సాక్షి, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణను కుప్పకూల్చడమేనని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చే స్తోందని, అందులో భాగంగానే బొగ్గు గనులను ప్రైవేటీకరించే ప్రయత్నంలో ఉందని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు.
తక్కువ కా లంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణపై బీజేపీ కక్ష కట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు తాజాగా చేసిన ప్రకటన ఇందులో భాగమేనన్నారు.
సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్న కేంద్రం.. గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మాత్రం నామినేషన్ పద్ధతిన గుజరాత్‌లో లిగ్నైట్ గనులు కేటాయించిందని తెలిపారు. గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేంద్రం అప్పజెప్పిన గనుల కేటాయింపు, వాటి పర్యావరణ అనుమతుల ప్రక్రియ తాలూకు పత్రాలను కేటీఆర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
తెలంగాణపై ఈర్ష్యతోనే వేలం
‘గుజరాత్ మాదిరే తెలంగాణలోని సింగరేణికి సై తం బొగ్గు గనులను కేటాయించాలని గత కొంతకాలంగా తమ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెడుతోంది. సొంత రా ష్ట్రం కోసం తమ వేలం పాలసీలను పక్కన పెట్టిన ప్రధానమంత్రి మోదీ.. తెలంగాణ సమాజంపై ఈర‡్ష్యతో సింగరేణి గనులను వేలం వేస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు సింగరేణిని ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చారు.
ఇప్పుడేమో సింగరేణి బొగ్గు గనులను వేలానికి పెట్టారు. ఉత్పత్తిలో, లాభాల్లో ప్రతి ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ, దేశంలోనే అత్యధికంగా పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించిన సింగరేణికి చెందిన బ్లాకులను ఎలా వేలం వేస్తారు? బొగ్గు తవ్వకమే ప్రధాన విధిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం పేరుతో సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం కేంద్రం చేస్తోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా నష్టాల పాల్జేసి, అమ్మకానికి పెట్టినట్లుగానే సింగరేణిని కూడా అంతిమంగా తన కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పే కుట్రలను చేస్తోంది. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత ఏడాది డిసెంబర్ 7న సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. అయినా కేంద్రం కార్మికుల ఆందోళనలను, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతోంది. బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రైవేటీకరిస్తే తెలంగాణలో చీకటే..
‘సింగరేణి ప్రైవేటీకరణ సమస్య బొగ్గు గనులు ఉ న్న ఏడెనిమిది జిల్లాలది కాదు. ఇది సమస్త తెలంగా ణకు సంబంధించిన అంశం. బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించాలనే కుట్రలకు కేంద్రం తెరలేపింది. రైతులకు, రాష్ట్రంలోని దళిత, గిరిజన, కుల వృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ వంటి పథకాలపై అక్కసు కూడా ఈ కుట్ర లో భాగమే. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నా ల్లో కేంద్రం విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుంది. సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు..’అని కేటీఆర్ తెలిపారు.
ప్రతి ఎంపీ గొంతు ఎత్తాలి
‘గనుల వేలంపై కేంద్రం మొండిగా ముందుకు వెళితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం తప్పదు. తెలంగాణ ఉద్యమం ఎగిసినట్టుగానే, మరోసారి సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలి.
సింగరేణి భుజంపై నుంచి తెలంగాణ ప్రజలపై గన్ను పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. సింగరేణి మెడపై కేంద్రం ప్రైవేట్ కత్తి పెడితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై వేటు వేయడం ఖాయం. 150 సంవత్సరాలకు పైగా తెలంగాణకు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చీకటి సూర్యుల బతుకులను చిదిమేసే కుట్రలు కేంద్రం ఇకనైనా ఆపాలి..’అని కేటీఆర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment