నాగోలు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పేదలకు భూములు ఇచ్చుడేమోగానీ గడచిన నాలుగు దశాబ్దాలుగా పేదల ఆధీనంలో ఉన్న భూములను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకుంటోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా, బీజేపీ కార్నర్ మీటింగ్‌లను నాగోలు కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నాగోలు చౌరస్తాలో, బీజేపీ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం హస్తినాపురం చౌరస్తాలో నిర్వహించారు.
ఆయా సమావేశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ‘పల్లెల్లో ఉపాధి లేక వేల మంది పట్నానికి వలస వచ్చారు. వీరంతా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వమని అడిగితే ఇవ్వడంలేదు. ఒక్కరికి కూడా 50 గజాల భూమి ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన భూమిని గద్దల్లా గుంజుకుంటున్నారు’ అని ఆరోపించారు. హైదరాబాద్‌లో కిరాయిలు కట్టలేకపోతున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
‘ఎల్‌బీనగర్ కాలనీ వారికి భూములు రెగ్యులరైజ్ చేస్తామని మునుగోడు ఎన్నికల సందర్భంగా కేటీఆర్ వచ్చి జీఓ 118 ఇచ్చారు. ఓట్లు వేయించుకున్నారు. తరువాత మర్చిపోయారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా 118 జీఓను అమలు చేయాలి’ అని ఈటల డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల భూములకు పట్టాలు ఇస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చశారు.
పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని...ఉద్యోగావకాశాలను కల్పిస్తాం అని భరోసా ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఎల్‌బీనగర్ ఎమ్మెల్మే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీజేపీ ఎల్‌బీనగర్ కన్వీనర్ రవీందర్‌గౌడ్, వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర్‌రెడ్డి, నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, బద్దం బాలకృష్ణగౌడ్, శ్యామల, పద్మారెడ్డి, మైనం రాజేష్, రావుల శ్రీనివాస్, డప్పు రాజు, రాఘవాచారి, హస్తినాపు రం డివిజన్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment