శుక్రవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అర్హులైన అందరి పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రతి గ్రామంలోనూ చొరవ తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా సవరణ, టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ‘ఓటర్ల జాబితాలో సవరణలపై దృష్టి సారించాలి. ఎన్నికల కమిషన్ మరో నెల రోజులపాటు కొత్త ఓటర్ల నమోదుకు, జాబితాలో గల్లంతైన ఓటర్లను చేర్పించేందుకు అవకాశం కల్పిస్తోంది.
ప్రతి గ్రామంలోనూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునిపోవాలి. టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు.. ఎమ్మెల్యేలతో, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమన్వయం చేస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ జాబితాలో చేర్పించేలా చొరవతీసుకోవాలి. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పార్టీ అధినేత ఆదేశించారు. ఈనెల రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్ల జాబితాలో చేర్చేలా చూడాలి. పార్టీ మండలాధ్యక్షులతో, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నేరుగా మాట్లాడి ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రధాన కార్యదర్శులు ఈ నెలలో వీలైనన్ని ఎక్కువ రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తెలంగాణభవన్‌లో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు.
జిల్లాల్లో భవనాలు
టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలన్ని వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ‘టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ మనకు అప్పగించారు. ప్రభుత్వ అనుమతి మేరకు ప్రతి జిల్లా కార్యాలయానికి ఒక ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశముంది. ఇప్పటికే దాదాపు 20 జిల్లా కేంద్రాల్లో స్థలాల ఎంపిక పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో స్థలాలను ఎంపిక కోసం ఎమ్మెల్యేలతోపాటు టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు స్వయంగా వెళ్లి పరిశీలించాలి. సంక్రాంతి తర్వాత వరుసగా జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి’అని ఆయన వెల్లడించారు.
పెద్దపల్లి గొడవపై దృష్టి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న వర్గపోరుకు తెరదించడంపై కేటీఆర్ దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ తమకు ఇబ్బంది కలిగించారని ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), బాల్క సుమన్ (చెన్నూరు), దాసరి మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి) ఇటీవల కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ బస్వరాజు సారయ్య, జి.వివేక్, బాల్క సుమన్‌లను క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. నేతల మధ్య సమన్వయలోపంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను విన్న తర్వాత ఇకముందు ఇలాంటివి జరగొద్దని.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేశ్‌లు కూడా క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలిశారు.
యాంకర్ సుమ భేటీ
తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్‌ను టీవీ యాంకర్ సుమ కలిశారు. ‘ఒక మంచి పని కోసం వచ్చాను. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను వెల్లడిస్తాను’అని భేటీ అనంతరం ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యేలు టి.రాజయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జి.విఠల్ రెడ్డి, ఎన్. నరేందర్, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment