న చోటు కాకుండా మకోచోట ఓటు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం తెలిసీ తెలియని వారితో ఓటరు నమోదు చేయించడం వల్లనే ఈ తప్పులు దొర్లాయని పలువురు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓల్డ్ వాసవీనగర్‌లో సీనియర్ సిటిజన్స్ ఆందోళనకు దిగారు.
మల్కాజ్‌గిరిలోనూ అంతే..
ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి పేర్లు కూడా నియోజకవర్గంలోని జాబితాల్లో మాయమయ్యాయి. ఇంట్లో ఇద్దరి పేర్లు ఉంటే మరో ఇద్దరికి లేవు. చనిపోయిన వారి పేర్లు సైతం జాబితాలో అలాగే ఉంచారు. మల్కాజిగిరి నుంచి వెళ్లిపోయిన వారి పేర్లు కూడా జాబితాలో దర్శనమిచ్చాయి. ఏడాది క్రితం ప్రత్యేక సిబ్బందికి ట్యాబ్‌లు అందజేసి ఇంటింటికీ సర్వే చేయించారు. అయినా జాబితాల్లో లోపాలు అలాగే ఉన్నాయి. బీఎల్‌ఓల నిర్లక్ష్యంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓల్డ్ మల్కాజిగిరికి చెందిన ఓ వృద్ధుడు ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. కానీ అతడి పేరు జాబితాలో అలాగే ఉంది. ఆర్‌కేనగర్‌కు చెందిన ఓ కుటుంబంలోని అందరి పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. సంజయ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి ఇద్దరు కుమార్తెలు ఆరేళ్లుగా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. వారి పేర్లు తొలగించమని ఇంటింటికి సర్వేకు వచ్చిన సిబ్బందికి చెప్పినా చర్యలు తీసుకోలేదు. మారుతీనగర్‌లో ఓ కుటుంబంలోని ఓటర్ల పేర్లు జాబితాలో రెండు సార్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇలాంటి తప్పులు కుప్పలుగా ఉన్నాయి.
బహదూర్‌పురాలో బెటర్..
ఇక్కడి 261 పోలింగ్ బూత్‌లను రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆదివారం 1237 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.
ఖైరతాబాద్‌లో స్పందన భేష్..
నియోజకవర్గంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్లలో 237 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం జరిగిన చెక్ యువర్ ఓట్‌కు మంచి స్పందన లభించింది. చాలా మంది ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో నిర్థారించుకున్నారు. లేని వారు అప్పటికప్పుడు ఫారం–6 ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment