మాట్లాడుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో మరొకరి పేర్ల మీదుగా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ సహకారంతో విచారణ మొదలైందన్నారు. జనవరి 11న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై ఇప్పటివరకు వచ్చిన క్‌లైమ్‌లు, ఆక్షేపణలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. 1.05 లక్షల క్‌లైమ్‌లను పరిశీలించిన తరువాతనే ఆన్‌లైన్ ప్రక్రియకు పూనుకుంటారన్నారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు అందే దరఖాస్తులను పరిశీలించి తాను, ఈసీఐ ఆమోదించిన తరువాతే పేర్లను తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. ఈసీఐ ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్‌లో రెండుసార్లు వెరిఫికేషన్ చేశారన్నారు. ప్రజల ఓటును ఓటరు జాబితాలో ఉంచే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనని చెప్పారు. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో 99 శాతం అన్ని వసతులు కల్పించామన్నారు. 118 పోలింగ్ కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత యాజమాన్యాలు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు.
పేర్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారి గురించి విచారణ మొదలైందని, వారెవరో పేర్లు బట్టబయలైనప్పుడు చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉంటుందన్నారు. ఓటు తొలగించారని ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ పరిధిలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించా లన్నారు. జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు వీవీ ప్యాట్లు, ఈవీఎంలపై అవగాహన కల్పించామని, మూడో విడత అవగాహన మొదలు పెట్టామన్నా రు. ఈసీ ఆదేశాలతో వీడియోల రూపంలో అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నా రు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, టీవీలలో పెయిడ్ న్యూస్‌లు వస్తే సంబంధిత అభ్యర్థి ఖాతా కింద వాటిని పరిగణిస్తామన్నారు. ఫేక్ న్యూస్‌ను కనిపెట్టడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. అనంతరం ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఓటు చిత్తూరు ఓటు పేరుతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment