తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశం కావడంతో కేబినెట్ కూర్పు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊహాగానాలు జోరందుకున్నాయి.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర రెండో కేబినేట్‌లో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి..? ఉమ్మడి జిల్లా నుంచి ఎవరెవరికి మంత్రివర్గంలో బెర్త్ దొరుకుతుంది...? మన ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఎవరిని వరించి వస్తాయి..? అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం నుంచి అంకితభావంతో పనిచేసి అధినేత విశ్వసనీయత చూరగొన్న నేతలకు ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్న చర్చ మరోవైపు జరుగుతోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్.. హోంమంత్రి మహమూద్ అలీలతో పాటు కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉన్నా... ప్రభుత్వ శాఖల మథనం, కుదింపు, విలీనం తదితర అంశాలతో ముడిపడటం వల్ల జాప్యం అయ్యిందంటున్నారు. డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి టీఆర్‌ఎస్ అత్యధిక మెజార్టీతో గెలుపొం దింది. అదే నెల 13న కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇది జరిగి సుమారు రెండు మాసాలు పూర్తి కాగా... ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు 19న ముహుర్తం కుదరడంతో రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
ఈ విడతలో ఇద్దరా? ముగ్గురా?
ఈసారి విస్తరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి చోటిస్తారా? లేక ముగ్గురిని తీసుకుంటారా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌లతో పాటు మాజీ విప్ కొప్పుల ఈశ్వర్ మంత్రి రేసులో ఉన్నారు. అయితే ఈసారి కేబినెట్ కూర్పుపై భిన్నమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందికి అవకాశముంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి విస్తరణలో 16 మందిని తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొంత మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుని మిగతా వారికి లోక్‌సభ ఎన్నికల తర్వాత చోటు కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికే ఈ విస్తరణలో అవకాశం దక్కనుంది. ప్రస్తుతం మాజీ మంత్రులుగా ఉన్న హుజూరాబాద్, సిరిసిల్ల ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, కేటీఆర్‌లకు ఈ విడతలో ఛాన్స్ ఉంటుందంటున్నారు. మరోమారు విస్తరణలో మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను మంత్రివర్గంలో చేర్చుకుంటారంటున్నారు. మొత్తం 16 మందిని ఈ విడతలోనే తీసుకుంటే.. ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లను మంత్రి పదవులు వరించనున్నాయి.
శాఖల మార్పులుంటాయా..?
మంత్రివర్గంలో ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారనే అంశపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీలు ప్రమాణ స్వీకారం చేయగా, అమాత్యుల రేసులో ఉన్న మరో సీనియర్ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్‌గా నియమించారు. నలుగురు మంత్రులు ఈసారి ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నా... ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురికి కూడా ఈసారి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. అయితే ఈసారి కొందరి శాఖల మార్పులు ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లలో ఎవరెవరికి.. ఏ శాఖ కేటాయిస్తారనేది కూడా చర్చనీయాంశమే అయ్యింది. ఈ విషయమై అధినేత కేసీఆర్ ఏం యోచిస్తున్నారు? అయన మదిలో ఏముంది? అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. కేటీఆర్, ఈటల రాజేందర్‌లకు పాత శాఖలే కేటాయిస్తారా? లేక ప్రచారంలో ఉన్నట్లు మార్పులు, చేర్పులు చేసి ఇస్తారా? అన్న అంశాలు ప్రజలు, పార్టీ నేతలతో పాటు మంత్రి రేసులో ఉన్నవారిని సైతం ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపులపై త్వరలోనే సస్పెన్స్ వీడుతుందని పార్టీకి చెందిన కొందరు సీనియర్లు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment