- రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లో కొత్త అంశాలు
హైదరాబాద్: ఓటర్లకు ‘ఆధార్’ను అనుసంధానించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలకు సంబంధించి పలు కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన ఓటర్ల వివరాలతోపాటు, ఒకచోట నుంచి మరోచోటకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలు బయటపడ్డాయి.
రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలకు సంబంధించి.. ఇప్పటి వరకు 6,79,452 మంది ఓటర్లు మృతి చెందినట్లు తేలింది. తెలంగాణ రాష్ట్రంలో 2,65,316 మంది, ఆంధ్రప్రదేశ్‌లో4,14,136 మంది ఓటర్లు మృతి చెందినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 45 లక్షల మంది ఓటర్లు ఒకచోట నుంచి మరోచోటకు తరలిపోయినట్లు స్పష్టమైంది.
ఇందులో తెలంగాణలో 23,56,968 ఓటర్లు ఒకచోట నుంచి మరోచోటకు తరలివెళ్లగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఓటర్లు 21,45,308 మంది ఉన్నట్టు తేలింది. వీరు శాశ్వతంగా తరలి వెళ్లినపక్షంలో.. పేర్లను అక్కడ తొలగిస్తారు. ఎక్కడకు తరలి వెళ్లారో అక్కడ ఓటరుగా నమోదుకు అవకాశమిస్తారు. రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం విలేకరుల భేటీలో వెల్లడించిన ఆధార్ అనుసంధానం వివరాల పట్టిక ఈ విధంగా ఉంది.